close

తాజా వార్తలు

ఆ ఉద్దేశంతో మాత్రం సినిమాల్లోకి రాలేదు!

హైదరాబాద్‌: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనదైన నటన, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నటి నిహారిక. ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’ చిత్రాల్లో నటించిన ఆమెకు సరైన విజయం దక్కలేదనే చెప్పాలి. అయితే ‘సూర్యకాంతం’ ఆ లోటును తప్పకుండా తీరుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. తను కథానాయికగా నటించిన చిత్రమిది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది.
ఈ పాత్ర కాస్త భిన్నం
‘‘సూర్యకాంతం’ అనగానే గయ్యాళితనమే గుర్తొస్తుంది. ఈ సూర్యకాంతం స్వభావస్వరూపాలు కొంత భిన్నం. ఎవరి విషయంలోనూ తలదూర్చదు. కానీ తన జోలికి వస్తే మాత్రం ఊరుకోదు. నచ్చిన వాళ్లతో ఎంత బాగుంటుందో, నచ్చని వాళ్లని అంత పీడించేస్తుంటుంది. అయితే తాను ఏం చేసినా.. ఎదుటివాళ్లకు తప్పుగా అనిపించదు. అదే ఈ పాత్రలో ప్రత్యేకత’’
ముక్కోణపు ప్రేమ కథ కాదు
‘‘ఈ సినిమా కథ విషయానికొస్తే.. సూర్యకాంతం అనేది ఓ సమస్య. అభి పరిష్కారం. అసలు ఆ సమస్య ఎవరి వల్ల వచ్చింది? పరిష్కారం ఎలా దొరికింది? అనేది తెరపై చూడాలి. అయితే ఇది ముక్కోణపు ప్రేమ కథ కాదు’’
ఆ ఆలోచన దర్శకుడిదే!
‘‘ఈ సినిమాకి సూర్యకాంతం అనే పేరు పెట్టాలన్నది దర్శకుడి ఆలోచనే. మా నాన్నగారు కూడా అప్పుడప్పుడూ నన్ను సూర్యకాంతం అనే పిలుస్తారు. అయితే అది కోపంతో కాదు. ప్రేమతోనే. సుహాసిని లాంటి అనుభవజ్ఞురాలితో నటించడం వల్ల చాలా నేర్చుకున్నా. సంభాషణలు వాడుక  భాషలోనే వినిపిస్తాయి. డబ్బింగ్‌ చెప్పేప్పుడు ఆ మాటల్ని బాగా ఆస్వాదించా’’.
ఇది మంచి సమయమే!
‘‘గత చిత్రాలు ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్‌’ రెండూ మంచి కథలే. కానీ ఫలితాలే నిరాశ పరిచాయి. విడుదల తేదీ, తదితర కారణాల వల్ల ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ‘సూర్యకాంతం’ మాత్రం మంచి సమయంలో విడుదల చేస్తున్నాం. వేసవి సెలవలు వచ్చాయి కదా? ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తారన్న నమ్మకం ఉంది’’.

‘సైరా’లో రెండు సన్నివేశాలే!
‘‘పెదనాన్న చిరంజీవిగారి సినిమాలో ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించినా చాలు నా జన్మ ధన్యమైనట్టే అనుకునేదాన్ని. ‘సైరా నరసింహారెడ్డి’ వల్ల ఆ అదృష్టం దక్కింది. ఇందులో కేవలం రెండు సన్నివేశాల్లో కనిపిస్తా. పెదనాన్నతో పాటు నటించా. ఓ సన్నివేశంలోని నటనకి గుర్తింపు రావడం ఖాయం’’
ఆ ఉద్దేశంతో మాత్రం సినిమాల్లోకి రాలేదు!
‘‘ఏళ్లతరబడి నాయికగా నిలవాలనే ఉద్దేశంతో సినిమాల్లోకి రాలేదు. ఉన్న కొద్దికాలమైనా విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల గుర్తింపు పొందాలనే వచ్చా. ఈ మధ్యకాలంలో డిజిటల్‌ రంగానికి బాగా గుర్తింపు వస్తోంది. అందుకే మరో వెబ్‌ సిరీస్‌కి శ్రీకారం చుట్టబోతున్నా. ఓ ఆరేళ్ల తర్వాత డిజిటల్‌ రంగం మరింత బలోపేతం అవుతుందన్న నమ్మకం ఉంది’’.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.