close

తాజా వార్తలు

ఆ రోజు మోదీని నిలదీశాం

మీరు...డీఎస్సీ రాసి టీచర్‌ ఉద్యోగం రాలేదని బాధపడుతున్న వేళ...ఏకంగా సివిల్స్‌ పాసై ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయితే ఎలా ఉంటుంది? రాజకీయాల్లో సరిగ్గా అలాంటి పరిస్థితే గంగాపురం కిషన్‌రెడ్డిది! జనవరిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి...అయ్యోపాపం అని అందరి సానుభూతిని అందుకుంటున్నవాడు కాస్తా...ఐదు నెలలు తిరిగేసరికి కేంద్ర మంత్రిగా ప్రమాణం చేస్తాడని ఎవరూహించగలరు? దీన్ని... అదృష్టం అనేవాళ్ళు కొందరైతే...రాజకీయ గాలివాటమనేవారు మరికొందరు...ఇన్నేళ్ళ కష్టానికి ఫలితమనేవారు ఇంకొందరు...కానీ ఇవేవీ కాదంటున్నాడు కిషన్‌రెడ్డి!

58 నిండినా ఇంకా ఎలా 40ల్లో ఉన్నట్లుంటాడు? భాజపా కార్యాలయాన్నే ఇల్లుగా ఎలా మలచుకున్నాడు? రోజూ పాదయాత్ర ఎందుకు చేస్తాడు?...నేటి ప్రధాని నరేంద్రమోదీని ఎందుకని నిలదీశారు? కేంద్రమంత్రిగా ప్రమాణం చేసినా ఇంకా ఆయన్ను బాధపెట్టిన విషయమేంటి?... ఇలాంటి ఆసక్తికర అంశాలను ‘హాయ్‌’తో ప్రత్యేకంగా పంచుకున్నారాయన!

* నిన్నటి పుట్టిన రోజుతో 58 నిండాయి. కానీ చూడటానికి అలా లేరు. మీ ఫిట్‌నెస్‌ రహస్యమేంటి? 
ఇదంతా అమ్మ ఇచ్చిన వరం! చిన్నప్పటి ఆటలు... ఇప్పుడు మితాహారం...  ఇవే రహస్యాలనుకోండి! ఇప్పుడు పొద్దున సాయంత్రం రెండు జొన్నరొట్టెలు తింటానంతే! బయటకు ఎక్కడకు వెళ్లినా.. పప్పు, సాంబారు, పెరుగుతో కొంచెం అన్నమే తింటాను. తక్కువ తినడం.. కష్టపడటం.. అమ్మఇచ్చిన ఆరోగ్యం.. వీటికితోడు రోజూ చేసే పాదయాత్ర నా ఫిట్‌నెస్‌కు కారణం.

* రోజూ పాదయాత్రా...?! 
అవును! పదవిలో ఉన్నా లేకున్నా రోజూ ప్రజల్లో ఉండటం బస్తీల్లో తిరగటం అలవాటైంది. అదే నాకు వాకింగ్‌ కూడా! ప్రజలతో మమేకం అవటానికీ... వ్యక్తిగత ఆరోగ్యానికీ ఇది మంచి మార్గం. అందుకే రోజూ పొద్దున్నే బయల్దేరి మధ్యాహ్నం దాకా బస్తీల్లో తిరగటం అలవాటుగా చేసుకున్నా! 2004లో నేను హిమాయత్‌నగర్‌ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచా. విజయరామారావు, తలసాని, లక్ష్మణ్‌, ఇంద్రసేనారెడ్డి వంటి నేతలు అంతా ఆనాడు ఓడిపోయారు. నేను మాత్రం గెలిచా! నన్ను గెలిపించిన ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటిని తీర్చాలని ఆనాడే అనుకున్నా. పాదయాత్ర రాజకీయాల్లో ఎదుగుదలకు ఓ సాధనం. జనంలో తిరిగితేనే వారి కష్టాలు తెలుస్తాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన మరుసటి రోజూ నా పాదయాత్ర సాగింది!

* అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? 
నాకు ముగ్గురు అక్కలు. ఓ అక్క పాతబస్తీలో ఉండేవారు. వాళ్ళింట్లోనే నేనూ ఉండేవాణ్ణి. అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) శాఖలతో పరిచయం ఏర్పడింది. ఏబీవీపీ కోసం కరపత్రాలతో ప్రచారం చేశా. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాశ్‌ నారాయణ్‌ ఉద్యమానికి ఆకర్షితుడినయ్యా. జనతాపార్టీలో యువజన విభాగం నేతగా పనిచేశా. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించాక అందులో చేరా. అప్పట్లో బండారు దత్తాత్రేయ ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా ఉండేవారు. కాచిగూడలోని తుల్జాభవన్‌ ఎదురుగా ఆఫీసు అద్దెకు తీసుకొని రెండు కట్టెలు పాతి రేకుమీద భాజపా ఆఫీసు అని పేరు రాసి పెట్టాం.

కిషన్‌రెడ్డి స్కూల్‌....! 

జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో పోలిస్తే నగరంలోని ఎమ్మెల్యేలకు అవకాశాలు తక్కువ.  వ్యవసాయం, అడవులు, గ్రామీణాభివృద్ధి శాఖల పనులేమీ ఉండవు. ఎమ్మెల్యేగా మేం ప్రజలకు అందించే సేవలు.. రహదారులు, పార్కులు, వీధిదీపాల వంటివే. అందుకే పాఠశాలల మీద దృష్టిపెట్టా. కాచిగూడ, పటేల్‌నగర్‌, గోల్నాకలో.. మొత్తం మూడు ప్రభుత్వ పాఠశాలలకే సొంత భవనాలు ఉండేవి. నేను ఎమ్మెల్యే అయ్యాక 21 భవనాలు కట్టించాను. పటేల్‌నగర్‌లో పాఠశాలలో భూమి తీసుకుని, భవన నిర్మాణం చేశాం. దానిపేరిప్పుడు ‘కిషన్‌రెడ్డి పాఠశాల’గా మారింది. ఇప్పుడందులో 1,400మంది పిల్లలున్నారు. అందులో సగంమంది మైనార్టీలే. ఆ బడిలో సీటు కోసం ఎంతో పోటీ ఉంటుంది. ఓసారైతే ప్రవేశాల సమయంలో పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చింది.

 

 మరి చదువు? 
పార్టీ ఆఫీసులో ఉండే చదువుకున్నా. బాలనగర్‌లోని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైనింగ్‌లో డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైనింగ్‌ చదివా! పొద్దున్నే పాతబస్తీ నుంచి పార్టీ ఆఫీస్‌కు వచ్చి బాలనగర్‌లో కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం పార్టీ కార్యాలయానికి వచ్చి రాత్రి పదకొండు తర్వాత ఇంటికి వెళ్ళేవాణ్ణి. దివంగత మాజీ గవర్నర్‌ వి.రామారావు, దత్తాత్రేయ- ‘ఈ తిరుగుడేంది... ఇక్కడే ఉండరాదా’ అంటే ... పార్టీ ఆఫీసు పెట్టిన నెలరోజుల్లో వచ్చేశా. అలా పార్టీలో పూర్తిస్థాయి కార్యకర్తగా మారా!

* రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు. ఉద్యోగం చేయాలని అనిపించలేదా? 
ఉద్యోగం చేయాలనే ‘టూల్‌ డిజైనింగ్‌’ కోర్సులో చేరా. పార్టీ కార్యాలయంలో ఉండకపోయి ఉంటే.. ఉద్యోగం చేసేవాడినేమో.  యువజన విభాగంలో ఉన్న సమయంలో నల్లు ఇంద్రసేనారెడ్డి, భగవంత్‌రావు, అశోక్‌.. ఇలా 15-20 మందిమి కలిసి విద్యార్థులు, ప్రజాసమస్యలపై ధర్నాలు చేసేవాళ్లం. ఇప్పుడు వందల మందితో చేస్తే ఆందోళన తీవ్రత ఎలా ఉంటుందో... మేం కొద్దిమందితోనే ఆ తీవ్రత వచ్చేలా నిబద్ధతతో పోరాడేవాళ్లం. ఆందోళనల్లో అరెస్టయ్యి, విడుదలైన తర్వాత.. ఆ విషయాలతో ప్రకటనలు రాసి పత్రిక కార్యాలయాల్లో ఇచ్చివచ్చేవాడిని. ఇలా పార్టీ కార్యకలాపాల్లో మునిగిపోయి.. ఆ కోర్సుకు సంబంధించిన సర్టిఫికెట్‌ తీసుకోవడానికీ వెళ్లలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఓ మిత్రుడు ఆ సర్టిఫికెట్‌ తెచ్చి ఇచ్చాడు.

*పార్టీ కార్యాలయానికి పుస్తె కట్టినట్లున్నారు....! 
పద్నాలుగు ఏళ్లు పార్టీ కార్యాలయంలోనే ఉన్నా. ఏ కార్యక్రమం జరిగినా నా భాగస్వామ్యం ఉండేది. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రి అయ్యాక నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీచేశారు. ఆయనకు ప్రత్యర్థిగా భాజపా నుంచి బంగారు లక్ష్మణ్‌ను బరిలో దించారు. లక్ష్మణ్‌కు డమ్మీ అభ్యర్థిగా పార్టీ నాతో నామినేషన్‌ వేయించింది. జాతీయ నాయకులు ఎవరు వచ్చినా వారికి సహాయంగా ఉండేవాడిని. ఇప్పటిలా కమ్యూనికేషన్‌ సదుపాయాలు లేవుకదా... పార్టీ కార్యాలయంలోనే ఫోన్‌ ఉండేది. దాని పక్కనే దత్తాత్రేయ నేను పడుకునేవాళ్లం. పగలు చేస్తే ఫోన్‌ బిల్లు ఎక్కువ అవుతుందని రాత్రి పూట ట్రంకాల్‌ బుక్‌ చేసి జిల్లా నేతలకు ఫోన్లు చేసి పార్టీ కార్యక్రమాల గురించి చెప్పేవాళ్లం. నా వివాహానికి ఒకరోజు ముందే పార్టీ ఆఫీసు నుంచి బ్యాగ్‌ తీసుకుని ఇంటికి వెళ్లా. పెళ్లయిన మూడో రోజే ఇంటినుంచి పసుపు కంకణాలతో రాజస్థాన్‌లో యువజన విభాగం జాతీయ కార్యవర్గ సమావేశాలకు వెళ్లా. అప్పుడు నేను బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిని. 
*  రోజంతా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతుంటే మీ ఆవిడ ఏమనేవారు కాదా? 
పార్టీకి అంకితమై పనిచేస్తానని నా గురించి ఆమెకు పెళ్లికి ముందే తెలుసు. అందుకే ఆ తర్వాత ఈ విషయంలో ఏమీ అనడానికిగానీ, ఆలస్యంగా వస్తున్నావని ప్రశ్నించడానికిగానీ తనకు అవకాశం లేకుండా పోయింది. పెళ్లయిన తర్వాత ఉద్యోగం చేస్తానని చెప్పలేదు. ఆమె ఇంటి బాధ్యతలు చూసుకోవడం.. నేను పార్టీ కార్యక్రమాల్లో..ఎవరి పనుల్లో వారుండేవాళ్లం. మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా పిల్లలూ అర్థం చేసుకున్నారు.

* మరి ఇల్లెలా గడిచేది? 
పార్టీలో పూర్తిస్థాయిలో నేను మునిగినా... ఫార్మసీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం మొదలెట్టాం. మా ఆవిడ చూసుకుంటుంది.

* మీ పిల్లలు ఏం చేస్తున్నారు? 
అమ్మాయి ఆస్ట్రేలియాలో ఇంటీరియర్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తోంది. అబ్బాయిది ఇంటర్‌ పూర్తయ్యింది. బీబీఏ (ఫైనాన్స్‌) చేయించాలన్నది ఆలోచన. చదువుల విషయంలో నిర్ణయం వారి స్వేచ్ఛకే వదిలేస్తా.

* ఎమ్మెల్యేగా ఓడిన కొద్ది నెలలకే కేంద్రమంత్రి కావడం ఎలా అనిపిస్తోంది? 
అసెంబ్లీ ఫలితాలు వచ్చిన రోజు కూడా ఓడిపోయానని బాధపడలేదు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా చాలనుకున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో.. రాజకీయాలు కొంచెం తగ్గించి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకున్నా. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెయ్యి ఓట్లతో నన్ను ఓడించిన అంబర్‌పేట ప్రజలే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో 45వేల మెజార్టీ ఇచ్చారు.

* అసెంబ్లీకి నెగ్గని మీరు ఎంపీగా బరిలో ఉన్నప్పుడు గెలుస్తామని నమ్మారా? 
గెలుపుపై గట్టి నమ్మకం లేదు. ఓడినా ఫర్వాలేదు అనుకుని బరిలో దిగాను. 2014లో తెదేపాతో మాకు పొత్తు ఉండె. సికింద్రాబాద్‌ నియోజకవర్గం పరిధిలో తెదేపా-భాజపా నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపాది పూర్తిగా ఒంటరి పోరు. ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు కాదుకదా మా పార్టీకి ఒక్క కార్పొరేటర్‌ కూడా లేడు. క్లిష్టమైన పరిస్థితి అని తెలుసు. అయితే అంబర్‌పేటలో ఓటమితో నాకు పెద్ద ఎత్తున సానుభూతి వచ్చింది. పక్క అసెంబ్లీ నియోజవర్గాలు.. ఇతర రాష్ట్రాల్లోని తెలుగువారు కూడా... ఎవరు కలసినా ‘అన్నా నువ్వు ఓడిపోవడం ఏంటి?’ అనేవారు! ఎంపీ టికెట్‌ వస్తే ఆ సానుభూతితో గెలుస్తానని అనుకున్నా. అందుకే పోటీచేస్తే సికింద్రాబాద్‌ నుంచే అని అధిష్ఠానానికి చెప్పా.

* ఈ గెలుపు ఓటములను చూస్తే మీకేమనిపిస్తోంది? 
అంబర్‌పేట ప్రజలు, ఆ భగవంతుడు నన్ను ఎంపీగా పంపించాలని అనుకున్నారు. అందుకే తక్కువ ఓట్లతో ఎమ్మెల్యేగా ఓడించారేమో! ఈ గెలుపు అమ్మ ఆశీర్వాదం. భగవంతుడి కృప. ప్రజల దీవెన! గెలిచి కేంద్రమంత్రి అయినా అమ్మ చూడలేదనే వెలితి ఉంది. ఎంపీ ఎన్నికల్లో నాకు ఓటు వేసిన అమ్మ... ఫలితాలకు కొద్దిరోజుల ముందే మాకు దూరమైంది. అమ్మ ఉండి ఉంటే ఎంతో సంతోషించేది!

* మంత్రివర్గంలో ఏ శాఖను ఆశించారు? 
టికెట్‌ వచ్చినప్పుడు ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి పదవి ఖాయమని చాలామంది అన్నారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో ఈ ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ప్రమాణస్వీకారం రోజు మధ్యాహ్నం 1.30గంటకు అమిత్‌షా ఫోన్‌చేసి ‘‘కిషన్‌ భాయ్‌ ఆప్‌కో శపత్‌ గ్రహణ్‌ కర్‌నా హోగా’’ (ప్రమాణ స్వీకారం చేయాలి) అని చెప్పారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌, వ్యవసాయం.. ఈ మూడింట్లో ఒక శాఖ ఇస్తే బాగుండని అనుకున్నా. రాష్ట్రానికి నా శాఖ ద్వారా సహాయం చేద్దామనుకున్నా. హోంశాఖ ఇస్తారని తెలవదు. మంత్రిపదవి కోసం మోదీని, అమిత్‌షాను నేను అడిగింది లేదు. హోంశాఖ రావడంతో మంచి పదవి వచ్చిందన్న భావన అందరిలో వ్యక్తమైంది. అయినా సాధారణ జీవితం గడపడం పార్టీ నుంచే అలవడింది. కేంద్రమంత్రిగా విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే అవకాశమున్నా... ఎకానమీలోనే వెళ్తాను. సింపుల్‌గా ఉండటమే నాకిష్టం.

* అమిత్‌షాతో కలసి పనిచేయటం ఎలా ఉంటుందనిపిస్తోంది? 
అమిత్‌ షాతో 1990ల నుంచే నాకు పరిచయం ఉంది. ఆయన అప్పుడు భాజపా జాతీయ విభాగం కోశాధికారిగా ఉండేవారు. అప్పుడు నేను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ఓసారి గుజరాత్‌లో ఆయన ఇంటికి వెళ్లా. కొద్దిరోజులు వాళ్ళింట్లోనే ఉన్నా. నేను సీనియర్‌ నాయకుడిని, కష్టపడ్డాను.. అందుకే కేంద్రమంత్రి పదవి దక్కిందని గర్వపడటం లేదు. భాజపాలో నాకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు. కాలం కలిసి వచ్చింది. ఇందులో నా గొప్పదనమేం లేదు. 

 


నరేంద్రమోదీతో కలసి అమెరికాలో పర్యటన ఎలా కుదరింది? 
రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధకాలంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచంలోని వివిధ దేశాల యువ రాజకీయ నాయకులను ఆహ్వానించి వారికి తమ పద్ధతులు పరిచయం చేసేది. అలా... 1993లో కూడా ఆహ్వానించారు. మనదేశం నుంచి మా పార్టీ తరఫున నరేంద్రమోదీ, కర్ణాటకకు చెందిన దివంగత అనంత్‌కుమార్‌లతో పాటు నన్ను పంపించాలని ఆడ్వాణీ, వెంకయ్యనాయుడు నిర్ణయించారు. కాంగ్రెస్‌ నుంచి పొంగులేటి సుధాకర్‌రెడ్డి మరో ఇద్దరు వచ్చారు. అప్పుడు మోదీ గుజరాత్‌ భాజపా ప్రధాన కార్యదర్శి (సంస్థాగత). నేను బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా ఉన్నా. అద్వాని పిలిచి నీకు పాస్‌పోర్ట్‌ ఉందా? అని అడిగారు. లేదని చెప్పడంతో.. ఆయనే అధికారులతో మాట్లాడి త్వరగా వచ్చేలా చేశారు. షూస్‌ కూడా లేవు. వెళ్లేముందు గడ్డం గీయించుకోమని నాకు, మోదీకి చెప్పారు. 40 రోజులు అమెరికాలో ఉన్నాం.

ఆ రోజుల్లో నరేంద్రమోదీ ఎలా ఉండేవారు? 
ఆడ్వాణీ చెప్పారని ఆ పర్యటనంతా మోదీ ఎన్నడూ గడ్డం పెంచలేదు. ఎక్కడికి వెళ్ళినా భుజాన బ్యాగ్‌ వేసుకుని.. అందులో పెన్ను, పుస్తకంతో వచ్చేవారు. ఆసక్తిగా అనిపించినవాటిని, వివరాలను ఎప్పటికప్పుడు రాసుకునేవారు. ఇప్పటితో పోలిస్తే ఆ రోజుల్లో అమెరికాల్లో తెలుగువాళ్లు తక్కువ. కానీ గుజరాతీలు ఎక్కువ. సాయంత్రం కాగానే మోదీ వాళ్ల దగ్గరకు వెళ్లేవారు. నాకు, అనంత్‌కుమార్‌కు బోర్‌ కొట్టేది. ఏం చేయాలో తోచేది కాదు. ఇలాకాదని మూడోరోజు మోదీని పట్టుకుని నిలదీశాం! మమ్మల్ని వదిలేసి వెళ్లడం... ఇదేం పద్ధతంటూ గొడవ పెట్టుకున్నాం. మా ఇద్దరినీ రూముల్లో వదిలివెళ్లొద్దు. నీ వెంట మేమూ వస్తాం.. అని పట్టుబట్టాం. దీంతో నవ్వి... మరుసటిరోజు నుంచి మమ్మల్ని తీసుకెళ్లేవారు.


కొట్టిన బావిలో కొట్టకుండా... 

పుట్టింది, పెరిగింది ఇబ్రహీంపట్నం సమీపంలోని చర్లపటేల్‌గూడెంలోని అమ్మమ్మ ఇంట్లోే. తమ ఇంట్లో చిన్నపిల్లలు లేరని మేనమామలు ప్రేమతో వాళ్లింటికి తీసుకెళ్లారు. ఐదో తరగతి వరకు అదే ఊరిలో చదువుకున్నా. ఆ తర్వాత పదో తరగతి వరకు ఇబ్రహీంపట్నంలో. ఊహ వచ్చిన తర్వాత మా అమ్మ దగ్గర ఎన్నడూలేను. నేనే అందరికంటే చిన్నవాణ్ణి. 
చదువుల్లో మొద్దునుకాదు... అలాగని హుషారూ కాదు. గ్యాంగులు తయారు చేసుకొని స్కూలు ఎగ్గొట్టి... చెరువుల్లో, బావుల్లో ఈత కొట్టడానికి వెళ్ళేవాళ్ళం. ఎన్నడూ కొట్టిన బావిలో మళ్ళీ ఈతకొట్టలేదు. ఊర్లో అన్ని బావులుండె. ఇప్పుడవన్నీ పోయాయి. అసలు పల్లె వాతావరణమే మారింది. ఇంటికి కావల్సిన వస్తువుల్లో చక్కెర, ఉప్పు, బట్టలు తప్ప అన్నీ మా మామవాళ్ళు పండించేవారు. ఏదీ బయట కొనాల్సిన అవసరం ఉండేది కాదు. బాసుమతి బియ్యం కూడా వేసుకునేవారు. పాలు, వెన్న, నెయ్యి, ఆముదాలు... ఇలా ప్రతీదీ స్వయం సమృద్ధంగా ఉండేది. మా కుటుంబమే కాదు. దాదాపు అంతా అలాగే ఉండేవారు. విత్తనాలను కూడా దాచుకునేవారు. ఇప్పుడా వ్యవస్థ నాశనమైంది. అన్నిరకాలుగా రైతు స్వయంసమృద్ధంగా ఉండేవాడు. నేనూ వ్యవసాయం చేశా. నాగలి కొట్టేవాణ్ణి. ఇప్పటికీ నాగలి కొట్టగలను.

- సుతారపు సోమశేఖర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.