close

తాజా వార్తలు

ఇక్కడ ఆడినోడే మొనగాడు!

అసలే ప్రపంచకప్‌.. ఆపై పాకిస్థాన్‌తో పోరు.. ఆ మ్యాచ్‌పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారత్‌, పాకిస్థాన్‌ అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు అమితాసక్తితో చూసే మ్యాచ్‌ అది. ఆ మ్యాచ్‌ గెలవడానికి ఇరు దేశాల ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఈ పోరును ఒక యుద్ధం లాగా చూస్తారు. ఇంత ఆసక్తి ఉన్న మ్యాచ్‌లో ఎంతో ఒత్తిడిని తట్టుకుని రాణించడం ఆటగాళ్లకు పెద్ద సవాలే. కానీ ఆ సవాల్‌ను ఛేదించి సత్తా చాటిన ఆటగాడు మొనగాడవుతాడు. జట్టును గెలిపిస్తే జాతీయ హీరో అయిపోతాడు. ఇప్పటిదాకా వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓటమే ఎరుగదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ మనదే విజయం. మరి ఆ ఆరు మ్యాచ్‌ల హీరోలెవరో.. వాళ్లు ఎలా మెరిశారో.. జట్టును ఎలా గెలిపించారో చూద్దాం పదండి.

అనుకున్నట్లే సచిన్నోడు

ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ తొలిసారి తలపడింది 1992లో. శ్రీకాంత్‌, కపిల్‌, అజహరుద్దీన్‌ లాంటి సీనియర్లతో పాటు సచిన్‌, కాంబ్లి, జడేజా లాంటి యువ ఆటగాళ్లున్నారు భారత జట్టులో. అయితే అప్పటికే కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లతో ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు రేపిన కుర్ర సచిన్‌పై ఈ ప్రపంచకప్‌లో మంచి అంచనాలే నెలకొన్నాయి. పాకిస్థాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఒత్తిడిలో మేటి ఇన్నింగ్స్‌ ఆడి సచిన్‌ తన స్థాయిని చాటుకున్నాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ చేసింది 216 పరుగులే. అందులో సచిన్‌ స్కోరు 54. చివర్లో ధాటిగా ఆడి జట్టు స్కోరును 200 దాటించింది మాస్టరే. ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా సత్తా చాటి పాక్‌ను 173కే ఆలౌట్‌ చేశారు. బౌలింగ్‌లోనూ రాణించిన సచిన్‌.. 10 ఓవర్లలో 37 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీసి హీరోగా నిలిచాడు.

పునాది వేసింది అతనే..

1996 ప్రపంచకప్‌లో పాక్‌పై విజయానికి బలమైన పునాది వేసింది ఓపెనర్‌ నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్దూ. 115 బంతులెదుర్కొన్న సిద్దూ.. 11 ఫోర్ల సాయంతో 93 పరుగులు చేసి భారత్‌ ఇన్నింగ్స్‌ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. 50 ఓవర్లలో జట్టు స్కోరు 287/8. సచిన్‌ (31)తో కలిసి సిద్దూ తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించి భారత్‌కు పైచేయి సాధించే అవకాశం కల్పించాడు. సెంచరీ చేసేలా కనిపించిన సిద్దూ.. జట్టు స్కోరు 168 వద్ద మూడో వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఈ రోజుల్లో 288 పెద్ద లక్ష్యం కాదు కానీ.. అప్పట్లో అది పెద్దదే. పాక్‌ ఇన్నింగ్స్‌ మెరుపు వేగంతో ఆరంభమైనా.. ఆ జట్టు ఆ తర్వాత తడబడింది. 9 వికెట్లకు 249 పరుగులే చేసి ఓటమి పాలైంది. మెరుపు ఇన్నింగ్స్‌తో జడేజా, చక్కటి బౌలింగ్‌తో ప్రసాద్‌ సైతం ఈ మ్యాచ్‌ విజయంలో తమవంతు పాత్ర పోషించారు.

ఈసారి బౌలర్‌

1999 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఏమంత గొప్ప ప్రదర్శన చేయలేదు. సెమీస్‌ కూడా చేరకుండానే, సూపర్‌ సిక్స్‌ దశలోనే ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. కానీ పాకిస్థాన్‌పై అజేయ రికార్డును మాత్రం కొనసాగించింది. టోర్నీలో తిరుగులేని ఆధిపత్యంతో ఫైనల్‌ చేరిన పాక్‌ను సూపర్‌సిక్స్‌ దశలో ఓడించింది. ముందు టోర్నీల్లో బ్యాట్స్‌మెన్‌దే విజయంలో కీలక పాత్ర కాగా.. ఈసారి బౌలర్‌ హీరోగా నిలిచాడు. ఆ హీరో.. వెంకటేష్‌ ప్రసాద్‌. మొదట భారత్‌ 6 వికెట్లకు 227 పరుగులే చేసింది. చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌.. ప్రసాద్‌ (5/27) ధాటికి కుదేలై 180 పరుగులకే ఆలౌటైంది. కార్గిల్‌ యుద్ధ సమయంలోనే ఈ విజయం రావడంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోయాయి.

తొలి సెంచరీ హీరో

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ల్లో ఎప్పుడూ జరగని విశేషాలు 2015లో చోటు చేసుకున్నాయి. తొలిసారి జట్టు స్కోరు 300 దాటింది. ఒక ఆటగాడు సెంచరీ చేశాడు. ఆ జట్టు భారత్‌ అయితే.. ఆ ఆటగాడు విరాట్‌ కోహ్లి. ముందు టోర్నీలో మాదిరే 2015లోనూ పాక్‌పై భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తనపై ఉన్న అంచనాల్ని అందుకుంటూ కోహ్లి సత్తా చాటాడు. 126 బంతులెదుర్కొన్న విరాట్‌.. 8 ఫోర్ల సాయంతో 107 పరుగులు చేశాడు. మామూలుగా దూకుడుగా ఆడే కోహ్లి.. ఈసారి తన శైలిని విడిచిపెట్టి నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 300 స్కోరును అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. పాక్‌ ఏ దశలోనూ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. షమి (4/35)తో పాటు మిగతా బౌలర్లూ సత్తా చాటడంతో ఆ జట్టు 224 పరుగులకే ఆలౌటైంది.

మళ్లీ మాస్టరే..

పాక్‌తో ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా జరిగిన ఆరు మ్యాచ్‌ల్లో హీరోల కథ ఇది. మరి ఈ ఆదివారం పాక్‌పై హీరోగా నిలిచేదెవరు? జట్టులో నం.1 బ్యాట్స్‌మన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయేనా? ఓపెనర్‌ రోహిత్‌ శర్మా? అతడితో తోడుగా వస్తున్న కేఎల్‌ రాహులా? పాకిస్థాన్‌తో చివరి మ్యాచ్‌ ఆడబోతున్న ధోనీనా? ప్రస్తుతం ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్‌బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బుమ్రానా? చక్కటి ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యనా?

పాకిస్థాన్‌పై భారత్‌ ప్రపంచకప్‌లో పూర్తి స్థాయి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన తొలి టోర్నీ 2011దే. సొంతగడ్డపై టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌ను కూడా సులువుగా ఓడించేస్తుందనే అనుకున్నారు. కానీ మ్యాచ్‌లో భారత్‌కు కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. పాక్‌ బౌలింగ్‌ భారత్‌కు పరీక్ష పెట్టింది. అయితే.. అంతకుముందే ప్రపంచకప్‌లో పాక్‌పై రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించిన సచినే 2011లోనూ భారత్‌ను గెలిపించాడు. కాకపోతే ఈసారి గత ఇన్నింగ్స్‌ల తరహాలో సాధికారికంగా ఆడలేదు మాస్టర్‌. 85 పరుగులతో మ్యాచ్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచిన అతడికి రెండు మూడు జీవన దానాలు లభించాయి. ఎలాగైతేనేం భారత్‌ 260 పరుగులు చేయడంలో తెందుల్కర్‌ పాత్ర కీలకం. తర్వాత బౌలర్లందరూ సమష్టిగా రాణించి పాక్‌ను 231 పరుగులకే ఆలౌట్‌ చేశారు. 1992, 2003లో మాదిరే ఈసారి కూడా పాక్‌పై ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సచినే.

అక్తర్‌ను ఉతికారేసి..

కార్గిల్‌ యుద్ధ అనంతరం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న సమయంలో 2003లో పాక్‌తో భారత్‌ పోరు. భారత్‌ ముందు 274 పరుగుల ప్రమాదకర లక్ష్యం నిలిచింది. ప్రపంచకప్‌లో పాక్‌పై అజేయ రికార్డు ఈసారి నిలవడం కష్టమే అనుకున్నారంతా. అక్తర్‌, అక్రమ్‌, వకార్‌లను ఎదుర్కొని నిలవడం కష్టసాధ్యమే అనిపించింది. ఆ స్థితిలో సచిన్‌ చెలరేగిన తీరును ఏ భారత అభిమానీ ఎప్పటికీ మరిచిపోలేడు. కళ్లు చెదిరే అప్పర్‌ కట్‌లతో అక్తర్‌ సహా పాక్‌ అగ్రశ్రేణి ఫాస్ట్‌బౌలర్ల అహాన్ని అణచి వేస్తూ సచిన్‌ పంచిన వినోదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 75 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 98 పరుగులు చేసి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు సచిన్‌. ప్రపంచకప్‌లో పాక్‌పై ఒక భారత బ్యాట్స్‌మన్‌ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఇదే అనడంలో మరో మాట లేదు. ఆ రోజు సచిన్‌ హీరో కాదు.. సూపర్‌ హీరో.

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.