close

తాజా వార్తలు

మా అనంతపురం అమ్మాయిలు అందంగా ఉండరా?

టాలీవుడ్‌లో తెలుగమ్మాయిలు మెరిసి మురిపించి చాలా కాలమైంది. ‘టాక్సీవాలా’కు కన్నుగీటిన కొంటె కోనంగి ప్రియాంక జవాల్కర్‌ మన తెలుగమ్మాయే! ఈ అనంతపురం ఆడబిడ్డను పలకరిస్తే.. ‘మా రాగిముద్ద రుచి భలే ఉంటుంది,  ధర్మవరం చీరల గురించి విన్నారా? పుట్టపర్తికి వచ్చారా ఎప్పుడైనా?’ గలగలా తెలుగు మాట్లాడేస్తుంటుంది. తెలుగుతెరకు పరిచయమైన పక్కాలోకల్‌ కథానాయిక  చెప్పిన ముచ్చట్లు...

 

కథానాయికనయ్యాక కొంతమంది గుర్తు పడుతున్నారు తప్పిస్తే మిగతా నా వ్యక్తిగత జీవితం అంతా మామూలే. తొలి సినిమాతోనే బోలెడన్ని అనుభవాల్ని మూటగట్టుకున్నా. అవి నా సినీ ప్రయాణం మొత్తానికి సరిపడే స్థాయిలో ఉంటాయేమో. ‘టాక్సీవాలా’ వేడుకలో విజయ్‌ దేవరకొండ చెప్పినట్టుగానే మొదట ఆ సెట్‌లోకి ఒక రకమైన భయం మధ్యే అడుగుపెట్టా. క్రమంగా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకొన్నా. తీరా షూటింగ్‌ పూర్తయ్యాక చాలా ఆటుపోట్లు. రెండేళ్ల ఎదురుచూపుల తర్వాత సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, ఆ సినిమాపై నాకున్న నమ్మకం ఏనాడూ కోల్పోలేదు. అందుకు తగ్గట్టే.. ‘టాక్సీవాలా’ ఘనవిజయం సాధించడం సంతోషాన్నిచ్చింది.
* మాది మహారాష్ట్రకు చెందిన మరాఠా కుటుంబం. ఒక తరం నుంచి అనంతపురంలో స్థిరపడ్డాం. నేను పుట్టింది, పెరిగింది ఇక్కడే. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో.. నన్ను ‘అనంతపురం పిల్ల’ అని పిలిచేవాళ్లు కొందరైతే, ‘అనంతపురం అమ్మాయి హీరోయిన్‌ అయ్యిందా!’ అని నా ముందే ఆశ్చర్యపోయేవాళ్లు ఇంకొందరు. ఆ మాటలు విన్నప్పుడు ‘ఏంటీ? మా అనంతపురం అమ్మాయిలు అందంగా ఉండరా? అక్కడి నుంచి హీరోయిన్లు రాకూడదా?’ అంటుంటా (నవ్వుతూ). కళలకు ప్రాంతీయ భేదాలు హద్దులు కావని నా అభిప్రాయం. ప్రియాంక చోప్రా కూడా బరేలీ అని చిన్న పట్టణం నుంచి వచ్చింది. కంగన రనౌత్‌ కూడా అంతే. ప్రతిభ, కుటుంబ సహకారం, పరిశ్రమ ప్రోత్సాహం ఉంటే ఎవ్వరైనా కథానాయికలు అవుతారు.
* టీవీలో ఏదైనా పాట వస్తుంటే కొందరు పిల్లలు డాన్స్‌ చేస్తుంటారు. దాన్నిబట్టి వాళ్లకున్న ఆసక్తి అర్థమవుతుంది. కొందరు పిల్లలు ‘తాము కూడా అలా ఆడిపాడితే బాగుంటుంది కదా’ అనుకుంటారు. నేను రెండో రకం. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. కానీ, బయటపడేదాన్ని కాదు. మా ఇంట్లో చదువుకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. నా కజిన్స్‌ అందరూ బాగా చదువుకొన్నవాళ్లే. కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లున్నారు. వాళ్లలో విదేశాల్లో స్థిరపడ్డవాళ్లు చాలామందే! చిన్నప్పటి నుంచి చదువు తప్ప మరో ప్రపంచం తెలీదు నాకు.స్నేహితులూ తక్కువే. కాలేజీకి వచ్చామా, వెళ్లామా అంతే!
* ఇంజినీరింగ్‌ తర్వాత సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేస్తూ సినిమాలపై దృష్టి పెట్టాను. మొదట లఘు చిత్రాల్లో నటించాను. కానీ, ‘టాక్సీవాలా’ సెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు ఎదురుగా ఓ పెద్ద కెమెరా, చుట్టూ టెక్నీషియన్లు, పక్కన కల్యాణి, విజయ్‌లాంటి నటుల్ని చూసి.. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మొదటి షాట్‌ తర్వాత కానీ నేను మామూలు స్థితికి రాలేదు. వారం పోయాక గానీ సినిమాలో నటిస్తున్నానని మా కుటుంబ సభ్యులకు చెప్పలేదు.
* మా అమ్మకు డిజైనింగ్‌తో అనుబంధం ఉంది. దాంతో నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదువుకొన్నా. ‘టాక్సీవాలా’ సినిమాకి నా దుస్తుల్ని నేనే డిజైన్‌ చేసుకున్నా. ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా తెరపై కనిపించాలనుకుంటా. అందంగా కనిపించడానికీ, అసభ్యంగా కనిపించడానికి తేడా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నటిస్తా. కాస్త ఆలస్యమైనా.. నాదైన దారి నాకు ఉంటుందని నమ్ముతున్నా. సినిమాల్లోకి రాకపోయుంటే ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో స్థిరపడేదాన్నేమో!
* తెలుగమ్మాయిలకి పరిశ్రమ నుంచి, ప్రేక్షకుల నుంచి లభించే ప్రోత్సాహమే వేరు. అది ప్రత్యేకమైన కిక్‌నిస్తుంది. తెలుగు మాట్లాడే హీరోయిన్‌ అంటూ దర్శకనిర్మాతలు సంతోష పడుతుంటారు. తొలి సినిమా చేస్తున్నప్పుడే చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ‘టాక్సీవాలా’ తర్వాతే రెండో సినిమా చేయాలనుకొన్నా. అనుకొన్నట్టే అగ్ర కథానాయకుల చిత్రాలు కూడా వచ్చాయి.  రెండో సినిమా కెరీర్‌కి చాలా ముఖ్యం. అది దృష్టిలో ఉంచుకొని అడుగులు వేస్తున్నా.

*మా కుటుంబం అనంతపురంలోనే ఉంటుంది. మా ఇంట్లో మహారాష్ట్ర వంటకాలే వండుతుంటారు కానీ... నాకు మాత్రం అనంతపురం ఫుడ్‌ అంటేనే ఇష్టం. అందుకే మా అమ్మ రాగి సంకటి, ఉగ్గాని, బజ్జీల్లాంటివన్నీ నేర్చుకుని చేస్తుంటుంది. మసాలా పూరీ అంటే చాలా ఇష్టం. కర్ణాటక బోర్డర్‌లో బాగా చేస్తారు.
*నాకు స్నేహితులు తక్కువే! ఒకరిద్దరు ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. వాళ్లు ‘టాక్సీవాలా’ చూశాక ఫోన్‌ చేసి చాలా సంతోషించారు. తెరపై నన్ను చూసి ఆశ్చర్యపోయామని చెప్పారు.
* పవన్‌కల్యాణ్‌ నా అభిమాన కథానాయకుడు. ఆయన్ని కలవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు కానీ...  ఈసారి మాత్రం ఎలాగైనా కలవాలి.
* అభిమాన కథానాయికలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. కాజల్‌ అగర్వాల్‌ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఆలియా భట్‌ బాగా నచ్చుతోంది.
* మంచి ప్రేమకథలో నటించాలని ఉంది. ఖాళీ దొరికిన ప్రతిసారీ తెలుగులో వచ్చిన పాత ప్రేమకథా చిత్రాల్ని చూస్తూ ఉంటా.
- నర్సిమ్‌ ఎర్రకోట

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.