close

తాజా వార్తలు

తలరాతను మార్చుకోవచ్చు

ఆధ్యాత్మిక సాధన కష్టం.
సంసారంలో ఉంటే ఇంకా కష్టం.
బాధ్యతలుంటే మరీ కష్టం.
ఇవన్నీ ఉన్నా.. సాధన సాధ్యమే అంటున్నారు శ్రీరామచంద్ర మిషన్‌ అధ్యక్షుడు, ఆధ్యాత్మిక గురువు కమలేశ్‌ దాజీ. గృహస్థు ధర్మం పాటిస్తూనే.. హృదయంలో రుషిగా ఉండొచ్చంటున్నారు. గుండె గుడిలో దైవాన్ని ప్రతిష్ఠించవచ్చని చెబుతున్నారు. ముక్కుమూసుకొని తపస్సు చేయడమే ధ్యానం అనుకుంటాం. కానీ, అమెరికాలో పారిశ్రామికవేత్తగా ఎదిగిన ఆయన ఆధ్యాత్మిక గురువుగానూ కోట్ల మందిని ప్రభావితం చేస్తున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యాన ప్రక్రియతో ఎందరినో సాధకులుగా తీర్చిదిద్దుతున్న ఆయన భారత్‌తో పాటు 150 దేశాల్లో ఎన్నో ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేడు శ్రీరామచంద్ర మిషన్‌ ఆది గురువు లాలాజీ మహారాజ్‌ జయంతి. ఈ సందర్భంగా కమలేశ్‌ పటేల్‌ దాజీతో ‘హాయ్‌’ సంభాషణ!

ఫార్మసిస్ట్‌ నుంచి ధ్యానగురువు దాకా..
హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానంతో ఎందరికో చేరువైన కమలేష్‌ దాజీ 1956లో గుజరాత్‌లో జన్మించారు. బాల్యంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంతో పరిచయమైంది ఆయనకు. శ్రీరామచంద్ర మిషన్‌ వ్యవస్థాపకుడు బాబూజీ మహారాజ్‌ శిష్యరికంలో ధ్యాన సాధనలో ఎంతో కృషి చేశారు. డిగ్రీ పట్టా అందుకున్న తర్వాత అమెరికా వెళ్లిన కమలేష్‌ దాజీ న్యూయార్క్‌ నగరంలో ఫార్మసిస్ట్‌గా పనిచేశారు. సహజమార్గ్‌ యోగా ప్రక్రియకు విస్తృతమైన ప్రచారం కల్పించారు. ఫార్మసిస్ట్‌గా, పారిశ్రామికవేత్తగా ఎంతో ఖ్యాతి గడించిన ఆయన తర్వాతి కాలంలో ఆధ్యాత్మిక మార్గంలో పయనం కొనసాగిస్తున్నారు. 2012లో శ్రీరామచంద్ర మిషన్‌ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఆయన 2014 నుంచి సంస్థ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సంస్థ తరఫున దేశవిదేశాల్లో విస్తృతంగా ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
* ధ్యానం మనసుకు సంబంధించిందంటారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానంతో మీరు గుండెకు సంబంధమంటున్నారు. గుండె ఒక అవయవం కదా! ఆధ్యాత్మిక స్పందనలు ఎలా కలుగుతాయి?
హృదయానికి అత్యున్నత స్వాభావిక స్వరూపం మెదడు. మస్తిష్కం ఆంతరంగిక భావనే హృదయం. మెదడు ఆలోచిస్తే.. హృదయం అనుభూతి చెందుతుంది. మెదడులో ఒక ఉన్నతమైన ఆలోచన పుడితే.. అది హృదయాన్ని తడుతుంది. అందుకే హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానం హృదయంలో దైవానుభూతిని కలిగిస్తుంది. గీతలో కృష్ణుడు కూడా ‘నన్ను నీ హృదయంలో చూడమ’న్నాడు. అంటే దైవం నిలిచేది హృదయంలోనే! హృదయ ధ్యానంతో దైవాన్ని అనుభూతి చెందవచ్చు.
* హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానంలో ప్రాణాహుతి ప్రసరణ చేస్తారని చెబుతారు. ఇది ఎంతవరకు శాస్త్రీయమైనది?
  ప్రాణాహుతి ప్రసరణ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. మన దృక్పథాన్ని మారుస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని ప్రభావాన్ని ప్రయోగాత్మకంగా కూడా నిరూపించాం. ప్రాణాహుతి ప్రసరణతో మనిషి సుషుప్తిలో ఉన్నా.. జాగరూకుడై ఉంటాడు.
* ధ్యానం సహజంగా సాగాలంటే.. ఏం చేయాలి?
మనిషి జన్మాంతరాలుగా ఎన్నో కర్మలను పోగు చేసుకొని తన వెంట తెచ్చుకుంటాడు. పుట్టింది మొదలు ఎన్నో కర్మలను చేస్తుంటాడు. వాటి ప్రభావం ఆ వ్యక్తిపై ఎప్పుడూ ఉంటుంది. కర్మ సంస్కారాలను కడిగేసుకోవాలి. ఎరుకతో వ్యవహరించాలి. చేసిన తప్పులను పశ్చాత్తాపంతో కడిగేసుకోవాలి. హృదయ నిర్మలీకరణ జరిగితే.. ధ్యానం సహజంగా సాగుతుంది.
* ఫలితం ఆశించకుండా పనిచేయమనే కర్మ సిద్ధాంతం.. ఈ కాలానికి ఎంత వరకూ అనుసరణీయం?
చాలామంది తలరాత ఇంతే అనుకుంటారు. అయితే, ఫార్మసిస్ట్‌ కావాలంటే ఫార్మసీ చేయాలిగా! మనం చేసే ప్రతి కర్మకూ ఫలితం ఉంటుంది. మన క్రియాశీలత ఆధారంగా మన తలరాత మారుతుంది. ఈ రోజు మనం చేసే పని.. రేపు మన విధిని నిర్ణయిస్తుంది. ఫలితం ఆశించకుండా పనిచేయడం కాదు.. చేసే పనిని బట్టి ఫలితం ఉంటుందనేది తెలుసుకుంటే తలరాత మార్చుకోవచ్చు. ‘నీవు చేసే పనులకు నీవే సాక్షిగా ఉండు’ అంటాడు కృష్ణుడు. గమనంలో ఉన్న ఒక గోళంపై బయటి నుంచి ఏదైనా బలం ప్రయోగిస్తే గానీ, దాని దిశ మారదని సైన్స్‌ చెప్పినట్టు.. మన ప్రమేయం లేకుండా జీవితాల్లో మార్పు రాదు.
* మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అన్ని సందర్భాల్లోనూ ఇది సాధ్యమవుతుందంటారా?
జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సంకల్పం ఉండాలి. నేను మారాలి, నేను ప్రత్యేకంగా ఉండాలని బలంగా కోరుకోవాలి. జన్యుపరంగా నా ఎత్తు 5.9 అడుగులకు మించి పెరిగే అవకాశం లేదు. కానీ, వ్యాయామాలు చేయడం వల్ల నేను 5.10 అడుగుల ఎత్తుకు పెరగగలను. మా నాన్న పల్లెటూరు రైతు. వ్యవసాయం తప్ప మరో ప్రపంచం తెలియదు. విద్య, మరెన్నో మార్గాల ద్వారా నాకు లభించిన జ్ఞానంతో.. మా నాన్న కన్నా గొప్ప స్వేచ్ఛను పొందగలిగాను. ఇది మానసికమైన అనుభవం. ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అవకాశాలు ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో పరిధులు ఎక్కువ. మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అందులో విజయం సాధించడానికి అవకాశాలు చాలా తక్కువ. ఆధ్యాత్మికంలో అంతులేని అవకాశాలు ఉన్నాయి. అయినా ఎవరూ ప్రయత్నించరు. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఐదు నిమిషాలు వెచ్చించినా ఓ అద్భుత అనుభూతి కలుగుతుంది.
* ఆధ్యాత్మికత అనగానే మతం ప్రస్తావన వస్తుంది. ఈ రెండింటికీ అసలు సంబంధం ఏమిటి?
మతం అంటే కలుపుకొని పోయేదని అర్థం. పరమాత్మను దర్శింపజేయడమే మతం అభిమతం. కానీ, మా మతం వేరు, దేవుడు వేరు..అని ఇలా ఎవరికి వారు గిరి గీసుకున్నారు. ఆధ్యాత్మికత మతం నుంచి మొదలవ్వడంలో తప్పు లేదు. కానీ, చివరకు మతం మృగ్యమై ఆధ్యాత్మిక ఆనందమే మిగలాలి. ‘ఒక మతంలో పుట్టడం మంచిదే. కానీ, మతస్థుడిగా కన్నుమూయడం తప్పు’ అంటారు స్వామి వివేకానంద. ఆధ్యాత్మికతకు మతం ఉండదు. అది మనలో ఒక గుణంగా ఉండాలి. మత గ్రంథాలు.. దైవరాధన ఇలా చేయాలి, ఇంత సమయం చేయాలి అని చెబుతాయి. ఆధ్యాత్మికతలో 24X7 ఆరాధన కొనసాగుతూనే ఉంటుంది. మనం ఏ పనిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా మన మనసు దైవంతో ముడిపడి ఉండటమే ఆధ్యాత్మికత.

* ఏకకాలంలో నాలుగైదు పనుల్లో నిమగ్నమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి సాధనలు సాధ్యమంటారా?
ధ్యానం కొనసాగడానికి, ఆధ్యాత్మిక జీవనానికి మిగిలిన వ్యవహారాలను వదిలేయాలన్న నియమమేం లేదే! రోజువారీ పనులు చేస్తూనే.. మానసికంగా ధ్యానం కొనసాగించవచ్చు. ఉద్యోగం చేస్తూ, సినిమా చూస్తూ, ఆహారం తింటూ.. మానసికంగా ధ్యానం చేయవచ్చు. పక్షి రెండు రెక్కలతో సులభంగా ఎగిరినట్లు మనిషి ఆధ్యాత్మిక, లౌకిక జీవితాల మధ్య సమతౌల్యాన్ని సాధిస్తూ సాగిపోవాలి. చాలామంది ధ్యానం, ఆధ్యాత్మికత వయసు మీదపడ్డ వారికి చెందినవని భావిస్తారు. విశ్రాంత జీవితంలో కాలక్షేపం కాదు ఆధ్యాత్మికత అంటే! రిటైర్‌ అయ్యాక చేద్దాంలే.. చూద్దాంలే అనుకున్నవాళ్లు చాలామంది ఆ తర్వాత శరీరం సహకరించక, ఆరోగ్యం బాగోక.. ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించలేకపోతారు. అందుకే మన జీవన గతిని మార్చే ధ్యానం, ఆధ్యాత్మికతను బాల్యం నుంచి అలవర్చుకోవాలి. అప్పుడు మెరుగైన జీవితం అనుభవంలోకి వస్తుంది.

ప్రాణాహుతితో పరిపూర్ణత
హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానంతో హృదయం నిర్మలీకరణం అవుతుంది. మూడు నెలలు ఈ ధ్యానంపై దృష్టి కేంద్రీకరించగలిగితే ఉన్నతమైన మార్పు కలుగుతుంది. హృదయంలో దివ్యశక్తి ఉందనే భావనతో ధ్యానం చేయాలి. ఇదే సమయంలో సాధకులకు గురువులు ప్రాణాహుతి ప్రసరణ చేస్తారు. దాని వల్ల హార్ట్‌ఫుల్‌నెస్‌ ధ్యానం పరిపూర్ణం అవుతుంది. చీపురుతో తొలగించలేని పొగను గది తలుపులు తెరిచి, తాజా గాలిని ఆహ్వానించడం ద్వారా బయటకు పంపించినట్లు.. గురువు హృదయం నుంచి వెలువడే ప్రాణాహుతి ప్రసరణ సాధకుడిలో మెరుగైన స్థితిని సృష్టిస్తుంది.

గుండెల్లో ఉన్నాడని..
దేవుడిపై నమ్మకం ఉందా? తాతయ్యనో, బామ్మనో, అమ్మనో అడిగితే.. దాదాపూ అందరూ ఉందనే సమాధానమే చెబుతారు. ఎందుకు నమ్మకం అని అడిగితే.. ‘మా అమ్మ చెప్పిందనో.. మా తాత చెప్పారనో..’ సమాధానం వస్తుంది. మన శాస్త్రాలు చెప్పాయి. మన ధర్మం చెప్పింది అంటారు. దేవుడున్నాడనే నమ్మకం మంచిది. ఆ నమ్మకానికి అనుభూతి ఉండాలి. అనుభవం కలగాలి. దైవం నా గుండెల్లోనే ఉన్నాడన్న భావనే అద్భుతం. అదే దైవానుభూతి.

భగవద్గీతను మనవాళ్లు సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు. ‘కర్మణ్యే వాది కారస్తే మాఫలేషు కదాచనా..’ అంటే భగవానుడు ‘బ్రహ్మవిద్య కోసం చేసే ఏ కార్యమైనా..’ అనే ఉద్దేశంలో చెప్పింది. ‘నేను నీ సేవకుడిని.. నీవు ఏదనుకుంటే అదివ్వు’ అని ఫలితం దేవుడికే వదిలేయాలి. కానీ, మనవాళ్లు దానిని మామూలుగా చేసే కర్మలుగా భావించేలా చేశారు.
జీవితంలో ప్రతి నిమిషమూ అద్భుతమే. వచ్చే ప్రతి నిమిషాన్నీ.. గడిచిన క్షణం కన్నా అద్భుతంగా ఆస్వాదించాలి. అప్పుడే జీవితంలో తృప్తి ఉంటుంది. అలా లేదంటే.. మనలో తప్పున్నట్టే!

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.