
తాజా వార్తలు
మామయ్యలను ఉద్దేశిస్తూ బన్నీ ప్రకటన
హైదరాబాద్: కథానాయకుడు అల్లు అర్జున్ తన మామయ్యలు పవన్ కల్యాణ్, నాగబాబుకు మద్దతు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి, అదే పార్టీ తరఫున నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి కూడా పవన్ పోటీ చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వారికి మద్దతు తెలుపుతూ అల్లు అర్జున్ ప్రకటన విడుదల చేశారు. ‘మా ప్రోత్సాహం మీకెప్పుడూ ఉంటాయి’ అని పేర్కొన్నారు.
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్ని ఎంచుకున్న నాగబాబుకు శుభాకాంక్షలు. ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా. రానున్న ఎన్నికల ప్రచారంలో మేం మీతో లేకపోయినా.. మీకు, సమాజ అభివృద్ధికి మా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది’.
‘రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తున్న పవన్ కల్యాణ్, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ నా అభినందనలు. పవన్ కల్యాణ్ తన న్యాయకత్వం, అద్భుతమైన విజన్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తారని ఆశిస్తున్నా’ అని బన్నీ ప్రకటనలో పేర్కొన్నారు.