close

తాజా వార్తలు

ఫుల్‌టైమ్‌ హీరోలు.. పార్ట్‌టైమ్‌ నటులు

వాళ్లెవరో మీరే చూడండి

‘నేను హీరోని... హీరో పాత్రలే చేస్తా’ - కొన్నాళ్ల క్రితం టాలీవుడ్‌లో నడిచిన ట్రెండ్‌ ఇది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. కథ నచ్చితే, కాంబినేషన్‌ బాగుంటే హీరో అనే ఇమేజ్‌ పక్కన పెట్టి కీలక నటులుగా మారడానికీ సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘మహర్షి’తో నరేశ్‌ కీలక పాత్రలో కనిపించారు. త్వరలో మరి కొంత మది ఈ దిశగా అడుగులేస్తున్నారు. వాళ్లెవరంటే..

బన్నీతో కలసి..

తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది.  ఆ కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్‌ ‘కరెంట్‌’తో మెప్పించాడు. ఆ తర్వాత ఆయనకు ఆశించిన విజయాలు దక్కలేదు. అయితే గతేడాది వచ్చిన ‘చి.ల.సౌ.’తో తనకు నప్పిన కథను ఎంచుకుని విజయాన్ని అందుకున్నారు. సుశాంత్‌కు ఇటీవలే మరో అవకాశం దక్కింది. అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదు. 

గ్యాంగ్‌ లీడర్‌తో..

గతేడాది ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌ అందుకున్నాడు కార్తికేయ. చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. తాజాగా విడుదలైన ‘హిప్పీ’ మంచి టాక్ అందుకుంది. ప్రస్తుతం నేచురల్‌ స్టార్‌ నాని నటిస్తున్న ‘గ్యాంగ్‌ లీడర్‌’ చిత్రంలో కార్తికేయ ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు. హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఇలాంటి సాహసం చేయడం గమనార్హం. 

నాని చేస్తున్నాడా?

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ తెచ్చుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని. పాత్రల ఎంపికలో ఆయనకు ఆయనే సాటి. ఇటీవల ‘జెర్సీ’తో మరో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. తాజాగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్‌ బాబుతో కలిసి ఆయన ‘వి’ అనే మల్టీస్టారర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నాని ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 

మరోసారి కీలకం

ఒకప్పుడు కామెడీ హీరోగా వరుస విజయాలను అందుకోవడమే కాదు, మినిమం గ్యారెంటీ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్‌. అయితే, కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలేవీ సరైన విజయాలను అందుకోలేదు. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు ‘మహర్షి’లో నటుడిగా మరోసారి నిరూపించుకున్నారు. ఈ జోరులో మరో అవకాశం కూడా నరేశ్‌ తలుపు తట్టిందట. రవితేజ నటిస్తున్న ‘డిస్కోరాజా’లో నరేశ్‌ కీలకపాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల టాక్‌.

బ్యాక్‌ టు కామెడీ

తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా సునీల్‌ చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేయలేదనే చెప్పాలి. అలా ‘అందాల రాముడు’తో హీరోగా మారిన సునీల్‌కు రెండు మూడు విజయాలు దక్కినా, ఆ తర్వాత ఆ హిట్‌ల పరంపర కొనసాగలేదు. దీంతో తనకు అచ్చి వచ్చిన కామెడీవైపే మళ్లీ అడుగు వేస్తున్నారు. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’లో నీలాంబరి పాత్రలో మెప్పించారాయన. ఇటీవల వచ్చిన ‘ చిత్రలహరి’లోనూ నవ్వులు పూయించారు. 

మళ్లీ చేస్తాడా? 

హీరోగా నటిస్తూ బలమైన పాత్రల మీద మనసు పారేసుకున్న మరో కథానాయకుడు నవీన్‌ చంద్ర. ‘అందాల రాక్షసి’తో హీరోగా విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత ‘నేను లోకల్‌’లో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో నటించారు. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’లోనూ బాల్‌ రెడ్డి మెప్పించారు. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమేనని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు నవీన్‌చంద్ర.

ఇలా యంగ్‌హీరోలందరూ ఒక పక్క కథానాయకులుగా నటిస్తూనే, మరోపక్క వచ్చిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటున్నారు. 

 -ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.