close

తాజా వార్తలు

జుట్టు కత్తిరించుకొని వచ్చేదాన్ని

తొలి సినిమాతోనే ఏం సక్కగున్నాదే... అనిపించిన అందం తాప్సిది. ఆమె సొట్టబుగ్గలు... సంపంగి ముక్కు... తెలుగు కుర్రకారు మనసుల్ని ఝుమ్మనిపించాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సినిమాతో హీరోయిన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన తాప్సి అందంలోనే కాదు.. అభినయంలోనూ మేటి అని నిరూపించింది. హిందీలోనూ జెండా పాతేసిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల ‘గేమ్‌ ఓవర్‌’ చిత్రంతో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి ‘హాయ్‌’తో ముచ్చటించింది.

ముంబయిలో ఇల్లు కొన్నారట. ఇక అక్కడే స్థిరపడినట్టేనా?
నటిగా నేను పనిచేసే ప్రతి చోటునూ నా సొంత స్థలంగానే భావిస్తా. కాకపోతే ముంబయిలో నేను నివసించడానికి ఓ ఇల్లు కొన్నా. ఎప్పట్నుంచో కంటున్న కల అది. ముప్పయ్యేళ్లు వచ్చే లోపు సొంత కారు, సొంత ఇల్లు, స్థిరమైన కెరీర్‌ ఉండాలనుకొనేదాన్ని. ఆ కలలన్నీ నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మధ్య తరగతి నుంచి వచ్చిన అమ్మాయిని. ఖరీదైన ముంబయి ప్రాంతంలో సొంతంగా ఇల్లు కొనడం పెద్ద విషయం కదా. ఇక మీ తదుపరి లక్ష్యం పెళ్లేనా అని మాత్రం అడగకండి (నవ్వుతూ). కుటుంబం, పిల్లలు అనే ఆలోచన వచ్చినప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తా. అప్పటిదాకా నా కెరీరే నాకు ముఖ్యం.

కథానాయికగా ఎప్పుడో పేరు తెచ్చుకున్నారు. ఇల్లు కొనుక్కోవడానికి ఇన్నాళ్లు పట్టిందా?
దిల్లీలో పెట్టుబడి కోసం ఓ ఇల్లు కొన్నా. దాంతో అది నా సొంత ఇల్లు అనే అభిప్రాయం ఎప్పుడూ కలగలేదు. అయితే ముంబయికి వెళ్లడానికి ముందు హైదరాబాద్‌లో మంచి ఫ్లాట్‌ కొనాలని ప్రయత్నించా. దాదాపుగా ఖరీదు కూడా చేశా. అంతలోనే ముంబయి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే నా సొంత కారు కల నెరవేరింది మాత్రం హైదరాబాద్‌లో ఉన్నప్పుడే. బీఎమ్‌డబ్ల్యూ కారుని దిల్లీలో కొని, హైదరాబాద్‌కి ట్రాన్స్‌పోర్ట్‌ చేయించా. ఇక్కడికొచ్చాకే దాన్ని నడిపా. ముంబయి వెళ్లిపోయేటప్పుడు నాతోపాటే తీసుకెళ్లా.

చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాళ్లా?
అల్లరి ఎక్కువే కానీ, అది ఇంట్లో ఉన్నంతవరకే. స్కూల్‌కి వెళ్లాక ఉండేది కాదు. టీచర్లంటే భయమని కాదు. అక్కడ మా క్లాస్‌లో లీడర్‌ని నేనే. ఎవరైనా అల్లరి చేస్తే టీచర్లకి ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత నాది. అలా నా అల్లరి కంట్రోల్‌ అయ్యిందన్నమాట (నవ్వుతూ).

అగ్ర కథానాయికగా ఎదిగారు. మీరు గడిపిన మధ్య తరగతి జీవితం గుర్తుకొస్తుంటుందా?
గుర్తుకు రావడమేంటి, ఇప్పటికీ నేను మధ్య తరగతి అమ్మాయినే. కథానాయికని అయ్యాక కొన్ని సౌకర్యాలు పెరిగుండొచ్చు తప్ప నా జీవితంలో ఊహించని మార్పులేమీ లేవు. ఇప్పటికీ థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తాను. లెక్కలేసుకుంటూ షాపింగ్‌ చేస్తాను. ఇంట్లో మా చెల్లెలితో నాకది, నీకిదంటూ గొడవ పడుతుంటాను. అప్పటి స్నేహితులు ఇప్పుడూ నాతో టచ్‌లో ఉన్నారు. మేం కలిస్తే చిన్నప్పటి రోజుల గురించి, అప్పటి జీవితం గురించే ఎక్కువగా మాట్లాడుకుంటుంటాం.

సినీ రంగంలోకి రాకుండా ఉండాల్సిందని ఎప్పుడైనా అనిపించిందా?
నా సినీ ప్రయాణంలో పరాజయాలు చాలానే. కానీ ఏ సందర్భంలోనూ ఎందుకొచ్చాననే ప్రశ్న తలెత్తలేదు. నాలుగు గోడల మధ్య 9 టు 5 ఉద్యోగం చేయడం నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు. అందుకే మా నాన్నని ఒప్పించి ఈ రంగంలోకి వచ్చా. మనకు ఇష్టమైన రంగంలో రాణించాలనుకొన్నప్పుడు ఎన్ని కష్టాలెదురైనా లెక్కచేయం కదా. అలా పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగా. నటిని కాకపోయుంటే ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్‌ రంగంలోనో లేదంటే బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలోనో కొనసాగుతూ ఉండేదాన్ని. నా గురించి కొద్దిమందికే తెలుసుండేది. అదే నటిని అయ్యాను కాబట్టి ఇంత మందికి చేరువయ్యాను. ఇంత మందికి వినోదం పంచుతున్నా. ఇంతకంటే ఏం కావాలి?

సెలవుల్లో అదే పని

న సంతోషం మన చేతుల్లోనే ఉంటుందని నమ్మే వ్యక్తిత్వం నాది. చేయాలనుకొన్నది చేసే వరకు నిద్రపోయేదాన్ని కాదు. నాది రింగుల జుట్టు. చిన్నప్పుడు చాలా ఒత్తుగా ఉండేది. నా సెలవు రోజంతా జుట్టుకి నూనె పట్టించడానికి, కడగడానికే సరిపోయేది. దాంతో ఎలాగైనా జుట్టు కత్తిరించుకోవాలని అనిపించేది. ఇంట్లో చెబితే  ఏమంటారో అని ఏవేవో సాకులు చెప్పి నేనే వెళ్లి కత్తిరించుకొని వచ్చేదాన్ని. ప్రాక్టికల్‌గా ఆలోచించడం చిన్నప్పట్నుంచే అలవాటైంది. ఆ మనస్తత్వం సినిమా కెరీర్‌కి ఎంతగానో ఉపయోగపడింది. చదువుల్లో నేను చాలా చురుకు.

ఒకే సారి పది పనులు చేస్తుండాలి

ఇంట్లో భారం కాకూడదని, నా పాకెట్‌ మనీని నేనే సంపాదించుకోవాలనే లక్ష్యంతోనే కళాశాలలో ఉన్నప్పుడు మోడలింగ్‌ వైపు దృష్టిపెట్టాను. ఎప్పుడూ ఒక పనితో గడపడం నాకు ఇష్టం ఉండేది కాదు. ఒకేసారి పది పనులు చేయాలనిపిస్తుంటుంది. అలా చదువు, మోడలింగ్‌తో బిజీ బిజీగా గడిపా. ఇంజినీరింగ్‌ తర్వాత పై చదువుల ప్రణాళికల్లో భాగంగా ఏడాదిపాటు ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ ఏడాదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. సినిమా అవకాశాలు వచ్చాయి.

భాషపై అలా పట్టు

కెమెరా ముందుకొచ్చేవరకు సినిమా గురించి నాకేమీ తెలియదు. ప్రతి శుక్రవారం కొత్త సినిమా చూడాల్సిందే అనుకునే రకాన్నీ కాదు. ఫలానా సినిమా బాగుందని ఎవరైనా చెబితే, అమ్మానాన్నలతోనో లేదంటే స్నేహితులతో కలిసి థియేటర్‌కి వెళ్లేదాన్నంతే. సినిమా వాతావరణం, భాష అన్నీ కొత్తే. దాంతో తొలి రోజు భయంగానే ‘ఆడుకలమ్‌’ సెట్లోకి అడుగుపెట్టా. గందరగోళ పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి నేపథ్యంలోనే తొలి సన్నివేశాలు తీశారు. దాంతో ఆ సన్నివేశాలు చాలా సహజంగా వచ్చాయి. ఒక షెడ్యూల్‌ ‘ఆడుకలమ్‌’ చేస్తే, మరొక షెడ్యూల్‌ ‘ఝుమ్మందినాదం’ చేసేదాన్ని. ఆ రెండు సినిమాలూ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లక్ష్మీప్రసన్న తెలుగు నేర్చుకోమని సలహా ఇచ్చింది. ఆ సలహాతో భాషపై పట్టు పెంచుకొన్నా. దాంతో చాలా విషయాల్ని నేర్చుకోగలిగా.

వెడ్డింగ్‌ ప్లానింగ్‌ బిజినెస్‌

నా చెల్లెలు షగుణ్‌ నాకంటే నాలుగేళ్లు చిన్న. నాకు సంబంధించి ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా సలహా తీసుకోవాలన్నా తననే అడుగుతుంటా. తను, నేను వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీని ఏర్పాటు చేశాం. డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌లో మా సంస్థకి మంచి పేరుంది.
- నర్సిమ్‌ ఎర్రకోట
ఫొటో : మధు

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.