close

తాజా వార్తలు

ఇంత దూరం వచ్చేవాణ్నే కాదు...

తెరపై ఓ నటుడిని చూడగానే... వాళ్లు అంతకుముందు చేసిన పాత్రల్నిబట్టి నవ్విస్తాడనో, లేదంటే భయపెడతాడనో, ఏడిపిస్తాడనో ఓ అంచనాకొచ్చేస్తాం. బ్రహ్మాజీ విషయంలో అలా ఓ నిర్ణయానికి రాలేం. ఆయన ప్రతినాయకుడిగా భయపెడుతుంటాడు. హాస్య నటుడిగా నవ్విస్తుంటాడు. క్యారెక్టర్‌ నటుడిగా భావోద్వేగాలూ పంచగలడు. ఆయనలో ఓ మంచి కథానాయకుడు కూడా ఉన్నాడని ‘సింధూరం’తో రుజువైంది. ఒకొక్క సినిమాలో ఒక్కో తరహా పాత్రతో కనిపిస్తూ అలరిస్తున్న ఓ అరుదైన నటుడు బ్రహ్మాజీ. ఆయనతో ‘హాయ్‌’ మాటలు కలిపినప్పుడు మరో కోణం కూడా కనిపించింది. అదేంటో మీరే చదవండి...
* ‘గులాబి’లో ఉన్నట్టే ఉన్నారే..
స్నేహితులు ఇదే అడుగుతుంటారు (నవ్వుతూ). దానికి కారణం 70 శాతం జీన్స్‌ ప్రభావమని నమ్ముతా. మిగతా 30 శాతం క్రమశిక్షణతో కూడిన జీవితం. ఇలా యంగ్‌గా కనిపించడానికి మెడిసిన్‌ ఏమైనా తీసుకుంటున్నారా అని ఎవరో ట్విట్టర్‌లో అడిగారు. రోజూ 8 గంటలు నిద్ర, కచ్చితంగా వ్యాయామం, బుద్ధిజం చాంటింగ్‌, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఎప్పుడూ సంతోషంగా ఉండటం... ఇవే నేను వాడే మెడిసిన్‌ అని చెప్పాను.
* ఎప్పుడూ సంతోషంగా ఉండటం చిత్ర పరిశ్రమలో సాధ్యమంటారా?
నేను బుద్ధిజం అనుసరిస్తాను. నువ్వు సంతోషంగా ఉండు, పక్కవాళ్లని సంతోషంగా ఉంచు అని నమ్ముతాను. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. సమస్య ఎదురైనప్పుడు బాధపడతాం. కొన్నాళ్లకు అది పరిష్కారం అవుతుంది. అప్పుడు ఈ మాత్రం దానికే ఇన్నాళ్లూ ఎందుకు ఏడ్చామనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండమని చెబుతుంది బుద్ధిజం. నేను దాన్ని నమ్ముతాను. చేసిన సినిమా పేరు తెచ్చినా, తీసుకురాకపోయినా దాని ప్రభావం నాపై పెద్దగా పడకుండా చూసుకుంటా.
* కృష్ణవంశీతో మీ అనుబంధం ప్రత్యేకమైనది కదా?
తను, నేను మద్రాస్‌లో రూమ్మేట్స్‌. ‘శివ’ సినిమా సమయంలో కలిసున్నాం. దర్శకుడయ్యాక నీకు బ్రేక్‌ ఇస్తా అనేవాడు. అన్నట్టుగానే ‘గులాబీ’లో మంచి పాత్ర ఇచ్చాడు. ఆ తర్వాత ‘నిన్నే పెళ్లాడతా’లో అవకాశం ఇచ్చాడు. ఇది సూపర్‌ హిట్టయితే నిన్ను హీరోని చేస్తా అన్నాడు. ‘సింధూరం’తో హీరోని చేశాడు. అది ఆడకపోయినా సరే నిన్ను కమెడియన్‌గా పరిచయం చేస్తానంటూ ‘చంద్రలేఖ’ అవకాశమిచ్చాడు. అలా ఆయన ఏమేం పాత్రల్లో నన్ను చూపించాడో అవే నాకు తిరిగొస్తున్నాయి. అది నా అదృష్టం. ఒకే రకమైన పాత్రలతో ప్రయాణం చేసుంటే ఇంత దూరం వచ్చేవాణ్ని కాదు.
* ‘గులాబి’లో మీ పాత్రని చూశాక మీ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారు?
మా కుటుంబ సభ్యులు కాదు కానీ... చాలామంది మహిళలు నన్ను చూసి భయపడేవాళ్లు. నా గురించి తెలిసినవాళ్లు కూడా ‘నిజంగానే వీడు, మమ్మల్ని తీసుకెళ్లి అమ్మేస్తాడేమో’ అన్నట్టు చూసేవాళ్లు (నవ్వుతూ). ఇప్పటికీ స్క్రిప్టులో నమ్మక ద్రోహం చేసే పాత్ర ఏదైనా ఉందంటే... ‘గులాబి’లో బ్రహ్మాజీ చేసిన రాంబాబు పాత్ర ఉంది కదా, అలా ఉండాలని మాట్లాడుకుంటారు.
* ఇక్కడ కొనసాగలేం, ఇక తిరిగి వెళ్లిపోదాం అని ఎప్పుడైనా అనిపించిందా?
అలా ఎప్పుడూ అనిపించలేదు. కానీ కెరీర్‌ అనుకొన్నట్టుగా సాగక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు స్నేహితులు సాయం చేశారు. హీరోగా చేశాను, సరిగ్గా ఆడలేదు. మళ్లీ క్యారెక్టర్లు చేశా, కానీ బ్రహ్మాండమైన బ్రేక్‌ ఏమీ రాలేదు. అలాంటి సందర్భంలోనే కృష్ణవంశీ కాకుండా... సన్నిహితులైన చాలామంది దర్శకులు మంచి పాత్రలు ఇచ్చారు. బ్రహ్మాజీ కోసం అంటూ ఏదో ఒక పాత్ర రాశారు.
* అన్ని రకాల పాత్రలు చేశారు కదా, ఇంకా కలల పాత్రలంటూ ఏమైనా ఉన్నాయా?
చరిత్రాత్మక సినిమా చేయాలని ఉండేది. ‘బాహుబలి’ తరహా సినిమా చేస్తే బాగుండేది అనుకొనేవాణ్ని. అదృష్టవశాత్తూ ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో అలాంటి పాత్ర లభించింది. రామ్‌చరణ్‌ స్వయంగా నన్ను తీసుకెళ్లి ఆ పాత్ర ఇప్పించారు. నమ్మినబంటు అంటారు కదా. అలాంటి పాత్ర. చిరంజీవిగారి పక్కన కనిపిస్తా.


మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఆయన బదిలీలతో గోదావరి జిల్లాల్లో చాలా ఊళ్లు తిరుగుతుండేవాళ్లం. చిన్నప్పుడే ఏదో ఒకరకంగా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఉండేది. పెద్దయ్యాక నటనపై ఆసక్తి పెరిగింది. ఎఎమ్‌ఐఇ చదువుతూ మధ్యలో ఆపేసి, సినిమాల్లోకి వెళతానన్నా.


 

నా భార్య బెంగాలీ. ఆమె ఇంటీరియర్‌ డిజైనర్‌. మంచి పెయింటర్‌. పాటలు పాడుతుంది, పుస్తకాలు బాగా చదువుతుంది. నాకు బుద్ధిజం పరిచయం చేసిందీ తనే. బుద్ధిజం ఏరియా లీడర్‌ కూడా. ఆమె ద్వారానే నాకూ బుద్ధిజం అలవాటైంది.


 

పరిశ్రమలో ఎవరూ తెలియదు కదా, ఎలా పైకొస్తావు అనేవారు మా నాన్న. కానీ నా ఆసక్తి చూసి వెళ్లు అన్నారు. మొదట మధు ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను. ఆ తర్వాత రెండేళ్లకి మెల్లమెల్లగా ప్రయత్నాలు మొదలుపెడుతూ అడుగులేశా. మద్రాసుకి వెళ్లాక మొదట్లో డబ్బు పంపేవారు. అవి భోజనాలకి సరిపోయేవి. ఇక సినిమాలు చూడటానికి, ఇతరత్రా వ్యాపకాలకోసం ఎలాగోలా మేనేజ్‌ చేసేవాళ్లం.

- నర్సిమ్‌ ఎర్రకోట, ఫొటోలు: జయకృష్ణ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.