close

తాజా వార్తలు

రివ్యూ: మ‌జిలీ

న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, స‌మంత‌, దివ్యాన్ష కౌశిక్‌, రావు ర‌మేశ్‌, సుబ్బరాజు, పోసాని కృష్ణముర‌ళి త‌దిత‌రులు
క‌ళ‌: సాహి సురేశ్‌ 
పోరాటాలు: వెంక‌ట్ 
కూర్పు:  ప్రవీణ్‌ పూడి
ఛాయాగ్రహ‌ణం: విష్ణు శ‌ర్మ
సంగీతం: గోపీసుంద‌ర్‌ 
నేప‌థ్య సంగీతం: త‌మ‌న్ 
నిర్మాత‌లు: సాహు గారపాటి, హ‌రీష్ పెద్ది
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: శివ నిర్వాణ.
సంస్థ‌: షైన్ స్క్రీన్స్‌
విడుద‌ల తేదీ‌: 5 ఏప్రిల్ 2019

విజ‌య‌వంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు నాగ‌చైత‌న్య, స‌మంత. వీళ్లు క‌లిసి న‌టించిన ప్రతి సినిమాలోనూ ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీనే హైలైట్‌‌గా నిలిచింది. ఇదివ‌ర‌కు ప్రేమ‌క‌థ‌ల్లోనే న‌టించిన చైతూ, స‌మంత... పెళ్లి త‌ర్వాత తొలిసారి క‌లిసి ‘మ‌జిలీ’ చేశారు. ఇది మాత్రం భార్యాభర్తల నేపథ్యంలో సాగే క‌థ‌. ‘నిన్ను కోరి’తో మెప్పించిన శివ నిర్వాణ ద‌ర్శక‌త్వం వహించారు. ప్రేమికులుగా చ‌క్కగా ఒదిగిపోయిన ఈ జోడీ భార్యాభ‌ర్తలుగా ఎలా న‌టించారు? ‘మ‌జిలీ’ ఎలా ఉంది? 
క‌థేంటంటే: ఎప్పటికైనా మంచి క్రికెట‌ర్‌గా ఎద‌గాల‌నేది పూర్ణ (నాగ‌చైత‌న్య‌) క‌ల‌. ఆ ప్రయత్నంలో ఉండ‌గానే అన్షు (దివ్యాన్ష) అత‌ని జీవితంలోకి వ‌స్తుంది. ఇద్దరి మ‌ధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ అన్షు ఇంట్లోవారు వీరి పెళ్లికి ఒప్పుకోరు. ఆమెకి మ‌రో అబ్బాయితో పెళ్లి చేస్తారు. కొన్నాళ్ల త‌ర్వాత పూర్ణకి కూడా ఎదురింటి అమ్మాయి శ్రావ‌ణి (స‌మంత)తో పెళ్లి జ‌రుగుతుంది. పెళ్లైతే జ‌రుగుతుంది కానీ.. అన్షుని మాత్రం మ‌రిచిపోలేక‌పోతాడు పూర్ణ‌. దాంతో శ్రావ‌ణిని కూడా దూరం పెడతాడు. కానీ కొన్నేళ్లు గ‌డిచాక అన్షు వ‌ల్లే... పూర్ణ‌, శ్రావ‌ణి ఒక‌రికొక‌రు ద‌గ్గరవుతారు. అదెలా?వీరిద్దరి జీవితాల్లోకి వచ్చిన మీరా అనే పాప క‌థేమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: యువ‌త‌రం ద‌ర్శకులు స‌హ‌జ‌త్వాన్ని... నిజాయ‌తీతో కూడిన క‌థ‌ల్ని తెర‌పైకి తీసుకురావ‌డానికే ఇష్టప‌డుతుంటారు. క‌థానాయ‌కులు  కూడా ఇటీవ‌ల అలాంటి క‌థ‌ల‌పైనే మ‌క్కువ ప్రదర్శిస్తున్నారు. ‘మ‌జిలీ’ కూడా అలాంటి క‌థే. పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ఒక జంట జీవితంలోని మజిలీయే ఈ చిత్ర క‌థ‌. అందులో ప్రేమని, బాధ‌ని మేళ‌వించిన విధానం ఆక‌ట్టుకుంటుంది. తొలి స‌గ‌భాగం కుటుంబం, స్నేహం, ప్రేమ‌, జీవితంలో అనుకున్నది సాధించాల‌నే త‌ప‌న... త‌దిత‌ర అంశాల నేప‌థ్యంలో సాగుతుంది. ఇటు యువ‌త‌రాన్నే కాకుండా... కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు కూడా ఉంటాయి. ఆరంభ స‌న్నివేశాలన్నీ... క‌థా నేప‌థ్యాన్ని వివ‌రించేలా అనిపించినప్పటికీ, పూర్ణ జీవితంలోకి అన్షు వ‌చ్చిన‌ప్పట్నుంచి మ‌రింత ఆస‌క్తి ఏర్పడుతుంది. కార్పొరేట‌ర్ భూష‌ణ్ (సుబ్బరాజు) గ్యాంగ్ చేసే ప‌నులతో ఈ క‌థ మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. కానీ ద‌ర్శకుడు దీన్నొక హీరో - విల‌న్ క‌థ‌లా కాకుండా, అందుకు భిన్నంగా తీర్చిదిద్దడం మెప్పిస్తుంది. అప్పటిదాకా సాగిన క‌థ ఒకెత్తైతే, శ్రావ‌ణిగా స‌మంత ప‌రిచ‌య‌మ‌య్యాక సాగే క‌థ మ‌రో ఎత్తు.

ప్రథమార్ధాన్ని మించి ద్వితీయార్ధంలో భావోద్వేగాలు పండుతాయి. ఇందులో హాస్యాన్ని మేళ‌వించిన తీరు కూడా మెప్పిస్తుంది. అయితే తొలి స‌గ‌భాగంలో క‌థ ఎంత వాస్తవిక‌త‌తో సాగుతుందో, ద్వితీయార్ధంలో అంత నాట‌కీయ‌త కూడా క‌నిపిస్తుంది. మీరా పాత్ర ప్రవేశం, ఆ అమ్మాయి వ్యవ‌హ‌రించే తీరు కాస్త నాట‌కీయంగా అనిపించినా... ఆ పాత్ర స‌హాయంతోనే భార్యాభ‌ర్తల బంధాన్ని, ఆ నేప‌థ్యంలో భావోద్వేగాల్ని బ‌లంగా పండించాడు ద‌ర్శకుడు. ప‌తాక స‌న్నివేశాలు కూడా మెప్పిస్తాయి. పెళ్లికి ముందు, పెళ్లి త‌ర్వాత ప్రేమ గురించి చెప్పిన విధానం, ప్రేమంటే ఇవ్వడమే అన్న విష‌యాన్ని నాగ‌చైత‌న్యతో చెప్పించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. అక్కడక్కడా స‌న్నివేశాలు ఎంత‌కీ ముందుకు సాగ‌వ‌న్నట్టుగా అనిపించినా... అంతిమంగా మంచి అనుభూతుల్ని పంచుతుందీ చిత్రం.

ఎవ‌రెలా చేశారంటే: నాగ‌చైత‌న్య‌, స‌మంతల న‌ట‌నే ఈ చిత్రానికి ప్రధాన బ‌లం. ప్రేమ‌లోనూ, కెరీర్‌లోనూ పరాజితుడిగా మిగిలిన ఓ యువ‌కుడి పాత్రలో నాగ‌చైత‌న్య చక్కటి అభిన‌యం ప్రద‌ర్శించాడు. ఆయ‌న పాత్ర రెండు కోణాల్లో క‌నిపిస్తుంది. యువ‌కుడిగా, మ‌ధ్య వ‌య‌స్కుడిగా క‌నిపించేందుకు ఆయ‌న తీసుకున్న జాగ్రత్తలు మెప్పిస్తాయి. స‌మంత త‌న న‌ట‌న‌తో ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. కళ్లతోనే భావోద్వేగాలు పండించిందామె. నాగ‌చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య టీనేజ్ నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు కూడా చాలా బాగుంటాయి. దివ్యాన్ష కౌశిక్ త‌న పాత్ర ప‌రిధి మేర‌కు ప‌ర్వాలేద‌నిపిస్తారు.

నాగ‌చైత‌న్య తండ్రిగా రావు ర‌మేశ్‌, స‌మంత తండ్రిగా పోసాని కృష్ణముర‌ళి చక్కటి వినోదాన్ని పండించారు. సుహాస్, సుదర్శన్ క‌థానాయ‌కుడికి స్నేహితులుగా క‌నిపించారు. సుబ్బరాజు అంద‌రినీ క‌లుపుకొని పోవాలంటూనే విల‌నిజం చూపించే పాత్రలో క‌నిపిస్తాడు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. గోపీసుంద‌ర్ బాణీలు, త‌మ‌న్ నేప‌థ్య సంగీతం మెప్పిస్తాయి. విశాఖ‌ప‌ట్నం క‌థ‌లాగే.. స‌హ‌జ‌త్వం ఉట్టిప‌డేలా ఛాయాగ్రాహ‌కుడు విష్ణు శ‌ర్మ త‌న ప‌నితనాన్ని చూపించారు. ద‌ర్శకుడు శివ నిర్వాణ ర‌చ‌న ప‌రంగా, ద‌ర్శక‌త్వం ప‌రంగానూ త‌న ప‌ట్టుని స్పష్టంగా ప్రదర్శించారు. అటు హాస్యాన్ని పంచుతూనే.. భావోద్వేగాలు పండేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. 
బ‌లాలు
+ క‌థ 
+ నాగ‌చైత‌న్య - స‌మంత న‌ట‌న  
+ హాస్యం 
+ భావోద్వేగాలు

బ‌ల‌హీన‌త‌లు
- అక్కడక్కడా సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
- ద్వితీయార్ధంలో నాట‌కీయత 
చివ‌రిగా: భావోద్వేగాల ‘మ‌జిలీ’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే! 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.