close

తాజా వార్తలు

రివ్యూ: మన్మథుడు 2
న‌టీన‌టులు: నాగార్జున‌, ర‌కుల్‌ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌ కిషోర్‌, రావు ర‌మేష్‌, ఝాన్సీ, దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు
దర్శకత్వం: రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాత‌లు: నాగార్జున, పి.కిర‌ణ్‌
సంగీతం:  చైత‌న్‌ భ‌రద్వాజ్‌
ఛాయాగ్రహ‌ణం: ఎం.సుకుమార్‌
ప్రొడక్షన్‌ డిజైన‌ర్స్‌: ఎస్‌.రామ‌కృష్ణ‌, మౌనిక‌
స్క్రీన్‌ప్లే: రాహుల్ ర‌వీంద్రన్, స‌త్యానంద్‌
కూర్పు: ఛోటా కె.ప్రసాద్‌, బి.నాగేశ్వర రెడ్డి
సంభాష‌ణ‌లు: కిట్టు విస్సా ప్రగ‌డ‌, రాహుల్ ర‌వీంద్రన్‌
నిర్మాణ సంస్థలు: మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, వ‌యాకామ్ 18 స్టూడియోస్‌
విడుద‌ల‌: 9-8-2019

పిరి’ త‌ర్వాత నాగార్జున మ‌రోసారి ఫ్రెంచ్ క‌థ‌ని ఎంచుకొన్నారు. మాతృక‌లో క‌థానాయ‌కుడు మ‌ధ్య వ‌య‌స్కుడు కావ‌డం, ఆ పాత్రలో మన్మథుడి త‌ర‌హా ల‌క్షణాలు పుష్కలంగా ఉండ‌టంతో నాగార్జున ఎంతో ఇష్టపడి ఫ్రెంచ్ సినిమా ‘ఐ డు’ రీమేక్ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు. ‘చి.ల‌.సౌ’తో అటు సెంటిమెంట్‌నీ, ఇటు హాస్యాన్ని బాగా పండించి దర్శకుడిగా ప్రతిభ క‌న‌బ‌రిచిన రాహుల్ ర‌వీంద్రన్‌కి ఈ సినిమాని తీసే బాధ్యతలు అప్పగించారు. ‘మ‌న్మథుడు 2’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆ చిత్రం ఎలా ఉంది? నాగార్జున 17 ఏళ్ల క్రితం చేసిన ‘మ‌న్మథుడు’ సినిమాని గుర్తు చేసుకుంటూ థియేట‌ర్‌కి వెళ్లిన ప్రేక్షకుల‌కి, రెండో మ‌న్మథుడు ఎలాంటి వినోదాన్ని పంచాడు?

క‌థేంటంటే: పోర్చుగ‌ల్‌లో స్థిర‌ప‌డిన తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి సామ్ అలియాస్ సాంబ‌శివ‌రావు (నాగార్జున‌). ప్రేమ‌పై న‌మ్మకం కోల్పోయిన అత‌ను త‌న ఆనందం కోస‌మే జీవిస్తుంటాడు.  మ‌రోవైపు వ‌య‌సు మీద ప‌డ‌టంతో ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోవాల‌ని ఒత్తిడి చేస్తుంటారు. వాళ్ల మాట‌ల్ని పెడ‌చెవిన పెట్టి జీవితాన్ని ఆస్వాదిస్తుంటాడు సామ్‌. అయినా కుటుంబం నుంచి ఒత్తిడి త‌గ్గక‌పోవ‌డంతో అవంతిక (ర‌కుల్‌ప్రీత్ సింగ్‌)ని ప్రేమిస్తున్నానని ఆమెని తీసుకొచ్చి ప‌రిచ‌యం చేస్తాడు. పెళ్లి రోజున చెప్పా పెట్టకుండా వెళ్లిపోయేలా ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. త‌న‌కున్న స‌మస్యల కార‌ణంగా అందుకు ఒప్పుకుని ఇంటికొచ్చిన అవంతిక... సామ్‌ కుటుంబస‌భ్యుల‌కి దగ్గర‌వుతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఒప్పందం ప్రకారం ఆమె సామ్‌కి దూర‌మైందా? లేక సామ్‌ని పెళ్లి చేసుకుందా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ‘మ‌న్మథుడు 2’ అనే పేరు పెట్టడానికి కార‌ణం నాగార్జున పాత్రే. ఆయ‌న ప్లేబాయ్ అవ‌తారం ఆక‌ట్టుకుంటుంది. మ‌ధ్య వ‌య‌స్కుడి పాత్రే అయినా.. ఆయ‌న కుర్రాడిలాగా క‌నిపించారు. ఇదివ‌ర‌కు వ‌చ్చిన ‘మ‌న్మథుడు’ని మ‌న‌సులో పెట్టుకొని, ఆ అంచ‌నాల‌తోనే ఈ సినిమాకి వెళ‌తారు ప్రేక్షకులు. నాగ్ నిజంగానే మ‌న్మథుడిలా క‌నిపించినా... అందులోని కామెడీతో పోలిస్తే ఇక్కడ ఆ మోతాదు కాస్త త‌గ్గింది. నాగ్ ప్లేబాయ్ అవ‌తారం, వెన్నెల కిషోర్ కామెడీ, అవంతిక‌గా ర‌కుల్‌ చేసే సంద‌డితో ప్రథమార్ధం స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోతుంది. కామెడీ మాత్రం ఆశించిన స్థాయిలో పండ‌లేదు.

ద్వితీయార్ధంలో కామెడీతోపాటు, భావోద్వేగాలు పండాయి. చివ‌ర్లో త‌ల్లి నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు, సందేశం హృద‌యాల్ని హ‌త్తుకుంటుంది. ‘చి.ల‌.సౌ’లో స‌హ‌జంగా, క‌థ‌లో నుంచే రాహుల్ ర‌వీంద్రన్ వినోదాన్ని రాబ‌ట్టారు. కానీ ఈ చిత్రంలో అది లోపించింది. పైగా ఈ త‌ర‌హా క‌థ‌లు కూడా ప్రేక్షకుల‌కు అల‌వాటే. కానీ ఈ త‌ర‌హా క‌థ‌లో నాగ్ క‌నిపించ‌డం, ఆయ‌న వినోదం పండించ‌డం బాగుంది. కొన్ని సంభాష‌ణ‌ల్లో మ‌సాలా ఎక్కువైన‌ట్టు అనిపిస్తుంది. రాహుల్‌ రవీంద్రన్‌ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి త‌గ్గట్టుగా సినిమాని తీర్చిదిద్దిన విధానం ప‌ర్వాలేద‌నిపిస్తుంది.  

ఎవ‌రెలా చేశారంటే: నాగార్జున న‌ట‌న సినిమాకి ప్రధాన ఆకర్షణ‌. ఆయ‌న మ‌ధ్య వ‌య‌స్కుడిని అని గుర్తు చేస్తూనే ప్లేబాయ్ పాత్రలో ఆక‌ట్టుకున్నారు. రొమాంటిక్ స‌న్నివేశాలతో పాటు, భావోద్వేగాలు కూడా చక్కగా పండించారు. వెన్నెల కిషోర్ క‌థానాయ‌కుడితోపాటే క‌నిపిస్తూ చ‌క్కటి వినోదాన్ని పండించారు. కామెడీ విష‌యంలో ఆయ‌న‌కే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.

ర‌కుల్‌ప్రీత్ సింగ్ బ‌ల‌మైన పాత్రలో సంద‌డి చేశారు. ఆమె నేటిత‌రం అమ్మాయిగా కామెడీ పండిస్తూనే, అందులో భావోద్వేగాల్ని కూడా చ‌క్కగా పండించారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేశ్‌, సమంత  మెరుస్తారు. ల‌క్ష్మి, ఝాన్సీ, దేవ‌దర్శిని పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. రావు ర‌మేష్ త‌న‌దైన మార్క్ న‌ట‌న‌ని ప్రద‌ర్శించారు. సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి. చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం, సుకుమార్ కెమెరా ప‌నిత‌నం చిత్రానికి ప్రధానబ‌లం. ముఖ్యంగా పోర్చుగ‌ల్ అందాల్ని సుకుమార్ కెమెరాలో బంధించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ద‌ర్శకుడిగా రాహుల్ ర‌వీంద్రన్ తొలి సినిమా స్థాయిలో మెప్పించ‌లేక‌పోయారు. త‌నది కాని క‌థ అయినప్పటికీ దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కానీ కామెడీ విష‌యంలోనూ, సంఘ‌ర్షణ విష‌యంలోనూ ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు అంచ‌నాల్ని అందుకొనే స్థాయిలో లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. కొన్ని చోట్ల మాత్రం కామెడీ విష‌యంలోనూ, సున్నిత‌మైన అంశాల్ని డీల్ చేయ‌డంలోనూ తానెంత ప‌ర్‌ఫెక్టో చాటిచెప్పారు. అక్కడ ఈ సినిమాకి ద‌ర్శకుడిగా రాహుల్ ర‌వీంద్రన్‌ని నాగ్ ఎందుకు ఎంచుకున్నారో మ‌రింత బాగా అర్థం అవుతుంది.  

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ నాగార్జున, ర‌కుల్‌ల న‌ట‌న‌ - న‌వ్వించ‌ని కొన్ని స‌న్నివేశాలు
+ వెన్నెల‌ కిషోర్ కామెడీ  
+ భావోద్వేగాలు  

చివ‌రిగా: న‌యా మ‌న్మథుడు అక్కడక్కడా న‌వ్విస్తాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

 Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.