close

తాజా వార్తలు

ఇవి నేర్పుకోండి!

కీలక నైపుణ్యాలు: 2020


సెన్స్‌ మేకింగ్‌


నావెల్‌ అండ్‌ అడాప్టివ్‌ థింకింగ్‌


క్రాస్‌ కల్చర్‌ కాంపిటెన్సీ


న్యూ మీడియా లిటరసీ


ట్రాన్స్‌ డిసిప్లినారిటీ


సోషల్‌ ఇంటెలిజెన్స్‌


కంప్యూటేషనల్‌ థింకింగ్‌


వర్చువల్‌ కొలాబరేషన్‌


నిన్నలా, మొన్నలా.. రేపు ఉండటం లేదు! ప్రపంచంతో అనుసంధానం (గ్లోబల్‌ కనెక్టివిటీ) పెరిగింది. స్మార్ట్‌ మెషిన్స్‌, న్యూ మీడియా లాంటివి దూసుకొచ్చేశాయి. ఇలాంటి కొత్త గాలులు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూప స్వభావాలను మార్చేస్తున్నాయి. వాటికి అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవటానికి యువత సంసిద్ధం కావాలి. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ద ఫ్యూచర్‌’ లాంటి సంస్థలు వివిధ రంగాలను పరిశీలించి 2020కి కావాల్సిన నైపుణ్యాలను రూపొందించాయి. వస్తున్న, రాబోతున్న మార్పులకు దీటుగా నిలదొక్కుకోవాలంటే.. వీటిని నేర్చుకోవాలి, సాధనతో పదును పెట్టుకోవాలి. నేటి ‘వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డే’ సందర్భంగా ఈ ఫ్యూచర్‌ వర్క్‌ఫోర్స్‌ నైపుణ్యాల గురించి తెలుసుకుందామా!?
కళాశాలల నుంచి గ్రాడ్యుయేషన్‌ పట్టా పుచ్చుకున్నా జాబ్‌ మార్కెట్‌లో విఫలమవుతున్నవారే ఎక్కువ. సాధారణ డిగ్రీలకే కాదు; వృత్తివిద్యలకూ ఇది వర్తిస్తోంది. విద్యార్థులు తాము కోరుకున్న ఉద్యోగం సాధించలేకపోవడమో, అర్హతకు తగ్గ కొలువు దక్కించుకోలేకపోవడ[మో జరుగుతోంది. బాగా కష్టపడుతూ మంచి మార్కులు, గ్రేడ్‌లతో ఉత్తీర్ణులవుతున్నా కార్పొరేట్‌ అంచనాలను అందుకోలేకపోతున్నారు. మరో పక్క సాంకేతిక ప్రగతి మూలంగా ఉద్యోగాల్లో సరికొత్త నైపుణ్యాల అవసరం పెరుగుతోంది. అంటే.. కేవలం హార్డ్‌వర్క్‌ను నమ్ముకుంటే ఉద్యోగం చేజిక్కించుకోవటం కష్టమే. నియామక సంస్థలు అర్హతలతోపాటు అత్యాధునిక నైపుణ్యాలున్నవారిని కోరుకుంటున్నాయి.
3 నుంచి 5 ఏళ్లపాటు కళాశాల జీవితాన్ని గడిపినా డిగ్రీని మాత్రమే సంపాదించగలుగుతున్నారు. కానీ, కొలువులకు పనికొచ్చే నైపుణ్యాలను నేర్చుకోలేకపోతున్నారు. దీనికి సరైన వేదికలు లేకపోవడం కారణం కాదనీ, జాబ్‌ మార్కెట్‌లో విజయం సాధించడానికి ఏం నేర్చుకోవాలన్నదానిపై అవగాహన లేకపోవడమే ముఖ్య కారణమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే.. వచ్చే ఏడాది, సమీప భవిష్యత్తులో ఉద్యోగజీవితంలో అడుగుపెట్టబోయేవారు ఇప్పటినుంచే దృష్టిపెట్టాల్సిన కీలక నైపుణ్యాలను సంగ్రహంగా పరిశీలిద్దాం.

కలివిడితనం: సోషల్‌ ఇంటెలిజెన్స్‌

ఇంట్లో అయినా, పనిచేసేచోట అయినా ప్రతి ఒక్కరూ తోటివారి నుంచి ప్రేమ, గౌరవం ఆశిస్తారు. ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్నే సోషల్‌ ఇంటెలిజెన్స్‌ నైపుణ్యంగా చెబుతున్నారు. అంటే.. తన గురించీ, ఇతరుల గురించీ సవ్యమైన అవగాహన ఉండాలి. ఇతరులతో ఎంత బాగా కలిసిపోతారు అన్నదానిపై ఈ నైపుణ్యం ఆధారపడి ఉంటుంది.
ఎలా అలవర్చుకోవాలి: ఇతరులతో సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే వాళ్ల ప్రవర్తను మనం అంగీకరించాలి. ఉదాహరణకు ఒక విషయంలో అందరి అభిప్రాయం సానుకూలంగానే ఉండాలనేం లేదు. ఒక్కోసారి మీకు వ్యతిరేకత రావొచ్చు. అలాంటప్పుడు వారి అభిప్రాయం వినడం, వివాదం అవుతుందనిపిస్తే మౌనంగా ఉండటం కూడా బంధాన్ని నిలబెడుతుంది. కొత్తవారితో సంభాషణ ప్రారంభించడం, విజయవంతంగా ముగించడం వంటివీ ఈ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సాయపడతాయి.


లోతైన ఆలోచన: సెన్స్‌ మేకింగ్‌

రోబోలు ఎంత స్మార్ట్‌గా, త్వరగా పనిచేసినా కొన్ని నైపుణ్యాలను మాత్రం అవి ప్రదర్శించలేవు. దానిలో సెన్స్‌ మేకింగ్‌ ఒకటి. ఒక విషయానికి సంబంధించి లోతుగా ఆలోచించడం, దాని అవసరాన్ని గుర్తించడం వంటివి కోడింగ్‌ సాయంతో అవి చేయలేవు. ఉదాహరణకు ఒక కంప్యూటర్‌తో చదరంగం ఆడుతున్నపుడు వ్యక్తి కంటే సిస్టమ్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే దానిలో వ్యక్తి వేయగల ఎత్తుల సంభావ్యతను అది సెకన్లలో లెక్కగట్టి, ఆ ప్రకారం నడుచుకుంటుంది. అదే ఏదైనా విషయంలో వ్యక్తులను ఒప్పించడం వంటివి అది చేయలేదు. కాబట్టి, ఈ నైపుణ్యం ఉన్నవారికి అవకాశాలు తప్పక ఉంటాయి.
ఎలా అలవర్చుకోవాలి: ఆన్‌లైన్‌లో ఒక వస్తువు కొనాలంటే ఏం చేస్తాం? నాలుగు వెబ్‌సైట్‌లు చూస్తాం. దేనిలో తక్కువ ధరకు వస్తోందో, అప్పటికే ఉపయోగించిన వారి ఫీడ్‌బ్యాక్‌తో నిర్ణయం తీసుకుంటాం. ఇక్కడ ఇంత సమాచారాన్ని సేకరిస్తాం కాబట్టి, సరైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమౌతుంది. ఇదే పద్ధతిని ప్రతి నిర్ణయం విషయంలో పాటించగలగాలి. వివిధ వనరుల నుంచి సమాచారం సేకరించడం, ఇతరుల సాయం తీసుకోవడం, పరిశోధన చేయడం వంటివి అలవాటు చేసుకుంటే సెన్స్‌ మేకింగ్‌ సులభమవుతుంది.
ఎలా అలవర్చుకోవాలి: 


అధునాతన బృందం: వర్చువల్‌ కొలాబరేషన్‌

స్నేహితులంతా మొబైల్‌లో ఒకే వేదికగా మాట్లాడుకోవాలనుకునప్పుడు వాట్సాప్‌, మెసెంజర్లలో గ్రూప్‌చాట్‌ను ఎంచుకుంటుంటారు. దూరంగా ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవాలనుకున్నప్పుడు గ్రూప్‌ వీడియో కాలింగ్‌ ఎంచుకుంటుంటారు. ఈ తరహా అనుసంధానానికి సంస్థలు ఉపయోగిస్తున్న పేరు- వర్చువల్‌ కొలాబరేషన్‌. ఒక ప్రాజెక్టు మీద పనిచేసేవారు కొన్నిసార్లు వివిధ ప్రదేశాల్లో, ఒక్కోసారి విదేశాల్లో ఉండొచ్చు. వీరంతా దాని మీద సమీక్ష జరపాలనుకున్నప్పుడు ఒకచోట కలవడం అన్నిసార్లూ కుదరదు. పైగా సమయ వృథా. అందుకని సంస్థలూ తమకంటూ ఈ-మెయిల్‌, ప్రత్యేకమైన మైక్రో బ్లాగింగ్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లను ఉపయోగించుకుంటూ పని మీద చర్చలు, అభిప్రాయాలు పంచుకుంటాయి.
ఎలా అలవర్చుకోవాలి: ఉద్యోగిగా వర్చువల్‌ బృందంలో రాణించాలంటే.. సోషల్‌ మీడియా అకౌంట్‌ గ్రూపులు, మల్టిపుల్‌ వీడియో కాలింగ్‌లపై అవగాహన ఏర్పరచుకుంటే చాలు. ఇప్పుడు మార్కెట్‌లో ఇలాంటివి చాలానే అందుబాటులో ఉన్నాయి. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, గూగుల్‌ డువో వంటివి ఇందుకు సాయపడతాయి.


సువిశాల పరిధి: క్రాస్‌ కల్చర్‌ కాంపిటెన్సీ

మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్లడం, అక్కడి వారు మన దగ్గరికి రావడం ఇప్పుడు సాధారణం అయింది. సంస్థలూ ఒక ఉత్పత్తిని రూపొందించే విషయంలోనో, తమ వస్తువును ఆ దేశంలో పరిచయం చేయడానికో ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంటాయి. అప్పుడు ఉద్యోగులు ఒప్పందం చేసుకున్న సంస్థ ఉద్యోగులతోపాటు అక్కడి కస్టమర్లతోనూ లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు భిన్న సంస్కృతులున్న అవతలివారిని అర్థం చేసుకోవడం, వారితో కలిసి పనిచేయడం తప్పనిసరి.
ఎలా అలవర్చుకోవాలి:  కొత్త ప్రదేశాలకు వెళ్లండి. మనదేశంలోనే ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చు. వారి ఆచార వ్యవహారాలను గమనించడం, వారితో కలివిడిగా మాట్లాడటం లాంటివి చేయొచ్చు. వారిపై మీకిదివరకే ఒక అభిప్రాయం ఉంటే దానిని పక్కనపెట్టి సరిగా అర్థం చేసుకోవాలి. అవసరమైతే సోషల్‌ మీడియా సాయాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల మన పరిధి, దృక్పథం విశాలమవుతాయి.


గణాంకాల గ్రహింపు: కంప్యూటేషనల్‌ థింకింగ్‌

వివిధ సంస్థలు ఏడాదికోసారి తమ పనితీరును గ్రాఫుల, చార్టుల రూపంలో విడుదల చేస్తుంటాయి కదా! సంస్థ చిన్నదైనా, పెద్దదైనా లావాదేవీలు, ఇతర సమాచారం ఎక్కువగానే ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇదంతా ఒకచోట క్రోడీకరించాల్సివుంటుంది.డేటాను యాబ్‌స్ట్రాక్ట్‌ కాన్సెప్టులుగా మార్చగలగటమూ, డేటా ఆధారిత రీజనింగ్‌ను అర్థం చేసుకోవటమే ఈ నైపుణ్యం.
ఎలా అలవర్చుకోవాలి: స్టాటిస్టికల్‌ అనాలిసిస్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ వంటి బేసిక్‌ అప్లికేషన్లపై అవగాహన పెంచుకోవాలి. మీ రెజ్యూమెలో వీటికి చోటు కల్పించేలా తగిన పరిజ్ఞానం సంపాదించాలి. .


సవాళ్లకు జవాబు:   నావెల్‌ అండ్‌ అడాప్టివ్‌ థింకింగ్‌

ఆఫీసుకు మీరు తరచూ ప్రయాణించే దారి మూసేస్తే ఏం చేస్తారు? తక్కువ సమయంలో చేరగల ఇంకో మార్గాన్ని వెతుక్కుంటారు. అవునా? పనిచేసే చోటా అంతే! అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి. వాటికి బెదర[కుండా త్వరగా, ఆచరణీయ మార్గం గ్రహించడమే ఈ నైపుణ్యం. అయితే ఆ చేసే కొత్త ఆలోచన మెరుగైనదిగా, నియామక సంస్థకు ఉపయోగపడేదిగా ఉండాలి.
ఎలా అలవర్చుకోవాలి:  అనుకోని సవాళ్లకు సిద్ధంగా ఉండండి. ఏదైనా పరిస్థితి ఎదురైనపుడు ఎలా, ఎన్ని విధాలుగా చేయొచ్చో ఆలోచించండి. అన్నీ విజయం సాధించాలనేం లేదు.  ఇదివరకు  చేసిన ప్రాజెక్టులయినా ఇంకోలా ఎలా చేయొచ్చో ఆలోచించండి.


సోషల్‌మీడియా:   న్యూ మీడియా లిటరసీ


డిజిటల్‌ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాక సమాచార లభ్యత చాలా సులువైంది. చాలామంది ఏ సమాచారానికైనా మొబైల్‌, కంప్యూటర్లపై ఆధారపడుతున్నారు. ఈ సమయంలో సంస్థలూ తమ ప్రాధమ్యాలను మార్చుకుంటున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించి చిన్న చిన్న వీడియోలను పోస్ట్‌ చేస్తుండటం గమనించే ఉంటారు. ఈ చర్య వినియోగదారులకు ఉత్పత్తిని దగ్గర చేయడమే కాకుండా, కొత్తవారికీ ఆసక్తిని కలిగిస్తుంది.ఖర్చూ తక్కువే.
ఎలా అలవర్చుకోవాలి:  మల్టీమీడియా సంబంధిత అంశాలపై అవగాహన పెంచుకోవాలి. వివిధ సంస్థలు సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోకడలను అనుసరిస్తున్నాయో గమనించాలి. వాటిపై అభిప్రాయాలను రాసుకోవడం, వాటిని ఉత్తమంగా చేయడానికి మీరు భావించిన సలహాలనూ జతచేసుకోవాలి.


ఆల్‌రౌండర్‌:   ట్రాన్స్‌డిసిప్లినారిటీ

గ్లోబల్‌ వార్మింగ్‌, జనాభా పెరుగుదల.. ఇలాంటి సమస్యలు పరిష్కరించడానికి ఏదో ఒక విభాగం సరిపోదు. వివిధ డిపార్ట్‌మెంట్ల సలహాలు అవసరమవుతాయి. సంస్థల విషయంలోనూ ఇలాంటి ధోరణి అవసరమే. కాబట్టి, ఉద్యోగులకు తమ రంగంపై పట్టు, ఇతర రంగాలపై కనీసం ప్రాథమిక అవగాహన అవసరం తప్పనిసరి అవుతోంది.
ఎలా అలవర్చుకోవాలి: ఇప్పుడు మీరు ఇంజినీరింగ్‌లో మెకానికల్‌ చదువుతున్నారనుకుందాం. మీ బ్రాంచిపై మీకు పట్టు తప్పక ఉంటుంది. అది సాధారణమే. కానీ ఇతర బ్రాంచిలపైనా స్థూలమైన అవగాహన పెంచుకోవాలి. ఏదైనా సమస్య ఎదురైనపుడు దానికి మీరు ఏ పరిష్కారం చూపలేకపోయినా కనీసం ఎవరు చూపించగలరో తెలియాలి. మిగతా బ్రాంచిల తీరు తెలిసినపుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి, మీ సబ్జెక్టుతోపాటు పక్కవాటి గురించీ తెలుసుకుంటుండాలి.

  


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.