close

తాజా వార్తలు

రివ్యూ:  ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు

చిత్రం: ఎన్టీఆర్‌-మహానాయకుడు
నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా, సచిన్‌ ఖేడ్కర్‌, సుప్రియ వినోద్‌, పూనమ్‌ బజ్వా, మంజిమా మోహన్‌, వెన్నెల కిషోర్‌, భానుచందర్‌, తదితరులు
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌
ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ
సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌
నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి
సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా
విడుదల తేదీ: 22-02-2019

ఎన్టీఆర్ క‌థ‌ని చెప్ప‌డ‌మంటే మాట‌లా?  క‌థానాయ‌కుడిగా ఆయ‌న ఎక్కిన శిఖ‌రాలు చూపించాలి. రాజ‌కీయ నేత‌గా ఆయ‌న చేసిన విజ‌య‌యాత్ర‌ని తెర‌పైకి ఎక్కించాలి.  అదో సుదీర్ఘ ప్ర‌యాణం.. మ‌హా సంగ్రామం. అందుకే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీయాల‌ని సంక‌ల్పించారు బాల‌కృష్ణ - క్రిష్‌.  క‌థానాయ‌కుడు ఈ సంక్రాంతికి విడుద‌లైంది. ఇప్పుడు ‘మ‌హా నాయ‌కుడు’ వంతు వ‌చ్చింది.  క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజ‌యాల‌కు తొలి భాగం ప‌ట్టం క‌డితే.. మ‌హా నాయ‌కుడిగా ఆయ‌న సాగించిన జైత్ర యాత్ర‌కు ‘మ‌హానాయ‌కుడు’ ప‌ట్టం క‌ట్టింది. మ‌రి ఆ ఘ‌ట్టాన్ని క్రిష్ ఎంత స‌మ‌ర్థంగా తెర‌కెక్కించాడు?  నంద‌మూరి తార‌క రామారావుగా బాల‌కృష్ణ ఏ స్థాయిలో రాణించాడు? చంద్రబాబు పాత్రలో రానా ఏవిధంగా ఆకట్టుకున్నారు? ‘మహానాయకుడు’తో ఎన్టీఆర్‌ జీవితం సంపూర్ణంగా ఆవిష్కృతమైందా?

క‌థేంటంటే...: ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ స్థాపిస్తున్నా’ అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ‘క‌థానాయ‌కుడు’ ముగిసింది. మ‌రి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానం సాగించిన విధానం ఎలానో ‘మ‌హానాయ‌కుడు’ చూపించింది. పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన 9 నెల‌లలోపే ఆయ‌న అధికారంలోకి ఎలా రాగ‌లిగారు?  అప్ప‌టి ఇందిరాగాంధీ నిరంకుశ‌త్వానికి ఎలా స‌మాధానం చెప్ప‌గ‌లిగారు?. తన వెంటే ఉండి, రాజ‌కీయంగా దెబ్బ‌తీయాల‌ని చూసిన వాళ్లెవ‌రు? ఆ కుట్ర‌ల నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? అనేదే ఈ చిత్రం. అయితే ఈ కథ‌ని కేవ‌లం రాజ‌కీయాల‌కు ప‌రిమితం చేయ‌లేదు. త‌న అర్ధాంగి బ‌స‌వ‌తార‌కంతో ఆయ‌న‌కున్న అనుబంధాన్ని తెలియజేస్తూ... ఆ కోణంలో కుటుంబ బంధాల‌కు పెద్ద‌పీట వేస్తూ తెర‌కెక్కించారు. ఈ రెండింటినీ స‌మాంత‌రంగా ఎలా చూపించారో తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: ఇది ఎన్టీఆర్ క‌థ అనేది ప‌క్క‌న పెట్టి చూస్తే... ఓ ర‌స‌వ‌త్త‌ర‌మైన రాజ‌కీయ చిత్రంగా ‘మ‌హానాయ‌కుడు’ని అభివ‌ర్ణించ‌వ‌చ్చు. ఓ క‌థానాయ‌కుడు పార్టీని స్థాపించ‌డం, ఆ మ‌రుస‌టి ఎన్నిక‌ల‌లోనే త‌న పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డం, పైగా కేంద్రంలోని నిరంకుశ‌త్వ ధోర‌ణికి ఎదురొడ్డి పోరాటం చేయ‌డం ఇవ‌న్నీ అబ్బుర‌ప‌రుస్తాయి. నిజానికి ఇదంతా జ‌రుగుతుందా?  సినిమా న‌టుల‌కు అంత శ‌క్తి ఉందా? అనిపిస్తుంది. కానీ ఇది చ‌రిత్ర‌. జ‌రిగిన వాస్త‌వం. కాబ‌ట్టి - ఆ ఉదంతాలు ఎన్టీఆర్‌లోని ప్ర‌బ‌ల‌మైన శ‌క్తిని ప్రతిఫలిస్తాయి. 

 అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌కి చాలా ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో ఆయ‌న విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. ఆ ఉదంతాన్ని కూడా తెర‌పై చూపించ‌గ‌లిగారు. ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సివ‌చ్చింది?  చేసిన పొర‌పాటుని గ్ర‌హించి మ‌ళ్లీ ఎందుకు వెన‌క‌డుగు వేయాల్సివ‌చ్చింది? అనేదానికీ ఈ సినిమాలో స‌మాధానాలు ఉన్నాయి. నాదెండ్ల భాస్క‌రరావు న‌మ్మించి ఎలా మోసం చేశారు? అధికార దాహంతో ఎన్టీఆర్‌ని సీఎం కుర్చీ నుంచి ఎలా దింపాల‌ని చూశారు? అనేది అస‌లు క‌థ‌. ఆ కుట్ర‌లు, కుతంత్రాల నేప‌థ్యంలో ద్వితీయార్ధాన్ని ఆస‌క్తిదాయ‌కంగా మ‌లిచాడు క్రిష్‌. కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్ర‌బాబు తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరారు?  దానికి గ‌ల కార‌ణాలేంటి?  నాదెండ్ల భాస్క‌ర‌రావు ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌కి ఎదురైన అవ‌మానాలు, ఎం.ఎల్.ఏల‌ను దిల్లీకి తీసుకెళ్లి బ‌ల‌నిరూప‌ణ చేయ‌డం, ఇందిరాగాంధీ నియంతృత్వ విధానాల‌పై పోరాటం చేయ‌డం.. ఈ స‌న్నివేశాల‌న్నీ ర‌క్తిక‌ట్టిస్తాయి. ఈ సినిమా మొత్తం బ‌స‌వ‌తార‌కం కోణంలో సాగుతుంది. ఆమె మ‌ర‌ణమే.. ఎన్టీఆర్ క‌థ‌కు తుది అంకం.

ఎవ‌రెలా చేశారంటే..: ఎన్టీఆర్‌గా నంద‌మూరి బాల‌కృష్ణ ఒదిగిపోయిన విధానం ‘క‌థానాయకుడు’లో చూశాం. ఈ సినిమా దానికి కొన‌సాగింపు. ఎన్టీఆర్ గా మ‌రోసారి బాల‌కృష్ణ త‌న వంతు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు. హావ భావాల ప్ర‌దర్శ‌న‌లో, సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ స‌మ‌తూకం పాటించాడు. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా ఆయ‌న పాత్ర‌లో రెండు పార్శ్వాలుంటాయి. రెండు చోట్లా.. బాల‌య్య రెండు ర‌కాలుగా క‌నిపిస్తాడు. విద్యాబాల‌న్ పాత్ర మొత్తం భావోద్వేగాల భ‌రితంగా సాగింది. ఆమె న‌ట‌న బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తెచ్చింది. చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని ప‌దాల్ని చంద్ర‌బాబు ఎలా ప‌లుకుతారో మ‌నంద‌రికీ తెలుసు. రానా కూడా అదే విధానంతో ‘ముందుకు పోయాడు’. ఏఎన్నార్‌గా సుమంత్‌ని ఒకే ఒక్క స‌న్నివేశానికి ప‌రిమితం చేశారు. క‌ల్యాణ్ రామ్ కూడా అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తాడంతే.
క్రిష్ పాత్ర‌ల్ని మ‌ల‌చుకున్న విధానం బాగుంది. ఏది ఎంత వ‌ర‌కూ చెప్పాలో అంతే చెప్పాడు. మాట‌లు ఆక‌ట్టుకున్నాయి. ఆసుప‌త్రి ఎపిసోడ్ లో బుర్రా సాయిమాధ‌వ్ క‌లం మ‌రింత ప‌దునుగా ప‌లికింది. ఛాయాగ్ర‌హ‌ణం, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లూ బాగున్నాయి.

బ‌లాలు
+ బాల‌కృష్ణ - విద్యాబాల‌న్‌
+ భావోద్వేగాలు
+ పొలిటిక‌ల్ డ్రామా

బ‌ల‌హీన‌త‌లు
- ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని విస్మ‌రించ‌డం

చివ‌రిగా:  ‘మ‌హానాయ‌కుడు’ కుటుంబ - రాజ‌కీయ చిత్రం
గ‌మ‌నిక‌: ఈ స‌మీక్ష స‌మీక్ష‌కుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది స‌మీక్ష‌కుడి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మే!

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.