close

తాజా వార్తలు

పరీక్ష రాయడానికి రైల్‌ట్రాక్‌ వెంట పరిగెత్తాను

కొలకలూరి... సాహిత్యం

ఊరి ఆసామి దగ్గర జీతానికి ఉన్న ఆ కుర్రోడు...
వేలమంది విద్యార్థుల జీవితాల్ని మార్చిన గురువయ్యాడు.
అంటరానివాడిగా చూసిన సమాజంలోనే.. తనకు తాను వెలిగాడు. ఆ సమాజాన్నే వెలిగించాడు.
‘‘నిన్ను నువ్వు ఈ సమాజం మీదకు ఇసురుకో’’ అని చెప్పిన అమ్మమాటల్ని నిజం చేసి..
తన అనుభవాలతో తనకు తాను, తనలోకి ‘అనంత జీవనం’ చేశాడు.
పేగులు కాల్తుంటే.. వేదన రగుల్తోంటే..
అక్షరాలు పదాలకు జన్మనిచ్చాయి. పదాలు కావ్యాలను కన్నాయి. అన్నీ కలిసి ఆయన్ను గొప్ప రచయితను చేశాయి.
ఆ గొప్ప రచయిత ఎవరంటే... కొలకలూరి ఇనాక్‌ అని ఇంకా చెప్పాలా..?
అసమానతలు తగ్గడానికి, ఒత్తిడి పెంచే చదువులు మారడానికి ఏం చేయాలో చెప్పారాయన. ఆ ఆచార్యుని మనసులో భావాలు ‘హాయ్‌’కి ప్రత్యేకం.

* ‘విమర్శిని’కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు ‘మా నాన్న జీవితం వడ్డించిన విస్తరి కాదు. వడ్డించుకున్న విస్తరి’ అని మీ అమ్మాయి రాశారు. మీ ప్రస్థానం ఎలా మొదలైంది?
మా స్వస్థలం వేజెండ్ల. మా అమ్మనాన్న కూలీనాలీ పని చేసుకునేవారు. నేను జీతానికి ఉండేవాణ్ని. రెండోతరగతి దాకా చదువుకొని ఆ తర్వాత జీతానికి పోయి ఎగరగొట్టి తిరుగుతుండేవాణ్ణి. అలా ఒకసారి మా ఊర్లోని దేవదాసుగారనే అయ్యవారు దగ్గరికి వెళ్లాను. ఏం చదివావని అడిగితే మూడో తరగతి చదవలేదన్నా. ఎందుకూ అంటే జీతానికి పెట్టారన్నా. జీతం ఎందుకు వదిలేశావంటే ఇష్టం లేదన్నా. పలకా బలపం తెచ్చుకోమని చదువు చెప్పారు. మా నాయనకు తెలీకుండా వెళ్లేవాణ్ని. నేను తెలివైన వాడినని రూపాయి డబ్బు కూడా వద్దని మా అమ్మతో చెప్పారు. మూడో తరగతిలో ఉండాల్సినోణ్ణి ఐదోతరగతి పరీక్షలో కూర్చోపెట్టారు. ఆరోతరగతిలో చేర్చారు. ఆయన లేకుంటే జీవితం మీద ఆసక్తి కలిగేది కాదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ పాసయ్యేసరికి జీవితంమీద ఆశ మొదలైంది.

* పరీక్ష రాయడానికి వెళ్లేప్పుడు రైలు దొరక్క పరిగెట్టారట? ఎందుకు?
మొదటి రోజు టికెట్‌ లేకుండా రైళ్లో వెళ్లి పరీక్ష రాశా. రెండోరోజు పరీక్షకెళ్తోంటే టిక్కెట్టు లేకుంటే పోలీసోళ్లు జైల్లో పెడతారని స్టేషన్లో ఎవరో అనుకుంటుంటే విన్నా. ఆరోజు నా దగ్గర జేబులో అణా ఉంది. ఇంటికెళ్లి తెచ్చుకునే సమయం లేదు. బండి వెళ్లిపోయింది. ఏడుపొచ్చింది. పదకొండు కిలోమీటర్లు ట్రాక్‌ వెంట పరిగెత్తాను. మీ అబ్బాయి రైలు వెంట పరిగెత్తుతున్నాడని మా అమ్మకు ఎవరో చెప్పారు. మా అమ్మ కూడా గుంటూరుకి పరిగెత్తుకొంటూ వచ్చింది. ఇపుడు ఆ ఘటన తల్చుకుంటే బాధేస్తోంది. అపుడు విజయం సాధించినట్లు అనిపించింది.

* మీరేమో చదువుకోవడానికి వెళ్లారు. మరి సంపాదనంతా అమ్మదేనా?
తొమ్మిదో తరగతి దాకా ఫర్లేదు. మా నాన్న ఉన్నారు. ఆయన సంపాదన ఉండేది. మా అమ్మ పాలు, పెరుగు, కోళ్లు, గుడ్లతో ఎంతోకొంత సంపాదిస్తుండేది. అలా వచ్చిన డబ్బు మానాన్నకి ఇవ్వకుండా దాచిపెట్టేది. ఐదేళ్లలో ఒక ఎకరా పొలం కొంది. అద్భుతమైన స్త్రీ శక్తికి ప్రతిరూపం ఆమె. అంత పట్టుదలగా మహిళలుంటే దేశం గొప్పగా తయారవుతుందనిపిస్తుంది. నా తొమ్మిదో తరగతిలో మానాన్న పోయారు. మా అమ్మ అశక్తురాలైంది. పశువులు, కోళ్లు అన్నీ అమ్మేసింది. ‘నిన్ను చూసి బతుకుతున్నారా’ అనేది. మా చెల్లి మూడోతరగతి, మా తమ్ముడు ఐదోతరగతి చదివి మానేశారు. నేను తొమ్మిదో తరగతి చదివేప్పుడు భోజనానికి ఇబ్బందిపడ్డాను. ఎలాగైనా చదవాలని నిర్ణయించుకున్నా. హరిజన హాస్టల్‌లో సీటు రావటానికి నెలరోజులు కష్టపడ్డాను. ఆ తర్వాత మాచెల్లిని, తమ్ముడిని హాస్టల్‌లో చేర్పించి, తర్వాత బడిలో చేర్పించా. అలా పిల్లలపై అమ్మకు దిగులు తగ్గింది.

* అయిదేళ్ల వయసు నుంచే మీరు చాలా మొండివారని అంటారు!
నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరిచిల్లరగా ఉండేవాడిని. బావుల్లో, చెరువుల్లో ఈత కొట్టేవాడిని. స్నేహితులతో బాగా ఆటలు ఆడేవాడిని. దీంతో మా అమ్మ చాలా బాధపడేది. నన్ను బాగా కొట్టేది. మరుక్షణమే ఏడుస్తూ దగ్గరకు తీసుకునేది. ఎందుకురా ఇలా దెబ్బలు తింటావని అడిగేది... అప్పుడు అమ్మతో నువ్వే కన్నావు... పెంచావు... నువ్వే చంపేయ్‌... అనేవాడిని. దానికి ఆమె ఎంతో బాధపడేది. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు ఈ ఊర్లో అమ్మతో పాటే ఉండాలని అనుకోవద్దు. పెద్దవాడివయ్యావు. మంచి బతుకుతెరువు వెదుక్కోవాలి. కాబట్టి మరో ఊర్లో ఉండి చదువుకోమని ఆమె చెప్పింది. అప్పుడు నేను ఈ లోకంలో తల్లి ఎక్కడ ఉంటుందని అడిగాను. అప్పుడామె ‘లోకమంతా తల్లే’ అని హితబోధ చేసింది. నువ్వు గొప్పవాడివవుతావు. నాన్న లేడు కాబట్టి నీతోపాటు తమ్ముడు, చెల్లెల్ని కూడా బాగా చదివించాలని నూరిపోసింది.

* మీరు మొదట్లో లెక్కల్లో చాలా ముందుండేవారు... మరి తెలుగు సాహిత్యం ఎలా ఒంటబట్టింది?
నిజమే నాకు లెక్కలంటే చాలా ఇష్టం. తెలుగు చదువుకోవాల్సిన పరిస్థితి మా ఉపాధ్యాయుల వల్ల వచ్చింది. ఒక మాస్టారు నేను సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్న పద్యాలు చెప్పలేకపోతున్నానని బాగా తిట్టారు. దీంతో పట్టుదలగా తెలుగు చదవడం అలవాటు చేసుకున్నాను. నేను చదివిన పల్లె స్కూల్‌లో కొందరు ఉపాధ్యాయులు తెలుగు పద్యాలు, పాటలు పాడుతుంటే అందులోని పల్లె పదాలపై ఇష్టం పెరిగింది. అక్కడ గుర్రం జాషువాకు ఎంతో గౌరవం ఇచ్చేవారు. నాకు కూడా ఆయనలా రాయలనే కోరిక పెరిగింది. చివరకు తెలుగు భాష నాకు ఇష్టసఖి అయింది. పాపయ్యశాస్త్రిగారి వల్ల మరింత మమకారం పెరిగింది. అలా పద్యాలు రాయడం ప్రారంభించాను. తొలుత నా రచనలపై వారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అందరూ అదే విషయంపై వ్యాఖ్యానించేవారు. నాకేమో నా సొంత శైలి ఉండాలనే తాపత్రయం ఉండేది. అందుకే వచనం వైపు వచ్చాను.

* ఊరబావిలో వర్ణనలు, గ్రామ్యం... మీ ముద్రనే స్పష్టం చేస్తాయి కదా!
నిజమే... వచనం రాసిన తర్వాత నా ముద్ర ప్రస్ఫుటంగా కనిపించడం ప్రారంభమైంది. దీనికోసం మొదటి నుంచి నేను కొన్ని నియమంగా పాటించాను. సంస్కృతం ఇతర భాషల ప్రభావం పడకుండా ఉండేందుకు నేను చూసిన, నాకు తెలిసిన తెలుగునే వాడాలని నిర్ణయించుకున్నాను. దీనివల్ల నా పద ప్రయోగానికి, వాక్య నిర్మాణానికి కొత్తందాలు వస్తున్నాయని నాకే అర్థమైంది. జీవితంలో చూసిన, అనుభవిస్తున్న సంఘటలనే నా ఇతివృత్తాలవుతాయి. నాలో జరిగే సంఘర్షణలో నుంచి వచ్చిన విషయాలుంటాయి. నా వేదన వాక్యాలుగా మారాయి కాబట్టి నా రచనలు ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి.

మొదటి క్లాస్‌ అలా
పందొమ్మిదేళ్లకే లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది. చీరాల, శ్రీకాకుళాల్లో అవకాశాలొచ్చాయి. మా గురువుల దగ్గర ఉద్యోగం చేయటానికి ఇబ్బందిగా ఉండేది. నేను లైబ్రరీలో ఎక్కువగా ఉండేవాణ్ణి. సమయానికి క్లాసుకి వెళ్లేవాణ్ని. పెద్దవాళ్లముందు కూర్చోమని మా ప్రిన్సిపాల్‌ పిలుచుకెళ్లి కుర్చీలో కూర్చోపెట్టారు. రోజూ ఇలాగే కూర్చోమన్నారు. అక్కడ ఎన్నో విషయాలను తెల్సుకున్నా. రెండురోజులు బాగా సాధన చేసి తొలి క్లాసుకి వెళ్లాను. అటెండెన్స్‌ తీసుకున్నాక మాట్లాడలేకపోయా. చెబుతోంటే పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. రాసుకోవడం లేదు. భయంతో చెమటపట్టింది. గంటకంటే ఎక్కువ సమయం క్లాసు చెప్పాను. మాకు చదువు చెప్పిన లెక్చరర్‌ గోడ పక్కనుంచి వింటున్నాడు. బయటికొచ్చాక నన్ను దగ్గరకు లాక్కొని బాగా చెబుతున్నావు అన్నాడు. మాగురువు గారు గుళ్లో పాఠం చెప్పమని అడిగారు. బడిలో మాదిరి కాదక్కడ. పెద్దవాళ్లు, పండితులు ఉన్నారక్కడ. కాళిదాసు గురించి చెప్పమంటే హిమాలయాలు గుర్తొచ్చాయి. వాటి గురించి ఉపన్యాసం ఇస్తే గుళ్లో ఇరవై ఒక్కరూపాయలొచ్చాయి. ఆ తర్వాత చిత్తూరులో అసిస్టెంటు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరాను.

సాధించుకోవాలనే గుణం రావాలి
ఆర్థికమైన స్వయంప్రతిపత్తి లేనిదే.... లేనివాడు ఉన్నవాడితో సమానం కాలేడు. వాళ్లకు వచ్చేట్లు చేయాలంటే భూమి ప్రధానమైంది. భూమి వీళ్ల చేతుల్లో లేదు. ఫ్యాక్టరీలు లేవు. వీళ్ల ఆర్థిక దయనీయమైన స్థితి మారటానికి వనరులు లేవు. చాలాకాలంగా పేదరికం అలాగే ఉంది. పేదరికం ఉన్నన్నాళ్లు అసమానతలుంటాయి. పేదరికం రూపుమాపటం కష్టం. ఎందుకంటే మనకు జనాభా ఎక్కువ, భూమి తక్కువ ఉంది. అందువల్ల భూమిని వీళ్లందరికీ ఇవ్వడానికి సాధ్యం కాదు. పెద్దకమతాలుంటే భూమి ఉపయోగం. చిన్నకమతాలుండే రైతులు కూడా పేదవారే. ఉపాధి కోసం ప్రధానంగా కర్మాగారాలపై ఆధారపడాలి. చదువువస్తే నిలబడతారు. ఇందులో పోటీలో నిలబడినవాళ్లే ముందుకెళ్తారు. సామాన్య కుటుంబాల పిల్లలు ఈ పోటీల్లో నిలబడలేరు. అందుకే చదువు ఇచ్చేది మానసిక విముక్తి మాత్రమే. పనులుండే ప్రాంతాల్లో మామూలు చదువు చదివితే అవకాశాలు రావట్లేదు. మా ఊర్లో ఎమ్‌.ఎ.ఏమ్‌కామ్‌ చదివినోళ్లు మాకు ఉద్యోగాలు రాలేదంటారు. చదువుకున్నవాళ్లు కన్నవాళ్లకు బరువవుతారు. బాగా చదువుకుంటారు కాబట్టి కోపం ఎక్కువై రోషం ఎక్కువొచ్చి తెలివొచ్చి దుర్మార్గానికి దగ్గరయ్యే పరిస్థితిలొస్తున్నాయి కానీ సర్దుబాటు చేసుకుని సాధించుకోవాలనే గుణం రావటం లేదు. వీళ్లను బయటికి తేవటానికి సంస్కర్తలకు చేతకాలేదు. ప్రభుత్వాలు ప్రయత్నం చేసినా ఫలితం లేదు. వాళ్లల్లో వాళ్లకే చైతన్యం రావటానికి ఆలోచించాలి. ఇందుకు నా రచనలు ఏమైనా ఉపయోగపడాతాయేమో అని ఆశపడుతుంటా. ఇక్కడ చిత్రమైనది ఏంటంటే చదివేప్పుడు వాడి ఆలోచనశక్తికి, అవగాహనకు సమయమిస్తే వికాసం కలుగుతుంది. ఆ సమయం ఇవ్వకుండా ఇంట్లో, పాఠశాలల్లో తీవ్రమైన ఒత్తిడి తెస్తే చదువుకున్నది జీర్ణం కాదు.

నా పంచకట్టును మెక్చుకొనే వారు
ఎన్టీయార్‌గారు ధుర్యోధనుడి పాత్రలో నడుస్తుంటే ఆరాధించేవాడిని. అయితే నేను నడుస్తుంటే ‘ఆ నడక చూడు’ అని ఆయన నన్ను ఇష్టపడేవారు. ఆయన దగ్గరికి ఎప్పుడెళ్లినా పంచెకట్టుకునే వెళ్లేవాడ్ని(నవ్వులు).

అమ్మే కారణం
మా పల్లెలోని తెలుగుతల్లి నన్ను దీవించింది. నేను ఏ ఉద్యమాలు, సంఘాల్లోను చేరలేదు. వాటిల్లో చేరితే కొన్ని పరిధులు, ప్రోత్సాహకాలు, లాభాలుంటాయి. అయినా పట్టించుకోలేదు. నా హృదయానికి తప్ప దేనికీ నన్ను శాసించే హక్కు ఉండకూడదు అనుకున్నా. ఏదైనా సాధించాలని నన్ను నేను నిర్దేశించుకుని లక్ష్యాన్ని చేరటానికి ప్రయత్నించా. ఇందుకు మా అమ్మేకారణం. నిన్ను నువ్వు ఈ లోకం మీదికి ఇసురుకో అని చెప్పిందామె. నా భార్య కూడా మా అమ్మలాంటిదే. నా పిల్లలు ఇంతబాగా తయారవ్వటానికి కారణం తల్లివేరే.

గానుగెద్దు చదువులు
చదువుతున్నప్పుడు విద్యార్థులకు ఆలోచించే సమయం ఇవ్వాలి. అప్పుడే వికాసం సాధ్యమవుతుంది. తినేటప్పుడు ఒత్తిడి చేస్తే తిన్నది శక్తిగా మారదు. రక్తంలోకి చేరదు. అలాగే చదువు కూడా. ఇప్పుడైతే చదువుకోమనే ఒత్తిడి మాత్రమే ఉంది. చదువు తక్కువ... ఆలోచనా పటిమ పెంచుకునే సమయం ఎక్కువ ఇవ్వడం అనేది చక్కటి విధానం. చిన్నప్పటి నుంచి నేను ఆ విధానాన్నే ఇష్టపడేవాడిని. ఇక్కడో సంఘటన చెప్పాలి. ఒక పదో తరగతి విద్యార్థినికి పరీక్షలో ఓ ప్రశ్న వచ్చింది. ‘మీరు మీ తల్లిని ఇష్ట పడుతున్నారా? అవును లేదా కాదు అని రాయండి... అవును అని రాస్తే ఎందుకు ఇష్టడపడుతున్నారో తెలియజేయండి?’ అనేది ప్రశ్న. ఆమె ‘కాదు’ అని రాసింది. ఎందుకమ్మా అలా రాశావు... నీకు మీ అమ్మంటే ఇష్టం లేదా అని అడిగాను... ‘చాలా ఇష్టం’ అని చెప్పిందా విద్యార్థిని. మరెందుకు ‘అవును’ అని రాయలేదని అడిగితే... అవును అనిరాస్తే ఎందుకు ఇష్టపడుతున్నానో కూడా రాయాలి కదా... నేను రాసింది నచ్చకపోతే మార్కులు పోతాయి కదా... అని ఆమె సమాధానం చెప్పింది.... అయ్యో... మార్కుల గోలతో విద్యార్థులు మానవత్వానికి కూడా దూరవుతున్నారే అని చాలా బాధ పడ్డాను. ఇప్పుడు జీవితం కన్నా మార్కులే ఎక్కువయ్యాయన్నమాట. ఇది ఎంత బాధాకరం? మార్కుల కోసం పిల్లలు జీవితాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే... ఇది గానుగెద్దు లాంటి చదువుగానే భావించాల్సి వస్తుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.