close

తాజా వార్తలు

ఓ బేబీస్‌!!

ఓ బేబీ... ఈ సినిమా గడిచినంతసేపు సమంత కనిపిస్తే... ఆ సినిమా వెనుక    నిర్మాణం నుంచి దర్శకత్వం వరకూ... సెట్‌ డిజైనింగ్‌, ఆర్ట్‌ డిజైనింగ్‌, దుస్తుల ఎంపిక... ఇలా ప్రతి విభాగంలో మహిళలు పనిచేశారు. ఇంతకీ వాళ్లెవరూ, ఏమేం చేశారో తెలుసుకుందామా...

కథ ఎలా తెలిసిందంటే...
- తాటి సునీత, నిర్మాత 

నేను 2016లో ముంబయిలో ఓ కొరియా సంస్థకు కన్సల్టెంట్‌గా పనిచేశా.  ఆ సమయంలో క్రాస్‌పిక్చర్స్‌ సీఈవో థామస్‌ అనే వ్యక్తి నాకు ఓ స్నేహితుడి ద్వారా పరిచయం అయ్యారు. ఆయన కొన్ని కథలు ఇచ్చి... ‘వీటిని సినిమాగా తీస్తే భారత్‌లో బాగా ఆడతాయి’ అని చెప్పారు. అన్నింట్లో నన్ను ఆకట్టుకుంది మిస్‌గ్రానీ సినిమా. అప్పటికే ఆ సినిమా అక్కడ విజయవంతం కావడంతో ఆ హక్కులు తీసుకున్నా. మర్నాడు ఏదో పనిపై మళ్లీ ముంబయి వెళ్తుంటే ఆ విమానంలో నా ముందు సీట్లో సమంత. తనైతేనే దీనికి న్యాయం చేయగలదని అనిపించి తన నంబర్‌ తీసుకుని ట్రైలర్‌ పంపించా. తను అంగీకరిస్తూనే నందినిరెడ్డి ఈ సినిమా తీస్తే బాగుంటుందని సూచించింది. నేను డబ్బు పెట్టడంతోపాటు సురేష్‌బాబునీ సంప్రదించా. అలా సినిమా మొదలైంది. మా స్వస్థలం విజయవాడ అయినా ముప్పై ఏళ్ల క్రితమే మేం అమెరికాలో స్థిరపడ్డాం. అక్కడే ఎంబీఏ పూర్తి చేశా. మా తాతగారు అరవైల్లో వాణీ ఫిల్మ్స్‌ పేరుతో సినిమా పంపిణీదారుగా ఉన్నారు. సినిమాపై ఆసక్తితోనే న్యూయార్క్‌ యూనివర్సిటీలో చేరి 24 క్రాఫ్ట్స్‌ గురించి తెలుసుకున్నా. ఇక్కడకు వచ్చాక కొన్నాళ్లు సురేష్‌బాబు దగ్గర పనిచేశా. తరువాత సొంతంగా గురు ఫిల్మ్స్‌ పేరుతో ఆరు సినిమాలను నిర్మించా. ఓ బేబీ మాత్రం మరుపురాని అనుభూతి. 

నటిస్తూనే! 
- స్వప్నిక, సహ దర్శకురాలు

నేను ఈ సినిమాకి అసోసియేట్‌ డైరెక్టర్‌గా, కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌, యాక్షన్‌ కంటిన్యుటీ వర్క్‌లను చూసుకున్నా. రాజా రవీంద్ర...సునయనని కొట్టే ఓ పాత్రలోనూ నటించా. మొదటి నుంచీ నాకు నిర్మాణ రంగం అంటే ఆసక్తి. మాది గుంటూరు. విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఇంజినీరింగ్‌ చేశా. ఇప్పటి వరకూ ముప్ఫైఐదు సినిమాలకు పనిచేశా.  నా ఆసక్తిని గమనించిన నందిని ఇందులో అవకాశం ఇచ్చారు. 

ఇంటర్న్‌షిప్‌తో సినిమాల్లోకి... 
- చంద్రిక, సెట్‌ డిజైనర్‌

నేను చదివింది ఆర్కిటెక్చర్‌. మహానటి కోసం ఆర్కిటెక్ట్‌లను వెతుకుతున్నారని తెలిసి ప్రయత్నించా. అవకాశం వచ్చింది. ఓ ఇంటినో, ఆఫీసునో డిజైన్‌ చేయడం కన్నా, సెట్‌ డిజైనర్‌గా సినిమాల్లో చేయడం సవాలే. ప్రొడక్షన్‌ ఆర్ట్‌ డిజైనర్‌ల ఆలోచనలకు అనుగుణంగా...సెట్‌లను తీర్చిదిద్దడం చెప్పినంత సులువు కాదు. మహానటిలో మొదటి ఆరునెలలు ఇంటర్న్‌గా పనిచేసి ఆ తరువాత నుంచి పారితోషకం అందుకున్నా. ఇప్పుడు ఓ బేబీ చేశా. సినిమా ఏదైనా కథ, పాత్రలతోపాటు దాని చుట్టూ ఉండే వాతావరణమూ ఆకట్టుకునేలా ఉండాలి. దోమల మందు నుంచి డోర్‌ కర్టెన్‌ల వరకూ ప్రతిదీ జాగ్రత్తగా ఎంపిక చేసుకొనే బాధ్యతలన్నీ సెట్‌ డిజైనర్‌దే. మహానటి, ఓ బేబీ ఈ రెండింట్లో పాత కాలం నాటి అంశాలను చేరుస్తూ సెట్లు డిజైనింగ్‌ చేయడం నాకు కొత్తగా అనిపించింది. మాది హైదరాబాదే. నాన్న రమేశ్‌చంద్రబాబు వ్యాపారం చేస్తారు. అమ్మ జ్యోతి గృహిణి.  ప్రస్తుతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో ఓ చిత్రం చేస్తున్నా. 

అంతా అమ్మాయిలే చేస్తారని ఊహించలేదు
- నందినీరెడ్డి, దర్శకురాలు! 

బేబీ కథ చర్చిస్తున్నప్పుడే ఇది మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్థమైంది. అయితే ప్రతి విభాగంలో అమ్మాయిలు ఉండాలని తీసుకోలేదు. ప్రతిభ ఉన్న వారిని ఎంచుకున్నాం. తీరా చూస్తే అంతా మహిళలే కలిసి ఈ సినిమాను రూపొందించారు. సునీత కథ తెచ్చి... సమంత చేస్తే బాగుంటుందని చెప్పింది. సమంత నన్ను సూచించింది. నేను మలయాళంలో వచ్చిన చార్లీ సినిమాకి పెద్ద అభిమానిని. దానికి ఆర్ట్‌డైరెక్టర్‌గా పనిచేసిన జయశ్రీ కోసం చాలా రోజులుగా ప్రయత్నించా. ఇప్పుడు ఆమెతో పనిచేయగలిగా. ఆమె చంద్రికను సెట్‌ డిజైనర్‌గా ఎంచుకుంది. సహ నిర్మాతల్లో ఒకరైన వివేక్‌ కూఛిబొట్ల తరఫున దివ్యా విజయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించింది. నా అసిస్టెంట్‌ స్వప్నిక, అసిస్టెంట్‌ కెమెరా ఉమన్‌గా ప్రియాంక పనిచేశారు. ఇలా ప్రతి విభాగంలోనూ ఓ మహిళ కీలకంగా వ్యవహరించింది. మా కష్టానికి తెరపై సమంత, లక్ష్మి నటన ఓ అద్భుతం. ఈ రంగంలో అమ్మాయిలకు అవకాశాలు తక్కువ. మాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అంతా కసిగా, పట్టుదలగా పనిచేశాం. ఓ దర్శకురాలిగా... పనిలో మగ, ఆడ అనే తేడా కన్నా ఎంత బాగా పని జరిగింది అనేదే నాకు ముఖ్యం. ఈ మహిళలంతా చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకున్నారు. ఈ సినిమా విజయం ఈ రంగంలోకి రావాలనుకునే మరెంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నా. 

అన్నీ భిన్నంగా ఉండేలా...
- జయశ్రీ లక్ష్మీనారాయన్‌, ప్రొడక్షన్‌ ఆర్ట్‌ డిజైనర్‌ 

థ విన్నాక సన్నివేశాలు ఉండే సమయం తెలుసుకుని, ఎలా డిజైన్‌ చేయాలో ఆలోచించా. ముందు నా ఐడియాలను కాగితంమీద పెట్టి, అందుకు తగ్గట్లుగా  పనిచేశా. అరవైఏళ్ల అమ్మమ్మ, ఇరవై రెండేళ్ల పడుచుపిల్ల... రెండు విభిన్న పాత్రలు ఈ సినిమాని నడిపిస్తాయి. దానికి తగినట్లుగా ఆ వాతావరణాన్ని తీర్చిదిద్దా. బేబక్క వ్యక్తిత్వం తెలిసేలా రెట్రో తరహాలో లేత రంగుల్ని ఎంచుకున్నా. సమంత పాత్రకోసం ముదురు రంగులు, ఆమెలోని సంతోషం, ఆశ్చర్యం కలబోసేందుకు పరిసరాల్ని డిజైన్‌ చేశా. ఒకప్పటి రోజుల్ని గుర్తు తెచ్చే కాలేజీ క్యాంటీన్‌, చంటి ఇల్లు, బేబక్క వాడే వస్తువులు భిన్నంగా ఎంచుకున్నా. క్యాంటీన్‌లో బల్లలు, గడియారం... అన్నీ ప్రత్యేక శ్రద్ధతో ఉండేలా చూసుకున్నా. మలయాళంలో నేను చేసిన చార్లీ సినిమా చూసిన నందిని తనతో కలిసి పనిచేయని అడిగింది. ఇది నా మొదటి తెలుగు సినిమా. ఇప్పటివరకూ బాలీవుడ్‌, కోలీవుడ్‌, తమిళ పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉంది. చెన్నైలోని ఎంవోపీ వైష్ణవి మహిళా కళాశాలలో ఎంఏ బ్రాడ్‌కాస్టింగ్‌ కమ్యూనికేషన్‌ పూర్తి చేశా. ఓ అర్ట్‌ డైరెక్టర్‌ దగ్గర ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం రావడంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టా. ఇది నాకు మంచి అవకాశంగా భావించా. 

రెండోసారి మహిళా బృందంతో...

నేను, శిల్ప మహానటికి కాస్ట్యూమ్‌ అసిస్టెంట్స్‌గా పనిచేశాం. మా ఇద్దరికీ అక్కడే పరిచయం అయ్యింది. ఆ తరువాత ఇద్దరం కలిసి ఓ వెబ్‌ సిరీస్‌కి, ఆపై విజేత, దేవదాస్‌ వంటి సినిమాలకు పనిచేశాం. ఇప్పుడు ఓ బేబీలో ఒక్క సమంతకి తప్ప సినిమా మొత్తానికి మేం దుస్తుల్ని డిజైన్‌ చేశాం. 

నాన్న స్ఫూర్తితో...  
- దివ్యావిజయ్‌!, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 

సినిమాకు ఫండ్స్‌ సేకరణ నుంచి ప్రమోషన్స్‌ వరకూ ప్రతి పనిలోనూ భాగమయ్యా. కొరియా సినిమాను ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా తీయడంలో అంతా వందశాతం కష్టపడ్డాం. ప్రత్యేకంగా రాజేంద్రప్రసాద్‌, లక్ష్మీల క్యాంటీన్‌ ఏర్పాటులో ఎక్కడా రాజీ పడలేదు. గ్లాస్‌పెయింటింగ్‌ దగ్గర నుంచి గాజుసీసాల్లోని క్యాండీల ఏర్పాటు వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకున్నాం. సమంత పాడే పాట కోసం స్టేజి ఏర్పాటు... ఇలా ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్లు వచ్చేలా జాగ్రత్తపడ్డాం. ఇది నా రెండో సినిమా. మొదటిది రంగస్థలం. నాన్న విజయ్‌ స్టంట్‌మాస్టర్‌. ఆయన స్ఫూర్తితోనే నాకు సినిమా నిర్మాణంపై ఆసక్తి పెరిగింది. ఇంజినీరింగ్‌ చదివి, అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశా. ఆస్ట్రేలియాలో కొన్నాళ్లు పనిచేసినా ఏదో అసంతృప్తి. నాకు అనువైన రంగం సినిమా అని అనిపించింది. అందుకే ఇటు వచ్చేశా.

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.