close

తాజా వార్తలు

ఇది మా బ్యాగ్రౌండ్‌

ఈ హీరోయిన్ల బ్యాగ్రౌండ్‌ ఏంటో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం వారసత్వం అనేది ప్రతి రంగంలోనూ ఒక సాధారణ విషయమైపోయింది. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు హీరో కొడుకు హీరోనే అవుతాడు.. అన్నీ బాగుంటే స్టార్‌ హీరో అవుతాడు. లేకపోతే జీరో అవుతాడు. ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు తమ కుమార్తెలను వెండితెరపై తీసుకురావడానికి చాలా ఆలోచించేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్‌ పూర్తిగా పోయింది. ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా ఓ వెలుగు వెలిగిన సినీ తారల కుమార్తెలూ ఇప్పుడు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. 

అక్కాచెల్లెళ్లు..

నటనకు మరో రూపం అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌. రాజీకయ రంగ ప్రవేశంతో ఇటీవల ఆయన నుంచి సినిమాలు తగ్గాయనే చెప్పాలి. అయితే, ఆ లోటును ఆయన కుమార్తెలు శ్రుతిహాసన్‌, అక్షరాహాసన్‌ తీర్చేస్తున్నారు. కమల్‌ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతి అటు గాయనిగా, ఇటు నటిగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఇక అక్క బాటలోనే పయనించిన అక్షరాహాసన్‌ కూడా ఇటీవల పలు చిత్రాల్లో తళుక్కున మెరుస్తోంది. తాజాగా విడుదలైన ‘మిస్టర్‌ కేకే’లో తనదైన నటనతో మెప్పించింది. 

తొలి చిత్రంతోనే తండ్రిని మించిన తనయగా..

అద్భుతంగా డైలాగ్‌లు చెప్పే అతికొద్ది మంది నటుల్లో మోహన్‌బాబు ఎప్పుడూ ముందుంటారు. ఆయన నట వారసురాలిగా వెండితెరకు పరిచయమైన మంచు లక్ష్మి వరుస చిత్రాల్లో నటించి మెప్పించారు. తొలి చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’తో ఏకంగా ఉత్తమ ప్రతినాయకురాలిగా నంది అవార్డు అందుకున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. 

మెగా ఫ్యామిలీ నుంచి..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి అత్యధికమంది కథానాయకులు వెండితెరపై అలరించారు. అయితే అదే స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల. ‘ముద్ద పప్పు ఆవకాయ’ వెబ్‌సిరీస్‌తో నెట్టింట సందడి చేసిన ఈ చిన్నది ఆ తర్వాత ‘ఒక మనసు’తో వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత ‘హ్యాపీ వెడ్డింగ్‌’, ‘సూర్యకాంతం’చిత్రాలతో అలరించింది. సినిమాలో తన పాత్ర ముద్ర ఉంటేనే ఆ కథకు నిహారిక ఓటేస్తున్నారు.

‘మహానటి’తో మంచి పేరు

‘మహానటి’ అంటే సావిత్రిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. అలాంటి బరువైన పాత్రను అలవోకగా పోషించి, అందరి మన్ననలు అందుకున్న నటి కీర్తిసురేశ్‌‌. మలయాళ దర్శక నిర్మాత సురేశ్‌ కుమార్‌, మేనకల కుమార్తె ఈమె. బాలనటిగా ఒకట్రెండు చిత్రాల్లో అలరించిన కీర్తి సురేశ్‌ ‘నేను శైలజ’తో తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుస తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం మర్కర్‌, మన్మథుడు2 చిత్రాల్లో ఆమె సందడి చేయనున్నారు. 

‘హలో’ అంటూ పలకరించింది!

ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌‌, మలయాళ నటి లీసాల కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ ‘హలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది సాయిధరమ్‌ తేజ్‌ సరసన ఆమె నటించిన ‘చిత్రలహరి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. శర్వానంద్‌తో చేసిన ‘రణరంగం’ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ, ఒక మలయాళ చిత్రంలో నటిస్తోంది.

విభిన్న పాత్రలను ఎంచుకుంటూ..

తమిళ తెరపై తనదైన నటనతో అలరించిన నటుడు శరత్‌కుమార్‌. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి మెప్పించారు. ఆయన కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌ కూడా అదే బాటలో నడుస్తోంది. గతేడాది బాక్సాఫీస్‌ వద్ద వరుస విజయాలను అందుకున్న ఆమె ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తోంది. ఇక తెలుగులో సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’లో కీలక పాత్ర పోషిస్తోంది. 

రాధ కూతుళ్లు..

 

ఒకప్పుడు తెలుగులో స్టార్‌ కథానాయికగా ఓ వెలుగు వెలిగిన నటి రాధ. ఆమె కుమార్తెలే కార్తీక, తులసి. చైతన్య కథానాయకుడిగా నటించిన ‘జోష్‌’తో వెండితెరకు పరిచయమైన కార్తీక ఆ తర్వాత ‘రంగం’, ‘దమ్ము’, ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాలి’ వంటి చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘వా డీల్‌’ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. ఇక కార్తీక చెల్లెలు తులసి  చేసింది రెండు సినిమాలే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘కడలి’లో ఆమె నటించి మెప్పించారు. ఆ తర్వాత జీవాతో ‘యాన్‌’ చేశారు. ప్రస్తుతం తులసి సినిమాలు చేయడం లేదు. 

వచ్చే ఏడాది వరకూ ఐశ్వర్య కాల్‌షీట్‌ ఖాళీ లేదు!

ఐశ్వర్యా రాజేశ్‌. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో బాగా బిజీగా ఉన్న నటి. తండ్రి రాజేశ్‌ నటించింది కేవలం ఓ 50 చిత్రాల్లోనే. అది చిన్నా చితకా పాత్రలు. కానీ, ఆయన కుమార్తె ఐశ్వర్య చేతి నిండా చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. గతేడాది ఆమె నటించిన ‘సామి2’, ‘నవాబ్’, ‘వడ చెన్నై’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక క్రికెట్‌ నేపథ్యంలో ఆమె నటించిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే వరుస తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఐశ్వర్య వచ్చే ఏడాది కూడా కాల్‌షీట్‌లు అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. 

బాలీవుడ్‌ నుంచి వస్తున్నారు!

సాధారణంగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన కథానాయికలు తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఇప్పుడు బాలీవుడ్‌ నుంచి అందునా, సినీ నేపథ్యం ఉన్న కథానాయికలు టాలీవుడ్‌లో సినిమాలు చేసేందుకు వస్తున్నారు. గతంలో పలువురు కథానాయికలు వచ్చారు. త్వరలో శ్రద్ధాకపూర్‌ తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రభాస్‌ సరసన ఆమె నటించిన ‘సాహో’ ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా సుజీత్‌ దీన్ని తెరకెక్కించారు. ఇక మరో భారీ ప్రాజెక్టుతో ఆలియాభట్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు రాబోతున్నారు. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఆమె సందడి చేయనున్నారు. 

వీరే కాదు, సోనాక్షి సిన్హా(శతృఘ్న సిన్హా), సోనమ్‌ కపూర్‌(అనిల్‌కపూర్‌), పరిణీతి చోప్రా(ప్రియాంక చోప్రా సోదరి), యామీ గౌతమ్‌(ముకేశ్‌ గౌతమ్‌) సారా అలీ ఖాన్‌(సైఫ్‌ అలీఖాన్‌), ట్వింకిల్‌ ఖన్నా(రాజేశ్‌ఖన్నా),  కరీనా కపూర్‌(రణ్‌ధీర్‌ కపూర్‌)ఇలా చాలా మంది సినీ కుటుంబ నేపథ్యం ఉన్న కథానాయికలు వెండితెరపై అలరిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.