close

తాజా వార్తలు

సెల్వ దర్శకత్వంపై ఎనలేని ప్రేమ:సూర్య

కోడంబాక్కం: సెల్వరాఘవన్‌, సూర్య కాంబినేషన్‌లో తొలిసారిగా వస్తున్న చిత్రం ‘ఎన్‌జీకే’. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్‌, పాటలను తాజాగా ఆవిష్కరించారు. డ్రీమ్‌ వారియర్స్‌ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్యకు జోడీగా సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్‌లు నటించారు. దాదాపు రెండేళ్లపాటు నిర్మాణంలోనే ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో శివకుమార్‌తోపాటు చిత్రయూనిట్‌ పాల్గొంది. సినిమాటోగ్రాఫర్‌ శివకుమర్‌ విజయన్‌ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఓ అద్భుతమైన చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. సెల్వ దర్శకత్వం గురించి అందరికీ తెలుసు. కానీ ఆయన మాటలను చదివేటప్పుడు.. ఈ సన్నివేశానికి కెమెరా ఎక్కడ పెట్టాలోనని చాలా శ్రమపడి ఆలోచించేవాడిని. సూర్య నటన సినిమాలో హైలెట్‌గా ఉంటుందని’’ తెలిపారు. సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా మాట్లాడుతూ.. ‘‘సెల్వతో కలిసి చాలా సినిమాలకు పనిచేశా. ఆయన కథ చెప్పేటప్పుడే దాని ప్రాముఖ్యతను కూడా చెబుతారు. ప్రతి సినిమాకు ఏదైనా కొత్తగా చేద్దామనే ఆలోచనతోనే ఆయన ఉంటారు. చిన్న విషయాలపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపే దర్శకుడని’’ అభినందించారు. నటి సాయిపల్లవి ప్రసంగిస్తూ.. ‘‘ఈ సినిమాలో ఓ పాఠశాల విద్యార్థిని లాగే మారిపోయా. సెల్వరాఘవన్‌ చాలా కొత్త విషయాలను నేర్పించారు. నాలో ఉన్న నటనను బయటకు తీసుకొచ్చారు. సూర్యతో నటించడం చాలా గొప్పగా ఉందని’’ తెలిపారు. సెల్వరాఘవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కథలో హీరో పాత్రను రాసుకునేటప్పుడే సూర్య గుర్తుకొచ్చారు. నటన మాత్రమే ఆయన ప్రత్యేకత కాదు. డబ్బింగ్‌ పనుల్లో కూడా చిన్న చిన్న విషయాలను గుర్తించి మాట్లాడుతారు. సూర్య దర్శకుడికి తగ్గ నటుడు. ఈ సినిమాను ఆయన అంగీకరించడం ఓ వరం. సాయిపల్లవి చిన్నపిల్లలా మారిపోయింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ మంచి ప్రతిభ ఉన్న నటి అని’’ అభినందించారు.

సూర్య ప్రసంగిస్తూ.. ‘‘రాజకీయాలనేవి రక్తం చిందే యుద్ధం. అదేవిధంగా యుద్ధం అనేది రక్తం చిందే రాజకీయం. సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించేటప్పుడు ఒక్కో రోజు ఒక్కో విషయాన్ని నేర్చుకునేవాడిని. సమయం దాటినా కానీ ఏ విషయాన్నీ పట్టించుకోకుండా తన పనులు చూసుకుంటారు. ఆయన దర్శకత్వ శైలి అన్నా, మాటలన్నా నాకు ఎనలేని ప్రేమ. సెల్వ దర్శకత్వంలో అంకితభావంతో, మనసుపెట్టి నటించా. యువన్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటారు. కొత్త సంగీతంతో అందర్నీ మెప్పిస్తారు. తాను నటించిన తర్వాత కూడా ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకునే అంకితభావం కలిగిన నటి సాయిపల్లవి అని’’ పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.