close

తాజా వార్తలు

ఈ తరంలో... దూరదృష్టి లోపిస్తోంది!

పేదలకు ఉచిత నేత్ర వైద్యం
మూడు విభాలుగా నేత్ర చికిత్సలపై పరిశోధన
నాలుగు రాష్ట్రాల్లో నేత్ర సంబంధిత చికిత్సలకు ప్రత్యేక కేంద్రాలు..
దేశవిదేశాల్లో పలు సంస్థల పరిశోధనకు సహకారం..
ఇవన్నీ ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య పరిశోధన సంస్థ గురించి చెప్పడానికి వాడే పరిచయ వాక్యాలు. ఇంతటి ప్రతిష్ఠాత్మక సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ గుళ్లపల్లి నాగేశ్వరరావు. ఆయనెందుకు ఈ ఆసుపత్రి స్థాపించాలనుకున్నారు? ఎల్వీ ప్రసాద్‌ పేరేందుకు పెట్టారు? కళ్ల గురించి దేశ ప్రజల్లో ఉన్న చైతన్యం ఎంత? పిల్లల్లో ఎక్కువగా వస్తున్న నేత్ర సంబంధ సమస్యలకు కారణాలేంటి? వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ‘హాయ్‌’కి ప్రత్యేకం.

ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి అని ఎందుకు పేరు పెట్టారు?
మొదట నేను ఆయన అల్లుడినని వదంతులు వచ్చాయి. వాస్తవానికి ఎల్వీప్రసాద్‌గారు నాకు ఏమీకారు. అమెరికాలో ఉన్నపుడే మా ఆవిడ, నేనూ కంటి ఆసుపత్రి పెడదామనుకున్నాం. ఎన్టీఆర్‌గారు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు స్థలం కోసం ఉత్తరం రాశా. ఇస్మత్‌పూర్‌ అనే ప్రాంతంలో ఇచ్చారు. అప్పటికే హైదరాబాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ అనే ట్రస్టును నెలకొల్పాం. 1985 వేసవికాలంలో ముళ్లపూడి కార్డియాక్‌ సెంటర్‌ స్థాపించిన డాక్టరుగారు నన్ను కలిశారు. ఆయన ఇంట్లో ఎల్వీప్రసాద్‌గారి అబ్బాయి రమేష్‌ప్రసాద్‌గారిని కలిశా. ఆయన బంజారాహిల్స్‌లో స్థలం ఇచ్చారు. అందుకే మా బోర్డు సభ్యులందరం ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిగా పేరుపెట్టాం.

చిన్న వయస్సులోనే ఎక్కువ మంది పిల్లలు అద్దాలు పెట్టుకొని కన్పిస్తున్నారు. దీన్నిబట్టి నేత్ర సమస్యలు పెరిగాయని అనుకోవచ్చా?
సమస్య పెరిగిందని చెప్పవచ్చు. ప్రజల్లో వచ్చిన అవగాహనతోనూ ఇలా అద్దాలు ధరిస్తున్నారనీ అనుకోవచ్చు. ప్రస్తుతం మయోపియా(హ్రస్వదృష్టి) సమస్య ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎంతసేపు దగ్గర చూపునకే పరిమితమవుతున్న ఈ తరం ఆ సమస్యను ఎదుర్కోబోతోంది. దీనివల్ల దూరం చూపు దెబ్బతింటోంది. చీకటి గదులు, ఎక్కువగా సెల్‌ఫోన్లు, టీవీలు చూడటం, బయటికి వెళ్లి ఆడుకోకపోవడం వీటికి కారణాలు. అందుకే చైనాలో కచ్చితంగా బడిలో పిల్లలు రోజూ ఓ గంట బయట మైదానంలో ఆడుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. తక్కువ వెలుతురు వచ్చే గదులకు బదులు... గాజు గదులను నిర్మిస్తోంది. దీనివల్ల మయోపియా సమస్యను కొంతవరకూ తగ్గించవచ్చని భావిస్తున్నారు. మనదేశంలో ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రతీ విద్యార్థికి సాధారణ కంటి పరీక్షలు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

ఆరోగ్యం అనగానే.. గుండె, ఊపిరితిత్తులు... బీపీ, మధుమేహం గురించే మాట్లాడతారు. కన్ను గురించి పెద్దగా శ్రద్ధ చూపరెందుకు?
కంటిజబ్బుల వల్ల ప్రాణం పోతుందనే భయం ఉండదు. దీనివల్ల చాలా మంది సీరియస్‌గా తీసుకోరు. చూపుపోతుందనే భయం ఉన్నా పెద్దగా పట్టించుకోరు.

కంటి పరీక్షలు ఏ వయస్సు నుంచి మొదలు పెట్టాలి?
మన కుటుంబంలో ఎవరికీ కంటి జబ్బులు లేకపోతే 40-45 ఏళ్ల వరకూ పరీక్షలు అవసరం లేదు. ఆ తర్వాత రెండేళ్లకోసారి సమగ్రంగా పరీక్షలు చేయించుకుంటే మంచిది.

ఆహారానికి, కంటి జబ్బులకు సంబంధం ఏమిటి?
మన దేశంలో విటమిన్‌-ఏ లోపంతోనే సమస్యలొస్తాయి. ఇది ప్రస్తుతం పెద్ద విషయం కాదు. ఆహారంలో  విటమిన్‌-ఏ ఉండేట్లు చూసుకుంటున్నారు. పిల్లలకు మీజిల్స్‌ వ్యాక్సిన్‌ ఇస్తే ఇంకొంత రక్షణ ఉంటుంది.

ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య పరిశోధన సంస్థలో ఎటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి?
మాకు పరిశోధనలో మూడు డివిజన్లు ఉన్నాయి. బేసిక్‌ ల్యాబొరేటరీ, క్లినికల్‌ రీసెర్చీ, పబ్లిక్‌ హెల్త్‌ రీసెర్చీలు జరుగుతాయి.

మీకు వీటన్నింటికీ ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి లభిస్తోంది?
పేదలకు మేం ఉచితంగానే సేవలందిస్తాం. కొందరికీ 50శాతం ఫీజు వేస్తాం. ఇలా వచ్చిన డబ్బుతో అత్యున్నత ప్రమాణాలతో అందరికీ సమాన వైద్యం అందిస్తున్నాం. కొత్త ప్రాజెక్టులు, కొత్త భవనాలు, కొత్త యంత్రాలు కావాల్సినప్పుడు ఎంతో మంది స్పందిస్తారు. మా ఇనిస్టిట్యూట్‌కు ఉన్న ఛారిటబుల్‌ ట్రస్ట్‌కు కొందరు దాతలు నిధులిస్తుంటారు.

కొత్త ప్రాంతాలకు మీ సేవలను ఎలా విస్తరిస్తారు?
ప్రస్తుతానికి మేం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల్లో సేవలందిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఒక కేంద్రం ద్వారా చికిత్సలు చేస్తున్నాం. ఇక ఇంతకు మించి విస్తరించే ఆలోచనలేం లేవు. దేశ విదేశాల్లో 250కు పైగా సంస్థలకు టెక్నికల్‌ పార్టనర్స్‌గా ఉన్నాం.

పిల్లలకు బోర్డు సరిగ్గా కనిపించకుంటే టీచర్లు గుర్తించే అవకాశం లేదా?
మేం పనిచేసిన మూడు రాష్ట్రాల్లో గత రెండేళ్లనుంచీ ఈ పని చేస్తున్నాం. సెంటర్‌ఫర్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ అనేది మొదలెట్టాం. దీనిలో భాగంగా చిన్న డివైజ్‌ కనిపెట్టాం. రెండునిమిషాల్లో పిల్లవాడి కంటిచూపును తెలుసుకోవచ్చు.

వైద్యానికి సంబంధించి ఐదేళ్లు చదువుతాం. ఆ తర్వాత కోర్సులు చేయటానికి మరో నాలుగేళ్లు పడుతోంది. టెక్నాలజీ ఇంత వచ్చింది కదా.. ఈ చదువుల్ని కుదించలేమా..?
ఆరోగ్య రంగంలోకి కృత్రిమ మేధస్సు వచ్చింది. వీటిద్వారా నాలెడ్జ్‌ వస్తోంది. ముందుముందు ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల ఫలానా డాక్టర్లకు ఎక్కువ నాలెడ్జ్‌ ఉందనే తారతమ్యాలు పోతాయి. వైద్య విద్యను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దేశంలో అందరికీ అందించొచ్చు. వైద్యవిద్యలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకురావాలంటే యాభై ఏళ్లకింద నాటి కరిక్యులమ్‌ పూర్తిగా మార్చాలి. ఎంబీబీఎస్‌ అయిపోయిన ప్రతి వ్యక్తికీ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సీటురావాలి. భారత వైద్య మండలి నిబంధనల ప్రకారం ఇన్ని ఎకరాలలో మెడికల్‌ కాలేజీ ఉండాలి. ఐదువందల మంది కూర్చునే ఆడిటోరియం కావాలి అంటారు. ఈ డబ్బులన్నీ విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారు. దీంతో వైద్యవిద్య ఖర్చు పెరుగుతోంది.

మీలా సేవలందించే సంస్థలకు ఎటువంటి సహకారం అవసరమని భావిస్తున్నారు?
దేశంలో ఉన్న ఆరోగ్య సమస్యలకు, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉండేందుకు మా సంస్థలాంటి వాటిని ప్రోత్సహించాలి. మంచి ప్రమాణాలతో వైద్యసేవలందించే వారికి పూర్తి సహకారం అందించాలి. చిత్తశుద్ధితో సేవ వారిని ప్రోత్సహించాలి. రీసెర్చి గ్రాంట్స్‌ను కేంద్రం పెంచాలి.

ఏ రోగి వద్ద ఎంత డబ్బు తీసుకోవాలి అనేది మేం నిర్ధారించం. రోగులే చూసుకుంటారు. ఉచిత సేవ కౌంటర్‌కు వచ్చే వారికి అంతా ఉచితమే. పేయింగ్‌ కౌంటర్‌కు వచ్చేవారికి ఫీజు వివరాలు మా సిబ్బంది వివరిస్తారు. దాన్ని బట్టి రోగి సంబంధీకులే నిర్ణయం తీసుకుంటారు.
మన దేశంలో ప్రతి లక్ష మందికి ఒక నేత్ర వైద్యుడు ఉన్నారు. ఇది చాలా దేశాలకంటే మెరుగైన స్థితే అనేది నా అభిప్రాయం. మన దేశంలో కావాల్సింది వైద్యులు కాదు.. పారామెడికల్‌ సిబ్బంది. ప్రతి వైద్యునికి 5గురు పారామెడికల్‌ సిబ్బంది అవసరం. ఒకరికి ఒకరు కూడా లేరు.
చంద్రబాబునాయుడు గారు మాకు అమరావతిలో భూమి ఇచ్చారు. అక్కడ ఒక కేంద్రం పెట్టే ఆలోచనలో ఉన్నాం. ఇప్పటికే మాకు విజయవాడ, విశాఖపట్నంలలో కేంద్రాలున్నాయి.

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.