close

తాజా వార్తలు

మరాఠీలో రాసుకొని సివిల్స్‌ పాసయ్యా

‘తిరిగిచ్చేయాలి... లేకపోతే లావైపోతారు’ శ్రీమంతుడు సినిమాలో మహేష్‌ డైలాగ్‌! మనల్ని ఈ స్థాయికి చేర్చిన సమాజానికి తిరిగి ఇవ్వకపోతే ఎలా? ఇది మహేష్‌భగవత్‌ డైలాగ్‌! దుష్టశిక్షణలో ఆయన రాజీపడని నాలుగోసింహం అని తెలుసు. నేరస్తుల పాలిట సింహస్వప్నమనీ తెలుసు. మరి తెలియనిదేమిటి? ఈ పోలీసాయన వెనక లాలించి, బోధించే గురువూ ఉన్నాడని... సివిల్స్‌ రాయాలి... దేశ అత్యున్నత సర్వీసుల్లో అడుగుపెట్టాలనుకునే ఎందరో శిష్యులకు ఆయన మేటి గురువని... ఉపాధ్యాయుల కుటుంబంలో పుట్టి, ఐపీఎస్‌గా ఉంటూనే, గురువుగా మారిన ఆయనే హైదరాబాద్‌ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ మురళీధర్‌ భగవత్‌!  తాజా సివిల్స్‌ ఫలితాల్లోనూ ఆయన శిష్యులు సత్తా చాటారు. ఈ నేపథ్యంలో ఆయనతో ముఖాముఖి వివరాలు...

* మీ కుటుంబ నేపథ్యం...?
మాది మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా పథర్‌డీ గ్రామం. షిర్డీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అమ్మ లీలాబాయి, నాన్న మురళీధర్‌ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. నాలుగో తరగతి వరకు అమ్మ పనిచేసే ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. అక్కడ నుంచి పదో తరగతి వరకు శ్రుతిలోక్‌ జైన్‌ విద్యాలయలో చదువుకున్నా. ఇంటర్‌ కోసం పుణె వెళ్లి ఎస్‌పీ కాలేజ్‌లో చేరా. తర్వాత పుణెలో ఇంజినీరింగ్‌ చేశాను. సామాజిక ధోరణులను ఆకళింపు చేసే దిశగా అక్కడి వాతావరణం నన్ను ప్రేరేపించింది. సాంస్కృతిక కార్యక్రమాలన్నా, కళలన్నా ఇష్టం. స్నేహితుల సహకారంతో సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని.

* అమ్మానాన్నలు బోధనారంగంలో ఉండగా మీరు సివిల్స్‌ వైపు ఎలా వచ్చారు?
ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం ప్రాజెక్టు పనిలో భాగంగా చెక్‌డ్యాం డిజైన్‌ చేసేందుకు జ్ఞానప్రబోధిని సంస్థ తరఫున ససేవాడి వెళ్లా. అక్కడ నుంచి అన్నా హజారే స్వగ్రామం అయిన రాలేగావ్‌ సిద్ధిలో అప్పుడే వాటర్‌షెడ్‌ అభివృద్ధి పనులు జరుగుతుండటంతో అక్కడికీ వెళ్లా. ఆ సమయంలో ఆయన మాటలు నాలో స్ఫూర్తిని రగిలించాయి. ఎలా అయినా గ్రూప్స్‌ గెలవాలనుకున్నా. కానీ నాన్న చనిపోవడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒడుదొడుకులు మొదలయ్యాయి. పుణెలోని టెల్కో సంస్థకు ఇంజినీర్లు కావాలని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆ సంస్థ దత్తత తీసుకున్న 18 గ్రామాల్లో చెక్‌డ్యాంల నిర్మాణంలో నేనూ పనిచేశాను. ఆ తర్వాత పుణె సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ అండ్‌ యాక్టివిటీస్‌(సీడీఎస్‌ఏ) కోసం రెండున్నరేళ్లపాటు గ్రామీణాభివృద్ధి పనుల్లో పాలుపంచుకున్నాను. సీడీఎస్‌ఏ సంస్థ కోసం పనిచేస్తున్న సమయంలో ఓ ఐఏఎస్‌ అధికారితో మాట్లాడాల్సి వచ్చింది. ప్రజోపయోగ పనుల కోసం నిధుల్ని కేటాయించే అవకాశం సివిల్‌ సర్వీస్‌ అధికారులకు ఉంటుందని అప్పుడే గ్రహించాను. ఆ క్షణం సివిల్స్‌ రాయాలని గట్టిగా సంకల్పించుకున్నాను. కానీ ఆంగ్లంపై పట్టు లేకపోవడంతో వెనకాముందాడినా.. మరాఠీ సాహిత్యంలో నాకు పట్టుంది. ఆ ఆత్మవిశ్వాసంతోనే సీడీఎస్‌ఏ సంస్థకు రాజీనామా చేశాను. ముందుగా అనుభవం కోసం గ్రూప్‌-1 శిక్షణ తీసుకున్నాను. నా గురి మాత్రం సివిల్స్‌పైనే ఉండేది.

* సివిల్స్‌లో మీకు సహకరించిన అంశాలు?
మరాఠీ సాహిత్యంలో నాకున్న ప్రతిభను ముంబయికి చెందిన ప్రముఖ చరిత్ర ప్రొఫెసర్‌ కె.కె.షా గుర్తించారు. మరాఠీ సాహిత్యాన్ని ఆప్షన్‌గా ఎంచుకుని సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించిన భూషణ్‌ గగ్రానీని నాకు పరిచయం చేశారు. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ముంబయికి మకాం మార్చాను. పట్టుదలతో సివిల్స్‌ పుస్తకాల్ని మరాఠీలో రాసుకుని సన్నద్ధమయ్యాను. 1997లో మణిపురి కేడర్‌ ఐపీఎస్‌గా ఎంపికయ్యా. ఇంఫాల్‌ ఏఎస్పీగా బాధ్యతలు తీసుకున్నా. తర్వాతే ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి సునీతను వివాహం చేసుకుని.. అనంతరం ఏపీ కేడర్‌కు బదిలీపై వచ్చా.

* సివిల్స్‌ అభ్యర్థులకు వాట్సప్‌ గురూ ఎలా అయ్యారు?
నేను సివిల్స్‌కు సన్నద్ధమైనప్పుడు చాలా మంది సీనియర్లు నాకు సహకరించారు. సచిన్‌ తెందూల్కర్‌ తండ్రి రమేశ్‌ తెందూల్కర్‌ అందులో ఒకరు. అలాంటి వారి సలహాలతోనే ఈ స్థితికి చేరుకున్నా. అందుకే విధి నిర్వహణకు అవతల నా వ్యక్తిగతంగా సమాజానికి ఏదైనా తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నా. సివిల్‌ సర్వెంట్లు కావాలనుకొనే ఔత్సాహికులకు సహకారం అందించాలనుకున్నా. వాట్సప్‌లో అయితే ఎక్కువ మందిని ఒకే ప్లాట్‌ఫాం కిందకు తీసుకురావచ్చనే ఉద్దేశంతో నాలుగేళ్ల క్రితం ఓగ్రూపు ఏర్పాటు చేశా. సివిల్స్‌ మెయిన్స్‌లో అర్హత సాధించి ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన మెలకువల్ని అందిస్తున్నా. నాతోపాటు ప్రవిమళ్‌ అభిషేక్‌(ఐఏఎస్‌), సాధు నర్సింహారెడ్డి(ఐఆర్‌ఎస్‌), అనుదీప్‌ దురిశెట్టి(ఐఏఎస్‌), హర్ష కోయ(ఐఏఎస్‌), సాయితేజ(ఐఏఎస్‌), పృథ్వీతేజ(ఐఏఎస్‌) ఇందుకు సహకరిస్తున్నారు. అలాగే ఐఎఫ్‌ఎస్‌ శిక్షణార్థులకూ సలహాలిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో సివిల్‌ సర్వీసులకు 500 మంది, ఫారెస్ట్‌ సర్వీస్‌లకు 100 మంది వెళ్లేందుకు సహకరించాం. తాజాగా ప్రకటించిన సివిల్స్‌ ర్యాంకుల జాబితాలో టాప్‌-100లో 11 మంది మేం సలహాలిచ్చిన అభ్యర్థులున్నారు. మొత్తం మీద 70 మంది ఎంపికవ్వడం గర్వకారణంగా ఉంది.

* శిక్షణ ఇవ్వడానికి మిమ్మల్ని మీరు ఎలా అప్‌డేట్‌ చేసుకుంటున్నారు?
దినపత్రికలు చదవడం తప్పనిసరి. సమకాలీన అంశాల గురించి ఎప్పటికప్పుడు వాట్సప్‌ గ్రూప్‌లో షేర్‌ చేస్తుంటా. ఏటా సివిల్స్‌ ఇంటర్వ్యూకు హాజరయ్యే వారిని ఎలాంటి ప్రశ్నలడుగుతున్నారనే అంశాన్ని ప్రతీసారి తెలుసుకుంటూ ఉంటా. అలాంటి అంశాల గురించి అధ్యయనం చేసి వాట్సప్‌ గ్రూపులో అందిస్తుంటాను. పుస్తకాలని ఇష్టంగా చదువుతా. సాధారణంగా డిసెంబరులో మెయిన్స్‌ ఫలితాలు వస్తాయి. ఏప్రిల్‌లో ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు నెలల సమయాన్ని కీలకంగా తీసుకుంటా.

- మల్యాల సత్యం, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.