close

తాజా వార్తలు

‘అలాద్దీన్‌’ అద్భుత దీపం దొరికితే మీరేం చేస్తారు?

హైదరాబాద్‌: ‘ఎఫ్‌2’ తర్వాత ‘అలాద్దీన్‌’ కోసం వరుణ్‌తేజ్‌తో కలిసి పనిచేయడం యాదృచ్ఛికంగా జరిగిందని అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ అన్నారు. విల్‌స్మిత్‌, మీనా మసూద్‌, నయోమి స్కాట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లైవ్‌ యాక్షన్‌ చిత్రం ‘అలాద్దీన్‌’. తెలుగులో అదే పేరుతో విడుదలవుతున్న ఈ సినిమాలో జీనీ పాత్రకు వెంకటేష్‌, అలాద్దీన్‌ పాత్రకు వరుణ్‌తేజ్‌ డబ్బింగ్‌ చెప్పారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనే విషయాలను పంచుకున్నారు.

డిస్నీతో మీ అనుబంధం ఎలాంటింది?
వెంకటేష్‌:  అందరిలాగానే నేను కూడా మా పిల్లలతో కలిసి డిస్నీ మూవీలను చూస్తూ చాలా ఎంజాయ్‌ చేసేవాడిని. ఇప్పుడు డిస్నీ వాళ్లు అలాద్దీన్‌లో జీనీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పమని పిలిచినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అద్భుతమైన లైవ్‌ యాక్షన్‌ డ్రామా తెలుగు ప్రేక్షకులకు చేరితే బాగుంటుందనిపించింది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అందరూ చూడాలనే ఉద్దేశంతోనే డిస్నీ వాళ్లు అడగగానే నేనూ ఒప్పుకొన్నా. 

మీకు జీనీ ఎదురైతే ఎలాంటి కోరికలు కోరతారు?
వెంకటేష్‌: అవన్నీ మీకెందుకు చెబుతానండీ(నవ్వులు). అందరికీ కోరికలు ఉంటాయి. అందరి కోరికలు తీరుస్తుంటే ఆ ఆనందమే వేరు. ఈ సినిమాలో నేను వరుణ్‌ అడిగే కోరికలు నెరవేరుస్తుంటా. 

మీ వాయిస్‌లో ‘అలాద్దీన్‌’ పాత్ర పోషించడం ఎలా ఉంది?
వరుణ్‌తేజ్‌: నా చిన్నప్పుడు అలాద్దీన్‌ సినిమా చూశా. అంతేకాదు, గేమ్‌ కూడా ఉండేది. నేను, మా చెల్లి ఆడుకునేవాళ్లం. నా చిన్నప్పుడు తీపి గుర్తులను మిగిల్చిన ఈ సినిమాలో నా వాయిస్‌ను ఇవ్వడం నా అదృష్టం. డబ్బింగ్‌ చెబుతూ, మీ అందరికంటే ముందు నేను ఈ సినిమా చూశా. చాలా బాగుంది. ఇదో చక్కని అనుభవం.

జీనీ పాత్రకు డబ్బింగ్‌ చెబుతూ మీరు ఎలా ఎంజాయ్‌ చేశారు?
వెంకటేష్‌: జీనీ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం అద్భుతమైన అనుభూతి. ఆ ఆకారం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. పైగా అతను అలాద్దీన్‌కు మెంటార్‌. నాకు సరిగ్గా సరిపోయే పాత్ర అది. మొదటిసారి మరో పాత్రకు నా వాయిస్‌ ఇచ్చా. నాకు కష్టంగానే అనిపించింది. ఎందుకంటే ఆ పాత్రలో మేజిక్‌ ఉంటుంది.. ఫన్‌ ఉంటుంది. విల్‌స్మిత్‌ బాడీ లాంగ్వేజ్‌ ప్రత్యేకంగా ఉంటుంది. చాలా వేగంగా ఉంటారాయన. ఆ పాత్రకు తగినట్లుగా డబ్బింగ్‌ చెప్పడానికి కొంత సమయం పట్టింది. అయితే, తెలుగు ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. నాకు కామెడీ చేయటం ఇష్టమన్నది మీకు తెలిసిందే. 

మీరు కాకుండా మరెవరూ ఆ పాత్రకు డబ్బింగ్‌ చెప్పటానికి సరిపోరేమో..
వెంకటేష్‌: (నవ్వులు) అంత చెప్పొద్దలెండీ! ఎందుకంటే ఆ పాత్రలోనే థ్రిల్‌ ఉంది. డబ్బింగ్‌ ఎవరు చెప్పినా, అందులో లీనమై చెబుతారు. నేను కూడా అలాగే చెప్పా. ‘ఎఫ్‌2’లో వరుణ్‌కు ఒక గైడ్‌లా ఉన్నా, ఇందులో కూడా మేజికల్‌గా అతనికి గైడ్‌ చేస్తుంటా.(మధ్యలో వరుణ్‌ కలగజేసుకుని) ‘ఎఫ్‌2’లో తప్పుదోవ పట్టించారు. ఇందులో సరైన దారిలో తీసుకెళ్లారు(నవ్వులు)

‘అలాద్దీన్‌’కు దీపం దొరికినట్లు మీకు దొరికితే ఏం చేస్తారు?
వరుణ్‌తేజ్‌: చాలా కష్టమైన ప్రశ్న. ఆలోచించుకుని చెప్పాలి. నేను జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటా.

ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్‌ అయితే, ఆ భాష కొత్తగా ఉంటుంది కదా! మీకెలా అనిపించింది?
వెంకటేష్‌: నాకూ కొత్తగా, తమాషా, కష్టంగా అనిపించింది. నేను అమెరికాలో చదువుకున్నప్పుడు అక్కడి ఇంగ్లీష్‌ భాషా శైలిని ఎంజాయ్‌ చేస్తాను. ఇప్పుడు కూడా అంతే. అయితే, జీనీ పాత్ర చాలా పవర్‌ఫుల్‌, హ్యూమర్‌ కూడా ఉంటుంది. విల్‌స్మిత్‌ చేసిన పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం సంతోషంగా ఉంది. 

‘ఎఫ్‌2’ జర్నీ అలాద్దీన్‌కు ఏమైనా ఉపయోగపడిందా?
వెంకటేష్‌: ఏ సినిమా ప్రత్యేకత దానిదే. మేమిద్దరం మళ్లీ కలిసి పనిచేయడం యాదృచ్చికమే. ఎఫ్‌2లో మొదట ఏడిపించినా, ఆ తర్వాత వరుణ్‌ను గైడ్‌ చేస్తూ ఉంటా. ఇందులో కూడా అంతే. 

చిన్న ట్రైలర్‌లోనే మీ వాయిస్‌లో చాలా వైవిధ్యాన్ని చూపించారు? ఎలా సాధ్యమైంది?
వెంకటేష్‌: నిజంగా ఇదో ఛాలెంజ్‌లాగానే అనిపించింది. తొలిరోజు చాలా కంగారు పడ్డా. ఎందుకంటే ఇది కొత్త అంశం. ఒకనొక సందర్భంలో లేచి వెళ్లిపోయాను కూడా. ఇంటికి వెళ్లి, ‘ఇదేంటిరా! జీనీ పాత్రలో ఇరుక్కుపోయానా’ అనిపించింది. అయితే, ఒక్కసారి ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తర్వాత చేసుకుంటూ వెళ్లిపోయా.

మీకు స్క్రిప్ట్‌ ఇచ్చినప్పుడు మీరు ఎన్నిసార్లు అద్ధం ముందు నిలబడి ప్రాక్టీస్‌ చేశారు?
వెంకటేష్‌: నిజ జీవితంలో నేనూ జీనీలాంటి వ్యక్తినే. ఇంట్లో నా పిల్లలతో చాలా సరదాగా ఉంటా. వాళ్లకు అడిగింది ఇచ్చే వాడిని. వాయిస్‌లో వైవిధ్యం చూపించడానికి కొంచెం హోంవర్క్‌ చేసిన మాట నిజమే! అప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు.

మీరు జీనీ అయితే, వరాలు ఇవ్వడానికి ఎవరి దగ్గరకు వెళ్తారు?
వెంకటేష్‌: అందరి దగ్గరకీ వెళ్తా(నవ్వులు)

‘అలాద్దీన్‌’ పాత్రకు డబ్బింగ్‌ చెప్పడానికి మీరెలా సిద్ధం అయ్యారు?
వరుణ్‌తేజ్‌: నేను చేసిన సినిమాలు కూడా డబ్బింగ్‌ సమయానికి వచ్చేసరికి చాలా కష్టం అనిపిస్తుంది. ఈ సినిమా విషయంలో అది ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇందులో మేము నటించలేదు. వేరే వాళ్లు నటిస్తే, వాళ్లకు మేము డబ్బింగ్‌ చెప్పాం. 

మీ గడ్డం వెనుక కథ ఏంటి?
వరుణ్‌తేజ్‌: కొత్త సినిమా కోసం..

మీరిద్దరూ కలిసి పనిచేయడం మీకు ఎలా అనిపించింది?
వెంకటేష్‌: ‘అలాద్దీన్‌’లో జీనీ వచ్చినప్పటి నుంచి చాలా ఫన్నీగా ఉంటుంది. చాలా ఎక్స్‌ప్రెషన్స్‌ను ఎంజాయ్‌ చేశా. మేజికల్‌ పార్ట్‌ బాగుంటుంది. ఇక సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. 
వరుణ్‌తేజ్‌: నాకు అలాద్దీన్‌కు డబ్బింగ్‌ చెప్పడానికి వచ్చినప్పుడే వెంకటేష్‌గారు జీనీ పాత్రకు వాయిస్‌ చెబుతున్నారని అన్నారు. దీంతో నేనూ సంతోషంగా ఒప్పుకొన్నా. ‘ఎఫ్‌2’ ఇచ్చిన విజయంతో మా వాయిస్‌లు విన్నా, అందరికీ నచ్చుతుందని చేశాం.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.