close

తాజా వార్తలు

కంగన కోసమే సినిమాను ఒప్పుకొన్నాను: క్రిష్‌

నేను తీసింది బంగారం.. మీరు చూస్తోంది వెండి

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్ కోసమే తాను ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ఒప్పుకొన్నానని అంటున్నారు దర్శకుడు క్రిష్‌. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. అయితే సినిమా చిత్రీకరణ సమయంలో తనకు, కంగనకు మధ్య విభేదాలు తలెత్తాయని క్రిష్‌ అంటున్నారు. సినిమా గురించి, కంగనతో తనకు ఏర్పడిన విభేదాల గురించి ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు.

ప్రశ్న: ‘మణికర్ణిక’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. మీరెలా ఫీలవుతున్నారు? 

క్రిష్‌: నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సక్సెస్‌ను చాలా ఎంజాయ్‌ చేస్తున్నాను. టాక్‌ బాగుంది. సినిమా బ్లాక్‌బస్టర్‌ అవుతుందని నాకు ముందే తెలుసు.

సినిమాలో కంగనా రనౌత్‌ను తీసుకోవాలని ఎందుకనిపించింది?

మన భారత్‌లో ఉన్న గొప్ప నటీమణుల్లో కంగన ఒకరు. నిర్మాతలు కంగనను ప్రధాన పాత్రలో ఎంచుకుందామని చెప్పినప్పుడు నేను ఎగ్జైట్‌ అయ్యాను. ఆమె నటించిన ‘క్వీన్’, ‘తను వెడ్స్‌ మను’ సినిమాలు చూశాను. చాలా అద్భుతంగా నటించారు. చెప్పాలంటే సినిమాలో కథానాయిక కంగన కాబట్టే ‘మణికర్ణిక’ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఒప్పుకొన్నాను. ఎందుకంటే ఆమె ఈ పాత్రకు సరిగ్గా సరిపోతారనిపించింది. నేను స్క్రిప్ట్‌ నరేట్‌ చేయడానికి కంగన వద్దకు వెళ్లినప్పుడు ‘ఈ సినిమాతో మనకు కచ్చితంగా జాతీయ అవార్డు వస్తుంది’ అని చెప్పాను.

విడుదలకు ముందే ‘మణికర్ణిక’ సినిమాను చూశారా?

విడుదలకు ముందు చూడలేదు. కానీ గతేడాది జూన్‌లోనే సినిమా చూశాను. సినిమాను పూర్తిచేసి కాపీని అప్పగించాను. కానీ సినిమాలో నాకు తెలీకుండా మార్పులు జరిగి, కంగన దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాక సినిమా చూడలేదు.

మార్పులు చేశాక సినిమా చూపించాలని మీరు అడగలేదా?

లేదు. ఎందుకంటే నన్ను ఓ దర్శకుడిగా స్వీకరించలేదు. ఈ విషయంలో నాకు, కంగనకు మధ్య విభేదాలు వచ్చాయి. ఓ దర్శకుడిగా సినిమా చక్కగా రావాలని భావించి నేను కొన్ని రోజులు ఝాన్సీ ప్రాంతంలో నివసించాను. ఆ ప్రాంతంలోని గోడలను ముట్టుకున్నాను. లక్ష్మీబాయి విశ్వవిద్యాలయంలో చదువుతున్న వారిలో దాదాపు 40 మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేశాను. చరిత్రలో ఉన్న నిజాలను చూపించాలని నేను ఇంతగా తాపత్రయ పడితే.. కంగన చరిత్రను విస్మరించాలని చూశారు.

సినిమాలో మీకు నచ్చిన సన్నివేశం?

అతుల్‌ కులకర్ణి చేసిన యుద్ధ సన్నివేశాలు. కానీ వాటిని తొలగించేశారు. ఈ సన్నివేశం సినిమాలో ఉండాలని అనుకున్నాను. కానీ కంగన సన్నివేశాలు తొలగిద్దామని అడిగితే నేను ఒప్పుకోలేదు. నేను సినిమా కోసం 400 రోజులు కేటాయించాను. అంత కష్టపడి సినిమా పూర్తిచేసినప్పుడు నేను చేసింది తప్పు, బాలేదు అంటే నాకు బాధకలగదా? అదీకాకుండా ‘మీరు ‘మణికర్ణిక’ నుంచి ఎందుకు తప్పుకొన్నారు’ అని మీడియా వర్గాలు నన్ను ప్రశ్నించడం మరింత బాధించింది.

కానీ సినిమాలో 70 శాతం సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించానని కంగన అంటున్నారు కదా?

అది నీచమైన అబద్ధం. బహుశా అన్ని సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించినట్లు కంగన కలగన్నారేమో..! సినిమా కోసం పనిచేసిన వారిలో చాలా మంది నాతో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నారు. దాదాపుగా నేను దర్శకత్వం వహించిన సన్నివేశాలనే  క్లోజప్‌ షాట్‌లో కంగన దర్శకత్వం వహించినట్లు చెప్పారు. అంతమాత్రానికే ఆమె దర్శకురాలైపోతారా?

కంగన దర్శకత్వం వహిస్తోందన్న విషయం మీకు ముందే తెలీదా?

లేదు. సోనూ సూద్‌ సినిమా నుంచి తప్పుకొన్నప్పుడే తెలిసింది. ఆ తర్వాత నా అసోసియేట్‌ డైరెక్టర్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ సూపర్‌వైజర్‌ నాకు ఫోన్‌ చేసి ఇలా జరిగిందని చెప్పారు.

అసలు ‘మణికర్ణిక’ విషయంలో మిమ్మల్ని ఇబ్బందిపెడుతున్న అంశమేంటి?

నా బాధంతా సినిమాలో తాంతియా తోపే పాత్ర గురించి ఎక్కడా చెప్పలేదని. అది సినిమాకు చాలా కీలకం. దాన్నే తీసేస్తే ఎలా?సినిమాకు సంబంధించిన తొలి ఎడిటింగ్‌ పార్ట్‌ పూర్తయ్యాక కంగన అన్న మొదటి మాట ఏంటంటే.. ‘అరె.. సోనూసూద్‌ పాత్ర బలంగా ఉంది. కుస్తీ చేసిన సన్నివేశాలు ఉండాల్సిన అవసరం లేదు. వాటిని తీసేద్దాం’ అంది. కానీ అందరూ కంగనకే మద్దతు పలుకుతున్నారు. సోనూ సూద్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. జరిగిన విషయం ప్రజలకు తెలియాలి. కంగన చిత్ర పరిశ్రమకు ఓ నటిగా వచ్చారు. సోనూసూద్‌ పాత్ర ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఆమె ఎవరు.

మరి మీరు కంగనను ప్రశ్నించలేదా?

దీని గురించి నాకు, కంగనకు మధ్య చర్చలు జరగలేదు. కానీ నా గురించి కంగన చెప్పినవన్నీ అబద్ధాలే.

సినిమాలో ‘దాన్‌కిలా’ అనే ప్రత్యేక గీతంపై వివాదాలు తలెత్తాయి. దీని గురించి మీ అభిప్రాయమేంటి?

ఆ పాటను నేను చిత్రీకరించలేదు. అసలు సినిమాలో ఆ పాట ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను తెరకెక్కించిన సినిమా బంగారంలా ఉంది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నది మాత్రం వెండిలా ఉంది. ఏదేమైనా సినిమాకు మంచి స్పందన వస్తోంది. కానీ నేను తెరకెక్కించినది చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

మున్ముందు కంగనతో కలిసి పనిచేస్తారా?

ఇంత జరిగాక మళ్లీ ఆ ప్రశ్న ఎలా అడుగుతారు? ఆమెతో కలిసి ఇంకెప్పుడూ పనిచేయను.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.