close

తాజా వార్తలు

తొమ్మిదో రోజే ‘అన్నమయ్య’ తీసేద్దామనుకున్నారు

హైదరాబాద్‌: ‘‘కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే సినీ ప్రయాణం చేస్తున్నా. ఆ విషయంలో మా నాన్నే నాకు స్ఫూర్తి. ఆయన అప్పట్లోనే కొత్తతరం సినిమాలు చేశార’’న్నారు అక్కినేని నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించి, పి.కిరణ్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘మన్మథుడు 2’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణపై ఆనందం వ్యక్తం చేస్తూ ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘‘యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆలోచించి సినిమాలు చేస్తుంటా. ఆ లక్షణం నాన్న నుంచే నాకు వచ్చింది. ఆయన అప్పట్లో చేసిన ‘మూగమనసులు’, ‘ప్రేమ్‌నగర్‌’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘గుండమ్మ కథ’ ఇవన్నీ కొత్తతరం సినిమాలే. నేను చేస్తున్న సినిమాలు యువతరానికే కాదు, నాకూ నచ్చడం లేదు కాబట్టి ఇంకేదో చేయాలనే ఆలోచనతోనే ‘గీతాంజలి’ చేశా. ప్రేక్షకులు దాన్ని స్వీకరించడానికి సమయం పట్టింది. ‘నిర్ణయం’ విషయంలోనూ తొలి మూడు రోజులు ఆందోళన చెందాం. ‘అన్నమయ్య’ చిత్రాన్నయితే తొమ్మిదో రోజు థియేటర్ల నుంచి తీసేయడానికి సిద్ధమయ్యారు. ఏమైందో తెలియదు కానీ 11వ రోజు నుంచి థియేటర్లు నిండిపోయాయి. ‘మన్మథుడు’ విడుదల తర్వాత కూడా దర్శకుడు విజయ్‌ భాస్కర్‌ ఆందోళన చెందుతుంటే.. ‘కొత్త కథతో తీసిన సినిమా కాబట్టి ప్రేక్షకులకి చేరువ కావడానికి కాస్త సమయం పడుతుంద’ని చెప్పా. ‘మన్మథుడు 2’ని నాలో కొత్తదనం చూసుకొనేందుకే చేశా. ఇలాంటి ప్రయోగాలు చేయడంతోనే ఇంతదూరం వచ్చా. శనివారం చిత్రానికి లభించిన వసూళ్లు చూశాక చాలా ఆనందమేసింది. కథానాయకుడిగానే కాకుండా, ఒక నిర్మాతగానూ సంతృప్తిగా ఉన్నా. కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు చేస్తున్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి గడిపినప్పటి రోజులు గుర్తుకొచ్చాయ’’న్నారు.

జాతీయ పురస్కారాలపై నాగార్జున స్పందిస్తూ ‘‘ఇదివరకు ఒక్కసారే తెలుగు సినిమాలకి 8 జాతీయ అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత రావడం తగ్గిపోయాయి. ఈ ఏడాది ఏడు పురస్కారాలొచ్చాయి. ‘చి.ల.సౌ’ నిర్మాణంలో నేనూ భాగస్వామినే కాబట్టి ఆ చిత్రానికీ పురస్కారం రావడం సంతోషంగా ఉంది. రాహుల్‌ రవీంద్రన్‌కి ఈ సందర్భంగా అభినందనలు’’ అన్నారు. చిత్ర దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడుతూ ‘‘థియేటర్లకి వెళ్లి అక్కడ స్పందన ఎలా ఉందో చూసి చెప్పు’ అన్నారు నాగార్జున సర్‌. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకి వెళితే అక్కడ ప్రేక్షకులు సినిమాని ఆస్వాదిస్తున్న విధానం చూసి ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్‌ భరద్వాజ్‌, పి.కిరణ్‌. కిట్టు విస్సాప్రగడ, ఛోటా కె.ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.