close
Array ( ) 1

తాజా వార్తలు

నా ఇమేజ్‌ చెక్కు చెదరలేదు

తరాలు మారినా.. స్వరం మారని పదాలు రెండే రెండు.. 
ఒకటి మెగాస్టార్‌.. రెండోది చిరంజీవి.. 
అరవైనాలుగేళ్ల శివశంకర వరప్రసాద్‌ ‘సైరా’ అంటే.. 
ఇప్పుడు.. దేశమంతా ఔరా! అంటోంది. 
హాయ్‌ అంటూ పలకరిస్తే.. ఆయన చెప్పిన విశేషాలెన్నో... 

ఇటీవల మీ ఫొటోషూట్‌తో సామాజిక మాధ్యమాల్లో మీ వయసు గురించి చర్చ జరిగింది గమనించారా? 
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకొని, తగిన వ్యాయామం చేస్తూ ఉంటే.. వయసుని అధిగమించవచ్చు. వ్యాయామం నా దినచర్యలో ఓ భాగం. రాజకీయాల్లోకి వెళ్లాక ఎనిమిదేళ్లు నాపై నేను నియంత్రణ కోల్పోయా. ఎక్కడికంటే అక్కడికి వెళ్లడం, ఏదంటే
అది తినడం, వెళ్లినచోట వ్యాయామం చేసుకొనే వెసులుబాటు లేకపోవడంతో కాస్త మారిపోయాను. ‘ఖైదీ నంబర్‌ 150’ మొదలవ్వగానే మళ్లీ మునుపటిలాగా నాపై నాకు నియంత్రణ వచ్చింది. ఈ మధ్య ఆహార నియమాల్లో మరిన్ని మార్పులు చేసుకొన్నా. విశాఖలో పెమా వెల్‌నెస్‌ సెంటర్‌కి వెళ్లొచ్చా. అక్కడ 20 రోజులపాటు డా.మూర్తి నేతృత్వంలో గడిపా. దాంతో మరింత బరువు తగ్గా. 
ఒక్కసారిగా ఆహారం, అలవాట్లపై నియంత్రణ అంటే సులభం కాదు కదా... 
నా అలవాట్లను వెంటనే మార్చుకోగలను. తినే తిండిలో ఇది లేకపోతే ఎలా? అని ఎప్పుడూ అనుకోను. అన్నం మానేయాలంటే మానేస్తా. సూప్స్‌, సలాడ్స్‌ మీదే ఉండాలన్నా ఉంటా. డైట్‌ విషయంలో చరణ్‌ సలహాలు ఇస్తుంటాడు. మొన్ననే యూరప్‌లో డిజైన్‌ చేసిన ఒక డైట్‌ గురించి చెప్పాడు. మూడు రోజుల్లో రెండు మూడు కిలోలు తగ్గించే నియమం అది. 
అప్పట్లో ఆహార నియమాలేవీ ఉండేవి కాదేమో..! 
వ్యాయామం తప్ప మరో మెథడ్‌ తెలిసేది కాదు. అప్పట్లో ఎంత తింటే అంత బలం అనుకునేవాళ్లం. కానీ ‘ఫుడ్‌ మేక్స్‌ ఆల్‌ డిఫరెన్స్‌’ అనే విషయం ఈ మధ్య అర్థమైంది. సెట్‌కి ఇంటి భోజనమే వస్తుంది. ఇప్పుడు వ్యాయామంతో పాటు ఆహార నియమాలూ పక్కాగా పాటిస్తున్నా. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రీకరణలో ఉదయం 7 గంటలకు షూటింగ్‌ అంటే నాలుగు గంటలకే లేచి.. 5 నుంచి 6 వరకు వ్యాయామం చేసి సెట్‌కి వెళ్లేవాడ్ని. వ్యాయామం చేయకుండా సెట్‌కి వెళ్తే అసౌకర్యంగా ఉండేది. 
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సినిమా ఆలోచన ఎప్పట్నుంచో ఉంది కదా! అది కార్యరూపం దాల్చడానికి ఇంత కాలం పట్టిందేం? 
‘శంకర్‌దాదా జిందాబాద్‌’ కంటే ముందు నుంచే ఆలోచన ఉంది. స్క్రిప్ట్‌ సిద్ధం అయ్యాక లెక్కలేసుకుంటే బడ్జెట్‌ పరిమితులు దాటిపోయాయి. అప్పట్లో రూ.25-30 కోట్లే ఖర్చు పెట్టేంత మార్కెట్‌ ఉండేది. మా లెక్కలు యాభై అరవై కోట్లకు చేరాయి. రాజీ పడితే.. యుద్ధ సన్నివేశాలు, ఇతర సీన్లలో వేలమంది కనిపించేలా తీయలేం. పైగా అప్పట్లో ఇంత సాంకేతికత కూడా అందుబాటులో లేదు. అందుకే తర్వాత చూద్దామనుకున్నాం. నేను రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ కథ అలాగే ఉండిపోయింది. పునఃప్రవేశం చేయాలనుకున్నప్పుడూ చాలామంది ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేయమన్నారు. కానీ తరం మారిపోయింది. వీళ్లు నన్నిప్పుడు ఎలా చూడాలనుకొంటున్నారో కదా అనే మీమాంస నాలో ఉండేది. నాకదో పరీక్షా సమయం. అందుకే వెనకడుగు వేశా. మునుపటిలా ఒక బలమైన సామాజిక సందేశంతో పాటు, డ్యాన్సులు, ఫైట్లతో కూడిన సినిమా చేసి.. ఇమేజ్‌ చెక్కు చెదరలేదని భావిస్తే.. ‘సైరా’ చేద్దామనుకున్నా. 
కార్లు, కారు నెంబర్లపై మీకు చాలా సెంటిమెంట్లు ఉండేవట.. ఇప్పటికీ ఉన్నాయా? 
సెంటిమెంట్‌ కాదు. కానీ అప్పట్లో ఓ రకమైన ఇష్టం ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయాయి. ఒక చోట నుంచి మరోచోటకు ప్రయాణం చేయడానికి ఏ కారైతే ఏంటి? అనుకుంటున్నా. హోండా అకార్డ్‌ చాలా ఇష్టపడి కొనుక్కున్న తొలి ఫారిన్‌ కారు. ఇప్పుడు మా ఇంట్లో లేని కారంటూ లేదు. కానీ.. ఎందులో ప్రయాణం చేసినా ఒక్కటే కదా.. అనే ఫీలింగ్‌కి వచ్చేశాను.

నన్ను చూడడానికి థియేటర్లకు ఇంత మంది వస్తున్నారు కదా! వాళ్లను నేనెలా మెప్పించగలను? వాళ్లు ఆనందంగా ఇంటికి వెళ్లాలంటే నేనేం చేయాలి? అనే ఆలోచనలు ఎప్పుడూ ఉండేవి. మాస్‌ ఇమేజ్‌ ఉన్నప్పుడు స్వయంకృషి లాంటి సినిమాలు చేసినా, ఓ ఆడవేషం కట్టినా, చంటబ్బాయిలాంటి కథల్ని ఎంచుకున్నా, బంగీజంప్‌ చేసినా, రిస్కీ షాట్లు చేసినా.. ఏం చేసినా.. ప్రేక్షకుల కోసమే! అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధపడ్డాను. ఒకే రకమైన ఇమేజ్‌ చట్రంలో ఉండిపోవడానికి నేనెప్పుడూ ఇష్టపడలేదు. నేను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయికి చేరడానికి నా ప్రయత్నాలే నిచ్చెనలు వేశాయి.

శంకర్‌దాదా నుంచి మా అమ్మాయే 

కాస్ట్యూమ్స్‌ కృష్ణ నా దగ్గరే పని చేసేవారు. నటుడు, నిర్మాతగా బిజీ కావడంతో షాజీ అనే కాస్ట్యూమర్‌ని తీసుకున్నా. తనూ, నేను మాట్లాడుకొని నా దుస్తుల్ని సెలెక్ట్‌ చేసేవాళ్లం. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా సమయానికి అవగాహన పెరిగింది. నిర్మాత అశ్వినీదత్‌ వచ్చి ‘ముంబయిలో శ్రీదేవికి పనిచేసే బడేసాబ్‌ అనే డిజైనర్‌ ఉన్నారు. ఈ సినిమాకు ఆయనే డిజైనర్‌’ అన్నారు. ఓహో అలానా అనుకున్నా. అంతే తప్ప.. విదేశాల నుంచో, పక్క రాష్ట్రాల నుంచో డిజైనర్లను తీసుకురావడం నాకు నిజంగా తెలియదు. శంకర్‌దాదా నుంచి నా కాస్ట్యూమ్స్‌ అన్నీ మా అమ్మాయే దగ్గరుండి చూసుకుంటుంది. తను నిఫ్ట్‌లో చదువుకుంది. ఆ చదువు నాకు పనికొచ్చింది.

ఎస్సెమ్మెస్‌తో బచ్చన్‌ ఓకే 

నాకూ, అమితాబ్‌ బచ్చన్‌కీ మధ్య సినిమాకంటే కుటుంబపరంగా ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన డెబ్బయ్యో పుట్టినరోజుకి నన్ను ప్రత్యేకంగా   ఆహ్వానించారు. చరణ్‌ పెళ్లికి పిలవగానే  వచ్చారు. నా అరవయ్యో పుట్టినరోజుకీ రావలిసింది కానీ... ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో జయా బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ వచ్చారు. నేను ‘ప్రతిబంధ్‌’ సినిమా చేసినప్పుడు అమితాబ్‌ సలహాలు తీసుకొన్నా. తొలి కాపీని ఆయనకే చూపించా. పార్లమెంటులో నా తోటి రాజ్యసభ సభ్యులు జయా బచ్చన్‌. నాకెన్నో సలహాలు ఇచ్చేవారు. ‘ఛోటే మియా బడే మియా’ చిత్రీకరణ సమయంలో నా సినిమా చిత్రీకరణ కూడా పక్కనే జరుగుతుండడంతో మేం ఊటీలో కలిసి ఎన్నో ప్రాంతాలు తిరిగాం. అలా మా మధ్య చక్కటి అనుబంధం ఉంది. ‘సైరా నరసింహారెడ్డి’లో ఒక పాత్రని అమితాబ్‌ చేస్తే బాగుంటుందని సురేందర్‌రెడ్డి చెప్పాడు. దాంతో ‘సర్‌ ఇలా అనుకుంటున్నాం, పాన్‌ ఇండియా సినిమా ఇది. మీరు చేస్తే బాగుంటుంది’ అని ఒక్క ఎస్సెమ్మెస్‌ పెట్టా. దాంతో ఆయన ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే ‘ఎస్‌’ అంటూ స్పందించారు. పాత్ర ఎలా ఉంటుందో కనుక్కుంటానని చెప్పగానే దర్శకుడు, మా పాప సుస్మితతో పాటు, మరికొంత మందిని పంపించా. ఆ తర్వాత ఆయనే ఆ పాత్రకి తగ్గట్టుగా లుక్‌ టెస్ట్‌ చేసుకొని, ఇలా ఉంటే బాగుంటుందా అని మాకు చూపించారు.

స్టార్‌‌ అవుతాను.. అంతే! 

నెగిటివ్‌ వైబ్రేషన్స్‌ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి చోట అస్సలు ఉండలేను. జీవితంలో ఏదో సాధించాలని చెన్నై వచ్చి, ఏమీ సాధించలేక, నిరుత్సాహంతో కూరుకుపోయిన వ్యక్తులు పాండీబజార్‌లో ఎక్కువగా కనిపించేవాళ్లు. అటువైపు వెళ్లడానికి కూడా మనసొప్పేది కాదు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ను వినడం వల్ల.. మనం కూడా పోరాడే శక్తిని కోల్పోతామేమో అనిపించేది. నా మనసులో ఎప్పుడూ ‘నేను స్టార్‌ని అవుతాను.. తప్పకుండా మంచి స్థాయికి వెళ్తాను’ అనే నిశ్చలమైన ఆలోచన బలంగా ఉండేది. ఆ ఆలోచనను బలంగా నమ్మేవాడ్ని. నేనీ స్థాయిలో ఉన్నానంటే నాపై నాకున్న నమ్మకమే కారణం.

జ్యోతిలక్ష్మి పాటలకు చిందేసేవాడ్ని..

చిన్నప్పుడు సినిమాలు చూసేవాడ్నే కాదు. సినిమా వాళ్లంటే ఎలాంటి క్రేజూ ఉండేది కాదు. నటనపై మాత్రం మక్కువ ఉండేది. పదో తరగతిలో మా స్నేహితులంతా కలిసి ఓ డ్రామా వేశాం. నాకు ఉత్తమ నటుడు బహుమతి వచ్చింది. కాలేజీలో డ్రామా వేస్తే.. అక్కడా నేనే బెస్ట్‌ యాక్టర్‌. ఎన్‌సీసీ క్యాంపులకు వెళ్లినప్పుడు.. స్నేహితులమంతా సరదాగా కాలక్షేపం చేసేవాళ్లం. నేను చిన్న చిన్న స్కిట్స్‌ వేసేవాడ్ని. అప్పట్లో జ్యోతిలక్ష్మి పాటలు చాలా పాపులర్‌. ఆ పాటలకు డ్యాన్స్‌ చేసేవాడ్ని. ‘అరె.. భలే చేస్తున్నావ్‌రా!’ అని అందరూ మెచ్చుకుంటుంటే.. ‘దీనినే వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు’ అనిపించింది. మా నాన్న ఒకట్రెండు సినిమాల్లో నటించారు. ఆయన షూటింగ్‌ నుంచి వచ్చాక.. విశేషాలు చెబుతుంటే.. ‘సినీఫీల్డు ఇంత బాగుంటుందా’ అనిపించేది. అలా నటుడ్ని అవ్వాలన్న ఆశకు, ఆలోచనకు బీజం వేసింది నాన్నే. ఆయనకు ఎస్వీఆర్‌ గారన్నా, సావిత్రి గారన్నా చాలా ఇష్టం. అలా వాళ్లపై నాకూ అభిమానం ఏర్పడింది. కాలేజీ రోజుల్లో నన్నంతా ‘శత్రఘ్నసిన్హాలా ఉన్నావ్‌’ అనేవారు. ఆయన సినిమాలన్నీ చూస్తూ అనుకరించడం మొదలుపెట్టాను. సినిమాల్లోకి వెళ్తానంటే ఇంట్లో వద్దనలేదు. ‘ఏడాది పాటు ప్రయత్నించు. కుదరకపోతే వచ్చేయ్‌. ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు’ అని సలహా ఇచ్చారు. కానీ, ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తవ్వకముందే.నటుడిగా అవకాశాలు వచ్చాయి.

మాసూ, క్లాసూ, యువతరం, కుటుంబం.. ఇలా అందరి హీరో అవ్వడానికి వైవిధ్యమైన సినిమాలు చేయడమే కారణం. నా కెరీర్‌లో సూపర్‌హిట్టు లేని ఏడాది లేదు. ‘హిట్లర్‌’కు ముందు ఆర్నెల్లు గ్యాప్‌ వచ్చిందంతే. అప్పట్లో అదొక సంచలనం. ఇప్పుడైతే అది గ్యాపే కాదు.

మీ ఇమేజ్‌ గురించి అంతగా ఆలోచించారా? 
రాజకీయాల్లోకి వచ్చాక జనంతో తిరిగాను. వాళ్లతో కలిసి ప్రయాణం చేశాను. దాంతో వాళ్లు మళ్లీ నన్ను మునుపటిలా అదే క్రేజ్‌తో చూస్తారా? ఏ స్థాయిలో చూస్తారనే సందిగ్ధం ఉండేది. ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రీ రిలీజ్‌ వేడుక రోజు ఆ సందిగ్ధం పటాపంచలైంది. విజయవాడ, గుంటూరు రహదారిలో జనాల ఉద్ధృతి చూసి నా ఇమేజ్‌ చెక్కుచెదరలేదు అనిపించింది. ‘బాహుబలి’ కూడా ధైర్యాన్నివ్వడంతో ‘సైరా’ని సెట్స్‌పైకి తీసుకెళ్లాం. స్వాతంత్ర సమరయోధుడి కథ కావడంతో.. ఒక ప్రాంతంతో సంబంధం లేకుండా భారతీయ సినిమా అవుతుందనిపించింది. జాతీయస్థాయిలో చూపించగలిగితే ఎంతయినా ఖర్చు పెట్టొచ్చు అనిపించింది. రామ్‌చరణ్‌ ముందుకు రావడంతో సినిమా పట్టాలెక్కింది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మించిన ఈ సినిమా ప్రతి ఒక్కరూ మెచ్చుకునే స్థాయిలో ఉంటుంది. నటుడిగా నాకెన్నో సవాళ్లనిచ్చింది. గుర్రపు స్వారీ, కత్తి యుద్ధాలపై పట్టు పెంచుకోవాల్సి వచ్చింది. శారీరకంగా చాలా కష్టపడ్డా. 
మాస్‌ అంటే ఇది.. దీనికి ఇంత శక్తి ఉందని మొదటిసారి ఎప్పుడనిపించింది? 
‘ఖైదీ’ తర్వాతే. అప్పటిదాకా నాలోని ప్రతిభనంతా బయటపెట్టొచ్చా? ప్రేక్షకులు ఎంత వరకు స్వీకరిస్తారు? అనే ఆలోచనలు ఉండేవి. ‘ఖైదీ’తో మనం ఎంతిస్తే ప్రేక్షకులు అంత స్వీకరిస్తారు.. మనం ఎంత చేస్తే వాళ్లు అంతగా ప్రతిస్పందిస్తారనే విషయం అర్థమైంది. అంతవరకు చూడని డ్యాన్సులు, ఫైట్లు, భావోద్వేగ సన్నివేశాలు ‘ఖైదీ’తో ప్రేక్షకుల మనసుల్ని తాకాయి. దాంతోనే నాకు స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. అప్పట్నుంచి నాలోని ప్రతిభను బయటపెట్టే అవకాశం ఉన్న కథల్ని తరచూ చేశా. అదేసమయంలో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యే సినిమాలూ చేశా. 
మీరు ఆంజనేయస్వామి భక్తుడు కదా? ఇంట్లో మీ భక్తిభావాలు ఎవరికబ్బాయి? 
చరణ్‌కి ఆ లక్షణాలు వచ్చాయి. తనూ నాలా ఆంజనేయస్వామి భక్తుడే. మేం ఇద్దరం అయ్యప్ప మాలలు వేసుకుంటాం. ఇక పూజలు, వ్రతాలూ అంటారా? అవి ఇంట్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. 
జనసేన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది. పవన్‌ కూడా రెండు చోట్లా గెలవలేకపోయారు. మళ్లీ ధైర్యంగా ప్రజల మధ్యకు వెళ్లగలుగుతున్నారు. పవన్‌ని చూస్తే ఏమనిపిస్తోంది? 
జీవితకాలపు పోరాటం ఇది. చిన్న చిన్న ప్రతికూల పరిస్థితులకు వెరవకూడదు. తనో ఫైటర్‌. పోరాడుతూనే ఉంటాడు. నిరంతరం పోరాడేవాడిని ఏదోరోజు విజయం వరించి తీరుతుంది. ఆ విజయాన్ని అందుకోవడానికి పవన్‌ అన్ని విధాలా అర్హుడు. 
రాజకీయాలపై మీరు మళ్లీ దృష్టి పెట్టబోతున్నారని, ఒక ప్రధాన పార్టీ నుంచి ఆహ్వానం వచ్చిందని ప్రచారం సాగుతోంది... 
అది వాళ్ల ఆశ, ఆలోచన. దానిపై నేనెలా స్పందిస్తాను. ప్రస్తుతానికి నా దృష్టంతా సినిమాలపైనే. 
కొరటాల శివ సినిమా సంగతులేంటి? 
స్క్రిప్టు ఫైనల్‌ వెర్షన్‌ జరుగుతోంది. టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో నేను ద్విపాత్రాభినయం చేస్తున్నానని వార్తలొచ్చాయి. అందులో నిజం లేదు. 
స్డూడియో కట్టాలన్న ఆలోచన రాలేదా? 
ఎప్పుడూ రాలేదు. ఉన్న స్డూడియోలు సరిపోతాయి. వాటిని సరిగా వాడుకుంటే చాలు. చాలా ప్రభుత్వాలు స్డూడియోల కోసం స్థలం ఇస్తానని ఆఫర్‌ చేశాయి. కానీ అటువైపు మొగ్గు చూపలేదు. 
పుస్తకాలు చదువుతుంటారా? మీ జీవిత కథని పుస్తకంగా తీసుకురావాలన్న ఆలోచన ఉందా? 
పుస్తకాలు పెద్దగా చదవను. ‘ఈ పుస్తకం బాగుంది.. చదవాల్సిందే’ అని ఎవరైనా స్నేహితులు చెబితే, అప్పుడు తిరగేస్తా. ఈ విషయంలో నాకంటే చరణ్‌ బెటర్‌. మా ముగ్గురు అన్నదమ్ముల్లో కల్యాణ్‌ పుస్తకాలు బాగా చదువుతాడు. ఆ తరవాత నాగబాబు. నా జీవిత కథని పుస్తకంగా తీసుకురావాలన్న ఆలోచన ఉంది. దాన్ని వీడియో డాక్యుమెంట్‌గా తీసుకొస్తే బాగుంటుందేమో అని ఆలోచిస్తున్నాం. 
అప్పట్లో మీ డ్యాన్సులు చూడ్డానికి అభిమానులు ఒకటికి రెండుసార్లు థియేటర్లకు వచ్చేవారు. ఇప్పుడు డ్యాన్సుల కోసం సినిమాలు చూసే రోజులు ఉన్నాయంటారా? 
డ్యాన్స్‌ అనేది ఇప్పటికీ గొప్ప కమర్షియల్‌ అంశమే. దాని కోసం థియేటర్లకు వచ్చేవాళ్లు ఎప్పటికీ ఉంటారు. డ్యాన్సులు అవుట్‌డేట్‌ అయిపోవడమనే ప్రశ్నే లేదు. ఎంత బాగా చేస్తే.. అంత బాగా ఆదరిస్తారు. ఇప్పటి హీరోలంతా డ్యాన్సులు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ల గ్రేస్‌ బాగుంటోంది. అందరి డ్యాన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నా. ‘మేం ఇలా డ్యాన్సులు చేయడానికి మీరే స్ఫూర్తి’ అని చెబుతుంటారు. అందంతా వాళ్లు నాపై చూపించే గౌరవం. 
తొలిసారి మిమ్మల్ని తెరపై చూసినప్పుడు మీ తమ్ముళ్లు, తోబుట్టువుల ఫీలింగ్‌ ఏమిటి? 
వాళ్లు చాలా సంబరపడిపోయారు. నాన్నగారు రెండు సినిమాలు చేసినా.. అప్పటి సంగతులు వాళ్లకు తెలీదు. అందుకే... నేను తెరపై కనిపించేసరికి వాళ్లు పొంగిపోయారు. ఇప్పటికీ వాళ్లకు హీరో అంటే నేనే. కల్యాణ్‌ పెద్ద హీరో అయినా.. ‘అన్నయ్యా! నాకు నటుడన్నా, హీరో అన్నా నువ్వే. ఇంకెవ్వరూ కనిపించరు’ అంటుంటాడు. 
మీ నాన్నగారిలా మీరూ స్ట్రిక్టు ఫాదరేనా? 
అస్సలు కాదు. నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. నేను కనపడగానే భయంతో పారిపోవడం, దాక్కోవడం అంటూ ఏమీ ఉండవు. నా కంపెనీని చాలా ఇష్టపడతారు. ఇక ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజులు వస్తుంటే... చాలా హంగామా ఉండేది. స్టార్‌ హోటల్‌లో సెలబ్రేట్‌ చేసేవాడ్ని. పేలాచ్చీ అనే ఓ ప్రదేశం ఉంది. అదే మా పిక్నిక్‌ స్పాట్‌. అసలు ఇండస్ట్రీకి పార్టీ కల్చర్‌ని తీసుకొచ్చిందే నేను. అప్పట్లో సినిమా ప్రారంభమైనా, వంద రోజుల పండగ చేసినా.. అదే రోజు సాయంత్రం సినీ ప్రముఖులందరినీ పిలిచి విందు ఇచ్చేవాడ్ని. బాలకృష్ణ, వెంకటేష్‌లు కూడా వచ్చేవారు. నాగ్‌ అప్పటికే హైదరాబాద్‌కి వచ్చేశాడు. హనీహౌస్‌ అని చెన్నైలో ఓ ప్రాంతం ఉంది. మా పార్టీలన్నీ అక్కడే. తమిళసీమ నుంచి సత్యరాజ్‌ లాంటి హీరోలు కూడా పార్టీలకు హాజరయ్యేవారు. సుహాసిని, రాధిక.. ఇలా మా బ్యాచ్‌ ఉండనే ఉంది. 
ఓ నటుడిగా చరణ్‌ మిమ్మల్ని గర్వపడేలా చేసిన సందర్భం ఏది? 
మొదటి సినిమాకే చరణ్‌పై నాకు గట్టి నమ్మకం. తన ప్రతిభపై ఎప్పుడూ ఎలాంటి సందేహాలూ ఉండేవి కావు. అవకాశం వస్తే ఎలాంటి పాత్ర అయినా చేయగలడు. తన రెండో సినిమా ‘మగధీర’కే చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇన్ని సినిమాలు చేసినా, నాకు దక్కని కాస్ట్యూమ్స్‌ డ్రామా తను చేశాడు. ‘చిరుత’ మంచి ప్రారంభం. ఇక ‘రంగస్థలం’తో జాతీయస్థాయి నటుడు అనిపించుకున్నాడు. ‘రంగస్థలం’ కథ నా దగ్గరకు వస్తే.. చేయడానికి జంకేవాడ్ని. చరణ్‌ ఉత్సాహంగా రంగంలోకి దూకేశాడు. సినిమా రషెస్‌ చూశాక నన్ను నేను ఆపుకోలేకపోయాను. ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘చరణ్‌ నటన చూసి తండ్రిగా గర్వపడుతున్నా.. నటుడిగా ఈర్ష్య పడుతున్నా’ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చాను. ‘చిరంజీవి ఎందుకంత పెద్ద స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు’ అని అంతా ఆశ్చర్యపోయారు. సినిమా చూశాక వాళ్లు కూడా ‘మీరు చెప్పింది కరక్టే’ అని ఒప్పుకొన్నారు. 
ఒకప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో మీరూ ఒకరు. ఒక దశలో రెమ్యునరేషన్‌లో అమితాబ్‌ బచ్చన్‌ని దాటేశారు. ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. కానీ, ఇప్పుడు ఒక సినిమా హిట్టవ్వగానే హీరోలు పారితోషికం పదింతలు పెంచేస్తున్నారు కరక్టే అంటారా? 
ఈ వాతావరణాన్ని నేనేమాత్రం హర్షించలేను. నాతో పాటు నలుగురు బతకాలి అనే సిద్దాంతం నాది. నా సినిమా వల్ల నిర్మాత బాగుపడాలి, సినిమా కొన్న పంపిణీదారుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి అనే ఆలోచించేవాడ్ని. అప్పట్లో నేను అడ్వాన్సు తీసుకునేవాడ్ని కాదు. పారితోషికం ఎంతైనా సరే.. సినిమా పూర్తయ్యాకే. నాకోసం అప్పులు చేసి, వడ్డీలు కట్టి డబ్బులు తీసుకురావడం నచ్చేది కాదు. సినిమా పూర్తయిన తరవాత, వ్యాపారం బాగా జరిగాక డబ్బులు తీసుకుంటే నిర్మాత లాభపడతాడు. వాళ్లు డబ్బులు ఎగ్గొడతారన్న భయాలు ఉండేవి కావు. నమ్మకంపై జరిగే వ్యాపారం సినిమా. కాబట్టి.. ఎప్పుడూ నా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టలేదు. ఈ విషయం నా నిర్మాతలంతా చెబుతారు. నేనింత పారితోషికం తీసుకుంటే.. నిర్మాతలకు వెసులుబాటు ఉంటుందో ఆలోచించి తీసుకునేవాడ్ని. అయినా నా పారితోషికాన్ని డిసైడ్‌ చేయాల్సింది నేను కాదు. నిర్మాతలే. ‘చిరంజీవితో సినిమా తీస్తే, నాలుగు డబ్బులు మిగులుతాయి’ అనుకుని నా దగ్గరకు రావాలి అనుకునేవాడ్ని. అందుకే.. నాతో సినిమాలు చేసినవాళ్లు మళ్లీ మళ్లీ నాతో పనిచేయడానికి ఉత్సాహం చూపించేవారు. ఎన్టీఆర్‌ గారు సినిమాలు మానేశాక.. ఆయన నిర్మాతలు సినిమాలు తీయడం ఆపేశారు. వాళ్లంతా మళ్లీ నాతో సినిమాలు చేయడానికి మొగ్గు చూపారు. ఈ అలవాటే చరణ్‌కీ వచ్చింది. తనూ ఎప్పుడూ అడ్వాన్సులు తీసుకోడు. డబ్బంతా సినిమా అయ్యాకే. 
అప్పట్లో మీ సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు మీరే దర్శకత్వం చేసేవారట, నిజమేనా? 
దర్శకుడు అందుబాటులో లేడు, నటుల కాంబినేషన్‌ మిస్‌ అయిపోతుందనుకొన్నప్పుడు దర్శకుల అనుమతితో చేసేవాడ్ని. కె.రాఘవేంద్రరావు సాయంత్రం ఆరు తర్వాత తన సినిమాలకి సంబంధించి వేరే పనుల కోసం వెళుతూ... ‘బాబాయ్‌... ఈ సన్నివేశం నీకు తెలుసు కదా’ అంటూ నాకు అప్పజెప్పి వెళ్లేవారు. విజయబాపినీడుతోనూ నాకు అలాంటి అనుబంధం ఉండేది. బి.గోపాల్‌కీ నామీద నమ్మకం ఎక్కువగా ఉండేది. ‘ఇంద్ర’ సమయంలో.. కొన్ని రోజులు బి.గోపాల్‌ ‘అల్లరి రాముడు’కి కేటాయించాల్సి వచ్చింది. అందులో కొన్ని సన్నివేశాల్ని తీశా. మీరు దర్శకత్వం చేయొచ్చు కదా అని చాలామంది అంటుంటారు. అలా చేస్తే నటనకి న్యాయం చేయలేం. రెండు పనులూ చేయడం కష్టం. ఒకవేళ దర్శకత్వం చేయాల్సి వస్తే నటన ఆపేయాల్సి ఉంటుంది. లేదంటే చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. 
కోడలు.. ఉపాసనలో మీకు నచ్చే విషయాలేంటి? 
ఉపాసన ఓ పెద్ద ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి. కుటుంబం, అనుబంధాలూ వీటికి ఎక్కువ విలువ ఇస్తుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా, ఎంత ఎత్తుకు ఎదిగినా.. కుటుంబానికి సమయం కేటాయించాలి. నాణ్యమైన సమయం గడపాలి. ఈ విషయంలో ఉపాసన చాలా శ్రద్ధ తీసుకుంటుంది. మా అందరి బాగోగుల్నీ దగ్గరుండి చూసుకుంటుంది. మా ఆవిడ సురేఖలో కనిపించే చాలా మంచి లక్షణాలు ఉపాసనలోనూ కనిపిస్తాయి. తను మా ఇంటికి తగిన కోడలు.

నాన్న నా కాళ్లొత్తారు..

టీవల చరణ్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. అప్పుడు చరణ్‌ని చూసినప్పుడు మా నాన్న గుర్తొచ్చారు. ‘గుండా’ సినిమాలో రన్నింగ్‌లో ఉన్న రైలును పట్టుకొని ట్రాక్‌పై వేలాడుతూ ఫైట్‌ చేసే సన్నివేశం ఉంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఆ సమయంలో నాన్న అక్కడే ఉన్నారు. నా ఫీట్లు చూసి చాలా కంగారుపడ్డారు. ‘ఇలాంటి రిస్కులు చేసే పనైతే ఇక్కడ ఉండక్కర్లేదు. జరగరానిది జరిగితే..’ అని చాలా బాధపడ్డారు. ‘నాకేం కాదులే నాన్న.. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు’ అన్నా. ‘నా బాధ నీకిప్పుడు తెలియదు. రేపు నీ కొడుకు కూడా హీరో అయి.. నీ కళ్లముందు ఇలా రిస్కులు చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది’ అన్నారు. మరో సందర్భంలో ఇంట్లో నేను ఆదమరిచి నిద్ర పోతుంటే, నా కాళ్ల దగ్గర ఏదో అలికిడి వినిపించింది. చూస్తే.. నాన్నగారు నా కాళ్లు పడుతూ కనిపించారు. ‘అదేంటి నాన్న.. మీరు నా కాళ్లు పట్టడమేంటి’ అని వారించాను. ‘పడుకోరా.. నువ్వు హాయిగా పడుకుని ఎన్ని రోజులైందో.. ఎప్పుడూ షూటింగులు అంటూ పరిగెడుతున్నావ్‌’ అంటూ నన్ను సముదాయించారు. ఆ క్షణాల్ని నేనెప్పటికీ మర్చిపోలేను. చరణ్‌కి గాయమైనప్పుడు ఇవన్నీ గుర్తొచ్చాయి. ఆ రోజు నా గాయాలు చూసి మా నాన్న పడిన బాధ... ఇప్పుడు నాకు అర్థం అవుతోంది.

ఉదయం 7 గంటలకే సెట్‌కి రండి

‘ఎవరెస్ట్‌ శిఖరం మీద నిలబడ్డాం’ అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ, అక్కడ నిలబడిన వాళ్లకు మాత్రమే.. అందులోని కష్టం, బాధ అర్థమవుతుంది. అటూ ఇటూ కదలడానికి వీలుండదు. కాలు జారితే అగాథమే. నిలబడడానికి పోరాడాల్సిందే! కింది నుంచి పైకి వచ్చే వాళ్లకు ఉన్న వెసులుబాటు.. పైనున్న వాళ్లకు ఉండదు. వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆలింగనం చేసుకోవాలి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా భయపడకుండా, నిరుత్సాహపడకుండా పోరాడాలి. అలా చేయగలిగితేనే అంత ఎత్తున నిలబడగలం. ‘సైరా’ షూటింగ్‌లో నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ఉదయం ఏడంటే.. ఏడు గంటలకు తొలిషాట్‌ తీయాల్సిందే. తెల్లవారుజామునే మేకప్‌తో సెట్‌లోకి వెళ్లిపోయేవాడ్ని. పదింటికి బ్రేక్‌ఫాస్ట్‌. తర్వాత మళ్లీ షూటింగ్‌. ఒంటి గంటకు భోజన విరామం. ఇలా ప్రతిదీ ఓ పద్ధతి ప్రకారం చేశాం. ‘ఈ రోజుల్లో షూటింగ్‌ మొదలయ్యేది పదకొండు గంటలకు.. మీరొచ్చి మళ్లీ పాత సంప్రదాయానికి తెర తీశారు’ అని అందరూ చెబుతుంటే సంతోషంగా ఉంది. నా కెరీర్‌ ప్రారంభం నుంచీ ఇంతే. ఏడింటికల్లా సెట్‌లో రెడీగా ఉండేవాడ్ని. ఇప్పుడు వయసు పెరిగింది. రిలాక్స్‌ అవ్వొచ్చు. నా సొంత సినిమా. ఎప్పుడు సెట్‌కి వెళ్లినా.. కాదనేవారు లేరు. అయినా పాత రోజులను గుర్తు తెచ్చుకుంటూ.. అదే రీతిలో కష్టపడ్డాను. ఇప్పటి హీరోలకు చెప్పేదొక్కటే. ఓ సినిమా కోసం 150-180 రోజులు కేటాయించొద్దు. టెక్నాలజీ పెరిగింది. తక్కువ రోజుల్లో క్వాలిటీ ఉన్న సినిమాల్ని తీయొచ్చు. ఏడు నుంచి తొమ్మిదింటి లోపు షూటింగ్‌ మొదలుపెడితే చాలా కలిసి వస్తుంది. ఓ హీరో పనిలో వేగం పెంచితే దాని టర్నోవర్‌ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హీరోలూ, దర్శకులు గట్టిగా అనుకుంటే నిర్మాతల్ని సేవ్‌ చేయొచ్చు.
- నర్సిమ్‌ ఎర్రకోట, మహమ్మద్‌ అన్వర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.