close

తాజా వార్తలు

మాది ‘ప్రేక్షకపాత్ర’ కాదు!

మా ‘ముద్ర’ ఉంటేనే సినిమాకు ఆమోద‘ముద్ర’!

థానాయిక అంటే కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితమనే రోజులు ఎప్పుడో పోయాయి. ఒకప్పుడు కథ, అందులోని పాత్రలు, ఆఖరికి హీరోయిన్లు కూడా హీరో పాత్ర చుట్టూ తిరిగేవారు. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో ఈ ధోరణి కాస్త ఎక్కువగా కనిపించేది. హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే క్రమంలో మిగిలిన ఏ పాత్ర అయినా ‘ప్రేక్షక పాత్ర’ పోషించాల్సి వచ్చేది.  అయితే, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. యువ దర్శకుల ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. కథలో హీరోకు ఎంత ప్రాధాన్యం ఉందో.. కథానాయికకూ అంతే స్థాయిలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. హీరోయిన్లు సైతం అలాంటి పాత్రలకే మొగ్గు చూపుతున్నారు. అసలు కొందరైతే కథానాయికలను దృష్టిలో పెట్టుకునే కథలను సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో అలాంటి పాత్రలకు ఓటేసిన కథానాయికలెవరో ఓసారి చూస్తే...

సమంత.. పాత్రల ఎంపికలోనే ఉన్నది ఆమె తెలివంతా!

థలు.. పాత్రల ఎంపికలో అక్కినేనివారి కోడలు సమంతది భిన్నమైన ఎంపిక. గతేడాది ‘రంగస్థలం’, ‘మహానటి’, ‘యూటర్న్‌’ చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఆ విజయాలను కొనసాగిస్తూ, ఈ ఏడాది తమిళంలో ‘సూపర్‌ డీలక్స్‌’లో మరో వైవిధ్యమైన పాత్రను పోషించింది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’లో సమంత చేసిన శ్రావణి పాత్రకు మంచి గుర్తింపు లభించడమే కాదు.. సినిమాను విజయ పథంలో నడిపించడంలోనూ కీలక పాత్ర పోషించింది సామ్‌. ఇక వచ్చే నెలలో ‘ఓ బేబీ’ అంటూ ప్రేక్షకులను పలకరించనుంది. నందినీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, త్వరలోనే ఆమె తమిళ రీమేక్‌ ‘96’లోనూ నటించనుంది. విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తమిళ్‌లో విజయ్‌ సేతుపతి పాత్రను తెలుగులో శర్వానంద్‌ చేస్తున్నాడు. 

‘అరుంధతి’ నుంచి..

గ్లామర్‌ హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ‘అరుంధతి’. జేజెమ్మ పాత్రలో అనుష్క నటనకు అందరూ ఫిదా అయిపోయారు. అప్పటినుంచి కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలంటే దర్శక-నిర్మాతలకు గుర్తొచ్చేది అనుష్కనే. ‘బాహుబలి’లో ‘దేవసేన’ పాత్ర ప్రభాస్‌, రానాల తర్వాత ఆ స్థాయిలో స్వీటికీ పేరుతెచ్చింది. ‘రుద్రమదేవి’గానూ మెప్పించింది. ‘సైజ్‌ జీరో’తో ప్రయోగం చేసిన అనుష్క.. ఆ తర్వాత ‘భాగమతి’గా మెప్పించింది. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే మూవీ సహా, ‘సైరా’లో కీలక పాత్ర పోషిస్తోంది. 

‘లేడీ సూపర్‌స్టార్‌’ నయనతార

మిళ, తెలుగు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న నటి నయనతార. ‘లేడీ సూపర్‌స్టార్‌’గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయన్‌ ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలే చేసేవారు. గత కొంతకాలంగా ఆమె ఎంపిక చేసుకునే పాత్రలు పూర్తిగా భిన్నంగా ఉంటున్నాయి. నయన్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల తమిళంలో ఆమె నటించి చిత్రాలన్నీ ఈ తరహావే. ‘ఆరమ్‌’, ‘కోలమావు కోకిల’, ‘ఐరా’తో అలరించిన ఆమె, ‘కొలయెత్తిర్‌ కాలమ్‌’తో పాటు, ‘సైరా’, ‘బిజిల్‌’, ‘దర్బార్‌’ వంటి భారీ ప్రాజెక్టుల్లో ఉంది. 

అలా మొదలు పెట్టిన నిత్యామేనన్‌

తొలి నుంచి గ్లామర్‌ పాత్రల కన్నా కథా బలమున్న చిత్రాల్లో నటించేందుకు మొగ్గు చూపే నటి నిత్యామేనన్‌. తానే హీరోయిన్‌గా ఉండాలని డిమాండ్‌ చేసే ఈ రోజుల్లో మరో కథానాయిక ఉన్నా కూడా తనదైన నటనతో వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తోంది. ‘అలా మొదలైంది’ దగ్గరి నుంచి ‘ఇష్క్‌’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘జనతా గ్యారేజ్‌’, ‘అ’ సహా ఎన్నో చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలకు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా జయలలిత బయోపిక్‌ ‘ది ఐరన్‌ లేడీ’ ‘సైకో’, ‘మిషన్‌ మంగళ్‌’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తోంది. 

మిల్కీబ్యూటీది అదే దారి

కప్పుడు తమన్నా దాదాపు అన్ని గ్లామర్‌ పాత్రలే చేసేది. కానీ, ఇటీవల కాలంలో ఆమె ఎంపిక చేసుకునే చిత్రాల విషయంలో వైవిధ్యం చూపిస్తోంది. ‘100% లవ్‌’, ‘అభినేత్రి’, వంటి సినిమాల్లో బలమైన పాత్రలు పోషించిన తమన్నా ‘బాహుబలి-1’లో అవంతికగా మెప్పించింది. ఇక ఇప్పటికే విడుదలైన ‘అభినేత్రి2’లో అలరించిన తమన్నా త్వరలో రాబోతున్న చిత్రాల్లోనూ ఆమెవి కీలక పాత్రలే. ‘క్వీన్‌’ రీమేక్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’, ‘సైరా’, సహా ‘రాజుగారి గది3’లోనూ అలరించేందుకు సిద్ధమైంది. 

గ్లామర్‌ విత్‌ కాజల్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో దశాబ్ద కాలం నుంచి స్టార్‌ కథానాయికగా కొనసాగుతున్న నటి కాజల్‌ అగర్వాల్‌. ఒకప్పుడు గ్లామర్‌ పాత్రలకే పరిమితమైన ‘చందమామ’ ఇటీవల కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలను ఎంచుకుంటోంది. ఇందులో భాగంగానే గతేడాది ప్రశాంతవర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అ!’తో మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’లో కూడా కాజల్‌ది బలమైన పాత్ర. ఇక ఇటీవల మరోసారి తేజ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ‘సీత’లోనూ కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘క్వీన్‌’ దక్షిణాది భాషల్లో రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో కాజల్‌దే లీడ్‌ రోల్‌. శంకర్‌ సినిమాల్లో కథానాయిక పాత్రకు మంచి గుర్తింపు ఉంటుంది. అలా ‘భారతీయుడు2’లో అవకాశం లభించడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబైపోయింది కాజల్‌. అయితే, ఆ సినిమా ముందుకు కదలకపోవడంతో కాజల్‌ కాస్త నిరాశలో ఉంది. ఇక తమిళంలో జయం రవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో ‘కోమలి’ తెరకెక్కుతోంది. ఇందులోనూ తన పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. దీంతో కాజల్‌ ఆశలన్నీ ‘కోమలి’పైనే ఉన్నాయి. 

‘మహానటి’తో కీర్తిసురేష్‌

‘నేను శైలజ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది కీర్తిసురేష్‌. ఆ తర్వాత ‘నేను లోకల్‌’తో మరింత దగ్గరైంది. వరుసగా గ్లామర్‌ పాత్రలు చేస్తూ వచ్చిన కీర్తిసురేష్‌ నటిగా తనని తాను నిరూపించుకున్న చిత్రం ‘మహానటి’. సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంతో కీర్తికి జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ తర్వాత వరుసగా గ్లామర్‌ పాత్రలవైపే మొగ్గు చూపుతోంది. అయితే, మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘మర్కర్‌’లో కీర్తికి మంచి పాత్ర దక్కిందని సమాచారం. ‘మహానటి’లాంటి పాత్రలు జీవితంలో ఒకసారి మాత్రమే వస్తాయి. అలాంటి పాత్రలు చేసినప్పుడే నటిగా మనల్ని నిరూపించుకునే అవకాశం వస్తుంది. అయితే, అలాంటి బరువైన పాత్రలు మరోసారి చేయను’ అని కీర్తి సురేష్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. 

పాత్ర ఏదైనా ‘ఫిదా’ చేస్తుంది సాయి పల్లవి

‘ప్రేమమ్‌’లో మలర్‌గా యువ హృదయాలను కొల్లగొట్టిన సాయి పల్లవి ఆ తర్వాత యువకులందరినీ ‘ఫిదా’ చేసేసింది. పాత్రల ఎంపిక విషయంలో తొలి నుంచి సాయిపల్లవిది ప్రత్యేకమైనదారి. ‘ఫిదా’, ‘కణం’, ‘పడి పడి లేచే మనసు’ చిత్రాలే అందుకు ఉదాహరణ. ముఖ్యంగా ‘ఫిదా’లో భానుమతిగా ఆమె నటనను ఎవరూ మర్చిపోలేరు. చేసింది తక్కువ సినిమాలైనా గుర్తుండిపోయే పాత్రల్లో నటించింది. ఇక త్వరలో మరోసారి శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నటిస్తోంది. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలోనూ సాయిపల్లవిది గుర్తుండిపోయే పాత్ర అని చిత్ర వర్గాల సమాచారం.

‘మేడమ్‌’ రష్మిక 

‘ఛలో’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ రష్మిక ‘గీత గోవిందం’తో మరింత చేరువైంది. ఈ చిత్రం విజయ్‌ దేవరకొండ-రష్మికల కెమెస్ట్రీకి యువత ఫిదా అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో విజయ్‌-రష్మిక కీలక పాత్రల్లో నటిస్తున్న ‘డియర్‌ కామ్రేడ్‌’ వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంటో పాటు మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్‌ ‘భీష్మ’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషిస్తోంది. 

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.