close

తాజా వార్తలు

ఆ అనుబంధం కరవైంది!

సుశీలమ్మ.. జానకమ్మ..
ఆ తర్వాత.. ఇంకెవ్వరు చిత్రమ్మే!
దశాబ్దాల పాటు ఆమె పాట లేని సినిమా లేదు.
ఏ యుగళగీతమైనా ఆమె గళం వినిపించకుండా లేదు!
పన్నెండు భాషల్లో.. పాతికవేలకు పైగా పాటలు.. ఈ లెక్క చాలు చిత్ర గాత్రం ఎంత పక్కాగా ఉంటుందో!
ఒకవైపు స్వరార్చన.. మరోవైపు సామాజిక సేవతో ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తోన్న కె.ఎస్‌.చిత్ర ‘హాయ్‌’తో పంచుకున్న కబుర్లు..

* ఇన్నేళ్లయినా.. మీ గొంతులో అదే మాధుర్యం.. ఎలా సాధ్యం?
వయసు మరీ పెరిగితే తప్ప ఆ తేడా కనిపించదు. కొన్నాళ్లు విరామం ఇచ్చి, మళ్లీ పాడటం మొదలుపెట్టినా గొంతులో మార్పు కనిపిస్తుంది. నా విషయమంటారా.. సాధనే నా విజయ రహస్యం. సంగీతం నేర్చుకోగానే సరిపోదు.. ఎప్పటికప్పుడు సాధన చేస్తుండాలి.

* మీ నేపథ్యగానం ఎప్పుడు మొదలైంది?
తొమ్మిదో తరగతిలో ఉండగా మొదటిసారి మలయాళంలో పాడాను. ఆ రోజు నాకు బాగా గుర్తు. యేసుదాసుగారితో పాడాను. చిన్నదాన్ని కావడంతో భయమనిపించలేదు. వాళ్లు ఎలా చెబితే అలా పాడా. తర్వాత పదో తరగతి కావడంతో పెద్దగా పాడలేదు. మళ్లీ 80వ దశకం నుంచి నా కెరీర్‌ మొదలైంది. తెలుగులో కూడా మొదటి పాట యేసుదాసుగారితోనే అవకాశం వచ్చింది. అదేం చిత్రమో గానీ, నేను చేసిన మొదటి స్టేజి షో కూడా ఆ మహాగాయకుడితోనే కావడం విశేషం.

* సంగీతంపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉందా?
చిన్నప్పటి నుంచే! మా అమ్మానాన్న ఇద్దరూ గాయకులే. రేడియో ఆర్టిస్టులు. అమ్మ వీణ కూడా వాయించేవారు. మా మేనత్త కూడా మంచి గాయని. ఇంట్లో అందరూ విద్వాంసులే. అలా నాకు చిన్నప్పుడే సంగీతంపై ఆసక్తి కలిగింది. మా స్వస్థలం తిరువనంతపురం. నాన్నగారు కృష్ణన్‌నాయర్‌ సంగీతంలో ఓనమాలు నేర్పించారు. అప్పుడు నాకు మూడేళ్లనుకుంటా.. సంగీత విద్వాంసురాలు ఓమనకుట్టి మా ఇంటి దగ్గర గుళ్లో కచేరీ కోసం వచ్చారు. మా ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో ఉయ్యాల్లో ఉన్న మా తమ్ముడిని లాలిస్తూ పాట పాడానట. అది విని ‘ఈ అమ్మాయి చాలా బాగా పాడుతుంది. మంచి భవిష్యత్తు ఉంది. నా దగ్గరికి పంపండి.. సంగీతం నేర్పిస్తా’ అన్నారట. వెంటనే సాధ్యం కాలేదు కానీ, కొన్నాళ్ల తర్వాత ఆమె దగ్గర సంగీతం నేర్చుకున్నా. తక్కువ సమయంలోనే గాయనిగా గుర్తింపు తెచ్చుకున్నా.

నవ్వాల్సిన చోట ఏడ్చేశా
ఇళయరాజాగారు పాటలో చిన్న తప్పు కూడా రాకూడదంటారు. దాంతో కాస్త టెన్షన్‌గా ఉండేది. ఓసారి రాజాగారి దర్శకత్వంలో ఓ పాట రికార్డింగ్‌ ఉంది. ఆ రోజు పొద్దునే నాకు ఫోను వచ్చింది. బాలుగారితో పాడాలి. నేను మరో రికార్డింగ్‌లో ఉన్నా. అది పూర్తయ్యాక వస్తానని చెప్పా. అయితే కరెంట్‌ సమస్య వల్ల రికార్డింగ్‌ ఆలస్యమై.. కాస్త లేట్‌గా వెళ్లాను. రాజాగారు నన్ను చూసి ‘నువ్వు బాలు కన్నా బిజీ అయిపోయావు ఈ మధ్య’ అన్నారు. అప్పుడు రికార్డు చేసిన పాట కోకిల సినిమాలోనిది. అందులో ‘కోకిలా.. కొకోకిల..’అని వచ్చినప్పుడు మధ్యలో నవ్వాలి. ఆయన అన్న మాటకు నాకు బాధేసి ఏడుపొచ్చేసింది. చివరకు ఆయనే నన్ను ఓదార్చి.. తన స్టూడియోలో ఉన్న త్యాగరాజస్వామి ఫొటో ఇచ్చారు. ఆ ఫొటోను చూసినప్పుడల్లా నాకు గర్వంగా అనిపిస్తుంటుంది.

* మరి మీరు బాధపడిన సందర్భం..
మా అమ్మాయి నందన మా మధ్య లేకపోవడం నాకున్న ఒకే ఒక్క బాధ. ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతున్నా. అయితే సంగీతం ఆ విషాదం నుంచి బయటపడేందుకు నాకెంతో సాయం చేసింది. అలాగే ఇంట్లోవాళ్లు కూడా అనుక్షణం అండగా ఉన్నారు. నన్ను మామూలు మనిషిని చేయడానికి మావారెంతో కష్టపడ్డారు.

* సామాజిక సేవలోనూ భాగమవుతున్నట్టున్నారు..
మా పాప పేరిట స్నేహనందన ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పెట్టాం. ఈ సంస్థ ద్వారా 60 ఏళ్లు పైబడిన కళాకారులకు శాశ్వత ఫించను అందిస్తున్నాం. మలయాళంలో ఓ ఛానల్‌లో ‘స్నేహ స్పర్శన్‌’ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నా. నేనే యాంకరింగ్‌ చేస్తున్నా. దాని ద్వారా నిరుపేద రోగులకు వైద్యం, ఇల్లు లేనివారికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ కూడా అమ్మాయిల భవిష్యత్తు కోసం ఏర్పాటుచేస్తోన్న ఫండ్‌రైజింగ్‌ కార్యక్రమంలో పాల్గొనడానికే హైదరాబాద్‌ వచ్చా.

* చిత్ర ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తారు.. రహస్యమేంటి?
ఆడపిల్లలు ఎక్కువగా నవ్వకూడదని అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది. సీరియస్‌గా ఉండాలనేది. నేను మాత్రం పూర్తిగా భిన్నం. ఎవరినైనా చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది. నవ్వుతూ ఉండటమే నాకు ఇష్టం.

 

ముప్ఫయ్‌ రోజుల్లో తెలుగు

తెలుగులో పాడుతున్నప్పుడు భాషలో ఏమైనా దోషాలుంటే బాలుగారు సరిదిద్దేవారు. సంగీత దర్శకులు, పాటల రచయితలు ఇలా అందరూ సహకరించేవారు. ఇళయరాజాగారి దగ్గర వయోలనిస్ట్‌ జ్యూడీసార్‌ ఉండేవారు. ఆయన ‘ముప్ఫయ్‌ రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా?’ పుస్తకాన్ని రైల్వేస్టేషన్‌లో కొని తెచ్చిచ్చారు. అది నాకెంతో ఉపయోగపడింది. ఇప్పుడు తెలుగు పాట తెలుగులోనే రాసుకుని పాడుతున్నా.
ఓ గాయనిగా సాంకేతికతను నేను సమర్థిస్తా! కానీ, దానివల్ల కొన్నిసార్లు కృత్రిమత్వం వస్తుంది. రికార్డింగ్‌ చేసే విధానం కూడా మారింది. ఇప్పుడు గాయనీగాయకుల ట్రాక్స్‌ని విడివిడిగా రికార్డు చేసి, కలుపుతున్నారు. ఒకవిధంగా అది మంచిదే! కానీ.. లైవ్‌లో రికార్డు చేస్తే ఆ ప్రత్యేకతే వేరు. నాకు అలాంటి రికార్డింగ్‌ అంటే ఇష్టం. ఎంతో నేర్చుకోవచ్చు. ఎస్పీబీ కావొచ్చు, రెహ్మాన్‌ కావొచ్చు.. ఒక్కొక్కరితో ఒక్కో పాఠం నేర్చుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో అలాంటి అనుబంధం కనిపించడంలేదు.

 

మళ్లీ ఏం పాడను?

ఓసారి మా పాఠశాలలో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేరళ ముఖ్యమంత్రి వచ్చారు. అప్పటికే లైట్‌మ్యూజిక్‌లో స్టేట్‌ ఫస్ట్‌ ప్రైజ్‌ అందుకున్నా. కార్యక్రమం ప్రారంభం కావడానికి సమయం ఉండటంతో నేను స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నా. ఇంతలో టీచర్‌ నన్ను స్టేజ్‌ మీదికి పిలిచి.. బహుమతి వచ్చిన పాట పాడమాన్నారు. పాడేశాను. ఇంతలో ముఖ్యమంత్రి వచ్చారు. మరోపాట అన్నారు. నాకేం చేయాలో తోచలేదు. ‘మళ్లీ మళ్లీ పాడమంటే నేనేం పాడను..’ అర్థం స్ఫురించేలా ఓ పాట పాడాను. ఇదంతా మర్నాడు పత్రికల్లో రావడం గమ్మత్తు.
- హెచ్‌. శ్రీలక్ష్మి

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.