close

తాజా వార్తలు

రివ్యూ: ఝాన్సీ

చిత్రం: ఝాన్సీ
న‌టీన‌టులు: జ్యోతిక, జి.వి. ప్రకాష్, ఇవానా, రాక్‌లైన్ వెంక‌టేష్‌, గురు శంక‌ర్ త‌దిత‌రులు 
స‌ంగీతం: ఇళ‌య‌రాజా 
ఛాయాగ్ర‌హ‌ణం: తేని ఈశ్వ‌ర్‌ 
నిర్మాతలు: డి.అభిరామ్‌, అజయ్ కుమార్, డి.వెంకటేష్‌, కోనేరు కల్పన 
ద‌ర్శ‌క‌త్వం: బాలా 
సంస్థ‌: కల్పనా చిత్ర, యశ్వంత్ మూవీస్
విడుద‌ల‌: 
17-08-2018

తెలుగులో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ పాత్ర‌లు అన‌గానే సూర్య న‌టించిన ‘సింగం’ సినిమాలు గుర్తుకొస్తాయి. సింహం.. సింహం.. హీజ్‌ న‌ర‌సింహం.. అంటూ ఆయ‌న చేసే హంగామా మాస్ ప్రేక్ష‌కుల్ని మురిపిస్తుంటుంది. తాజాగా ఆయ‌న భార్య జ్యోతిక కూడా అదే త‌ర‌హా పోలీస్ అవ‌తార‌మెత్తింది. లేడీ సింగంగా మారింది. పోలీస్ ‘ఝాన్సీ’గా లాఠీ ఝుళిపిస్తోంది. త‌మిళంలో ‘నాచియార్’ పేరిట తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘ఝాన్సీ’గా అనువాద‌మైంది. రియ‌లిస్టిక్ సినిమాలు తీయ‌డంలో దిట్ట అయిన బాలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. మ‌రి లేడీ సింగం ‘ఝాన్సీ’ హంగామా ఎలా ఉందంటే!

కథేంటంటే: ఏ ప‌ని దొరికితే ఆ ప‌ని చేసుకుంటూ పొట్ట పోసుకునే ఓ కుర్రాడు గాలిరాజు (జి.వి.ప్ర‌కాష్‌). త‌న అవ్వ‌తో క‌లిసి జీవిస్తుంటాడు. మైన‌ర్ బాలిక అయిన రాశి (ఇవానా) త‌న బావ ద‌గ్గ‌రే ఉంటూ ఇళ్లల్లో ప‌నిచేస్తుంటుంది. గాలిరాజు, రాశి అనుకోకుండా ఓ ఆటో ద‌గ్గర క‌లుస్తారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ పుడుతుంది. ఇంత‌లో రాశి గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం తెలుస్తుంది. ఆమెని అత్యాచారం చేశాడ‌ని రాజుపై నేరం మోపుతారు. రాశి మాత్రం తానూ, రాజు ప్రేమించుకున్నామ‌ని కోర్టులో చెబుతుంది. దాంతో రాజుని బాల‌నేర‌స్థుల కారాగారానికి పంపుతారు. రాశిని ఏసీపీ ఝాన్సీ (జ్యోతిక) త‌న ఇంటికి తీసుకెళుతుంది. రాశి.. బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చాక ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలుస్తుంది. ఆ విష‌యం ఝాన్సీకి స‌వాల్‌గా మారుతుంది. ఎవ్వ‌రికీ భ‌య‌ప‌డకుండా.. నేర‌స్తుల‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగిస్తూ నిజాల్ని బ‌య‌టికి క‌క్కించే ఏసీపీ ఝాన్సీ.. ఈ కేసుని ఎలా ఛేదించిందనే విష‌యాన్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్. సున్నిత‌మైన విష‌యాల‌తో కూడిన ఒక నేరాన్ని ఏసీపీ ఎలా బ‌య‌ట‌పెట్టిందనేదే ఈ చిత్రం. బాలా స్టైల్ వాస్త‌వికత‌తో సాగుతుంది. ఇదివ‌ర‌కటి బాలా సినిమాల‌కీ, ఈ సినిమాకీ చాలా వ్య‌త్యాసం ఉంటుంది. దుఃఖ‌భ‌రిత‌మైన స‌న్నివేశాల‌తో సినిమాల్ని ముగించే బాలా ఈ చిత్రంలో మాత్రం క‌థ‌ని సుఖాంతం చేశాడు. అయితే, క‌థ‌లో మాత్రం సంక్లిష్ట‌త కొర‌వ‌డింది. క‌థ‌లోనూ, స‌న్నివేశాల్లోనూ వాస్త‌విక‌త క‌నిపిస్తుంది. కానీ..ఆశించిన స్థాయిలో థ్రిల్‌ని పంచ‌దు. ప్ర‌థ‌మార్థం గాలిరాజు, రాశిల మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలతోనే సాగుతుంది. విరామం స‌మ‌యంలో వ‌చ్చే మ‌లుపు ద్వితీయార్ధంపై ఆస‌క్తి రేకెత్తిస్తుంది. నిజానికి అప్ప‌టిదాకా ఏసీపీ ఝాన్సీగా జ్యోతిక చేసిందేమీ ఉండ‌దు. ద్వితీయార్ధం నుంచే ఆమె పాత్ర ప్ర‌భావం చూపించ‌డం మొద‌లుపెడుతుంది. నిజానికి క‌థ‌లో థ్రిల్ పండాల్సింది కూడా ద్వితీయార్ధంలోనే. అయితే, అక్క‌డ ఒక‌రిద్ద‌రు అనుమానితులపై దృష్టిపెట్ట‌డంతోనే కేసు ఓ కొలిక్కి వ‌చ్చేస్తుంది. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన ఓ పోలీసు అధికారిణికి ఓ మైన‌ర్ అమ్మాయి జీవితానికి సంబంధించిన కేసు స‌వాల్‌గా మారిన‌ప్పుడు ఆమె ఎలా స్పందిస్తుంద‌నేదే జ్యోతిక క్యారెక్ట‌రైజేష‌న్‌. ఆ పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. సున్నితంగా కనిపిస్తూనే, కేసుల విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే విధానం ఆక‌ట్టుకుంటుంది. ఒక చిన్న అంశం చుట్టూ క‌థ‌ని అల్లిన విధానం ఆక‌ట్టుకుంటుంది. పాత్ర‌ల తీరుతెన్నుల్లో మాత్రం త‌మిళ నేటివిటీ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తుంటుంది. అనువాదం విష‌యంలో నిర్మాత‌లు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవా‌ల్సింది.

ఎవ‌రెలా చేశారంటే: జ్యోతిక‌, జీవీ ప్ర‌కాష్‌, ఇవానా, రాక్‌లైన్ వెంక‌టేష్ పోషించిన పాత్ర‌ల చుట్టూనే క‌థ తిరుగుతుంది. జీవీ ప్ర‌కాష్, ఇవానా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. జ్యోతిక.. పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించింది. ఆమెని తెర‌పై మ‌రింత శక్తివంతంగా చూపించే అవ‌కాశం ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ దిశ‌గా దృష్టిసారించ‌లేదనిపిస్తుంది. రాక్‌లైన్ వెంక‌టేష్ జ్యోతిక‌కి సాయ‌ప‌డే పోలీసు అధికారిగా క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇళ‌యరాజా సంగీతం, తేని ఈశ్వ‌ర్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకుంటాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ కావ‌డంతో సాగ‌దీత ఎక్కువ లేకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టున్నాయి. ద‌ర్శ‌కుడిగా బాలా‌లో మాత్రం చాలా మార్పు క‌నిపించింది. వాస్త‌విక‌త విష‌యంలో మ‌రీ లోతుగా వెళ్ల‌కుండా, గ‌త సినిమాల‌కి పూర్తి భిన్నంగా తీశారు.

బ‌లాలు
+ క‌థలో మ‌లుపు 
+ వాస్త‌వికత 
+ జ్యోతిక, జీవా, ఇవానా, న‌ట‌న

బ‌ల‌హీన‌త‌లు
- థ్రిల్లింగ్ అంశాలు తగ్గడం 
- త‌మిళ నేటివిటీ

చివ‌రిగా: ఝాన్సీ.. ఓ పోలీసు ప‌రిశోధ‌న
గమనిక: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.