close

తాజా వార్తలు

నేను వంట వండితే అతను గిన్నెలు కడిగేవాడు

ఉదయాన్నే లేచి భీమవరంలో పోస్టర్లు చూడటానికి వెళ్లిన సినిమా పిచ్చోడు... ఎస్వీ కృష్ణారెడ్డి కోసం ఎంకాం చదవాలని కాలేజీలో చేరిన యువకుడు... త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో గిన్నెలు కడిగించి వంట చేసిపెట్టిన స్నేహితుడు... హీరో అవ్వాలని... విలన్‌గా చేయాలని... కమెడియన్‌గా మారిన నటుడు... సునీల్‌. సినిమాల కోసం పడిన తపన, త్రివిక్రమ్‌తో స్నేహం, సెట్లో నేర్చుకున్న విషయాలు... ఇలా బోలెడు కబుర్లు ‘హాయ్‌’తో పంచుకున్నాడు.

* భీమవరం నుంచి వస్తున్నప్పుడు మీతో ఉన్నదీ... ఇప్పుడు లేనిది ఏమిటి?
భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చేటప్పుడు బుర్ర, మనసూ రెండూ ఖాళీనే. ఒకే ఒక్క ఆశయం ఉండేది. ఇప్పుడు అదేం లేదు. ఎందుకంటే ఖాళీలోంచే శాంతి పుడుతుంది. ఆనందం వేరు, శాంతి వేరు. కారు కొనుక్కుంటే ఆనందంగా ఉంటాం. ఆ కారు షెడ్డుకి వెళ్తే శాంతి అనేది మన దరిదాపుల్లోకి కూడా రాదు. అప్పట్లో అంత ఒత్తిడిలోనూ మనసు ప్రశాంతంగా ఉండేది. సెట్‌కి వెళ్లేటప్పుడు ధ్యాసంతా సీన్‌ పేపర్‌ పైనే. ‘నా డైలాగులేంటి’ అని అసిస్టెంట్‌ డైరెక్టర్లను తెగ విసిగించేసేవాడ్ని. ఎందుకంటే అదే నా పాఠం.. అదే నా పుస్తకం. డైలాగ్‌ పేపర్‌ ఇచ్చేస్తే దాన్ని ఎన్నిరకాలుగా చెప్పొచ్చో ప్రాక్టీస్‌ చేస్తుండేవాడ్ని. ఇప్పుడు ఆ వాతావరణం ఎక్కడుంది? సెల్‌ఫోన్లు, స్మార్టు ఫోనులూ వచ్చాక మొత్తం పాడైపోయింది. సెట్‌కి వెళ్లగానే.. ‘టింగ్‌’ మంటూ ఓ మెసేజ్‌ వస్తుంది. అదేంటా? అని పట్టుకుని కూర్చుంటాం. ప్రపంచమంతా తెలుసుకోవాలన్న అత్యుత్సాహంతో మన పని గాలికొదిలేస్తున్నాం. ఎవరో ఏదో కామెంట్‌ పెడితే మనకేంటి? ఎవరికో ఏదో ఓ పని జరిగితే మనకేంటి? జరక్కపోతే మనకేంటి? స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక అందరి జీవితాలూ నా జీవితం అయిపోవడమేంటి? అందుకే సెట్‌కి వెళ్లగానే.. సెల్‌ నోరు కట్టేస్తున్నా.

సీటుబెల్ట్‌ పెట్టుకోకపోతే!
నా జీవితంలో ప్రమాదాలు చాలా సర్వసాధారణమైన విషయం. ఓ సారైతే కొన్నేళ్ల పాటు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఆసుపత్రిలో నేను కళ్లు తెరిచిన ప్రతీసారీ నా కళ్లముందు త్రివిక్రమ్‌ నిలబడి ఉండేవాడు. ‘సునీల్‌ చనిపోయాడు’ అంటూ అప్పట్లో కొన్ని టీవీ ఛానళ్లలో వార్తలు కూడా వచ్చేశాయి. ‘నువ్వే కావాలి’ సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ‘ఠాగూర్‌’ సమయంలోనూ అంతే. షూటింగ్‌ అయ్యాక.. ‘అన్నయ్యా.. భీమవరం వెళ్లొస్తా’ అంటూ చిరంజీవి అన్నయ్యకు చెప్పి బయల్దేరా. ‘సీటు బెల్ట్‌ పెట్టుకోవడం మర్చిపోవొద్దు’ అని అన్నయ్య హెచ్చరించారు. అప్పుడే నా కారు నాలుగు పల్టీలు కొట్టింది. అన్నయ్య చెప్పినట్టు నేను సీటు బెల్టు పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైపోదునో? అలా అన్నయ్య నా ప్రాణాలు కాపాడారు.

* స్మార్ట్‌గా ఆలోచించడం మంచిదే కదా?
ఏదైనా మంచిదే. కానీ దాన్ని వాడుకునే పద్ధతిలోనే వాడాలి. పెన్సిల్‌ రాసుకోవడానికి వాడాలి. పక్కోడ్ని పొడిచేయడానికి వాడతానంటే ఎలా? స్మార్ట్‌ ఫోన్‌ కూడా అంతే. ఇంటర్నెట్‌ అనేది మనిషి తనకు తాను సృష్టించుకున్న మహాద్భుతం. ఇది వరకు లెక్కలకు సంబంధించిన ఓ అనుమానం వస్తే మాస్టారు ఎక్కడున్నారో వెదుక్కుని మరీ ఆయన ఇంటికివెళ్లి సమాధానం రాబట్టేవాళ్లం. కానీ చాలా టైమ్‌ పట్టేసేది. ఇప్పుడు ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా ఒక్క బటన్‌ నొక్కితే చాలు.మనం ఇంటర్నెట్‌ నుంచి సమాచారం తీసుకోవాలి. మనమే ఇంటర్నెట్‌లో సమాచారం అయిపోతే నెగెటీవ్‌ వైబ్రేషన్స్‌ వచ్చేస్తాయి. ఈమధ్య ‘అరవింద సమేత’ కోసం ఎన్టీఆర్‌తో పనిచేస్తున్నప్పుడు ‘డిజిటల్‌ డిటాక్స్‌’ పద్ధతి గురించి చెప్పాడు. శరీరంలో చెత్త పేరుకుపోతే డిటాక్స్‌ ద్వారా తొలగించినట్టే, ఈ బుర్రలోని చెత్తని కూడా తొలగించుకోవచ్చని చెప్పాడు. అసలు ఫోన్‌ అనేది ఎందుకు? కేవలం మాట్లాడుకోవడానికి. దాని కోసమే వాడాలన్నారు. అలా ప్రాథమిక అవసరాల కోసమే వస్తువుల్ని వాడితే.. ఈ స్మార్ట్‌ మాయ నుంచి తప్పించుకోవచ్చని ఎన్టీఆర్‌ సలహా ఇచ్చాడు.

* పరిశ్రమకు వచ్చిన కొత్తలో గందరగోళం ఉండేదా?
నిజానికి ఏం జరుగుతుందో తెలిసేది కాదు. రోజుకి దాదాపు 18 గంటలు పనిచేసేవాడ్ని. వచ్చిన కొత్తలో నేను నటించిన సినిమా విడుదలైందంటే థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకులు ఎక్కడెక్కడ నవ్వుతున్నారో గమనించేవాడ్ని. ఆ తరవాత నవ్వించడం ఓ బాధ్యత అయిపోయింది. సెట్లోనే అన్ని విషయాలూ నేర్చుకునేవాడ్ని. ఓరోజు ఈవీవీగారి షూటింగ్‌ జరుగుతోంది. నేను కెమెరావైపు చూడకుండా మనుషులు ఎటువైపు ఉంటే అటు తిరిగి మాట్లాడేస్తున్నా. ‘ఇన్ని సినిమాలు చేశావ్‌ గానీ కెమెరా ఫేవర్‌ అంటే నీకింకా అర్థం కాలేదా’ అన్నారు ఈవీవీ. నిజానికి కెమెరా ఫేవర్‌ అంటూ ఒకటుంటుందని ఆరోజే తెలిసింది. కొన్నాళ్లకు బాపుగారి సినిమా చేస్తున్నప్పుడు కెమెరా వంక చూస్తూ మాట్లాడుతున్నా. ‘నాయినా నేను నీ ఫొటోలేం తీయడం లేదు. ఎవరు ఎటువైపు ఉన్నారో అటువైపు తిరిగి మాట్లాడు’ అన్నారు. ఓహో.. ఇక్కడ ఓ పద్దతంటూ ఉండదన్నమాట. ఎవరికి ఎలా కావాలో అలా నడుచుకోవాలన్నమాట అనే విషయం అర్థమైంది.

* మీరొచ్చిన కొత్తలో కామెడీ గ్యాంగ్‌ మీతో ఎలా ఉండేది?
ఎం.ఎస్‌గారితో నాకు ముందు నుంచీ పరిచయమే. ఆయనతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్‌, కోట, ధర్మవరం.. వీళ్లందరినీ థియేటర్‌లో చూసి వచ్చినవాడ్ని. వాళ్లతో ఎలా కలవాలి? వాళ్ల ముందు మనం ఆనతామా? లేదా? అనే భయం ఉండేది. అయితే వాళ్లంతా తమలో ఒకడిగా నన్ను కలిపేసుకున్నారు. బ్రహ్మానందంగారైతే మరీనూ. ఆయన ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తే చాలు. వంద డైలాగులతో సమానం.

* బ్రహ్మానందం మిగిలినవాళ్లందరినీ తొక్కేస్తారు అనే ప్రచారం  జరుగుతుండేది కదా?
ఇక్కడ ఎవరూ ఎవరినీ తొక్కేయలేరు. మనల్ని మనమే తొక్కేసుకుని, మన చేతకానితనాన్ని మరొకరిపై వేసేస్తుంటాం. బ్రహ్మానందంగారు సినిమాలు తీయలేదు. నటించారంతే. అలాంటప్పుడు ఆయన ఎలా తొక్కేస్తారు? ఈతరం కమెడియన్లను కూడా ఇంటికి పిలిపించుకుని, భోజనం పెట్టి మరీ పంపిస్తారాయన.

* మీలో హాస్య నటుడు ఉన్నాడని ఎలా తెలిసింది?
నిజానికి నేను ముందు హీరో అవ్వాలనుకున్నాను. నేనేంటి? పరిశ్రమకొచ్చినవాళ్లంతా అలానే అనుకుంటారేమో. ఆ తరవాత ఓసారి అద్దంలో మొహం చూసుకున్నప్పుడు జ్ఞానోదయం అయ్యింది. ‘మనలో హీరో లేడు.. విలన్‌ ఉన్నాడేమో’ అనుకున్నా. మోహన్‌బాబుగారిలా కామెడీ టచ్‌ ఉన్న విలనిజం చేద్దామనుకున్నా. నాలో ఓ హాస్య నటుడు ఉన్నాడని ముందుగా గుర్తించింది నా స్నేహితుడు త్రివిక్రమ్‌. అప్పట్లో మేమిద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం కదా? మా రూమ్‌కి ఎవరైనా వస్తే నేను నవ్విస్తుండేవాడ్ని. అది చూసి నాలో ఓ కమెడియన్‌ ఉన్నాడని పట్టేశాడు.

* పొట్టకూటి కోసం అప్పట్లో ఎలాంటి అవతారాలు ఎత్తారు?
డాన్సర్‌గా, అసిస్టెంట్‌ డాన్స్‌ మాస్టర్‌గా, కంపెనీ ఆర్టిస్టుగా చాలా చేశా. సినిమాలకు సంబంధం లేని పనులూ ఉన్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి దగ్గర సహాయకుడిగా పనిచేశా. నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు. బీకాం పరీక్షలు అయిపోయాక ఎలాగూ ఖాళీగా ఉన్నానని భీమవరం డయాగ్నొస్టిక్‌ సెంటర్లో అకౌంట్లు చూసేవాడ్ని. పన్నెండొందల జీతం. ఎంకాం చదువుదామనుకున్నా. అది కూడా ఎస్వీ కృష్ణారెడ్డిగారి కోసమే. భీమవరం డీఎన్‌ఆర్‌ కాలేజీలో ఆయన ఎంకాం చదివారు. ఆయన చదివిన క్లాసు రూములో నేనూ కూర్చోవాలన్న ఆశతో.. ఆ కోర్సులో జాయిన్‌ అయ్యా. నాలుగు రోజులుండి, ఆ ముచ్చట తీర్చుకుని హైదరాబాద్‌ వచ్చేశా. ఇక్కడికి రాగానే నేను కలుసుకున్న తొలి సినిమా వ్యక్తి కూడా ఆయనే.

* త్రివిక్రమ్‌తో ఒకే రూములో ఉండేవారు కదా.. వంటవండటం, దుస్తులు ఉతకడం లాంటి పనులు ఇద్దరూ షేర్‌ చేసుకునేవారా?
నేను వంట వండేవాడ్ని. తను గిన్నెలు కడిగేవాడు. ఇద్దరం కలసి బట్టలు ఉతుక్కునేవాళ్లం. తను శాకాహారి. నాకు ముక్క లేకపోతే ముద్ద దిగేది కాదు. త్రివిక్రమ్‌కి అప్పట్లో హోటల్‌లో రూమ్‌ ఇచ్చేవారు. నేను అక్కడికి వెళ్లి త్రివిక్రమ్‌ ఎకౌంట్లో నేను బిరియానీలు తింటే, రూమ్‌కి వచ్చి నేను వండింది తను తినేవాడు. అప్పట్లో ఇద్దరం ఒకే సైజులో ఉండేవాళ్లం. ‘ఇది నా చొక్కా... అది నీ ఫ్యాంటు’ అని ఉండేది కాదు. ఎవరికి నచ్చినవివాళ్లు వేసుకుని వెళ్లిపోయేవాళ్లం.

* త్రివిక్రమ్‌ ఈ స్థాయిలో ఉంటాడని ఎప్పుడైనా ఊహించారా?
తను చాలా తక్కువ స్టేజీలో ఆగిపోయాడు. నాకు తెలిసి తను ఇంకా ఎత్తులో ఉంటాడనుకున్నా. తెలుగులో మహా చేస్తే రెండు సినిమాలు చేస్తాడనుకునేవాడ్ని. ఆ తరవాత బాలీవుడ్‌లోనే చూస్తాడు అనుకునేవాడ్ని. తను అప్పట్లో నాకు చెప్పిన కథలు అలాంటివి. ఓరోజు కూర్చోబెట్టి 500 కోట్ల బడ్జెట్‌ కథొకటి చెప్పాడు. ఇప్పట్లో తీయాలంటే రెండువేల కోట్లు అవుతాయేమో. ఎంత సీరియస్‌ మేటర్‌లో ఉన్నా, వాతావరణాన్ని తేలిక చేసేస్తుంటాడు. అణుబాంబు గురించి ఆటోరిక్షావాడికి కూడా అర్థమయ్యేలా చెప్పగలడు. తనతో కంపెనీ చాలా ఇష్టపడేవాడ్ని. భీమవరం నుంచి వచ్చేటప్పుడు నా బైక్‌ అమ్మేసి వచ్చాను. ఆ డబ్బులు ఇద్దరం ఖర్చు పెట్టుకున్నాం. అది గుర్తుపెట్టుకుని, నాకో బండి కొనిపెట్టాడు. ఐదేళ్ల పాటు ఆ బండిపైనే తిరిగాను. డబ్బులన్నీ సూట్‌కేసులో దాచి, తాళాలు నాకు ఇచ్చేవాడు. ఖర్చులన్నీ నేనే చూసుకునేవాడ్ని. ఇద్దరు రూమ్మేట్స్‌ ఒకేసారి, ఒకే వేదికపై నంది అవార్డులు అందుకోవడం మా విషయంలోనే జరిగిందేమో.

- మహమ్మద్‌ అన్వర్‌,  ఫొటో: మధు

‘మన సు’నీల్‌

వీడియో గేములాడుతున్నామంటే... ఖాళీగా ఉన్నట్లే ఇదివరకు సెల్‌ఫోన్‌లో గేముల పిచ్చి చాలా ఉండేది. క్యాండీక్రష్‌ని పిచ్చిగా ఆడేవాడ్ని. లెవెల్స్‌ అన్నీ పూర్తి చేసుకుంటూ వెళ్లాను. కొన్ని లెవెల్స్‌ డబ్బులు పెట్టి కొన్నాను. అన్ని దశలూ పూర్తయిపోతే... ‘ఐయామ్‌ వెయిటింగ్‌ ఫర్‌ లెవెల్స్‌’ అని గొప్పగా ట్వీట్‌ చేస్తే.. అందరూ ‘వావ్‌..’, ‘గ్రేట్‌’, ‘సూపర్‌’ అంటూ కామెంట్లు పెడితే మురిసిపోయా. ఓ తమ్ముడు మాత్రం ‘ఏంటన్నయ్యా.. నువ్వు అంత ఖాళీయా’ అంటూ కామెంట్‌ పెట్టాడు. దాంతో దిమ్మతిరిగిపోయింది. పగలంతా షూటింగ్‌ చేసి, ఇంటికొచ్చి, రాత్రి నిద్రని క్యాండీక్రష్‌కి ధారబోస్తే.. ఇలా అంటారేంటి? అనిపించింది. అదీ నిజమే కదా? నేను క్యాండీక్రష్‌లో కప్పు కొట్టాలని హైదరాబాద్‌ రాలేదు. సినిమాల్లో నిరూపించుకుందామని వచ్చా. ఆ పని వదిలేసి, మరేదో పట్టుకున్నానని అర్థమైంది. అప్పటి నుంచీ సెల్‌ఫోన్‌ గేములపై వ్యామోహం పూర్తిగా తగ్గిపోయింది.
పోస్టర్లు చూడ్డానికి వెళ్లేవాడ్ని భీమవరం చిన్న టౌనే. కానీ చాలా ప్రకాశవంతంగా ఉండేది. ఏకంగా 12 థియేటర్లు ఉండేవి. టౌన్‌ స్టేషన్‌ దగ్గరకు వెళ్తే... కొత్త పోస్టర్లన్నీ వరుసగా అతికించేవారు. పొద్దుటే సైకిల్‌ వేసుకుని పోస్టర్లు చూడ్డానికి వెళ్లిపోయేవాడ్ని. మా అమ్మ పోస్ట్‌ మాస్టర్‌. అందుకే ఏ థియేటర్‌ ముందు నా సైకిల్‌ కనిపించినా పోస్టుమాన్లు మా అమ్మకి చెప్పేవారు. సినిమాకి వెళ్తానంటే అమ్మ అప్పుడప్పుడు డబ్బులిచ్చేది. చాలాసార్లు పర్సులోంచి డబ్బుల్ని నేనేం మాయం చేసేవాడ్ని.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.