close

తాజా వార్తలు

వాళ్లని కోటీశ్వరుల్ని చేయడానికే..!

కాలం మారింది
ట్రెండ్‌ మారింది
హీరోయిజం మారింది
మొత్తానికి ‘సినిమా’ మారింది!
ఏ కాలమైనా, ఎలాంటి ట్రెండ్‌ అయినా, తెరపై కనిపించే హీరో ఎవరైనా వాళ్లపై ‘పరుచూరి బ్రదర్స్‌’ ప్రభావం మాత్రం మారలేదు. ఆ కలం అభ్యుదయాన్ని ఒలికించింది. కుటుంబ బంధాల్ని పలికించింది. ఫ్యాక్షనిజం జెండా పాతింది. స్త్రీ పాత్రలకు పట్టం కట్టింది. సమాజం తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడింది. ఏం చేసినా చివరకు  హీరోయిజాన్ని ఎవరెస్టు అంచున కూర్చోబెట్టింది. పేజీల కొద్దీ డైలాగులు రాసిన వాళ్లే.. ఒక్క ముక్కలో పుస్తకాలు పట్టనంత సారాన్ని చెప్పారు. మూడు దశాబ్దాలు దాటినా, మూడొందల యాభై చిత్రాల మైలు రాయి అందుకున్నా ‘పడుచూ’రి కలం వాడీ వేడీ తగ్గలేదు. చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ కథ అందించింది పరుచూరి సోదరులే. తెలుగు చిత్రసీమలో మూడు దశాబ్దాలుగా ప్రయాణం చేసిన పరుచూరి వారిని కదిలిస్తే... ఎన్ని సంగతులో, ఎన్నెన్ని కబుర్లో..!

రచయితగా పది సినిమాలకు ఒక్క హిట్టొచ్చినా సరిపోతుంది. దర్శకుడిగా ఓ ఫ్లాప్‌ వచ్చినా ఇంట్లో కూర్చోవాలి. స్టార్‌ దర్శకులుగా రాణించిన ఎంతోమంది ఒకే ఒక్క ఫ్లాపుతో సినిమాలకు దూరం అయ్యారు. అలాగని రచయితలుగా మేం సంపాదించిందేం లేదు. ఓసారి సుబ్బిరామిరెడ్డి మా ఇంటికి వచ్చారు. మా ఇల్లు చూసి ‘ఏంటి నువ్వు సంపాదించింది ఇంతేనా?’ అని ఆశ్చర్యపోయారు. ఇతరుల్ని కోటీశ్వరుల్ని చేయడానికే దేవుడు మమ్మల్ని పుట్టించాడు అనిపిస్తుంది. అయినా ఏదో ఓ సంతృప్తి. శ్రీశ్రీకి ఏముంది? ఆయన్ని ప్రేమించలేదా? ఆయన లేకపోయినా రచనలు మిగిలిపోయాయి కదా? రచయితలకు దొరికే గౌరవం అదే.

ఆత్రేయగారు మమ్మల్ని పిలిచి ఓ మాట అన్నారు. ‘నాన్నా.. నాగేశ్వరావు, సావిత్రి, ఎస్వీఆర్‌, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, కెవి మహాదేవన్‌.. వీళ్ల పారితోషికం పదిహేను వేలు. నేనూ అంతే తీసుకునేవాడ్ని. ఇప్పుడు హీరోలు లక్షల్లో అందుకుంటున్నారు.. ఆత్రేయకు అదే పదిహేను వేలు వస్తున్నాయి’ అని. ఆ ట్రెండ్‌ని మేం దాటేశాం. ఒకప్పుడు దర్శకులు, కథానాయకులతో సమానంగా మాకు పారితోషికాలు అందాయి. ఆ తరవాత మేమూ తగ్గాం. క్రెడిట్స్‌ విషయంలో కథారచయితలకు అన్యాయం జరుగుతోంది. ఆడియో వేడుకలో గీత రచయిత మాత్రమే వేదికపై కనిపిస్తాడు. కథ, మాటలు అందించిన వాళ్లెక్కడో మారుమూల జనం మధ్య కూర్చుంటున్నారు. సినిమా బాగోకపోతే కథ బాలేదు, స్క్రీన్‌ ప్లే బాలేదు అంటారు. సినిమా ఆడితే అవి రెండూ గుర్తుండవు.

మూడు దశాబ్దాల ప్రయాణంలో 350 పైచిలుకు సినిమాలకు పని చేశారు కదా! ఇప్పటికీ సినిమాపై అదే ప్రేమ, అదే ప్యాషన్‌ ఎలా సాధ్యమవుతోంది?
గోపాల కృష్ణ : అదే ప్రేమ, అదే ప్యాషన్‌కి ముందు మరో మాట ఉందండీ. ‘అదే భయం’. మొదటి సినిమాకి రాస్తున్నప్పుడు ఉన్న భయం.. ఇప్పటికీ ఉంది. దర్శకులు మాకు ఫోన్లు చేసినా చేయకపోయినా మేమే వాళ్లకు ఫోన్‌ చేసి ‘మన కథ ఎంత వరకూ వచ్చింది? ఏమైనా అనుమానాలున్నాయా’ అంటూ ఆరాలు తీస్తుంటాం. ఇన్నేళ్లుగా క్రమశిక్షణ ఎప్పటికీ తప్పలేదు. అదంతా రామారావుగారి వల్ల అలవడిన లక్షణం. ఆయన ఆశీర్వాదంతో పరిశ్రమలోకి వచ్చినవాళ్లం. దాన్ని మర్చిపోకూడదు కదా!
వెంకటేశ్వరరావు : నిర్మాతలు, దర్శకులు, కథానాయకులు మామీద చూపించే ప్రేమ అభిమానం వల్లే ఈస్థాయిలో ఉన్నామేమో. చిరంజీవిగారు ఇప్పటికీ మమ్మల్ని వదలరు.

ఇప్పుడు కథా రచయిలతంతా దర్శకులు అయిపోతున్నారు కదా? ఇది పరిశ్రమకు మంచిదేనా?
గోపాలకృష్ణ : మన మొహం మనకు అందంగానే కనిపిస్తుంది. కథ కూడా అంతే. నీ కథ విని ‘ఇదేంటి?’ అని ప్రశ్నించేవాళ్లు ఉండాలి కదా? ఈ మధ్య పెద్ద సినిమాలూ కొన్ని పల్టీ కొట్టాయి. దానికి కారణం లోపాల్ని ఎత్తి చూపే మనిషి లేకపోవడమే.
వెంకటేశ్వరరావు: కథా రచయితలు పెద్దగా కనిపించడం లేదు. రచయిత అంటే ఇప్పుడు గీత రచయితే.

గీత రచయితలకు కాపీ రైట్స్‌ చట్టం వర్తిస్తోంది. మరి కథారచయితలకు..?
గోపాలకృష్ణ: కాపీ రైట్స్‌ సొసైటీ దిల్లీలో ఒక్కటే ఉంది. ముంబైవాళ్లు ఇలాంటి సంస్థని ఏర్పాటు చేయాలని చూసి విఫలం అయ్యారు. టాలీవుడ్‌లో రచయితల కోసం ఓ వ్యవస్థని ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది. రెండు మూడు వేల మంది రచయితలు కలిసి ఓ సంఘంగా ఏర్పడితే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయమై భాగ్యరాజాగారితోనూ మాట్లాడబోతున్నాం. ఓ సినిమా టీవీలో వచ్చిందనుకోండి. దానికి సంబంధించిన కాపీ రైట్‌ రచయితకూ ఇవ్వాలి. పాట రచయితకు ఆ హక్కు ఉన్నప్పుడు మాటలు, కథ అందించినవాళ్లకూ ఉండాలి కదా? నేను మొదట గీతరచయితగానే అడుగుపెట్టా. వచ్చిన కొత్తలో ఓ పది పాటలు రాశా. ఆ పాటల రూపేణా నాకు ఈమధ్య ఐపీఆర్‌ఎస్‌ నుంచి రూ.2,800 చెక్కు వచ్చింది. పది పాటలకే ఇంత వచ్చిందంటే, మా 350 సినిమాలకు ఇంకెంత వస్తుందో అనిపిస్తోంది. ఇది ఎంత వరకూ వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

మిమ్మల్ని స్క్రిప్ట్‌ డాక్టర్స్‌ అంటుంటారు ఎందుకు?
గోపాల కృష్ణ: ఆపేరు మాకు రామ్‌చరణ్‌ పెట్టాడు. సినిమా అంతా బాగున్నా, ఒకట్రెండు తప్పుల వల్ల.. ఆ సినిమా జాతకం మారిపోతుంటుంది. సినిమాలోని లోపాల గురించి తరచూ సోషల్‌ మీడియాలో చెబుతుంటా. మహేష్‌బాబు ‘వన్‌’ నిజంగా గొప్ప సినిమా. గోల్డెన్‌ రైస్‌ అనే పాయింట్‌తో ఆ కథ మొదలవుతుంది. కానీ... ఆ కథా వస్తువుని చివరి మూడు నిమిషాల్లోనే చూపించారు. పైగా కథానాయిక పాత్ర కథానాయకుడ్ని చీట్‌ చేయడం పూర్తిగా అనవసరం. సుకుమార్‌ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ‘బీచ్‌లో హీరోయిన్‌పై ఓ షాట్‌ తీద్దామనుకున్నా. కానీ కుదర్లేదు. అది తీసి ఉంటే.. ఈ లోపం కనిపించేది కాదు’ అన్నాడు. ‘ఖలేజా’ విషయంలోనూ ఇలాంటి చిన్న పొరపాటు జరిగింది. ఆ విషయాన్నే ‘పరుచూరి పలుకులు’లో చెప్పాను. పెద్ద పెద్ద సినిమాల్లోని చిన్న చిన్న లోపాల్ని చెబుతున్నాం కాబట్టే స్క్రిప్టు డాక్టర్స్‌ అంటున్నారేమో.
వెంకటేశ్వరరావు: ఏ రచయితకైనా ప్రపంచ జ్ఞానం అవసరం. తమ్ముడు తెలుగులో పీహెచ్‌డీ చేశాడు. పురాణాలన్నీ తిరగేశాడు. నేను అంతర్జాతీయ సినిమాల్ని బాగా చూస్తా.  నాటకాల వల్ల మూలాలు అర్థం అవుతాయి. ఊర్లలో ఉన్న సమస్యలను కథగా ఎలా చెప్పొచ్చు తెలుస్తుంది. ఇవన్నీ కథారచనలో మాకు ఉపయోగపడే అంశాలు.

ఒక్క సన్నివేశం వల్ల, ఒక్క డైలాగ్‌ వల్ల సినిమా జాతకం మారిపోతుందా?
గోపాలకృష్ణ: ఆ ప్రభావం చాలా ఉంటుంది. ‘ధృవ నక్షత్రం’లో కథానాయకుడు స్మగ్లర్‌. ‘ఇవన్నీ మానేయకూడదు’ అని అమ్మ అడుగుతుంది. ‘నేను పులిమీద స్వారీ చేస్తున్నా.. మానేయడం కుదరదు’ అని హీరో చెప్పొచ్చు. అది రొటీన్‌. అక్కడే ఓ డైలాగ్‌ రాశాం. ‘బస్సు ప్రయాణం చేసేవాడు మధ్యలో దిగిపోవాలి అనుకుంటే బెల్లు కొడితే చాలు. రైలు ప్రయాణం చేస్తుంటే చైను లాగితే సరిపోతుంది. నేను విమాన ప్రయాణం చేస్తున్నా. అయితే ల్యాండింగ్‌.. లేదంటే క్రాషింగ్‌’ అని చెప్పించాం. చప్పట్లు మార్మోగిపోయాయి.

ఓ హీరోకి కథ చెప్పి ఒప్పించడంలో తీసుకునే జాగ్రత్తలేంటి?
గోపాలకృష్ణ: కథని అమ్మడం ఓ కళ. ‘ఇంద్ర’ కథ బి.గోపాల్‌, అశ్వనీదత్‌ ఇద్దరికీ నచ్చలేదు. గోపాల్‌కి ‘ఇవి మనం తీసిన సినిమాలే కదా’ అనే ఫీలింగ్‌ ఉంది. ‘ఓ హీరోకి విజయాన్ని తెచ్చిపెట్టిన ఫార్ములా మరో హీరో విషయంలోనూ వర్కవుట్‌ అవుతుంది’ అనేది నా నమ్మకం. అత్తా అల్లుళ్ల కథలెన్ని వచ్చాయో లెక్క పెట్టండి. ప్రతీ హీరో ఈ జోనర్‌లో ఒక్క సినిమా అయినా చేశాడు. ప్రతీ సినిమా హిట్టే కదా?

మీ సినిమాలు చూస్తున్నప్పుడు చేసిన తప్పులు గుర్తొస్తాయా?
గోపాలకృష్ణ: మా ఇద్దరికీ వాస్తవాలు తెలుసు. కొంతమంది వల్ల చెడిపోయిన ఏ సినిమా గురించీ నేను మాట్లాడను. మా సినిమా ఎందుకు పోయిందో, ఎందుకు ఆడిందో నాకు తెలుసు. మా సినిమాలు చూస్తున్నప్పుడు ‘ఇంతకంటే ఉత్తమంగా ఎలా ఆలోచించవచ్చు?’ అనే ప్రశ్న తప్పకుండా వేసుకుంటాం. ‘రైటింగ్‌ ఈజ్‌ రీరైటింగ్‌’ అనేది నా సిద్ధాంతం.
వెంకటేశ్వరరావు: స్క్రిప్టు ఇచ్చేసి మా పని అయిపోయిందని ఎప్పుడూ అనుకోలేదు. సెట్లో కూర్చుని మేం డైలాగులు రాసేవాళ్లం. ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ షూటింగ్‌ జరుగుతోంది. మేం సెట్లో లేం. చిరంజీవి గారి నుంచి ఫోన్‌ వచ్చింది. సన్నివేశం చివర్లో నేను తలవంచుకుని వెళ్లిపోతున్నా.. ఇక్కడో మాట వస్తే బాగుంటుంది అన్నారు. ‘రోగిని ప్రేమించలేని డాక్టర్‌ కూడా రోగితో సమానం’ అని రాశాం. ఆ డైలాగ్‌ నిలబెట్టేసింది.

కథా చర్చల్లో మీ మధ్య గొడవలొస్తే ఏం చేస్తారు?
గోపాలకృష్ణ: అన్నయ్యపై కోపంతో ఎన్నిసార్లు ఫైళ్లు విసిరేశానో. ఈ విషయం బి.గోపాల్‌ని అడిగితే బాగా చెబుతాడు. మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి.. తను పక్కకు వెళ్లి వినోదం చూసేవాడు.
వెంకటేశ్వరరావు: ప్రతీసారీ మా మధ్య క్షీర సాగర మథనం జరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు నేను, కొన్నిసార్లు వాడు తగ్గుతాం. అలా మాట్లాడుకుంటేనే మంచి సీన్లు పుడతాయి. ‘కర్తవ్యం’ సినిమాలో మీనాని మానభంగం చేసే సన్నివేశాన్ని ముందు అనుకోలేదు. మా చర్చల మధ్య పుట్టిందే. ఆ సీన్‌ లేకపోతే.. ఇప్పుడు ‘కర్తవ్యం’ సినిమానే ఉండదు. అలా మా గొడవలు సినిమాకి మేలే చేశాయి.

ఇన్నేళ్లలో కథ ఏమైనా మారిందా?
గోపాలకృష్ణ: కథ మారింది అనుకోవడం పొరపాటు. హీరోయిజం కూడా ఏం మారలేదు. ‘ఖైది నెం.150’ చూడండి. చిరంజీవి ఏమైనా మారారా? ఆయన స్టైల్‌, హావభావాలు అలానే ఉన్నాయి. ఎక్కడ వైరైటీగా ఉండాలో, ఎక్కడ మాస్‌గా ఉండాలో ఆయనకు తెలుసు.

కథ విషయంలో ఇతరుల జోక్యాన్ని మీరెలా తట్టుకుంటారు?
వెంకటేశ్వరరావు: అది హీరోల్ని బట్టి ఉంటుంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌.. వీళ్లందరికీ మేమంటే ఇప్పటికీ అదే గౌరవం, అదే నమ్మకం. పైగా ఇప్పుడు మేం కథలు ఇవ్వడం బాగా తగ్గిపోయింది. ఆ మార్పు, పరిస్థితులు మాకు ఎదురు కాలేదు.

- మహమ్మద్‌ అన్వర్‌,
ఫొటో : జయకృష్ణ

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.