close

తాజా వార్తలు

కొత్త జట్టు గురూ...!  

ఆసక్తి రేపుతున్న హీరో- దర్శకుడి కాంబినేషన్‌

హీరోకి, హీరోయిన్‌కు మాత్రమే కెమిస్ట్రీ కుదిరితే సరిపోదు.. హీరోకి, దర్శకుడికీ కెమెస్ట్రీ ఉండాల్సిందే. లేకుంటే.. అవుట్‌పుట్‌ అంతంత మాత్రంగానే ఉంటుంది. కొందరు హీరోలు, దర్శకుల కాంబినేషన్‌ అంటేే.. చిత్ర పరిశ్రమలో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ‘వాళ్లు కలిస్తే హిట్టే..’ అనే టాక్‌ వినిపిస్తుంది. ఆ మాటకు తగ్గట్లుగానే వారి కాంబినేషన్‌లోని సినిమాలు వరుస విజయాలతో దూసుకెళ్తుంటాయి. ఒకప్పుడు రజనీకాంత్‌, ఎస్పీ ముత్తురామన్‌ కాంబినేషన్‌ అంటే.. తిరుగులేదనిపించేది. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏకంగా 25 సినిమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ఇటీవల విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్‌ అన్నా కూడా అలాంటి మాటే వినిపిస్తోంది. ఇక అజిత్‌- శివ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. వరుసగా మూడు విజయాలు దక్కాయి. సూర్య- హరి, శివకార్తికేయన్‌- పొన్‌రామ్‌.. ఇలా ఎన్నో కాంబినేషన్లు వరుస విజయాలను దక్కించుకుంటున్నాయి. అయితే వీటన్నింటి కన్నా భిన్నంగా ఓ కొత్త కాంబినేషన్‌ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ హీరోకి వరుసగా హిట్లు ఇచ్చిన ఆ దర్శకుడు ఇప్పుడు మరో హీరోతో కలిసి బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే కొత్త దర్శకుడిని నమ్మి అగ్ర హీరోలు కూడా కాల్షీట్లు ఇచ్చేస్తున్నారు. ఆ విశేషాలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం...
తలైవర్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కలిసి...

అజిత్‌తో కలిసి ‘దీనా’ చిత్రంతో కెరీర్‌ను ఆరంభించిన దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌. ఆ తర్వాత విజయ్‌తో ‘తుపాక్కి’, ‘కత్తి’, ‘సర్కార్‌’ వంటి మూడు బ్లాక్‌బస్టర్‌ హిట్లను రూపొందించి..బాక్సాఫీసు కింగ్‌గా మారాడు. విజయ్‌కి తగ్గ దర్శకుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2001 నుంచే కెరీర్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తున్నప్పకీ సూపర్‌స్టార్‌తో సినిమా చేయాలనే కల నెరవేరకుండా ఉండిపోయింది. అయితే ఎట్టకేలకు 18 ఏళ్ల తర్వాత సూపర్‌స్టార్‌ కటాక్షం కలిగింది. ప్రస్తుతం తలైవర్‌ హీరోగా ‘దర్బార్‌’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నయనతార కథానాయిక. మురుగదాస్‌ దర్శకత్వంలో సినిమా కోసం రజనీకాంత్‌ అభిమానులు కూడా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి అది ఇప్పుడు పట్టాలపైకి వచ్చింది.
అజిత్‌   దర్శకుడు.. సూర్యతో..!

వీరం, వివేగం, వేదాలం, విశ్వాసం.. ఇలా వరుసగా అజిత్‌ హీరోగా నాలుగు సినిమాలను తెరకెక్కించిన శివ.. ఇప్పుడు సూర్య చెంత కు చేరారు. 2018లో విడుదలైన ‘తానా సేంద కూట్టం’ తర్వాత సూర్య చిత్రాలేవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. కానీ ఆయన నటించిన ‘ఎన్‌జీకే’, ‘కాప్పాన్‌’ చిత్రాలు త్వరలోనే తెరపైకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుధ కొంగర దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు శివ దర్శకత్వంలోని సినిమాలోనూ నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇది సూర్యకు 39వ చిత్రం. స్టూడియోగ్రీన్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రకటన కూడా విడుదల కానుంది.
జయం రవితో హరి..

హరి.. అంటేనే సూర్య దర్శకుడనే ముద్ర పడిపోయింది. ఆయన ధనుష్‌, విక్రంలతో పాటు పలువురు హీరోలకు దర్శకత్వం వహించినప్పటికీ సూర్యతో ఏకంగా నాలుగు చిత్రాలు తెరకెక్కించారు. అందులో ‘సింగం’ సీక్వెల్‌ చిత్రాలు వరుసగా విజయాన్ని సాధించాయి. ‘సింగం’ తదుపరి భాగాన్ని కూడా తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఆయన జయం రవి హీరోగా ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
సెల్వ దర్శకత్వంలో విక్రం

విశ్వనటుడు కమల్‌హాసన్‌ శిష్యుడు రాజేష్‌ సెల్వ. కమల్‌ హీరోగా ‘తూంగావనం’ చిత్రాన్ని తెరకెక్కించారు. అంతేకాకుండా ‘విశ్వరూపం 2’ చిత్రంలో గురువుతో కలిసి పనిచేశారు. ఇప్పుడు విక్రం హీరోగా ‘కడారం కొండాన్‌’ తెరకెక్కిస్తున్నారు. కమల్‌ కుమార్తె అక్షర హాసన్‌ ముఖ్యపాత్ర పోషించారు. శ్రీనివాస్‌ గుప్తా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్‌ కేఎల్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 19న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రారంభంలో ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని మే 31కి వాయిదా వేశారు. ఇందులో పూర్తి భిన్నమైన పాత్రలో విక్రం కనిపిస్తున్నాయి. టీజర్‌ కూడా ఇటీవల ప్రేక్షకులను, అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. సాంకేతిక పరమైన హంగులు ఈ చిత్రంలో అధికంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 31న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. 
వెంకట్‌ప్రభుతో శింబు

తన స్నేహ బృందంతోనే వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకుడు వెంకట్‌ప్రభు. వైభవ్‌, ప్రేమ్‌జీ, జై, శివలతో సినిమాలను రూపొందిస్తున్న ఆయన అజిత్‌తో ‘మంగాత్తా’ను రూపొందించి హిట్‌ అందుకున్నారు. అందులోనూ తన స్నేహ బృందాన్ని చొప్పించారు. ఈ నేపథ్యంలో తొలిసారి శింబు హీరోగా ‘మానాడు’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌. ఐశ్వర్యాదత్త, ప్రేమ్‌జీ తదితరులు నటిస్తున్నారు. పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్‌ సెటైర్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా పలువురు సీనియర్‌ హీరోలు కూడా కొత్త దర్శకులకు అవకాశమిస్తూ ఆశ్చర్య పరుస్తున్నారు. మరి వీరి ప్రయోగం ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో వేచి చూడాలి. 


 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.