close

తాజా వార్తలు

అలా...కూర్చుంటే ఎలా..!

ఓ పది నిమిషాలు నిలబడితే కాళ్లు లాగేస్తాయి... కాసేపైనా చతికిలపడాల్సిందే! ఆహరం తినేటప్పుడు, టీవీ చూసేటప్పుడే కాదు...ఫోన్‌  మాట్లాడుతున్నా, మరే పనిచేసినా...గంటలు గంటలు కూర్చునే చేస్తున్నాం.  ఇక నేటితరం ఉద్యోగినులయితే కదలకుండా ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే బరువు పెరగడమే కాదు మరెన్నో అనారోగ్య సమస్యలూ ఇబ్బందిపెట్టొచ్చు.  అవేంటో తెలుసుకుందామా!



వీళ్లిద్దరి పనులు వేరైనా... కూర్చునే సమయం, తీరు ఒకటే. ఇలా ఉద్యోగాలు చేసే మహిళలే కాదు... ఇంటిపట్టున ఉండే గృహిణులు, యువత ఎవరైనా సరే! ఈవిధంగా ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే ఇటువంటి ఇబ్బందులే  ఎదురవుతాయి. మరేం చేయాలి


* శ్వేత ఓ ప్రయివేటు సంస్థలో క్లర్క్‌. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదింటి వరకు దించిన తల ఎత్తకుండా పని చేస్తుంది.   మధ్యలో లేచి కాసేపు నడవాలన్నా.. పని ఒత్తిడితో సాధ్యం కాదు. దాంతో చిన్నవయసులోనే మోకాళ్ల నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతోంది. 


‌* రాధ పదేళ్లుగా ఓ ఫైనాన్స్‌ సంస్థలో అకౌంటెంట్‌గా చేస్తోంది. ఆఫీసులో చేరిన కొత్తలో సన్నగా ఉన్న ఆమె... క్రమంగా బరువు పెరిగిపోయింది. అంతేకాదు అదేపనిగా కూర్చోవడం వల్ల నడుము నొప్పి, మధుమేహం బారిన పడింది.



ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల సమస్యలు అని మనకి తెలుసు. అందుకే ఎన్నిగంటలు పనిచేయాల్సి ఉన్నా, ఏ పనిచేసినా....సరే! ఆ విషయాన్ని మరిచిపోవద్దు. మధ్యమధ్యలో లేచి నడవడం, చిన్న చిన్న స్ట్రెచెస్‌ చేయడం వంటివన్నీ బాధ్యతలా పెట్టుకోవాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి పనితో పాటు చిన్న చిన్న వ్యాయామాలకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం ఇలా చేయండి.

కాసపు నడిస్తే...
* గంటకోసారైనా కూర్చున్న చోటు నుంచి లేచి అటూ ఇటూ నాలుగడుగులు వేయాలి. ఇలా ఓ అయిదు నిమిషాలపాటు చేస్తే మేలు. అందుకోసమే ఈ మధ్య కొన్ని సంస్థలు స్టాండింగ్‌ డెస్క్‌లు రూపొందిస్తున్నాయి.
*  ఇక ఫోను మాట్లాడేటప్పుడు సోఫాలోనో, కూర్చీలోనో కూర్చోవడం కంటే నడుస్తూ మాట్లాడటం మంచిది. టీ తాగాక, మధ్యాహ్నం భోజనం చేశాక, సాయంత్రం అల్పాహారం తీసుకున్నాక నేరుగా వచ్చి సీట్లో కూర్చోవద్దు. ఓ పదినిమిషాలైనా అటూ ఇటూ తిరగండి. దీనివల్ల జీర్ణశక్తి మందగించకుండా ఉంటుంది.
* ఇంట్లో ఉన్నా, ఆఫీసుకి వెళ్లినప్పుడైనా  లిఫ్ట్‌కు బదులుగా మెట్లెక్కేయండి.  అలానే బయట ఏ చిన్నపని ఉన్నా...బండిని వాడేబదులు నడిచి వెళ్లడానికే ప్రాధాన్యం ఇవ్వండి. కుర్చీలో ఉండే చేయొచ్చు...
ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు ముందు కుర్చీలో నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. వెన్నెముక నిటారుగా లేకపోతే పొట్ట వస్తుంది. ఇక ఎక్కువగంటలు కూర్చోవలసి వచ్చినప్పుడు కొంత విరామం తీసుకుని కాళ్లు, చేతులు, మెడను సవ్య అపసవ్య దిశలో నెమ్మదిగా తిప్పాలి. ఇలా ఓ పది నుంచి పదిహేనుసార్లు చేస్తే సరి. ఇదే విధంగా భుజాలు, చేతుల్ని కూడా పైకి, కిందకు గుండ్రంగా, వ్యతిరేక దిశలో తిప్పడమూ చక్కటి వ్యాయామమే అవుతుంది.
* కుర్చీలో నిటారుగా కూర్చుని కుడి కాలుని నేల మీద ఆనించాలి. ఎడమ కాలి పాదాన్ని కుడి మోకాలికి ఆనించాలి. ఆ స్థితిలోనే ఉండి రెండు చేతులతో మోకాలిని, మడమని పట్టుకుని ముందుకి, వెనక్కి వంగాలి. ఇలా రెండు నిమిషాలు చేసి  చేతులను పైకి ఎత్తాలి. కాసేపయ్యాక రెండో కాలిని కూడా కింద పెట్టి రెండు చేతులతో నేలను తాకే ప్రయత్నం చేయాలి. దీన్ని పీజియన్‌ పోశ్చర్‌ అంటారు. నడుం నొప్పి తగ్గుతుంది. వెన్ను గట్టిపడుతుంది. ఒత్తిడి వంటివి దూరం అవుతాయి. మూత్ర సంబంధ సమస్యలు అదుపులోకి వస్తాయి.
* కుర్చీలో కూర్చుని కాళ్లను ఏటవాలుగా చాపండి. ఆ తరువాత చేతులతో కాలి వేళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించండి.  ఇది తొడలకు చక్కటి వ్యాయామం.  అయితే పొట్ట, తొడలకు సంబంధించిన వ్యాయామాల్ని చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే మోకాళ్లనొప్పులతోపాటు ఇతర సమస్యలు ఎదురవుతాయి.

ఇవీ ముఖ్యమే..
పనిచేసేటప్పుడు నడుస్తున్నాం కదా అని దానికే పరిమితం అవ్వొద్దు. కేవలం అరగంటా, గంటకోసారి అటూ ఇటూ నడవడం వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు. మీ దినచర్యలో ఇతర పనుల మాదిరిగానే వ్యాయామానికి కనీసం ఓ అరగంటైనా సమయం కేటాయించుకోవాలి. అలాని జిమ్‌కే వెళ్లక్కర్లేదు. ముందు నడకతో మొదలుపెట్టండి. కాస్త అలవాటు అయ్యాక వ్యాయామాలు చేయొచ్చు. మీ చుట్టూ ఉన్న వస్తువుల్నే వ్యాయామ సాధనాలుగా అంటే... నీళ్లసీసాలు, కర్ర, చున్నీ, తాడు... వంటివాటితోనూ రకరకాల వ్యాయామాలు చేయొచ్చు. ఉదాహరణకు చున్నీ లేదా తాడు వంటివాటి చివర్లు పట్టుకుని చేతుల్ని చాచడం, ఒకవైపు వంగి లేవడం వంటివి సులువుగా చేయొచ్చు. వాటిని కాళ్లకు ఆధారంగా చేసుకుని ఓ క్రమపద్ధతిలో పడుకోవడం, లేవడం వల్ల చేతులతోపాటు పొట్టకూ వ్యాయామం అందుతుంది. పొత్తికడుపు దగ్గర ఉన్న కండరాలు దృఢంగా మారతాయి. అలానే తాడాటా ఆడొచ్చు. దీనివల్ల బోలెడు కెలొరీలు కరుగుతాయి.
*ఉదయం లేవగానే పడుకున్న చోటే ఉండి కొన్ని రకాల స్ట్రెచెస్‌, స్క్వాట్స్‌ ప్రయత్నించొచ్చు. వీటివల్ల విశ్రాంత స్థితిలో ఉన్న కండరాలు శక్తిని పొందుతాయి. శరీరం చురుగ్గా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

ఎక్కువ సేపు కూర్చుంటే...!
* రక్తపోటు పెరుగుతుంది.
* నడుము, పొట్ట, తొడలు, పిరుదల దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
* చెడు కొలెస్ట్రాల్‌ స్థాయులు పెరిగిపోతాయి.
* గుండె జబ్బులు, క్యాన్సర్‌ లాంటివి వచ్చే ప్రమాదముంది.
* జీవక్రియల వేగం మందగిస్తుంది.
* అలసట, బడలికలతో శరీరం నిస్సత్తువగా మారుతుంది.
* శరీరాకృతిలో కూడా స్పష్టమైన మార్పు వస్తుంది.
* నడుము, వెన్ను సమస్యలు బాధిస్తాయి.
* ఒంటరితనం, ఆందోళన వంటి మానసిక సమస్యలు దరి చేరతాయి.


గృహిణులయితే పనులన్నీ అయ్యాక టీవీ ముందు కూర్చుంటారు. ఉద్యోగినులైతే అటు ఆఫీసులో ఎక్కువ సమయం పనితోనూ, ఇంటికి వచ్చాక ఫోన్లతోనూ కూర్చుంటారు. ఇలా ఎక్కువ సమయం కదలకుండా ఉండటం, శారీరక శ్రమ లేకుండా ఉన్నప్పుడూ ఊబకాయం ఎదురవుతుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చట. పైగా రోజులో ఎనిమిది గంటలకు పైగా కూర్చుని పనిచేసేవారి జీవితకాలం తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ లెక్కన పొగతాగడం వల్ల మరణించేవారితో పోలిస్తే ఊబకాయుల్లోనే మరణ రేటు ఎక్కువని పరిశోధనలు తేల్చాయి.


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.