close

తాజా వార్తలు

ఫ్లాట్‌ఫామే పరుపు పేపరే దుప్పటి 

తేజయం

జూబ్లీహిల్స్‌...ఓ రాతి ప్రహరీకి అతి చిన్న ఇనుప గేటు..ఇల్లన్నారు.. ‘చిత్రం’గా అక్కడ బండరాళ్లు కనిపించాయి. ‘ధైర్యం’ చేసి లోపలికి అడుగులు వేసి...ఆ పెద్ద బండరాళ్లు దాటితే ‘నిజం’ అది ఇల్లే.నా జీవితానికి ‘నేనే రాజు... నేనే మంత్రి’ అనే దర్శకులు తేజ... నవ్వుతూ స్వాగతం పలికారు. ఇంటర్వ్యూ మొదలు పెడితే... జీవితాన్నే మన ముందుంచారు. ఈ బండరాళ్లు, గోడల్లోకి చెట్లు ఏంటి? అంటే...అవి చెక్కుచెదరకుండా... ఇల్లు కట్టాలనేది నా ఆశయమన్నారు. ఒక పూట కడుపు నింపుకోడానికి పడిన అవస్థల నుంచి... కెమెరామెన్‌గా వి‘జయం’ సాధించిన క్రమం వివరించారు. బతుకుదెరువుకు కార్లు కడిగిన పరిస్థితి నుంచి దర్శకుడిగా మారిన క్రమాన్ని కళ్లకు కట్టారు. కొన్ని కన్నీళ్లు... కొంచెం పట్టుదల... ఎంతో స్ఫూర్తి నిండిన సంఘటనలను ‘హాయ్‌’తో పంచుకున్నారు. 


పూట ఎలా గడుస్తుందో..! 
బతకడానికి హోటల్‌లో క్లీనింగ్‌ దగ్గరి నుంచి ఆఫీసుల్లో టీ ఇచ్చే వరకూ అన్ని పనులు చేశా. లారీ క్లీనర్‌గానూ వెళ్లా. ప్రతిరోజూ ఈ పూట ఎలా గడుస్తుందో అని ఎదురు చూడటమే. నాదగ్గర కొంచెం డబ్బుంటే పొర(బ్రెడ్డు ముక్క)ను నీళ్లలో అద్దుకొనే తినేవాడిని. ఇంకొంచెం ఎక్కువుంటే... పొరను టీలో అద్దుకొనే తినేవాడిని. దీనికంటే ఎక్కువుంటే ఇడ్లీ, అంతకన్నా మించి ఉంటే భోజనం చేసేవాడ్ని.


పెరుగు సరిగ్గా లేదని... 
నాకు భోజనంలో తప్పకుండా పచ్చడి, పెరుగు ఉండాలి. ఇంట్లో ఒకసారి మూడు రోజులుగా పెరుగు సరిగ్గా ఉండటం లేదు. నా భార్య శ్రీవల్లిపై సీరియస్‌ అయ్యాను. ఆ తర్వాతా పెరుగు రుచి మారలేదు. దీంతో మా ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది. ఆ గొడవ విడాకుల వరకూ వెళ్లింది. అది తర్వాత సద్దుమణిగింది లేండి. ‘ఏంటి నాన్న... పెరుగు బాలేదని అమ్మకు విడాకులిస్తానన్నావా?’ అంటూ ఇప్పటికీ పిల్లలు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు.


పిల్లను ఇవ్వనన్నారు... 
మా చెల్లికి తెలిసిన అమ్మాయే శ్రీవల్లి. తనతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాక... వాళ్లింట్లో వాళ్లు కుదరదన్నారు. నేనప్పుడు ‘రాత్రి’ సినిమాకు పనిచేస్తున్నా. ‘ఇతని సినిమా ఇంకా రిలీజ్‌ కాలేదు. పైగా కుటుంబం లేదు. ఈ పరిస్థితుల్లో మా అమ్మాయిని ఇవ్వలేం’ అన్నారు. అప్పుడు అక్కినేని వెంకట్‌ గారి భార్య జ్యోత్స్న గారు వెళ్లి శ్రీవల్లి వాళ్లింట్లో ఒప్పించారు. ఇప్పటికీ జ్యోత్స్న గారు శ్రీవల్లికి ఫోన్‌ చేసి తేజ ఎలా ఉంటున్నాడని చెక్‌ చేస్తుంటారు(నవ్వు).


ఇంట్లోంచి బయటికి వచ్చేశా 
నాన్న బలరామకృష్ణది చెన్నైలో ఎక్స్‌పోర్ట్‌ వ్యాపారం. అమ్మ రాణి వ్యాపార లావాదేవీలు చూసుకొనేవారు. అక్క, నేను, చెల్లి ముగ్గురం. అమ్మానాన్న ఉన్నప్పుడు మాకు రాజభోగాలు ఉండేవి. స్కూల్‌కి కారులో వెళ్లేవాణ్ని. అమ్మ చనిపోయాక నాన్న బాగా కుంగిపోయారు. వ్యాపారంలో నష్టమొచ్చింది. ఆస్తులన్నీ పోయాయి. మా ముగ్గురిని బంధువులు ఒక్కొక్కరూ పంచుకున్నారు. అక్కను మా అత్త, నన్ను మా బాబాయ్‌, చెల్లిని ఇంకో బాబాయ్‌ తీసుకెళ్లారు. మా చెల్లిని కొన్ని రోజులకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో వదిలేశారు. అక్క అత్త వాళ్లింట్లో అడ్జెస్ట్‌ అయ్యింది. నేను బాబాయ్‌ వాళ్ల ఇంట్లో ఉండలేకపోయాను. బయటకి వచ్చేశాను. హనుమాన్‌ జంక్షన్లో మాకు బంధువు ఉంటాడు. ఆయన ఒకసారి నన్ను చూసి ‘ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి వచ్చేయ్‌’ అన్నాడు. సరేలే అని ఆయన ఇంటికి వెళ్లాను. తలుపు తట్టాను. ఆయన బయటికి వచ్చి ‘ఏరా ఇలా వచ్చావ్‌’ అన్నాడు. పరిస్థితి చెబితే... ‘రమ్మంటే వచ్చేయడమేనా రా’ అన్నాడు. అంతే అక్కడే ఉంచి వెనుదిరిగాను.


ఒక ప్యాంటు... రెండు చొక్కాలు 
సినిమాలకు కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసేటప్పుడు... నా దగ్గర ఒకే ప్యాంటు, రెండు చొక్కాలు ఉండేవి. వీధి కొళాయి దగ్గర స్నానం చేసి షర్ట్‌ పిండుకొని ఆరేసుకునేవాడ్ని. ప్యాంటు రెండు, మూడురోజులకు ఒకసారి అక్కడే ఉతుక్కోవడం అలవాటు. ప్రొడక్షన్‌ వాహనం వచ్చినప్పుడు ఒక పెద్ద ఇంటి దగ్గర నిలబడి బండి ఎక్కేవాడ్ని. నాకు ఇల్లే లేదంటే వారు గౌరవించరని అలా చేసేవాడ్ని.  ఏ ఫ్లాట్‌ఫామ్‌ మీదో పడుకొని నిద్రపోయే వాడ్ని. దుప్పట్లు కూడా ఉండేవి కావు. నేలను ఊడ్చుకొని పేపర్‌ కప్పుకొని పడుకొనేవాడ్ని. షూటింగ్‌ సమయాల్లో సాయంత్రం పూట ఇడ్లీ పెట్టేవారు. అప్పుడే ఎక్కువగా తినేవాడ్ని... ఎందుకంటే రాత్రికి ఫుడ్‌ దొరకదు కదా! ఒక్కోసారి అక్కడా ప్రొడక్షన్‌ వాళ్లు కడుపునిండా తిననిచ్చేవాళ్లు కాదు. రెండే ఇడ్లీలని పెట్టేవారు. మళ్లీ అడిగితే లేదు పొమ్మనేవారు. రోజూవారీ ఖర్చులకు కార్లు కడిగేవాడిని. నెలంతా కడిగితే రూ.100 ఇచ్చేవాళ్లు.


వద్దన్నా హైదరాబాద్‌కు 
కెమెరామెన్‌ రవికాంత్‌ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడ్ని. అప్పుడు ఒక మెస్‌లో కూర్చొని సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. నువ్వు కెమెరా అసిస్టెంట్‌ అంటున్నావు కదా... గదిలో సూర్యరశ్మి వస్తున్నట్లు చూపించడానికి నువ్వు ఏం చేస్తావో చెప్పు అన్నాడు. నేను దాన్ని ఎన్నో రకాలుగా తీయొచ్చోనని చెప్పాను. ‘నేను త్వరలోనే ఒక సినిమా చేయబోతున్న నువ్వు కెమెరామెన్‌గా పనిచేద్దువు నాతో పాటు హైదరాబాద్‌కు వచ్చేయ్‌’ అన్నాడు అతను. నేను వెళ్లి ఈ విషయం రవికాంత్‌ గారికి చెప్పాను. ఆయన తిట్టాడు. ‘అతను రెండు సినిమాలకూ అసిస్టెంటుగా పనిచేయలేదు. నీకేమో అనుభవం లేదు. మీరిద్దరూ కలిసి ఏం సినిమా చేస్తారు? వద్దు నా మాట విని ఇక్కడే ఉండు’ అన్నాడు. నేను వినలేదు. అతనితో కలిసి హైదరాబాద్‌ వచ్చేశాను. అతనెవరో కాదు రాంగోపాల్‌ వర్మ. ఇద్దరం కలిసి ‘శివ’ స్క్రిప్ట్‌ రాసుకున్నాం. అది పెద్ద హిట్‌. తర్వాత ‘క్షణక్షణం’. ‘రాత్రి’ సినిమాకు నన్ను కెమెరామెన్‌గా పరిచయం చేశాడు. అంతం, మనీ, రక్షణ చేశాను. అలా చేస్తున్నప్పుడు ఆమీర్‌ఖాన్‌ బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అలా బాలీవుడ్‌లో 30 సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశా.


అప్పుడు బాధపడ్డాను 
సాధారణంగా ఏ కష్టం వచ్చినా బాధపడను. అవన్నీ జీవితంలో భాగమనుకుంటాను. అయితే నేను ఫెయిల్యూర్స్‌లో ఉన్నప్పుడు ఎవరూ నా ఫోన్‌ లిఫ్ట్‌ చేయడానికి ఇష్టపడే వాళ్లు కాదు. ఒక కుర్ర హీరో నా దగ్గరికి వచ్చి ‘సార్‌ మీరు నాతో సినిమా చేయాలి’ అన్నాడు. నేను ‘ప్రొడ్యూసర్‌ ఉన్నాడా?’ అన్నా. ‘ఉన్నాడు సార్‌.. మీరొక్కసారి ఫోన్‌ చేయండి’ అన్నాడు. నేను రెండు సార్లు ఫోన్‌ చేశా. అతను తీయలేదు. అప్పుడు బాధేసింది. ‘నేను ఎప్పుడూ ఇలాగే ఉండను. మీకు జీవితంలో సినిమా చేయను’ అని ఆయనకు  మెసేజ్‌ పెట్టాను.


సైకిల్‌ కొనుక్కోవడమే లక్ష్యం 
కెమెరామెన్‌ కావాలనో... దర్శకుడ్ని అయిపోవాలనో నేను పరిశ్రమకు రాలేదు. బతకడానికి వచ్చాను. అయితే... కెమెరామెన్‌కంటే దర్శకుడికి ఎక్కువ డబ్బు వస్తుందని ఇలా దర్శకత్వం వైపు వచ్చాను. అప్పట్లో మా నాన్నకు తెలిసిన వ్యక్తి నన్ను ఒక సినిమా ఆఫీసులో పెట్టించాడు. వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తే రోజూ రూ.5 ఇచ్చేవారు. అక్కడికి వెళ్లాలంటే 10 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అందుకే ఎప్పటికైనా సైకిల్‌ కొనుక్కోవాలని అనుకునేవాడ్ని. సినిమాల్లోకి వచ్చాక కార్లున్నా.. సైకిల్‌ ఆశ తీరలేదు. ‘జయం’ రిలీజ్‌ అయిన తర్వాత ఆ కోరిక నెరవేర్చుకున్నా. మెస్‌లో నెలవారీ భోజనానికి టోకెన్లు కొనుక్కుంటే చాలనీ అనుకునేవాడ్ని. అందుకే ఇప్పటికీ ఎక్కడైనా మెస్‌ కన్పిస్తే మనసు లాగేస్తుంది. చెన్నై, కర్ణాటక వెళ్లినప్పుడు మెసుల్లోనే తింటూ ఉంటా.


చెన్నైవెళ్లి నేను ఫ్లాట్‌ఫాం మీద పడుకున్న ప్రదేశాలు, భోజనానికి ఇబ్బంది పడిన స్థలాలను అప్పుడప్పుడూ చూసుకుంటూ ఉంటాను.


అలా ‘చిత్రం’ జరిగింది 
నేను హిందీ సినిమాలకు పనిచేసేటప్పుడు ఎక్కువగా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్‌లు చేసేవాడ్ని. ఎందుకంటే మా ఆవిడ, పిల్లలు ముంబయికి రామనేవారు. దీంతో వాళ్లు ఇక్కడ. నేనక్కడ. అవకాశం దొరికినప్పుడల్లా హైదరాబాద్‌లో షూటింగ్‌ పెట్టుకునే వాడ్ని. ఇలా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎక్కువ సినిమాలు తీశాను. అలా రామోజీరావు గారికి ‘చిత్రం’ కథ వినిపించాను. వాస్తవానికి ఈ కథ నేను క్షణక్షణం సినిమాకు పనిచేసేటప్పుడే రాసుకున్నా. ఎవరికి చెప్పినా ఆసక్తి చూపించేవారు కాదు. 16ఏళ్ల అమ్మాయి గర్భవతి కావడం ఏమిటి? అని ప్రశ్నించేవారు. రామోజీరావ్‌ గారు కథ విని... ఓకే అన్నారు. దాన్ని రూ.40లక్షల్లో పూర్తిచేశాను. అది సెన్సేషన్‌. ఇక తర్వాత మీకు తెలుసు కదా!

ఇప్పటికే 1150 మందిని వివిధ విభాగాల్లో పరిశ్రమకు పరిచయం చేశాను. దీన్ని 10000కు పెంచాలని ఆశ. చిత్రం-2 తీయమని అడుగుతున్నారు. దాని పనిలో ఉన్నానిప్పుడు.


పెద్ద బండరాయిని చూపించి దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో మీ ఇష్టమంటే... ఒకరు దాన్ని కంకరగా పగులగొట్టి అమ్ముకొంటాడు. రెండోవాడు ఇష్టంగా పనిచేసి దాన్ని ఒక శిల్పంలా మలుస్తాడు. దీన్ని అమ్మి ఎక్కువ డబ్బు గడిస్తాడు. పేరూ సంపాదిస్తాడు. ఏ మార్గం ఎంచుకుంటే మేలో యువతే ఆలోచించాలి. ఏపని అయినా మనసుతో చేస్తే విజయం తప్పక వరిస్తుంది. 


డైటింగ్‌ అంటూ ప్రత్యేకంగా ఏమీ చేయను. కొంచెం కడుపు ఖాళీ ఉండగానే తినడం మానేస్తా. ఎటువంటి అలవాట్లు లేవు.


పిల్లలపై ఒత్తిడి తేవొద్దు 

ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ర్యాంకుల కోసం ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు. మార్కులే జీవితమంటున్నారు. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముందు తల్లిదండ్రులు మారాలి. పిల్లల్లో ఉన్న ప్రతిభ ఏంటో గుర్తించి... ప్రోత్సహించాలి. అంతేగానీ పక్కింటి వాళ్లమ్మాయి ఐఐటీ ర్యాంకు కొట్టిందని, ఎదురింటి అబ్బాయి మెడిసిన్‌ సీటు సంపాదించాడని పిల్లలను దెప్పిపొడవడం మానేయాలి. ఇతరులతో పోల్చడం మానేయాలి. మన పిల్లల్ని పక్కింటి వాళ్లలా పెంచడం ఎందుకు?

హిట్‌ను తలకు ఎక్కించుకుంటే పొగరు ఎక్కువ అవుతుంది. ప్లాప్‌ను మనసుకు తీసుకుంటే కుంగిపోతాం. ఈ రెండు మన భవిష్యత్తుకు నష్టమే. అందుకే నేను ఈ రెండింటినీ పెద్దగా పట్టించుకోను. ఈ రోజు నా పని ఏంటి? అని ఆలోచించుకుంటూ వెళతాను. 


పిల్లలకు ఆస్తులివ్వను 
మా అబ్బాయి అమితవ్‌ తేజ్, అమ్మాయి ఐలాతేజ్‌. అమితవ్‌ నా దగ్గరకి వచ్చి ‘నాన్న... ఇంటర్లో ఏ గ్రూప్‌ తీసుకోవాలో చెప్పు’ అన్నాడు. నీ ఇష్టమని చెప్పాను. నువ్వు చదవకపోయినా నాకేం ఫర్వాలేదన్నాను. పిల్లలకు ఎలా ఇష్టం ఉంటే అలా బతకమని చెబుతాను. పక్కింటి వాళ్లలా చదువుకోవాలని, ర్యాంకర్లు కావాలని ఒత్తిడి పెట్టను. ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వను అన్నాను. వాళ్లే కష్టపడి ఎదగాలని సూచించాను. అప్పుడే వాళ్లకు కష్టం విలువ తెలుస్తుంది. బతికే తెలివితేటలు ఇస్తే చాలనేది నా సిద్ధాంతం. ఇప్పుడు అమితవ్‌ బాక్సింగ్‌ ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. ఒక సంవత్సరంలో వాణ్ని ఇంటి నుంచి పంపించేస్తా. అమ్మాయి అమెరికాలో చదువుకుంటోంది. వాళ్లకు పెళ్లికూడా చేయనని చెప్పాను. మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోమని ఇప్పటికే చెప్పేశాను. కావాలంటే... పెళ్లయ్యాక నేను ఒక డిన్నర్‌ ఇస్తానంతే!(నవ్వు).

- వీరా కోగటం 
చిత్రాలు : జయకృష్ణTags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.