close

తాజా వార్తలు

ఆయన కోసం ఆరు నెలలు తిరిగా..

కరెంటు లేని గ్రామంలో పుట్టాడు.. పెద్దలు టీచర్‌ కమ్మంటే... కాదని, హోమియో వైద్యం చదివాడు.. స్థిరాస్తి వ్యాపారం చేస్తూ... సిమెంటు పరిశ్రమలు పెట్టాడు. ఇక అయిపోయాడని అందరూ అనుకుంటే అందనంత ఎత్తుకు ఎదిగాడు...
మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు. పట్టుదల, అకుంఠిత దీక్ష, నిజాయతీలే తన విజయాలకు కారణమని చెబుతున్న ఆయన... సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎలా ఎదిగారో ‘హాయ్‌’కి ప్రత్యేకం...

* ఇంట్లో వాళ్లు ఉపాధ్యాయ వృత్తి చేయమంటే... మీరు హోమియో వైద్యం వైపు ఎలా వచ్చారు?
మాది సామాన్య మధ్య తరగతి కుటుంబం. మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. మా పెద్దన్నయ్య బీఎస్సీ మధ్యలో ఆపేసి కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. 7వ తరగతి వరకూ మా ఊర్లో కరెంటు కూడా లేదు. 8 తరగతి నుంచి టౌన్‌కు పోవాల్సి వచ్చింది. నేను పట్టుదలగా చదివాను. మా ఊర్లో పదోతరగతి పాసైతే సంబరాలు చేసేవారు. నేను ఇంటర్‌ పూర్తిచేశాను. అప్పుడు మా జిల్లా కేంద్రం మహబూబ్‌నగర్‌లో బీఎస్సీలో చేరాను. బీఎస్సీ బీఈడీ చేసి టీచర్‌ ఉద్యోగం సంపాదించాలని మా అన్న కోరిక. ద్వితీయ సంవత్సరంలో ఉండగా హోమియోపతి వైద్యానికి సంబంధించి నోటిఫికేషన్‌ వచ్చింది. వైద్యం చదువుకుంటే ఎక్కడైనా సొంతంగా బతకొచ్చనేది నా అభిప్రాయం. స్నేహితులకు వచ్చిన మనీఆర్డర్‌ తీసుకొని హైదరాబాదు కొచ్చాను. బీహెచ్‌ఎంఎస్‌(హోమియోపతి)కు దరఖాస్తు చేశాను. రూ.70 ఫీజు కట్టాను. సీటొచ్చింది. అప్పుడు ఇంట్లో విషయం చెప్పాను. అన్న వద్దన్నారు. ఎదురుచెప్పలేకపోయాను. తర్వాత కొన్ని రోజులు ఆగి మా అన్నకు నచ్చజెప్పాను. అలా హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు మెడికల్‌ కాలేజీలో బీహెచ్‌ఎంఎస్‌ చేశాను. నాలుగున్నర సంవత్సరాలు కోర్సు. 6 నెలలు హౌస్‌సర్జన్‌గా పనిచేశాను.

* డాక్టర్‌ చదివి.. స్థిరాస్తి వ్యాపారంలోకి ఎలా అడుగుపెట్టారు?
1979లో దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రాక్టిస్‌ మొదలు పెట్టాను. సాయంత్రం సమయాల్లో రోగులు ఎక్కువ మంది వచ్చేవారు. ఉదయం పూట రోగుల కంటే... రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు ఎక్కువగా వచ్చి స్థలాలు కొనమని చెబుతుండేవారు. అలా సత్యనారాయణగారు పరిచయం అయ్యారు. ఆయనే నన్ను ఈ వ్యాపారంలోకి తీసుకొచ్చారు. ఆయనకు అంతకుముందే ఇందులో మంచి అనుభవం ఉంది. అప్పుడు ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌లలో పొలాలుండేవి. వీటిని కొనడానికి మా మేనమామ దగ్గరికి వెళ్లి డబ్బు అప్పు అడిగాను. ఆయన బంగారం తాకట్టు పెట్టుకోమని ఇచ్చారు. వాటిని తాకట్టు పెడితే నాకు కావాల్సినంత డబ్బు రాలేదు. అందుకే అమ్మేశాను. మొదటి వెంచర్‌ హయత్‌నగర్లో వేశాం. అప్పుడు అక్కడ ఎకరం రూ.90వేలు. మూడునెలల్లో ప్లాట్లు అమ్మేశాం. అప్పట్లోనే రూ.2లక్షలు లాభం వచ్చింది. తర్వాత ప్రాక్టీస్‌ మానేసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.

* రియల్‌ వ్యాపారంలో అడ్డంకులేం రాలేదా?
చాలా అడ్డంకులు వచ్చాయి. ఎక్కడా రాజీ పడకుండా ముందుకెళ్లాను. నేను ఓటమిని ఒప్పుకొనే వాణ్ని కాను. పైగా వినియోగదారుడి సంతృప్తే లక్ష్యంగా పనిచేశా. వినియోగదారుడే దేవుడు అన్నట్లు పనిచేశాం. ఫ్లాట్‌ అప్పచెప్పిన తర్వాత కూడా ఏదైనా సమస్యలొస్తే వెళ్లి పరిష్కరించేవాళ్లం. అందుకే వినియోగదారులు మమ్మల్ని నమ్మారు. అలా అడ్డంకులను అధిగమించాం.

* సిమెంటు పరిశ్రమ పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది?
1996లో మహా సిమెంట్స్‌ను మొదలుపెట్టాం. అయితే అప్పట్లో సిమెంటు పరిశ్రమ పరిస్థితి బాగాలేదు. బాగా నష్టాలు వచ్చేవి. అయినా.. వెనుకడగు వేయలేదు. ఆ కాలంలో చాలా సిమెంటు పరిశ్రమలు మూతపడే పరిస్థితి. 2000లో పరిశ్రమను విస్తరించాలనుకున్నా. అందరూ వద్దన్నారు. నేను అప్పటి వరకూ సంపాదించిన డబ్బు పెట్టాను. స్థలాలు, ఇల్లు అమ్మేశాను. త్రిబుల్‌బెడ్‌రూం ఫ్లాట్‌లోకి మారాను. అప్పడే నవదీప వెంచర్‌ లీగల్‌ సమస్యతో ఆగిపోయింది. అప్పటికే దానికి రూ.42కోట్లు ఖర్చు పెట్టేశాను. ఇక రామేశ్వరరావు పని అయిపోయిందని అనుకున్నారంతా. నేను మాత్రం పట్టుదలతో పనిచేశాను. మా పరిశ్రమ విస్తరణ పూర్తయ్యేసరికే సిమెంటుకు మంచి రోజులొచ్చాయి. 2001లో రూ.7కోట్లు లాభం వచ్చింది. 2007-08లో మూడోసారి విస్తరించాం. అదే ఏడాది మంచి లాభాలొచ్చాయి. ఆ ఏడాదిలో రూ.400 కోట్లు ఇన్‌కంట్యాక్స్‌ కట్టాను.

* వ్యాపారంలో భాగస్వాములను ఎందుకు తీసుకోలేదు?
భాగస్వాములుంటే నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకొనే వెసులుబాటు ఉండదు. పైగా లాభాలుంటే భాగస్వాములు బాగుంటారు. లేదంటే... తప్పు మనమీద తోస్తారు.

* ఇన్ని వ్యాపారాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలా..
నేను ఇంత బలమైన సంకల్పంతో, నిశ్చయమైన మనసుతో ఉండడానికి దోహదపడేది ఆధ్యాత్మికత. జీవితంలో మనం ఎన్నో ఎత్తుపల్లాలు చూస్తుంటాం. ప్రతి దశలోనూ మనం ఏదో తోడు కోరుకుంటాం. నాకు ఈ భక్తి భావన, ఆధ్యాత్మికత ఎంతో ఉపయోగపడింది. అందుకే రాత్రి ఎంత ఆలస్యమైనా.. ఉదయాన్నే లేచి రెండు, మూడు గంటలు పూజ చేస్తాను. నా మానసిక ప్రశాంతతకు ఇది కారణమవుతుంది. నిర్ణయాలు కూడా కచ్చితమైనవి తీసుకోగలుగుతాను.

* మీపై నమ్మకం ఎలా కలిగించగలిగారు?
స్థిరాస్తి వ్యాపారం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు 2600 ఫ్లాట్లు కట్టడం ప్రారంభించాం. మిగతా వ్యాపారులంతా నిర్మాణాలు ఆపేశారు. మేం కొనసాగించాం. వినియోగదారులకు చెప్పిన సమయానికంటే ముందే కట్టి ఇచ్చాం. మిగతా వ్యాపారుల వద్ద పెట్టుబడి పెట్టిన వారంతా ఇబ్బంది పడుతుంటే... మమ్మల్ని నమ్మి మా దగ్గర ఫ్లాట్లు కొన్నవాళ్లు సంతోషపడ్డారు. తర్వాత వాళ్లే చాలా మందికి మా గురించి చెప్పారు. అలా మేమంటే నమ్మకం ఏర్పడింది. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. దాని మీద జీవితాంతం ఆశ పెట్టుకుంటారు. అలాంటిది మేం ఎలా నిర్మించి ఇవ్వాలి? వందశాతం బాగా చేసివ్వాలి. అలాగే చేశాం.

* జీయర్‌గారి ట్రస్ట్‌ ద్వారా సామాజిక, ఆధ్యాత్మిక సేవలు నిర్వహిస్తూ ఉంటారు కదా! ఇంతకీ చిన్నజీయర్‌స్వామితో పరిచయం ఎప్పుడు ఏర్పడింది?
1990లో ఆయనతో పరిచయం ఏర్పడింది. అంతకుముందు ఆంజనేయస్వామిని నమ్మేవాడిని. జీయర్‌గారిలో ప్రశాంతత, క్లారిటీ ఆఫ్‌ థాట్‌, వైబ్రేషన్స్‌ నచ్చాయి. మీరు భగవద్గీత చెబితే స్పాన్సర్‌ చేస్తానంటే ఆయనకి నమ్మకం కలుగలేదు. నన్ను ఆరు నెలలు తిప్పుకొన్నారు. అప్పుడాయన విజయవాడలో ఉండేవారు. నేను పట్టినపట్టు విడవకుండా ఆయన దగ్గరికివెళ్లాను. నాపై ఆయనకు నమ్మకం ఏర్పడ్డాక భగవద్గీత బోధించడం మొదలెట్టారు. మొదటి శ్లోకానికే వారం రోజులు పట్టింది. అంత లోతుగా, స్పష్టంగా, విజ్ఞానం పంచుతూ ఆయన చెప్పిన తీరుకు ఆకర్షితుడినయ్యాను. ఆయనతో మాట్లాడాను. చెప్పింది విన్నాను. ఆయన ట్రస్ట్‌తో కలిసి పనిచేస్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావించాను. ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాను.

* ఆధ్యాత్మికంగా ఎన్నెన్నో చేస్తున్నారు కదా.. నెరవేరని ఆశలేమైనా ఉన్నాయా?
నేను అనుకున్నవి అన్నీ నెరవేరాయి. సంతృప్తిగా ఉంది.

 

హోమియో సేవ

నేను హోమియోపతి చదివాను. అదంటే నాకు నమ్మకం. ఇప్పటికీ మా మనవళ్లకు నేనే హోమియోపతి మందులు ఇస్తాను. అతి పెద్ద అత్యాధునిక హోమియో హాస్పిటల్‌ కట్టి, 14 మంది మంచి డాక్టర్లుతో స్వామివారి ఆధ్వర్యంలోనే ఉచిత సేవ చేస్తున్నాం. హోమియోపతివాళ్లు ఎక్కువగా క్లినిక్స్‌ పెడుతున్నారు, కానీ పరిశోధనవైపు తక్కువ వెళ్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వనరుల్లేవు కాబట్టి రోగులు రావట్లేదు. మా ఆసుపత్రి శంషాబాద్‌ దగ్గర ఉన్నా రోజూ 700మందికి పైగా వస్తున్నారు. అందరికీ ఒకేరకమైన వైద్యం ఉండదు. తత్వం బట్టి మందులుంటాయి. మనకు పరిశోధన కేంద్రం లేదు. మేం ప్రారంభించాం. మన ప్రభుత్వం ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొని, ఫండింగ్‌ సహా మాకిచ్చారు. ప్రపంచంలోనే ఉత్తమ ప్రొఫెసర్స్‌ను తీసుకొస్తున్నాం. మా ఇన్‌స్టిట్యూట్‌లోని పిల్లలు నాలుగో సంవత్సరానికి వచ్చారు. పీజీ కూడా మంజూరైంది. మా దగ్గర డిజిటైల్‌ లైబ్రరీ పెద్దది. పిల్లలు అక్కడే హాస్టల్‌లో ఉండి చదువుకోవాలి. ముంబయి నుంచి నిపుణులను ఆహ్వానించాం. ప్రతి కేసును రికార్డు చేసి పరిశోధనకు కృషి చేస్తున్నాం.
ఏ విషయంలో అయినా ఇంట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఎవరి ఆలోచన బాగుంటే వారిదే అమలు చేస్తాం. అంతా డెమోక్రటిక్‌గా ఉంటుంది. ఒక్కోసారి విభేదాలు వస్తాయి. చర్చలతో పరిష్కరించుకుంటాం. ఇక మా ఇద్దరు కోడళ్లు విద్యాపరమైన విషయాలు చూస్తున్నారు. నేను బతుకుతెరువు ఎలా అనే స్థితి నుంచి ఈ స్ధాయికి చేరుకున్నాను. అదే విషయం వాళ్లకు చెబుతుంటాను. తపనతో, కష్టంతో ఎన్నో అద్భుతాలు సాకారమవుతాయి.

 

వాక్‌ టూ వర్క్‌ కాన్సెప్ట్‌...

భవిష్యత్తులో ట్రాఫిక్‌ సమస్యలు విపరీతం కానున్నాయి. అందుకే వాక్‌ టు వర్క్‌ అనే కాన్సెప్ట్‌తో పనిచేస్తున్నాం. 3000 ఎకరాల్లో వెంచర్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. పెద్ద టౌన్‌షిప్‌లాంటిదన్న మాట. ఇక్కడే ఆఫీసులు, ఇళ్లు, షాపింగ్‌, స్పోర్ట్స్‌, స్కూల్స్‌... అన్ని అందుబాటులో ఉండేలా చేస్తాం. ప్రకృతి హితంగా ఉంటుందీ ప్రాజెక్టు. మురుగునీటి శుద్ధి చేస్తాం. మొక్కలు ఎక్కువగా పెంచి 3డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని చూస్తున్నాం. ఒక సరస్సు సృష్టిస్తున్నాం. ఒక టీఎంసీ నీరు ఇందులో అందుబాటులో ఉండేలా చేస్తాం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఒక ఆదర్శ వెంచర్‌ వేసేందుకు సిద్ధమవుతున్నాం.
మా సంస్థలో పనిచేసే ఉద్యోగుల విషయంలో కష్టపడేతత్వం, నమ్మకం, విశ్వాసాలకు ప్రాధాన్యం ఇస్తాను. ప్రతిభ ఉండీ బాధ్యత లేకుంటే ఇబ్బందే. నమ్మకం, స్థిరత్వం లేకపోతే ఎంత ప్రతిభావంతుడైనా రాణించడం కష్టమే.

 

ఎంజాయ్‌ ది లాస్‌

మొదట మనమీద మనకు నమ్మకముండాలి. ప్రతి రంగమూ గొప్పదే. ఎటువంటి పరిస్థితులు వచ్చినా భయపడొద్దు. ఆలస్యం అయినా విజయం తప్పక వస్తుంది. కష్టపడి పనిచేసుకుంటూ వెళ్లండి. నిరాశ పడొద్దు. అందుకే నా పిల్లలకు ఎంజాయ్‌ ద లాస్‌ అని చెబుతాను. ఎన్ని కష్టాలొచ్చినా బెదరకూడదు. మనసు గాయమైనా పనిచేయాలి. మనిషి సాధించనిది ఏదీ లేదు. స్థిరంగా, ఫోకస్‌గా ఉండాలి.
సైకిల్‌ తొక్కినపుడు బెంజికారులో వెళ్లినపుడు కంటే సంతోషంగా ఉన్నా. సంతోషం అనేది మైండ్‌సెట్‌.
ఓటములు మన బలాన్ని పెంచుతాయి.
నువ్వు అనుకున్నట్లు నువ్వుండు.
దేవాలయాలకు వెళ్లినపుడు మనకంటే సుప్రీమ్‌ ఉన్నారని గుర్తొస్తుంది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.