close

తాజా వార్తలు

అది చెప్పేంత స్థాయి నాకు లేదు

మెగాఫ్యామిలీ హీరో.. అయినా.. ఎంట్రీ కోసం ఐదేళ్లు ఎదురుచూశాడు.. ‘నేను నిజంగా దురదృష్టవంతుడినా?’ అని భయపడ్డాడు.. ‘వీడేం పట్టుకున్నా మసే’ అనే మాటలనూ ఓర్చుకున్నాడు... అవమానాలకు జవాబుగా.. భయాన్ని జయించి.. నిరాశను ఓడించి.. ‘విన్నర్‌’గా నిలిచాడు. ‘సుప్రీమ్‌’ హీరో అనిపించుకున్నాడు.. ‘చిత్రలహరి’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయిధరమ్‌ తేజ్‌ తన కథని, తపననీ, ఇష్టాల్నీ ఇలా పంచుకున్నాడు.

*బుల్లితెర జ్ఞాపకం ‘చిత్రలహరి’ పేరుతో వెండితెరపైకి వస్తున్నారు. చిన్నప్పుడు ‘చిత్రలహరి’తో మీకున్న అనుబంధం ఎలాంటిది?
నా బాల్యమంతా చెన్నైలో గడిచింది. కింద పోర్షన్‌లో మేము, పైపోర్షన్‌లో మా తాతయ్య ఉండేవారు. తాతయ్య వాళ్లింట్లో టీవీ ఉండేది. శుక్రవారం స్కూలు నుంచి రాగానే పైకి వెళ్లిపోయేవాడ్ని. ‘తాతా.. టీవీ..’ అంటూ ఆయన చుట్టూ తిరిగేవాడ్ని. ‘చిత్రలహరి’ సమయానికి మా స్నేహితులంతా వచ్చేవారు. అందులో మావయ్య పాటలు ఏమైనా వస్తాయా అనే ఆశ మాది. ఎవరి పాట వచ్చినా ఆస్వాదించేవాళ్లం. మావయ్య పాటలకే కాదు.. అందరు హీరోల పాటలకూ డాన్సు చేసేవాడ్ని. మావయ్య కూడా ‘ఆ పాటకు డాన్స్‌ చేయ్‌’ అంటూ టేప్‌రికార్డర్‌ ఆన్‌ చేసేవారు.

* చిరంజీవిగారి హిట్‌ గీతాల్ని మీరు రీమిక్స్‌ చేశారు. వాటిలో బాగా చేశానని సంతృప్తి ఇచ్చినది, పాడుచేశానే అని అసంతృప్తికి గురి చేసినవి ఏమైనా ఉన్నాయా?
పాటల్ని ఎంచుకోవడంలో నా ఛాయిస్‌ ఏదీ ఉండదు. దర్శకులు ఏం చెబితే అది చేయడమే! ‘ఇక్కడ ఈ పాట పెట్టండి’ అని నేనెప్పుడూ అడగలేదు. ఇక బాగా చేశానా, లేదా? అనేది ప్రేక్షకులు చెప్పాలి. అది చెప్పేంత స్థాయి నాకు లేదు. ఎందుకంటే సినిమాతో పాటు ఎదగాలనుకునేవాడ్ని నేను. సినిమాకి మించి ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు.
* కాస్త బరువు తగ్గినట్టున్నారు..
కొంచెం తగ్గా.. ఇంకొంచెం తగ్గాలి. రెండేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నా బరువు తగ్గాలని! కానీ గాయాల వల్ల కుదర్లేదు. రెండు రోజులు జిమ్‌కి వెళ్తే.. మూడో రోజు ఫిజియో దగ్గరకు పరుగులు తీయాల్సి వచ్చేది.

* గాయాలా..! అంతలా ఎప్పుడు తగిలాయండి?
‘విన్నర్‌’ సమయంలో.. ఆ సినిమా కోసం హార్స్‌రైడింగ్‌ నేర్చుకోవాల్సి వచ్చింది. అప్పుడే గాయాలయ్యాయి! పెద్దగా పట్టించుకోలేదు. ఆ నొప్పులతోనే ‘జవాన్‌’లో పరుగులు పెట్టేశాను. దాంతో గాయాలు మరింత పెద్దవయ్యాయి. వరుస సినిమాలతో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులే ఎదుయ్యాయి. ఓ దశలో అయితే కాలు కూడా కదపలేకపోయా! నొప్పిని భరిస్తూ.. పెయిన్‌కిల్లర్స్‌ తీసుకుంటూ డాన్సులు చేశా. అమ్మ దగ్గర నా ఇబ్బంది బయటపడకుండా ఆస్కార్‌ లెవల్లో నటించేవాడ్ని. అయినా కనిపెట్టేసేది. ‘ఏంట్రా అలా నడుస్తున్నావ్‌?’ అని అడిగితే.. ఏవో కబుర్లు చెప్పేవాడ్ని. ఇక లాభం లేదనుకొని చికిత్స కోసం అమెరికా కూడా వెళ్లా. దాంతో లైపో చేయించుకోవడానికి వెళ్లాడని చాలామంది అనుకున్నారు. హెయిర్‌ ట్రీట్‌మెంట్‌ కోసం వెళ్లాడనే వార్తలూ వచ్చాయి. కానీ, నేను ఆర్థో ఫిజీషియన్‌ కోసం అమెరికా వెళ్లా!

* చిన్నప్పుడు హార్స్‌రైడింగ్‌ నేర్చుకున్నారు కదా.. అయినా ఎందుకిలా..?
చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్నా. ‘విన్నర్‌’కి ముందు మళ్లీ ట్రైనింగ్‌ తీసుకున్నా. గుర్రపుస్వారీలో మనం ఎంత నేర్పరులమైనా.. అప్పుడప్పుడూ గుర్రాలు మన మాట వినవు. బ్యాక్‌కిక్‌తో పడేస్తుంటాయి. కొన్నిసార్లు మనం బ్యాలెన్స్‌ తప్పుతాం. అప్పుడప్పుడూ కొత్త గుర్రాలొస్తాయి. వాటిని మచ్చిక చేసుకునేలోపు దెబ్బలు తప్పవు.

* ఇంతకీ హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?
చిన్నప్పుడు చదువు.. ఆటలు.. ఇదే ప్రపంచం. కాస్త పెద్దయ్యాక సైంటిస్ట్‌ అవ్వాలనుకున్నా. నైన్‌ టు ఫైవ్‌ ఉద్యోగం నా వల్ల అవుతుందా అన్న డౌట్‌ వచ్చింది. ఆ ప్రయత్నమూ చేశా.. ఈ ఉద్యోగాలు నాకు సరిపడవని అర్థమైంది. అప్పుడు సినిమాలోకి రావాలనిపించింది.

* ఒక ఫ్యామిలీ నుంచి ఎందరు హీరోలు వచ్చినా చూడాల్సిందేనా.. వంటి మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది?
ఫ్యామిలీతో మొదటి సినిమా అవకాశం వస్తుందేమో! ఆ తర్వాత పరిస్థితేంటి? ప్రతిభ లేకపోతే.. ఎవ్వరూ అవకాశాలు ఇవ్వరు. ఒకరకంగా బ్యాక్‌గ్రౌండ్‌ బ్యాగేజీ లాంటిది. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్లు పెద్దగా కష్టపడనవసరం లేదని చెప్పను కానీ, వాళ్లపై ఇంత ఒత్తిడి ఉండదు. వాళ్లేమిటో నిరూపించుకున్న తర్వాత అంచనాలు పెరుగుతాయి. మేం మొదటి సినిమా నుంచే ఆ భారాన్ని మోయాల్సి వస్తుంది.

* మీరూ ఆ ఒత్తిడిని ఫీలయ్యారా?
నా కెరీర్‌ మొదలైంది 2010లో! కానీ తొలిసినిమా విడుదల కావడానికి ఏకంగా ఐదేళ్లు పట్టింది. ‘రేయ్‌’ ఆగిపోయింది. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ 80 శాతం పూర్తయ్యాక శ్రీహరి గారు చనిపోయారు. ఆ సినిమా కూడా ఆగిపోయింది. ‘ఇదేంట్రా ఏం పట్టుకున్నా మసైపోతోంది’ అనిపించింది. పరిశ్రమలో అత్యంత దురదృష్టవంతుడినేమో అనుకున్నా. సినిమాల్లో నుంచి బయటకు పోలేను. అలాగని అందులోనే ఉండలేను. ఇదేమిట్రా ఇరుక్కుపోయానని బాధపడ్డా. కష్టాలన్నీ తొలిదశలోనే అనుభవించాను. ఇవన్నీ నా ప్రయాణానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ విడుదలకు ఒకరోజు ముందు ప్రీమియర్‌ షో వేశారు. చిరంజీవిగారు చూసి.. ‘కంగ్రాట్స్‌ రా!.. నీ సినిమా విడుదల అవుతోంది’ అన్నారు. అదే మామయ్య ఇచ్చిన కాంప్లిమెంట్‌గా భావించాను.

* కెరీర్‌ మొదట్లో హిట్లు కొట్టారు. తరువాత వరుసగా పరాజయాలు పలకరించాయి..?
కథ బాగుందనే సినిమా మొదలుపెడతాం. కానీ, ఆ కథని తెరపైకి తీసుకొచ్చే విషయంలో ఓడిపోతున్నాం. అందుకే పరాజయాలు వచ్చాయి. వాటికి పూర్తి బాధ్యత నాదే! ఆ సినిమాలకు నేనే ‘నో’ చెప్పి ఉంటే ఆగిపోయి ఉండేవి కదా.

* మంచి సినిమా ఆడలేదన్న అసంతృప్తి ఏమైనా ఉందా?
మంచి సినిమా చేస్తే ఆడేది కదా. చేయలేదు కాబట్టే ఆడలేదు. ప్రేక్షకులు, విమర్శకుల జడ్జిమెంట్‌ ఎప్పుడూ తప్పు కాదు. వాళ్ల తీర్పుపై నాకు నమ్మకం ఉంది.

* సినిమాలు సినిమా ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో చూడాలన్న పట్టుదల ఉండేదా?
పెద్ద మావయ్య సినిమా అంటే హుషారు వచ్చేది. చెన్నైలో ఉండేవాళ్లం కదా.. రజనీకాంత్‌గారి సినిమాలెక్కువగా చూసేవాళ్లం. అయితే వచ్చిన ప్రతి సినిమా చూసేయాలని ఉండేది కాదు. సెలక్టివ్‌గా వెళ్లేవాళ్లం. ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమా వచ్చినప్పుడు.. ఇంట్లో గొడవ పెట్టుకొని వెళ్లా. ‘టైటానిక్‌’ సినిమాకు వెళ్తానంటే.. ‘అది చిన్నపిల్లలు చూసే సినిమా కాదు.. వెళ్లొద్దు’ అంది అమ్మ. మా ఫ్రెండ్సంతా చూశారంటే.. ‘అదంతే నువ్వు చూడకూడద’ని వార్నింగ్‌ ఇచ్చింది. దాంతో ‘పెళ్లాయ్యాక నా భార్యతోనే ఆ సినిమా చూస్తా’ అని అమ్మ దగ్గర శపథం చేశా. అన్నట్టే ఇంతవరకూ చూడలేదు. టీవీలో వచ్చినా.. ఛానల్‌ మార్చేసేవాడ్ని.

* అయితే పెళ్లయ్యాక ఫస్ట్‌ ప్రోగ్రాం అదే అన్నమాట..?
(నవ్వుతూ) ఇప్పుడంత ఇంట్రెస్ట్‌ లేదు లెండి. టీవీ చూడాలన్న ఫీలింగ్‌ కూడా రాను రాను తగ్గిపోతోంది.  నెట్‌ఫిక్స్‌, అమేజాన్‌ వచ్చేశాయి కదా! టెక్నాలజీ పెరిగిపోయింది.. ఎప్పుడు ఏ ప్రోగ్రాం కావాలన్నా మొబైల్‌లో చూసుకోవచ్చు. ఇంకా టీవీ అనుకుంటూ కూర్చుంటే ఎలా.. ఇది వెబ్‌సిరీస్‌ల కాలం అయిపోతే!! మా అమ్మ జబర్దస్థ్‌ చూస్తుంటుంది.. నేనూ టైమ్‌పాస్‌కి చూస్తుంటా.

* ఐపీఎల్‌ వచ్చేసింది.. ఫాలో అవుతారా?
తప్పకుండా. చెన్నై, హైదరాబాద్‌ నా ఫెవరెట్‌ టీమ్స్‌. హైదరాబాద్‌లో ఉంటున్నా కాబట్టి.. ఆ టీమ్‌ గెలవాలని కోరుకుంటా. చెన్నైలో పుట్టి పెరిగాను కాబట్టి చెన్నై కూడా ఫెవరేట్‌. మిగిలిన మ్యాచ్‌లు పెద్దగా పట్టించుకోను.

 కోరికలన్నీ తీర్చుకుంటున్నా...

నాకు బైకులంటే పిచ్చి. ఎస్‌డీ, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, ఆర్‌ఎక్స్‌ 100 వంటివి ఇష్టం. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, ఆర్‌ ఎక్స్‌ 100 రెండూ కొన్నా. ఇక ఎస్‌ డీ కొనాలి. బైకులు ఇంటికి తీసుకొస్తే.. ‘ఎవరివిరా ఇవన్నీ’ అని అమ్మ అడుగుతుంటుంది. ‘నా ఫ్రెండ్స్‌వ’ని అబద్దం చెబుతా. ‘స్పోర్ట్స్‌ బైక్‌ కాకుండా.. పాతబళ్లు ఎందుకురా?’ అని ఫ్రెండ్స్‌ అడుగుతుంటారు. కానీ... ఇవన్నీ నా చిన్నప్పటి కోరికలు. అప్పట్లో హీరోలు ఈ బళ్లతోనే కదా.. ఫైటింగులు చేసేవాళ్లు. ‘అరె.. ఈ బండి ఎప్పటికైనా కొనాలి’ అనుకునేవాడ్ని. ఆ కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకుంటున్నా. కార్లన్నా ఇష్టమే! అవి కొనేంత ఆర్థిక స్తోమత నాకు లేదు.

బరిలో మామయ్య.. అందుకే వదులుకున్నా..

‘శతమానం భవతి’ నా దగ్గరకే వచ్చింది. అయితే ఆ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్‌. అదే సమయంలో మామయ్య రీఎంట్రీ సినిమా ‘ఖైదీ నెం 150’ వస్తోంది. మామయ్య బరిలో ఉన్నప్పుడు నా సినిమా రిలీజవ్వడం సమంజసం కాదనిపించింది. అందుకే ‘శతమానం భవతి’ వదులుకున్నా.

అంతకు మించి  లేదు...

ఓ కథానాయికతో  ఏవేవో రూమర్లు పుట్టించారు. అలాంటి ప్రచారాల వల్ల ఆ అమ్మాయి కెరీర్‌ నాశనం అవుతుందని భయపడి.. సీరియస్‌గా తీసుకోవాల్సివచ్చింది. అప్పటి నుంచీ తనతో దూరంగానే ఉన్నా. మా మధ్య స్నేహం పాడవడం ఇష్టం లేదు. నా తొలి సినిమా హీరోయిన్‌ తను. ఆ గౌరవం  ఎప్పటికీ ఉంటుంది. నా తొలి దర్శకుడు,  నిర్మాత ఎంత స్పెషలో.. తనూ అంతే స్పెషల్‌. అందుకే కాస్త చనువుగా ఉండేవాడ్ని. అంతకు మించి ఏం లేదు.

అమ్మ అలా ఫిక్సయింది...

సంబంధాలు వస్తున్నాయి. కానీ, అమ్మ పెళ్లి గురించి ప్రస్తావించినప్పుడల్లా నేను మాట మార్చేస్తుంటా. పెళ్లి విషయంలో ‘నా మాట వినడు’ అని అమ్మ ఫిక్సయిపోయింది. ఆ బాధ్యత నా మీదే వేసింది. ప్రస్తుతం పెళ్లి, భార్యగా ఎలాంటి అమ్మాయి రావాలి.. ఈ విషయలేం ఆలోచించడం లేదు. నా దృష్టంతా సినిమాలపైనే!

సెంచరీ కొట్టా!

క్రికెట్‌ చూడడం కంటే ఆడడం బాగా ఇష్టం. సీసీఎల్‌ పుణ్యమా అని ఇంటర్నేషనల్‌ స్టేడియాలలో ఆడే అవకాశం దక్కింది. అంతకు ముందు స్కూల్‌ లెవల్లో చాలా మ్యాచ్‌లు ఆడాను. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ని. అప్పుడప్పుడూ లెగ్‌ స్పిన్‌ వేసేవాడ్ని. మిడిల్‌ ఆర్డర్‌ కాబట్టి ఎప్పుడోగానీ బ్యాటింగ్‌ అవకాశం వచ్చేది కాదు. వచ్చామా? బాదామా? పోయామా? అన్నట్టే ఉండేది. అయితే హైదరాబాద్‌ తరఫున ఆడుతూ ఓసారి సెంచరీ కొట్టా. సచిన్‌ నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ ప్లేయర్‌. ఇప్పుడు ధోనీ అంటే చాలా ఇష్టం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.