close

తాజా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సీక్వెల్‌ తీస్తారా?

అదే నా చివరి సినిమా అవ్వొచ్చు.
దాని గురించి అస్సలు భయం లేదు!

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను చూసిన తర్వాత అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ ప్రేక్షకులకు ఎంత నచ్చుతాడో.. కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్‌ కూడా అంతే స్థాయిలో నచ్చుతాడని రాజమౌళి అన్నారు. వారి పాత్రలను బట్టి సన్నివేశాలు ఉంటాయి తప్ప.. ఒకరికి ఎక్కువ.. ఒకరికి తక్కువ ఉండవని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియాభట్, డైసీ, అజయ్‌దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సంబంధించిన విశేషాలను ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, నిర్మాత దానయ్యలతో కలిసి రాజమౌళి విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానం ఇచ్చింది. 
కొమురం భీం, అల్లూరి సీతారామరాజులు బ్రహ్మచారులు కదా! ఇందులో ఇద్దరు కథనాయికలను పెట్టారు?
రాజమౌళి: చరిత్ర చూసుకుంటే కొమురం భీంకు ఇద్దరు భార్యలు. అల్లూరికి  చిన్నప్పటి నుంచి మరదలు సీతతో ప్రేమ ఉంది. కానీ, పెళ్లి జరగలేదు. నేను తెలిసిన కథ  చెప్పడంలేదు. తెలీని కథ చెబుతున్నాను
ఇది ఫిక్షనల్‌ స్టోరీనా? నిజమైన స్టోరీనా? 
రాజమౌళి: ఇది ఫిక్షనల్‌ కథ కానీ, రియల్‌ పాత్రలపై ఉంటుంది. ఇంతవరకూ ఈ కథను ఎవరూ చెప్పలేదు. 
ఆంధ్రా, తెలంగాణ, ఉత్తర భారతం అన్ని ప్రాంతాలను కలిపేసినట్లు ఉన్నారు?
రాజమౌళి: తెలంగాణ, ఆంధ్రా నుంచి వచ్చిన ఇద్దరు ఉద్యమ వీరుల స్నేహం కొత్తగా అనిపించింది. అందుకే అన్ని తెలుగు ప్రాంతాలను ఈ సినిమాతో కలిపి తీస్తున్నాను.

ఈ చిత్రం స్వాతంత్ర్యోద్యమానికి ముందు జరిగే కథతోనే ఉంటుందా? ప్రస్తుత జనరేషన్‌కు లింక్‌ ఉంటుందా?
రాజమౌళి: ఈ చిత్రం మొత్తం స్వాతంత్ర్యోద్యమానికి ముందే జరిగిన కథతో ఉంటుంది. ప్రస్తుతానికి ఎలాంటి సంబంధం ఉండదు.

మరో దర్శకుడు ఈ కథతో వస్తే చేసేవాళ్లా? 
ఎన్టీఆర్‌:
మరోదర్శకుడితో అయితే అది భవిష్యత్తు గురించి. రాజమౌళి కాబట్టి ఇది జరిగింది. భవిష్యత్తులో మరేదైనా కథతో మమ్మల్ని సంప్రదిస్తే, జరుగుతుందో లేదో చెప్పలేను కానీ. ఇది మాత్రం జక్కన్న వల్లే జరిగింది.  మరో విషయం ఏంటంటే.. ఇది నాకు జక్కన్నకు ఉన్న స్నేహంతో సాధ్యమైంది.
‘బాహుబలి’తో మీ పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు హీరోలతోనే చేయడానికి కారణం ఏంటి?
రాజమౌళి: ఇద్దరు తెలుగు వీరుల గురించి కథ చెబుతున్నప్పుడు తెలుగువారితోనే చేయాలి. ‘బాహుబలి’ పాన్‌ ఇండియా సినిమా. కాబట్టి కథను బలమైన ఎమోషన్స్‌తో చేస్తే యాక్టర్‌ ఎక్కడి నుంచి వచ్చారన్నది అంత ముఖ్యం కాదు.
చరణ్‌, తారక్‌ల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏదైనా గిఫ్ట్‌ ఆశించవచ్చా?
రాజమౌళి: సినిమా విడుదల తేదీ జులై 30, 2020. చాలా సమయం ఉంది. ఇప్పుడే విడుదల చేయడం చాలా తొందర అవుతుంది.
‘బాహుబలి’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలన్న డైలామాలో ఎప్పుడైనా ఉన్నారా? ఈ కథనే ఎంచుకోవడానికి కారణం ఏంటి? స్వాతంత్ర్య కాలం నాటి కథతో వివాదాలు రావని అనుకుంటున్నారా? 
రాజమౌళి: ప్రతి సినిమాను నేను నా మొదటి సినిమా అనుకుని చేస్తా. పాత సినిమాల ప్రభావం ఉంటుంది. ప్రేక్షకులకు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటాను, కానీ, అది నా నిర్ణయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపదు. ఏ సినిమా తీసినా వివాదం సాధారణం. ‘బాహుబలి’కే వచ్చాయి. దాని గురించి భయమేమీ లేదు.

అల్లూరి సీతారామరాజు తీసినప్పుడు కూడా కృష్ణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
రాజమౌళి: మామూలుగా మన హీరోలనే సూపర్‌ హ్యూమన్‌ లెవల్లో నిలబెట్టి తీస్తా. మరి ఇద్దరు రియల్‌ హీరోలను ఏ స్థాయిలో నిలబెడతానో ఆలోచించుకోండి. అల్లూరి సీతారామరాజును కృష్ణ తీస్తున్నప్పుడు వివాదం వచ్చింది. కానీ తీయడం మానేసారా? అన్నమయ్య తీసినప్పుడు వివాదం వచ్చింది మానేయాలా? లేదు కదా.. వివాదాలు ఉంటాయని అద్భుతమైన స్టోరీని తీయడం మానకూడదు.

మల్టీస్టారర్‌ సినిమా విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను మీరు ఎలా అధిగమిస్తారు.
రాజమౌళి: ఇద్దరు టాప్‌ స్టార్‌డమ్‌ ఉన్న హీరోలను పక్కన పెట్టినప్పుడు ఫ్యాన్స్‌ గొడవ పడతారని చెప్పి అన్ని సన్నివేశాలను పంచుకుంటూ వెళ్తే అక్కడ కథ ఏమీ ఉండదు. ఆడియన్స్‌ థియేటర్‌కు వచ్చి తెరపై తారక్‌, చరణ్‌లను పది నిమిషాలు చూసిన వారిని మర్చిపోయి వారి పాత్రలను గుర్తుంచుకునే స్క్రీన్‌ప్లే మన దగ్గర ఉందని నమ్మిన తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాం. అదే సమయంలో బ్యాలెన్స్‌ ఉండాలి. అది ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉండాలి. సినిమా అయిపోయిన తర్వాత కొమురం భీం పాత్రలో తారక్‌ ఎంత నచ్చుతాడో.. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ కూడా అంతే నచ్చుతాడు. 
ప్రతినాయకులుగా ఎవరు ఉంటారు?
రాజమౌళి: ఇందులో అలియా భట్‌, డైసీ, సముద్రఖని, అజయ్‌దేవగణ్‌ ఇలా చాలా పాత్రలు ఉంటాయి. కథ పూర్తయ్యే సరికి వీళ్లిద్దరే హీరోలు.. వీళ్లే విలన్లు.. అన్ని పాత్రలు ఈ ఇద్దరి పాత్రలను సపోర్ట్‌ చేస్తాయి. 
1920లో జరిగిన కథ అని అన్నారు కదా! సరిగ్గా వందేళ్ల తర్వాత ఆ కథతో సినిమా విడుదల కావడం ఎలా అనిపిస్తోంది?
రాజమౌళి: మీరు చెప్పేవరకూ ఆ ఆలోచన లేదు(నవ్వులు) కథ 1921-22 ప్రాంతంలో జరిగింది. కానీ విడుదల మాత్రం 2020లోనే ఉంటుంది. అది మాత్రం గ్యారెంటీ

తెలియని చరిత్ర చెబుతున్నామన్నారు. ఏదైనా పరిశోధన జరగుతోందా?
రాజమౌళి: సినిమా ప్రారంభానికి ముందే వాళ్లిద్దరి గురించి అందుబాటులో ఉన్న సమాచారం వరకూ పూర్తిగా చదివాం. ధ్రువీకరిస్తూ రాసిన వాటిల్లో చాలా తక్కువ సమాచారం మాత్రమే దొరికింది. అలా లేకపోవడం నేను స్వేచ్ఛ తీసుకున్నట్లు అయింది. సినిమాలోని అన్ని పాత్రలు చాలా విభిన్నంగా ఉంటాయి. 
మొత్తం బడ్జెట్‌ ఎంత?
దానయ్య:
రూ.350, రూ.400 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తున్నాం.
మీ ప్రతి సినిమాలో ఏదో ఒక సన్నివేశం ‘ఇలా కాపీ చేశారు’ అని ట్రెండ్‌ అవుతూ ఉంటాయి. మరి సినిమాతో ఆ ప్రచారానికి చెక్‌ పెడతారా?
రాజమౌళి: రాకపోతే ఆశ్చర్యపోవాలి. ఎక్కడో వెతికి దీనికి ముడిపెడతారు. ఇదంతా చిత్రీకరణలో భాగం. నేను వాటిని అస్సలు పట్టించుకోను
తెలుగు ప్రాంతానికి చెందిన ఇద్దరు పోరాట యోధుల కథ ఇది! ఇతర ప్రాంతాల వారికి ఇది నచ్చుతుంది అని మీరు అనుకుంటున్నారా?
రాజమౌళి: వారి గురించి తెలీకపోతే ఇప్పుడు తెలుసుకుంటారని ఆశ. అందరికీ వారి గురించి తెలియాలి. గొప్ప వీరులు కాబట్టి గూగుల్‌ చేస్తే నేను చాలా సంతోషంగా ఫీలవుతాను. మరో విషయం ఏంటంటే.. కథలో ఉన్న పాత్రల బలంపై సినిమా ఉంటుంది కానీ వారు ఎంత గొప్పవారు అని మాత్రం చెప్పడం లేదు. 
‘బాహుబలి’లో ఇద్దరు బలమైన మహిళా పాత్రలు ఉన్నాయి? మరి ఇందులో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు వాళ్ల పాత్రల గురించి?
రాజమౌళి: నేను సినిమా తీస్తే కథానాయికలు ప్రాధాన్యత ఉందా? లేదా? వంటివి పట్టించుకోను. కానీ, అవి ఆడియన్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది మాత్రమే చూస్తాను. ఆలియాకు ఇందులో మంచి పాత్ర లభించింది. ఆమె ద్వారానే సినిమా కీలక మలుపు తిరుగుతుంది.
సినిమాకు కన్‌క్లూజన్‌ ఇస్తారా? లేక సీక్వెల్‌ తీస్తారా?
రాజమౌళి: నా కథలో అల్లూరి, కొమరం భీం ఎలా పోరాడారు? అన్న విషయం ఆధారంగా ఉండదు. వారు పోరాడటానికి వెళ్లకముందు ఏం జరిగింది? అన్నది మాత్రమే మీరు చూడబోతున్నారు.
ఈ కాన్సెప్ట్‌ మీదా? నాన్నగారిదా?
రాజమౌళి: ఐడియా నాదే. చాలా ఏళ్ల క్రితం ‘మోటర్‌సైకిల్‌ డైరీ’ అనే సినిమా చూశాను. సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి సాగే ఈ సినిమాలో చివర్లో ఆయన ఎవరో కాదు చెగువెరా అని తెలుస్తుంది. అంత అద్భుతమైన కథ అది. ఆ సినిమా చూసే నాకు ఈ కాన్సెప్ట్‌ తట్టింది. మనం కూడా ఇలాంటి చేస్తే ఎలా ఉంటుంది? అనిపించింది.
2020 వరకు తారక్‌, చరణ్‌ డేట్స్‌ లాక్ చేశారు. ఇది ఎంత వరకు కరెక్ట్‌ అంటారు?
రాజమౌళి: అదేమన్నా తప్పా అండీ.. ఈ సినిమా చేయడానికి చాలా రోజులు పడుతుంది కాబట్టి మేం వర్కర్లకు మరింత పని కల్పిస్తున్నట్లు అవుతుంది.
చరణ్‌: ఈ మధ్యకాలంలో ఏ సినిమా చేసినా కూడా ఏడాదిలోగా పూర్తికావడంలేదు. రాజమౌళి సినిమాలను ఎంత ఆలస్యం చేసినా ఆయనతో కలిసి పనిచేసేవారికి ఒకేసారి పది సినిమాలు చేసినంత ఆనందం ఉంటుంది. లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి.

తారక్‌: మాకు డేట్స్‌ విషయంలో కంగారేం లేదు. ఇంకా చెప్పాలంటే జక్కన్నతో ఎన్ని రోజుల సినిమా తీస్తే అంత నేర్చుకుంటాం. దీనిని మేం హాలిడే అనుకుంటున్నాం.
‘మగధీర’ తర్వాత చరణ్‌ హిస్టారికల్‌ ఫాంటసీ నేపథ్యం ఉన్న సినిమా చేయలేదు. తారక్‌ కూడా ‘యమదొంగ’ తర్వాత అలాంటి సినిమా చేయలేదు..(ప్రశ్న పూర్తయ్యేలోపే తారక్‌ అందుకుని..)
తారక్‌: 
‘శక్తి’ సినిమా మర్చిపోయారా.. మీరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను.
మీ సినిమాల్లో ఏవన్నా కత్తిసాములు, గుర్రపుస్వారీలు ఉంటే ముందు మీరు నేర్చుకుంటారు. ఈ సినిమా కోసం మీరేం నేర్చుకున్నారు?
రాజమౌళి: అదంతా ఒకప్పుడండీ.. ఇప్పుడేమీ అవడంలేదు.
‘బాహుబలి’ అన్ని భాషల్లో విడుదలై రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మరి ‘ఆర్‌ ఆర్‌ ఆర్’ ఏ రేంజ్‌లో రాబడుతుంది అనుకుంటున్నారు?
రాజమౌళి: మన స్థాయి రూ.10వేల కోట్లు ఉంటుందండీ.. ఆశకు హద్దులేదు. ముందైతే ఎంత ఖర్చుపెట్టామో అంత వస్తే చాలన్న భయముంటుంది. ఇక కలెక్షన్లు మనం పెట్టిన బడ్జెట్‌కు, ఊహించిన దానికి మధ్య ఉంటుంది. అది సినిమా పూర్తయి విడుదలైతే కానీ ఓ అంచనాకు రాలేం.
ఈ సినిమా ద్వారా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపాలని మీరు చెప్పారు? ఎలాంటి ప్రభావమో తెలుసుకోవచ్చా?
తారక్‌:
ఆర్‌ ఆర్‌ ఆర్‌ ద్వారా తెలుగు వీరుల గురించి యావత్‌ భారతదేశానికి తెలుస్తుంది.
‘మహాభారతం’ తీస్తానన్నారు? ఎప్పుడు మొదలవుతుంది?
రాజమౌళి: మొదలుపెడతానని నేనెక్కడా చెప్పలేదు. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పా. జనాలేమో అది నా తర్వాతి చిత్రమనుకుంటున్నారు. అయితే, అదే నా చిట్ట చివరి చిత్రం కావొచ్చు. ‘బాహుబలి’కి సంబంధించిన వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ జరుగుతోంది.
ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్‌ ఎంత ప్రాధాన్యం ఉంది?
రాజమౌళి: ఇందులోనూ వీఎఫ్‌ఎక్స్‌కు ప్రాధాన్యం ఉంది.అది అవసరమైన స్థాయిలోనే ఉంటుంది. అందుకే సినిమా విడుదలకు ఆర్నెల్ల ముందే సినిమాను వీఎఫ్‌ఎక్స్‌ పనులకు కేటాయిస్తాం. 
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విషయంలో ఒత్తిడి ఉందా?
రాజమౌళి:
అస్సలు లేదు. అది నాబలంగానే ఫీలవుతా! ఇంతమంది నా సినిమా కోసం ఎదురు చూస్తున్నారా? అని బలంగా భావిస్తా.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.