close

తాజా వార్తలు

లక్ష కుంకుమ.. కోటి తులసి.. ఏమిటీ అర్చనలు?

విప్లవమైనా.. వీరశైవమైనా.. ఆదిశంకరుడైనా.. చెగువేరా అయినా.. చెప్పిందొకటే అనగలిగిన ప్రవచనకారుడు. వేదశాస్త్రవిజ్ఞానాల అంతస్సూత్రాన్ని అస్త్రంగా ప్రయోగించి మూఢాచారాలను పటాపంచలు చేసే ఆధ్యాత్మికవాది. సంప్రదాయాన్ని సమర్థిస్తారు. ఆధునికతనుఆహ్వానిస్తారు. అంధవిశ్వాసాలను ప్రశ్నిస్తారు. విచ్చలవిడితనాన్ని నిలదీస్తారు. సనాతన సంప్రదాయ విలువలను తనదైన శైలిలో వివరిస్తూ నవీన యుగానికి దిశానిర్దేశం చేస్తున్న మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు అంతరంగం ‘హాయ్‌’కి ప్రత్యేకం.

* మీకు పురాణేతిహాసాలు, వేదవాఙ్మయంపై అద్భుతమైన పట్టు ఉంది. మీ ప్రవచనాల్లో సనాతన విజ్ఞానాన్ని నవీన సమాజ పోకడలతో మిళితం చేసి సందేశం ఇస్తుంటారు. దీనికి కారణం?
ఏ రెండు సిద్ధాంతాల మధ్య భేదం ఉందనుకోవడం భ్రమ. ఏకత్వం అనేది సత్యం. ఉన్నది ఒకే ఒక పదార్థం. అది సత్యం. నిజానికి వేదవాఙ్మయంలో భగవంతుడిని ‘సత్‌’ అని సంబోధించారు. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి అని మనం పేర్లు పెట్టుకుంటున్నాం. ఈ పేర్లు వేదం పెట్టలేదు. సత్‌ అంటే అది. ఆ పదార్థాన్ని ఎవరు ఎలా అర్థం చేసుకుంటే.. అలా అర్థం అవుతుంది. అనేక సిద్ధాంతాలు నేను చూశాను. కమ్యూనిజం, నాస్తికవాదం పుస్తకాలు చదివాను. వాటి ప్రభావానికీ కొంత లోనయ్యాను. కొంతకాలం ఏమిటిదంతా? అనే సందిగ్ధంలో ఉన్నాను. ఉపనిషత్తులు చదివినప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. అసలైన సిద్ధాంతాలు జనంలోకి వెళ్లడం లేదు. తేడా ఎక్కడ వచ్చిందంటే.. వేదం వేరు, శాస్త్రం వేరు, పురాణం వేరు, కావ్యం వేరు. వీటి నిర్మాణంలో తేడా ఉంది. వాల్మీకి రామాయణం చదువుతుంటే దృష్టి ఒకలా ఉంటుంది. సినిమాలో చూస్తుంటే మరోలా ఉంటుంది. ఇదంతా దృష్టి భేదాన్ని బట్టి కల్పించుకున్నదే కానీ, మూలంలో అంతా ఒక్కటే! ఈ భేదాన్ని గుర్తించే దృష్టి నాకు ఉండబట్టి.. మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో.. ఈనాటి సమాజానికి ఉపయోగపడే విషయాలను వెలికితీసి.. ప్రవచనం చెబుతాను.

* ఆనందానికీ, బ్రహ్మానందానికీ తేడా?
ఆనందాల్లో 11 రకాలున్నాయి. ఏ ఆనందం అయినా బ్రహ్మానందం ముందు దిగదుడుపే. ఏ పదార్థం తిన్నా.. ఏ సుఖం అనుభవించినా.. అది మళ్లీ అనుభవించాలని అనిపిస్తే.. అది ఆనందం కాదు. అది అనుభవిస్తున్నానన్న విషయం కూడా తెలియకుండా.. అందులో మునిగిపోయి ఆస్వాదిస్తూ ఉంటే అది ఆత్మానందం. ఎవరూ లేకుండా ఏకాంతంగా తనలో తాను లీనమై ఉండగలిగితే, తనతో తాను ఉండగలిగితే.. అది బ్రహ్మానందం.

* ఆ దశకు చేరాలంటే ఏం చేయాలి?
ప్రతిరోజూ అభ్యసించాలి. ‘ప్రతి రాత్రి పడుకోబోయే ముందు పది నిమిషాలు ఆరోజు జరిగిన ముఖ్యమైన ఘట్టాలన్నీ.. ఒకసారి అవలోకించాలి. అంతటితో ఆ విషయాన్ని వదిలేయాలి. ఇలా యాంత్రికంగానైనా అభ్యసించగలిగితే.. ఓ ఏడాదికి జీవన్ముక్త స్థితి అర్థమవుతుంద’ని అంటారు జిడ్డు కృష్ణమూర్తిగారు. ఎక్కడివి అక్కడ వదిలేసే స్థితిని మనిషి నిరంతరం అభ్యాసం చేయగలిగితే.. జీవన్ముక్త స్థితికి చేరగలుగుతారు. బ్రహ్మానంద దశకు తప్పక చేరుకుంటారు.

* కోరికను జయించే అష్టాంగమార్గాన్ని బుద్ధుడు చెప్పాడు. అది మన జనంలోకి ఎందుకు వెళ్లలేదు?
బౌద్ధధర్మంలో ప్రాథమికమైన ఇబ్బంది ఉంది. హిందుత్వం అలా కాదు. ఆచరణ యోగ్యమా? కాదా? అని చూసి మన రుషులు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు, యుద్ధాలు వచ్చినా హిందూధర్మం నిలబడింది. బుద్ధుడు ఉన్నప్పటికంటే ఆయన లేనప్పుడు బౌద్ధం గొప్పగా వ్యాపించింది. విదేశాల్లో పక్కనబెడితే స్వదేశంలో బౌద్ధం తగ్గిపోయింది. కారణం బౌద్ధం, జైనమతాల్లో అహింసను అతి చేశారు. చీమను, దోమను చంపద్దు. కడుపు నిండితే చాలు. మూడేళ్లు భిక్షాటనం చేసుకుంటే చాలన్నారు. అలా చేస్తే అసలు పనిచేయటం మానేసి కేవలం బతికే సమాజం తయారవుతోంది. అదే హిందూ ధర్మంలో బ్రహ్మచర్యం పాటించి పెళ్లి చేసుకుని సంసారం చేసి భార్య అనుమతిస్తేనే సన్యాసం తీసుకోవాలి అన్నారు. అదీ అరవయ్యేళ్ల తర్వాత. బ్రహ్మచారికి సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతించాలి.. అదే గృహస్థు అయితే భార్య అనుమతి ఉండాల్సిందే. వానప్రస్థం భార్యతో కూడా వెళ్లొచ్చు. అరవయ్యేళ్లు దాటిన తర్వాత మౌనంగా ఉండాలి.

* ఎవరైనా వ్యక్తి చనిపోయినపుడు మృతదేహం దగ్గర చాలామంది భగవద్గీత పెడుతున్నారు. ఆ ఉద్దేశం ఏంటి?
మన సమాజంలోని ప్రధాన లోపం ఏంటంటే ఒక గొప్ప ఆచారం, దాని అసలు ఉద్దేశం మరిచిపోవడం. వ్యక్తి తన వృద్ధాప్యంలో పురాణాలు, భగవద్గీతలాంటివి రోజూ చదువుకుంటూ ఉండాలనీ.. ఏవైనా దైవ స్తోత్రాలు వింటూ చనిపోవాలని పెద్దలు చెబుతారు. కానీ చనిపోయాక వినే అజ్ఞానుడెవరండీ? వెళ్లిపోయిన తర్వాత భగవద్గీత, విష్ణు సహస్రనామం అయినా.. కెవ్వుకేక లాంటి పాట వేసినా ఒకటే. శాసనసభలో చట్టం చేసి దీన్ని మార్చాలి.

* బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం.. ఈ దశల్లో మనిషి ఎలా ఉండాలంటారు?
రఘువంశ మహాకావ్యంలో కాళిదాసు దిలీప మహారాజు, రఘువంశ రాజుల ప్రవర్తన గురించి వివరిస్తూ ఈ నాలుగు దశల్ని చాలా స్పష్టంగా వివరించారు. జీవితం వందేళ్లు అనుకోండి. మొదటి పాతికేళ్ల బ్రహ్మచర్యంలో ఎన్ని విద్యలు చదవాలో అన్ని నేర్చుకోవాలి. గృహస్థాశ్రమం భార్యతో హాయిగా జీవించాలి. యాభై దాటగానే పాతికేళ్లు మునిలా మౌనంగా ఉండాలి. నేనేమిటి? నేనెవరు? అనుకుంటూ మనల్ని మనమే ఆవిష్కరించుకోవాలి. డెబ్భై దాటితే ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా మానసిక సన్యాసం తీసుకోవాలి. ఏ క్షణమైనా శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి.

* మీకు హాస్యవధానం అంటే ఇష్టం కదా.. కారణమేంటీ..?
పదోతరగతిలోనే పద్యాలు బాగా చదివేవాణ్ణి. అప్పటి పాఠ్యప్రణాళికలో ప్రాచీన పద్యభాగం డెబ్భయ్‌ శాతం ఉండేది. మంచి పద్యాలుండేవి. కఠినపదాలు కన్పించేవి. అందుకే అవంటే తొలుత ఇష్టపడేవాళ్లం కాదు. గురువులు సుద్దముక్కతో కొట్టి పద్యాల్లోని పదాలు విడదీసి అర్థమయ్యేట్లు చెప్పేవారు. అలా సులువగా ఒంటబట్టేవి. అలా పద్యాలపై ఆసక్తి పెరిగింది. డిగ్రీలో నాలుగు శతకాలు రాశా. అవధానం పట్ల ఆకర్షణకి కారణం కీర్తికాంక్షవల్ల వచ్చింది. విజయవాడ ఆకాశవాణి రేడియోకేంద్రం వారు సమస్యాపూరణం ఇచ్చేవారు. మూడురోజుల్లో పంపమనేవారు. అలా ఉత్తరాలు రాసి పంపేవాణ్ణి. ఆ తర్వాత అభ్యాసం చేశా. మేడసాని లాంటివారు నాకంటే ముందుండే వారు. నేనూ హాస్యావధానం చేయాలనుకునేవాణ్ణి. హాస్యావధానం అంటే ఇతర మతాలవాళ్లు వస్తారు. వాళ్లకోసం సామాజిక అంశాలు చెప్పేవాణ్ణి. అదృష్టవశాత్తూ 1992లో ప్రారంభమైన నా అవధానం 1996 నాటికే అన్న మేడసాని మోహన్‌, తడిమెళ్ల వరప్రసాద్‌, నాగఫణిశర్మలతో సమానంగా సహస్రావధానం చేసే స్థాయికి వెళ్లాను.

* మీరు అవధానం చేస్తుంటే మెదడుమీద ప్రయోగం చేశారట?
బెంగళూరులోని నిమ్‌హాన్స్‌లో ఈ ప్రయోగం చేశారు. అక్కడ టి.రామకృష్ణ అనే ఆయనకు శాస్త్రాలు, సాహిత్యంపై అభిరుచి ఎక్కువ. నా అవధానాలు చూసినపుడు .. మీరు వేగంగా, సమయస్ఫూర్తిగా, సరదాగా చెబుతున్నారు. ఇది ఎలా చెబుతున్నారు. వీటికి ప్రత్యేక నాడులున్నాయా? అనేది తెల్సుకునేందుకు ప్రయోగం చేద్దామన్నారు. నేనూ అంగీకరించా. వైర్లు పెట్టి ఏ నాడులు ఎలా పనిచేస్తాయో చూడటానికి ప్రయోగశాలలో అవధానం చేయించారు. ఎనిమిది మంది పృచ్ఛకులు ఉన్నారు. అక్కడ చేసిన ప్రయోగం తాలుకు విషయాలు పదహారు పేజీల్లో నివేదికగా ఇచ్చారు. ‘సమ్‌థింగ్‌ ఈజ్‌ గోయింగ్‌ ఆన్‌ విచ్‌ వియ్‌ కెనాట్‌ ఐడెంటిఫై’ అన్నారు.

* పూజా విధానాలు కొన్నిసార్లు మూఢత్వానికి దారి తీస్తున్నాయి. అసలు పూజకు నిర్వచనం ఏంటి?
పూజ అనే ధాతువుకు అర్చించుట, మనస్సు లగ్నం చేయుట అని అర్థం. పువ్వు పెట్టండి, ఆకు పెట్టండి అని కాదు. అయినా పూజ నిర్వహించేటప్పుడు పూలు, ఆకులతో అర్చించాలని షోడషోపచారాల్లో చెబుతారు. ఎందుకంటే కాళ్లు చాపి ఖాళీగా కూర్చుంటే మనసు ఎక్కడికో వెళ్లిపోతుంది. అలాగే శాస్త్రంలో పత్రం, పుష్పం, ఫలం, తోయం.. అని ఏకవచనం చెప్పారు. లక్ష కుంకుమ, కోటి తులసి పత్రి అర్చనలు.. ఏంటివన్నీ? దీన్ని వేలంవెర్రి అనొచ్చు. దీనికి ఏ శాస్త్ర్రప్రమాణం లేదు. అభిషేకం అనే మాటకి జల్లుట అని అర్థం. అంటే నీటితో చల్లుట. అంతేగానీ పాలతో అభిషేకం, పెరుగుతో అభిషేకం, తేనెతో అభిషేకం చేయాలని ఏ శాస్త్రాల్లోనూ చెప్పలేదు.

* పూజ గది ఎలా ఉండాలి?
పూజ గది ఎంత విశాలంగా ఉంటే అంత మంచిది. ఒకే ఒక విగ్రహం లేదా ఒకే ఇలవేల్పు ఉంటే మంచిది. ఒక పువ్వు, ఒక ఆకు, ఒక తీర్థం పెట్టి హారతి ఇస్తూ పూజ చేయాలి. పూజ చేస్తున్నంతసేపు దృష్టి భగవంతుడి మీద ఉంచాలి. హారతి ఇస్తున్నపుడు గమనించాలి. పువ్వు పెడుతున్నపుడు గమనించాలి. ప్రతీదీ మనసుపెట్టి గమనించాలి అంటారు శంకరాచార్యులు. ఇక పూజా గదిని ఎలాంటి శంకల్లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి.

* తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు? మరి వీరి ఫొటోలను పూజగదిలో పెట్టుకోవచ్చా?
లక్షణంగా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో అమ్మానాన్నల ఫొటోలతో పాటు... మన జాతీయ పతాకం ఉంటుంది. ఎందుకంటే దేశం కూడా నాకు ముఖ్యం. అసలు పూజ గదిలో విగ్రహాలు, పటాలు పెట్టుకునేది కోరికలు కోరడానికి కాదు... వారిని చూసినప్పుడు స్ఫూర్తి పొందడానికి. మనమూ వారిలా సన్మార్గంలో పయనించడానికి.

‘‘కామక్రోధాదులను అధిగమించి మనిషి చిత్తశుద్ధితో జీవిస్తూ ఆత్మజ్ఞానం పొందడం ప్రవచనాల వల్ల రాదు. ఎన్ని గ్రంథాలు చదివినా, ఎంతమంది గురుబోధలు విన్నా రాదు. పరమాత్మ అనుగ్రహించిన వాడికే ఇది సాధ్యం’’ అంటుంది కఠోపనిషత్తు. మనిషి ఆత్మజ్ఞానం పొందడానికి తనను తాను సిద్ధం చేసుకోవాలి. మనిషికి ఆత్మ సాక్షి. దానిని గుర్తించి ప్రతి విషయాన్ని తనకుతాను పరామర్శ చేసుకుంటే గానీ మార్పు సాధ్యం కాదు.

శివునికెందుకు మారేడు దళం

శివుడు అభిషేక ప్రియుడు... అభిషేకాలు చేయడం వల్ల శివలింగంపై ఎక్కడైనా చెమ్మ ఉండిపోతే లింగం దెబ్బతింటుంది. మరి ఈ చెమ్మను తొలగించాలంటే ఏం చేయాలి? మారేడు దళాలు వేస్తే అవి ఈ చెమ్మను పీల్చుకుంటాయి. అందుకే శివుడికి మారేడు దళాలు వేయమని చెబుతారు. అదీ రెండు దళాలు వేస్తే చాలు... అంతేగాని లక్ష పత్ర, కోటి పత్రం అంటూ ఏమీ ఉండదు. ఈ కోటిపత్ర పూజ పేరిట మారేడు దళాలను లారీలకు లారీలు తమిళనాడు నుంచి తెప్పిస్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంత కీడో ఆలోచించండి.
* అలాగే విష్ణువుకు తులసి మాల వేయమని చెబుతారు. విష్ణువు విగ్రహ స్వరూపుడు. ఆయనకు అభిషేకాలు చేసినప్పుడు విగ్రహంపై ఎక్కడైనా చెమ్మ ఉండిపోతే... ఫంగస్‌ వచ్చి విగ్రహం దెబ్బతింటుంది. అలా ఫంగస్‌ రాకుండా ఉండేందుకు తులసిమాల వేయమంటారు. తులసి యాంటిబయోటిక్‌గా పనిచేస్తుంది.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.