close

తాజా వార్తలు

కమర్షియల్‌ కోసం గ్లామర్‌గా నటించను: అమలాపాల్‌

కమర్షియల్‌ కోసం గ్లామర్‌గా నటించను: అమలాపాల్‌

చెన్నై: ‘మైనా’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు కేరళ కుట్టి అమలాపాల్‌. ‘దైవ తిరుమగల్‌’, ‘వేట్టై’, ‘కాదలిల్‌ సొదప్పువదు ఎప్పడి’, ‘వీఐపీ’, ‘అమ్మాకనక్కు’ వంటి పలు చిత్రాలతో ఆమె క్రేజీ మరింత పెరిగింది. ఇటీవలే ‘తిరుట్టుపయలే 2’, ‘భాస్కర్‌ ఒరు రాస్కెల్‌’ సినిమాల్లో కనిపించి మెప్పించారు. తాజాగా రామ్‌కుమార్‌ దర్శకత్వంలో విష్ణుకు జోడీగా ‘రాక్షసన్‌’, ‘ఆడై’ వంటి చిత్రాల్లో నటించారు. ఇందులో ‘రాక్షసన్‌’ ఈ నెల 5వ తేదీన తెరపైకి రానుంది. ఇవేకాకుండా మలయాళ చిత్రాల్లోనూ ఈ అమ్మడు నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాను నటిస్తున్న సినిమాల గురించి ఆమె చెప్పిన విశేషాలు...

ఉపాధ్యాయురాలి పాత్ర: నా కెరీర్‌లో మంచి గుర్తింపునిచ్చే చిత్రం ‘రాక్షసన్‌’. ఇందులో ఉపాధ్యాయురాలిగా నటించా. సైకో థ్రిల్లర్‌ కథ ఇది. చాలా వరకు రాత్రి పూటే ఎక్కువ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సినిమా కోసం హీరో విష్ణు చాలా శ్రమించారు. ఇప్పుడు మంచి స్నేహితుడు అయ్యారు. థ్రిల్లర్‌ సినిమాలంటే ఇలాగే ఉండాలన్న ట్రెండ్‌కు ఈ సినిమా పూర్తి భిన్నమైంది. తమిళ సినీ పరిశ్రమలో ఇదో బెంచ్‌మార్క్‌ చిత్రంగా ఉంటుంది. ఇందులో గ్లామర్‌కు తావులేదు. పాటల్లో కూడా అందాల ఆరబోత ఉండదు. మంచి సినిమాలో నటించామనే తృప్తినిచ్చింది. ఈ సినిమాకు నేనే డబ్బింగ్‌ చెప్పా.

విజయమే.. కమర్షియల్‌: ఇటీవల తమిళం బాగా నేర్చుకున్నా. సరళంగా మాట్లాడగలుగుతున్నా. సినీ పరిశ్రమలో మంచి సినిమా, చెడ్డ సినిమాలే ఉంటాయి. పెద్ద బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తే కమర్షియల్‌గా విజయం సాధిస్తుందనే నమ్మకం నాకు లేదు. ఏ సినిమా అయినా విజయం సాధిస్తే.. అది కమర్షియల్‌ చిత్రం అవుతుంది. 

కమర్షియల్‌ కోసం గ్లామర్‌గా నటించను: అమలాపాల్‌

హిందీలో అవకాశం: తమిళంలో ప్రస్తుతం చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఓ హిందీ చిత్రానికి అంగీకరించా. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా. మునుపటి కన్నా ఇప్పుడు చాలా స్లిమ్‌ అయ్యా. అయితే ఆ హిందీ సినిమా కోసం కాదు. తమిళ చిత్రాల కోసమే.

అందుకే అలా నటించా: నాకు హోమ్లీ గాళ్‌ అనే గుర్తింపు ఉంది. కుటుంబ ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. కానీ ‘ఆడై’ సినిమా పోస్టర్‌ చూసినవారు ‘అరె.. అమలాపాలా ఇది..’ అని ఆశ్చర్యపోతున్నారు. ఆ సినిమాకు అలాంటి సీన్‌ అవసరమైంది. అందుకే గ్లామర్‌గా నటించా. అవసరానికి మించి, కమర్షియల్‌ హంగుల కోసం నేనెప్పుడూ గ్లామర్‌గా నటించను. ప్రస్తుతం ‘ఆడై’ చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. తదుపరి ‘అదో అంద పరవైపోల’ అనే చిత్రంలో నటిస్తున్నా. అలాగే ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నా. అంతేకాకుండా ఓ యాడ్‌ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించా. దాని గురించి త్వరలోనే తెలుస్తుంది.

బయోపిక్‌లో నటిస్తా: మహానటి సావిత్రి బయోపిక్‌ అందర్నీ అలరించింది. ఆ సినిమాతో బయోపిక్‌ ట్రెండ్‌ మొదలైంది. అయితే ఎవరి బయోపిక్‌లో నటించాలా అని ఆలోచిస్తున్నా. సరైన సమయం వచ్చినప్పుడు, అవకాశాన్ని బట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తా. నేను అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్తా. అక్కడున్న ప్రకృతి మంచి నూతనోత్సాహాన్ని, సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది. నా జీవితాన్ని మార్చింది హిమాలయాలే. అక్కడికి వెళితే దేవుడి దగ్గరకు వెళ్లొచ్చినట్లు ఉంటుంది. ఒంటరిగా వెళ్లినా.. ఏ మాత్రం భయం లేదు. కానీ ఇక్కడే భయమేస్తోంది.

సమయం వస్తే రాజకీయాల్లోకి...: నన్ను పలురకాలుగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి గురించి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశా. అతనిని అరెస్టు చేశారు. మరి ఇలాంటి ఘటనలను ఎదుర్కోవడానికి మీరు రాజకీయాల్లోకి వస్తారా?.. అని చాలా మంది అడుగుతున్నారు. చూద్దాం.. సమయం వస్తే ఏదైనా జరగొచ్చు. నా చేతికి గాయాలైనప్పుడు కూడా కేరళ వరద బాధితుల కోసం సహాయ చర్యల్లో పాల్గొన్నా. ఎంతో మంది ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.