close

తాజా వార్తలు

చాలామంది సినిమాలకి దూరంగా ఉంటున్నారు

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో రాజేంద్రప్రసాద్‌ది ప్రత్యేకస్థానం. కథానాయకుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఘనత ఆయనది. గతకొంత కాలంగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా అద్భుతమైన పాత్రల్లో నటిస్తున్నారు. సమంత ముఖ్య పాత్రలో నందినీరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఓ బేబీ’. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్ర పోషించారు. జులై 5న ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో రాజేంద్రప్రసాద్‌ విలేకరులతో ముచ్చటించారు. 

‘ఓ బేబీ’లో బాయ్‌ఫ్రెండ్‌గా కనిపిస్తానని ఇటీవల జరిగిన వేడుకలో చెప్పారు. ఈ వయసులో బాయ్‌ఫ్రెండ్‌ పాత్రలోనా?
రాజేంద్రప్రసాద్‌: సినిమాలో నా గాళ్‌ ఫ్రెండ్‌ కూడా నా వయసులోనే ఉంటుందిలెండి (నవ్వుతూ). ఆ పాత్రని లక్ష్మీగారు చేశారు. కాకపోతే ఇందులో సమంతకీ కూడా నేనే బాయ్‌ఫ్రెండ్‌ని. అదే ఈ కథలో ఉన్న అందం. లక్ష్మీగారు సమంతగా ఎలా మారిపోయారు? బామ్మ కాస్త పడుచు అమ్మాయిగా మారాక ఆ బాయ్‌ఫ్రెండ్‌ పరిస్థితి ఏమిటనే విషయాలు ఆసక్తికరం. కథలో నాకు నచ్చిన అంశం కూడా అదే. ఇందులో నేను చంటి అనే బాయ్‌ఫ్రెండ్‌ పాత్రలో కనిపిస్తా. 

లక్ష్మి సీనియర్‌ నటి, సమంత నవతరం కథానాయిక. ఈ ఇద్దరితో కలిసి తెరను పంచుకోవడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది? 
రాజేంద్రప్రసాద్‌: మంచి పాత్రలు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తా. ఇక ఆ పాత్రల్ని అనుభవమున్న నటులతో కలిసి చేయడమన్నది మరింత సంతోషాన్నిచ్చే విషయం. కొంతమందితో కలిసి నటిస్తున్నప్పుడు ఉత్సాహంగా ఉంటుంది. ఆ విషయంలో నేనెంత అదృష్టవంతుడినంటే... ‘బామ్మమాట బంగారుమాట’ చిత్రంలో భానుమతిగారితో కలిసి నటించా. ‘బృందావనం’లో అంజలీదేవిగారితో కలిసి నటించా. అలాంటి అనుభూతినే నాకు ఈ సినిమా పంచింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లతో కలిసి చేసిన నటి లక్ష్మీ. సెట్‌లో ఆవిడ ఎదురుగా ఉన్నారంటే మనం ఏం చేయాలో వెంటనే దానంతట అదే రెడీమేడ్‌గా వచ్చేసేది. ఇక సమంత విషయానికొస్తే ఆమె తన కెరీర్‌లోనే అత్యుత్తమైన పాత్రని ఇందులో చేసింది. ఆమె మా అందరితో ఎంతో చనువుగా ఉంటూనే, భయం భక్తులతో నటించింది. కొన్ని సన్నివేశాల్లో నేను నిశ్శబ్ధంగా ఉంటే, ఆమె కామెడీ చేస్తూ ఉండాలి. అలాంటి సన్నివేశాలు తీస్తున్నప్పుడు సరదాగా ‘సర్‌... మేం ఇక్కడ కామెడీ చేయాలి. దయచేసి కొంచెం చెబితే చేసేసి వెళ్లిపోతామ’ని అడిగేది. ఒక పాత్రలో లీనమయ్యేందుకు అంతగా తపించే నేటితరం నటి సమంత. 

కొత్తతరం నటులతో సులభంగా కలిసిపోతుంటారు. వాళ్లతో కలిసి పనిచేస్తున్నప్పుడు సెట్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? 
రాజేంద్రప్రసాద్‌: ‘నీతో పాటుగా కలిసి ప్రయాణం చేసిన నటులు చాలామంది సినిమాలకి దూరంగా ఉంటున్నారు. మీరు మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఏమిటా రహస్యం?’ అని చాలామంది అడుగుతుంటారు. ఇప్పుడున్నది కొత్తతరమే కావొచ్చు కానీ, మనం వాళ్ల ఆలోచనలతో కనెక్ట్‌ అయితే చాలు. ఇక మిగతాదంతా మామూలే. నేను చూసింది, అనుభవించింది అదే. నిన్నటితరం దర్శకులతో మేం కూడా ఇలాగే ఉండేవాళ్లం. కాకపోతే నాకున్న అదృష్టం ఏంటంటే... నేను పడటం పడటమే ఎన్టీఆర్‌ దగ్గర పడ్డాను. ఆయన దగ్గర పనిచేశామంటే పరిశ్రమలో ఎవరితోనైనా బ్రహ్మాండంగా రాణించొచ్చు. తెల్లవారుజామున 3 గంటలకి రమ్మనేవారు. అప్పుడు వెళ్లాలంటే నేనెప్పుడు లేవాలి, ఎప్పుడు స్నానం చేయాలి. రాత్రంతా పడుకొనేవాణ్నే కాదు. వెళ్లి డోర్‌ బెల్‌ కొట్టగానే ‘ఎస్‌... ప్రసాద్‌ కమ్‌ ఇన్‌’ అనేవారు. పర్‌ఫెక్షన్‌ అంటే ఏమిటో ఆయన దగ్గరే నేర్చుకున్నా. 

ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నది ఈ సినిమాలో ఉపయోగించి నటించా అని చెప్పారు. ఇందులోని పాత్ర మీలోని నటుడికి ఎలాంటి సవాళ్లనిచ్చింది? 
రాజేంద్రప్రసాద్‌: ఇందులోని నటీనటులెవ్వరూ కూడా నటిస్తున్నట్టు కనిపించరు. పాత్రలు అంత సహజంగా ఉంటాయి. మేం ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకున్నదే సహజంగా నటించడం. అబ్జర్వేషన్‌ గురించి ఒక సబ్జెక్టు ఉండేది. మనం బయట ఎక్కడో గమనించింది, గుర్తు చేసుకొని నటించడం. ఇందులో నేను మద్యం తాగిన వ్యక్తిగా ఓ సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అది తీసేటప్పుడు సాయంత్రం నుంచి అలా ఊగుతూనే ఉన్నా. మనది కాని సన్నివేశంలోకి మనం వెళ్లి అందులో లీనం కావడం. భావోద్వేగాలు పండించాల్సి వస్తే నేను మా అమ్మని గుర్తు చేసుకుంటా. నాకు పదేళ్లున్నప్పుడు మా అమ్మ చనిపోయారు. ఒక నటుడు లీనం కావడం అలా ఉంటుందన్నమాట. ఇందులో చాలా సన్నివేశాల్ని అలా కొన్ని మెథడ్స్‌ ఉపయోగించి చేయాల్సి వచ్చింది. నా దృష్టిలో ప్రత్యేకమైన చిత్రమిది. నందినిరెడ్డి చాలా బాగా తీర్చిదిద్దింది. లక్ష్మీభూపాల్‌ రాసిన సంభాషణలు కూడా చాలా సహజంగా ఉంటాయి.

‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో ప్రతినాయక ఛాయలతో కూడిన పాత్ర చేశారు. పూర్తిస్థాయి ప్రతినాయక పాత్రలు చేయడానికి సిద్ధమేనా? 
రాజేంద్రప్రసాద్‌: వ్యతిరేక ఛాయలున్న పాత్రలు ఎందుకు చేయకూడదు? ఇప్పుడు జగపతిబాబు అద్భుతంగా చేస్తున్నారు కదా. కాకపోతే నటుడిగా నన్ను ప్రాణప్రదంగా ప్రేమించేవాళ్లకి ఆ పాత్రలు నచ్చడం లేదు. ‘ఎఫ్‌2’ చేస్తున్నప్పుడు అనిల్‌ రావిపూడి కూడా ఇలాగే ఆలోచించారు. ఒక సన్నివేశంలో ప్రకాష్‌రాజ్‌ నా చెంపపై కొట్టాలి. కానీ ఆ సన్నివేశాన్ని మరోలా మార్చి తీశాడు. 

హాస్యనటులు చాలామంది కథానాయకులు అవుతున్నారు. కానీ వాళ్ల నిలదొక్కుకోవడంలో విఫలమవుతున్నారు. ఆ విషయంపై మీ అభిప్రాయమేమిటి? 
రాజేంద్రప్రసాద్‌: రేలంగి, రాజబాబు తదితరులు అద్భుతమైన చిత్రాలు చేశారు. నాకు తెలిసినంత వరకు హాస్యనటుడు కథానాయకుడిగా నవ్వించడం వేరు. కథానాయకుడు హాస్యం పండించడం వేరు. రెండింటికీ బోలెడంత తేడా ఉంది. హాన్యనటుడికి ఎప్పుడూ లిమిట్‌ ఉంటుంది. తొలి ఫ్రేమ్‌ నుంచి, చివరి ఫ్రేమ్‌ వరకు ‘లేడీస్‌ టైలర్‌’ తరహాలో నవ్వించాలి. ప్రేక్షకులు వాళ్లని భరించాలి. అప్పుడే హీరో అనిపించుకుంటాడు. అయితే ఎవ్వరికైనా కాన్ఫిడెన్స్‌ ఉండటంలో తప్పు లేదు, నిజం మాత్రం అదే. 

మీరు కొత్తగా చేస్తున్న సినిమాలేమిటి? 
రాజేంద్రప్రసాద్‌: ‘ఓ బేబీ’, ‘బుర్రకథ’తో పాటు... ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రాలు వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం మహేష్‌బాబుతో కలిసి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నా. త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ చిత్రం చేస్తున్నా. తెలుగు, కన్నడ భాషల్లో ‘కాలేజ్‌ కుర్రాడు’ అనే సినిమా చేస్తున్నా. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.