close

తాజా వార్తలు

టీమిండియా జెర్సీ... ప్రయాణం ఇదీ?

క్రికెట్‌ చరిత్రలో భారత జట్టు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు టీమిండియా జెర్సీలో అనేక మార్పులు జరిగాయి. టీమిండియా జెర్సీలో నీలి రంగు ప్రధానంగా ఉంటుంది. మిగిలిన అంశాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. త్వరలో జరగబోయే  ప్రపంచకప్‌లో భారత్‌ జట్టు కొత్త జెర్సీలతో అడుగు పెడుతున్న విషయం తెలిసిందే. గత జెర్సీలో స్వల్ప మార్పులు చేసి కొత్తదాన్ని రూపొందించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత క్రికెట్‌ జెర్సీ ప్రయాణం గురించి చూద్దాం!

1975లో మొదటిసారిగా ప్రపంచకప్‌లో భారత్‌ అడుగుపెట్టింది. అయితే ప్రతి ప్రపంచకప్‌ సిరీస్‌కు జెర్సీ మార్చే విధానం 1992లో మొదలైంది. అంతకుముందు అంటే... 1975 నుంచి 1987 వరకు జట్లన్నీ తెలుపు జెర్సీలతోనే ప్రపంచ కప్‌లో ఆడిన విషయం తెలిసిందే. 

1985


 

ఈ సమయంలో భారత జట్టుకి ఎవరూ స్పాన్సర్స్‌ లేరు. అప్పటి  జెర్సీలు కేవలం పసుపు రంగు కాలర్‌, మిగిలిన భాగం నీలి రంగుతో ఉండేవి. జెర్సీలపై జట్టు పేరు, స్పాన్సర్స్‌, బ్రాండ్‌, ఆటగాళ్ల పేర్లు కూడా ఉండేవి కావు.
 


1992


 

పన్నెండేళ్ల వరకు అంటే 1980 నుంచి 1992 వరకు జెర్సీలో పెద్దగా మార్పులు జరగలేదు. 1992 ప్రపంచకప్‌కు ముదురు నీలి రంగులోకి జెర్సీని మార్చారు. టీషర్ట్‌ ముందు భాగంలో ‘ఇండియా’, వెనక భాగంలో ఆటగాళ్ల పేర్లతో డిజైన్‌ చేశారు. ప్రపంచకప్‌నకు వెళ్లే ముందు జెర్సీలు మార్చే ట్రెండ్‌ మొదలైంది ఇక్కడనుంచే.
 


1993


 

ఈ ఏడాది నుంచి భారత జట్టు జెర్సీని ముదురు నీలి రంగు నుంచి పసుపు రంగులోకి మార్చారు. టీషర్ట్‌ కుడివైపు విల్స్‌ అని రాసి ఉండి, మధ్య భాగంలో నీలి రంగు షేడ్‌ల మధ్య ‘ఇండియా’ అని రాసి ఉండేది. ట్రాక్‌ ప్యాంట్స్‌ మాత్రం లేత నీలం రంగులో ఉండేవి. అప్పుడు విల్స్‌ సంస్థ స్పాన్సర్‌గా ఉండేది.
 


1994


 

ఏడాది తరువాత జెర్సీలో స్వల్ప మార్పులు చేశారు. జెర్సీలో పసుపు రంగు తీవ్రత తగ్గి నీలి రంగు పెరిగింది. ఈసారి పసుపు రంగు షేడ్‌లో ‘ఇండియా’ అని నీలి అక్షరాలతో డిజైన్‌ మార్చారు.
 


1996 


 

ప్రపంచకప్‌-1996కు వెళ్లే ముందు టీమిండియా జెర్సీలో మరోసారి స్వల్ప మార్పులు జరిగాయి. 1994లో తీసుకొచ్చిన జెర్సీని అదే తరహాలో ఉంచుతూ ఛాతి భాగంలో పసుపు రంగు షేడ్‌నిచ్చింది. 
 


1997


 

బీసీసీఐ 1997 సంవత్సరం నుంచి ఆర్థికంగా బలోపేతమైంది. బీసీసీఐ లోగోని జెర్సీ మధ్య భాగంలో పెద్దదిగా చేస్తూ కొత్త డిజైన్‌ చేసింది. 
 


1998


 

ఒకే ఏడాది మూడు సార్లు జెర్సీ డిజైన్‌ను బీసీసీఐ మార్చింది. మొదటగా జెర్సీ మొత్తాన్ని నీలి రంగులోకి మార్చి ‘ఇండియా’ పేరుని మాత్రం పసుపు అక్షరాలతో ఉంచారు. టీషర్ట్‌ని నీటి మచ్చలతో కొత్తగా డిజైన్‌ చేశారు. బీసీసీఐ లోగోని చిన్నగా చేసి జెర్సీ కుడివైపునకు మార్చారు.  
 


 

రెండోసారి జెర్సీని మారుస్తూ.. టీషర్ట్‌ భుజాల భాగంలో రెక్కల తరహాలో  త్రివర్ణాలతో రూపొందించారు. 
 


 

మూడో సారి.. జెర్సీ మొత్తం ముదురు నీలి రంగులోకి మార్చి లేత నీలి రంగుతో ‘ఇండియా’ అని రాసి డిజైన్‌ చేశారు. 
 


1999


 

పసుపు రంగు మళ్లీ జెర్సీలోకి చేరింది. ఈ సారి కాలర్‌తో పాటు చేతులకి, టీషర్ట్‌ మధ్య భాగంలో పసుపు రంగు షేడ్‌తో డిజైన్‌ చేశారు. ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచకప్‌ జరిగే సందర్భంగా కొత్త జెర్సీని తీసుకొచ్చారు. 
 


2000


 

ముదురు నీలం రంగుతో కాలర్‌ను మళ్లీ మార్చారు. జెర్సీ మధ్య భాగంలో కూడా ముదురు నీలం రంగుతో ఉంచి, మిగిలిన భాగమంతా లేత నీలం రంగుతో  డిజైన్‌ చేశారు.  
 


2001


 

ముందు భాగంలో స్పాన్సర్స్‌ పేరు లేకుండా ఇదే చివరి జెర్సీ. గతంతో పోలిస్తే స్వల్ప మార్పులు చేశారు. ముదురు నీలి రంగుతో కుడివైపున నిలువుగా ‘ఇండియా’ అని  డిజైన్‌ చేశారు. సహారా స్పాన్సర్‌ చేయకముందు జెర్సీని మరికొన్ని మార్పులు చేశారు. పసుపు రంగుతో కుడి భుజం నుంచి ఛాతి వరకు డిజైన్‌ చేశారు. జెర్సీని లేత నీలి రంగులోకి మార్చారు.  సహారా అధికారికంగా స్పాన్సర్స్‌ చేశాక, పసుపు రంగుతో ‘ఇండియా’ అని మార్చారు. టీషర్ట్‌ ముందు భాగంలో పసుపు రంగు గీతలతో డిజైన్‌ చేశారు.
 


2002


 

సహారా, ఇండియా పేరు జెర్సీ ముందు భాగంలో ఉంచి, జాతీయ జెండాలోని త్రివర్ణాలతో జెర్సీ మధ్యలో డిజైన్‌ చేశారు. దీనిపై అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ జెర్సీని టీమిండియా ఎక్కువ కాలం ఉపయోగించింది. 2002లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీకి మాత్రం వేరే జెర్సీని డిజైన్‌ చేశారు. దీనిపై స్పాన్సర్స్‌ పేరు, త్రివర్ణాలు లేకుండా ‘ఇండియా’ అని పసుపు రంగుతో మార్చారు.
 


2003 


 

ఈ ప్రపంచకప్‌కు భారత్‌ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. 2002లోని జెర్సీకి భుజాల వద్ద నల్లని రంగుతో స్వల్ప మార్పులు చేసింది.  ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ వరకు చేరుకుంది. తుది పోరులో ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా
గుర్తుంచుకున్న జెర్సీ ఇదే. 

 


2007 


 

ప్రపంచకప్‌ కోసం కొత్త జెర్సీని తీసుకువచ్చారు. నీలి రంగును మరింత లేతగా మారుస్తూ, త్రివర్ణాలని జెర్సీ కుడివైపున నిటారుగా డిజైన్‌ చేశారు. భారత అభిమానులకి 2007 మరవలేనిది. ఆ ఏడాది వరల్డ్‌ కప్‌లో గ్రూప్‌దశలో వచ్చేసినా.. తొలి టీ20 ప్రపంచకప్‌ని ధోనీ సారథ్యంలో టీమిండియా సొంతం చేసుకుంది. 
 


2009- 10


 

జెర్సీ డిజైన్‌లో మార్పులు లేకుండా రంగు షేడ్‌ని మాత్రం మార్చారు. లేత నీలిరంగు షేడ్‌ నుంచి ముదురు నీలిరంగులోకి మార్చారు. ఇదే తరహా రంగుని 1992లో ఉపయోగించింది. 
 


2011 ప్రపంచకప్‌ 


 

గతంలో ఉన్న ముదురు నీలిరంగు షేడ్‌ని లేత నీలిరంగులోకి మార్చారు. త్రివర్ణాలని జెర్సీకి ఇరువైపులా డిజైన్‌ చేశారు. ట్రాక్‌ ప్యాంట్‌పై నారింజ రంగుని ఉపయోగించారు. ఈ జెర్సీ అందరి హృదయాల్లో నిలిచిపోయింది. 28 ఏళ్ల తరువాత భారత అభిమానులు కోరిక నెరవేరుతూ ప్రపంచకప్‌ను భారత్‌ రెండోసారి సొంతం చేసుకుంది.
 


2013


 

ప్రపంచకప్‌లో వాడిన జెర్సీకి కాలర్‌ దగ్గర నారింజ రంగుతో ఇరువైపులా డిజైన్‌ చేశారు. ఇంగ్లాండ్‌లో టీమిండియా స్వెటర్‌ ధరించడం వల్ల జెర్సీ డిజైన్‌ ప్రేక్షకులకి ఎక్కువగా కనిపించలేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి భారత్‌ విజేతగా నిలిచింది. 
 


2015 


 

స్పాన్సర్స్‌ మారడంతో జెర్సీలో స్వల్ప మార్పులు చేశారు. స్పాన్సర్స్‌ ‘స్టార్‌’ తెలుపు రంగులో ‘ఇండియా’ నారింజ రంగుతో జెర్సీ మధ్యలోకి మార్చారు. బీసీసీఐ లోగోపై మూడు నక్షత్రాలు ఉంచారు. ఇవి భారత్‌ సాధించిన మూడు ప్రపంచకప్‌లకు ప్రతీక (రెండు వన్డే, ఒక టీ20). 2015 ప్రపంచకప్‌కు స్పాన్సర్స్‌ పేరు లేకుండా భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగింది. సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో ఓడింది. 
 


2016


 

టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా జెర్సీలో కొద్ది మార్పులు చేశారు. జెర్సీలో కుడి వైపున నారింజ రంగుతో డిజైన్‌ చేశారు. సెమీస్‌లో వెస్టిండీస్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. టీ20ల్లో ఇప్పటికీ ఇదే జెర్సీని టీమిండియా వాడుతోంది.
 


2017 


 

స్పాన్సర్‌గా ఒప్పో వచ్చిన తర్వాత జెర్సీలో స్వల్ప మార్పులు చేశారు. జెర్సీ మధ్యలో లేత నీలిరంగుతో, భుజాలు, కాలర్‌ వద్ద ముదురు నీలిరంగుతో షేడ్‌ని మార్చారు. 2017లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో స్పాన్సర్స్‌ పేరుని తొలగించి అదే జెర్సీతో పాల్గొన్నారు. ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడింది. 
 


2019 


 

నీలి రంగులోనే జెర్సీ డిజైన్‌ స్వల్ప మార్పులు చేశారు. గతంలో ఒక నీలి రంగు షేడ్‌ మాత్రమే ఉంటే ఈసారి రెండు షేడ్స్‌ ఉపయోగించారు. కాలర్‌ లోపలి కింద భాగంలో జాతీయ జెండాలోని త్రివర్ణాలని టేప్‌ రూపంలో కొత్తగా చేర్చారు. కాలర్‌ వెనుక నారింజ రంగు ఉంచారు. ఇది జట్టులో చేరిన యువ ఆటగాళ్ల ఉత్సాహం, శక్తికి ప్రతీక. టీషర్ట్‌లోని ఛాతి భాగంలో కొత్తగా స్నాప్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. అడుగున చెమట ఎక్కువగా పట్టనీయకుండా ఇంజినీరింగ్‌ మెష్‌ను వినియోగించారు.
 

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.