close

తాజా వార్తలు

ఈ ఇంగ్లిష్‌ టీచర్‌... పిల్లల నేస్తం

ఓ సాధారణ ఉపాధ్యాయురాలిగా బోధనారంగంలోకి వచ్చిన ఆమె... అంచెలంచెలుగా కృషి చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.  విద్యార్థులను చదువులో మెరికల్లా తయారుచేయడానికి తాను నిత్య విద్యార్థినిగా మారింది. ఎప్పటికప్పుడు కొత్త బోధనా విధానాలను ప్రవేశపెడుతూ... ప్రయోగాలు చేస్తోంది. నిరుపేద పిల్లలకు సేవచేస్తూ... అక్షరదానం అందిస్తోంది. ఇవన్నీ ఆమెను ఈ ఏడాది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిని చేశాయి. ఆమే బెండి ఆశారాణి.
స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి అయినా తండ్రి రామారావు ఆర్మీ ఉద్యోగి కావడంతో బెంగళూరు, అండమాన్‌, భువనేశ్వర్‌ తదితర ప్రాంతాల్లో చదువుకుంది ఆశారాణి. ఎంఏ, బీఈడీని ఒడిశాలో పూర్తి చేసింది. 1992లో చిన్న ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో టీచర్‌గా చేరింది. ఆ భాషపై అంతగా పట్టు లేకపోవడంతో ఏడాదిపాటు అక్కడ పనిచేశాక ఆర్కేపురంలోని సైనిక పాఠశాలలో టీచర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. తీరా అక్కడికెళ్తే... ‘మీకు ఆంగ్లం సరిగ్గా రాదు గనుక రెండో తరగతికి పాఠాలు చెప్పండి...’ అన్నారు. ఒక్కక్షణం బాధనిపించినా... అవసరం రీత్యా ఆ పిల్లలకు పాఠాలు చెప్పడానికి సిద్ధమైంది ఆశ. అదే ఆమెకు మేలు చేసింది.
రెండేళ్లు కష్టపడి మరీ...
ఆంగ్లభాషలో పట్టు సాధించడానికి చాలా కష్టపడ్డానంటుంది ఆశారాణి. ‘టీచర్‌గా విద్యార్థులతో అనుబంధం ఏర్పడటానికి, వారికి పాఠాలు బోధించడానికి ఎలాగైనా సరే ఇంగ్లిష్‌ పూర్తిగా నేర్చుకోవాలనుకున్నా. అందుకోసం బీబీసీ వార్తలు వినేదాన్ని. దూరదర్శన్‌లో వచ్చే ఇంగ్లిష్‌ కార్యక్రమాలు చూసేదాన్ని. ఆంగ్లపత్రికలు, పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. నాపై నాకు కాస్త నమ్మకం వచ్చాక ప్రత్యేక కోర్సులూ చేశా. రెండేళ్లు ఇదే లక్ష్యంతో కష్టపడ్డా. కొన్నాళ్లకు రెండు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్‌ టీచర్‌గా వెళ్లా. ప్రస్తుతం మేడ్చల్‌, జీడిమెట్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో ఇంగ్లిష్‌ టీచర్‌గా, స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నా. ఉన్నత విద్యార్హతలు ఉన్నా... భాష రాకపోవడం వల్ల నాలా చాలామంది ఇబ్బంది పడతారని అర్థమైంది. దీనికి పరిష్కారం పెద్దయ్యాక భాష నేర్చుకోవడం కన్నా... విద్యార్థి దశ నుంచే కృషి చేస్తే ఏ ఇబ్బందీ ఉండదని అనిపించింది. బాగా ఆలోచించి చాలా సులువుగా ఆంగ్లం నేర్పించేలా చేయాలనుకున్నా. ముఖ్యంగా ప్రభుత్వపాఠశాల విద్యార్థులకు ఇది చాలా అవసరం కాబట్టి ఆ దిశగా నా వంతు ప్రయత్నాలు చేశా...’ అని అంటుంది ఆశారాణి.
ఆ అవకాశంతో...
సరిగ్గా రెండేళ్ల క్రితం అమెరికాలోని విద్యావిధానం తెలుసుకునే అవకాశం అందుకుందీమె. ఈ కార్యక్రమం గురించి తెలిసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంది. ఒకే పాఠశాలలో కనీసం అయిదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉండటమే కాదు, వారిచ్చే ప్రశ్నలకు సమాధానాలు సహా కొన్ని ప్రత్యేక అంశాలపై వ్యాసాలను రాసి పంపాలని తెలియడంతో అదీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి 89 మంది దీనికి ఎంపిక కాగా, మన దేశం నుంచి నలుగురు అర్హత సాధించారు. వారిలో ఆశారాణీ ఉంది. నెలన్నరపాటు అమెరికాలోని పాఠశాలల నిర్వహణ నుంచి చదువు చెప్పే విధానం వరకు ఎన్నో తెలుసుకుందామె. ‘చివరి వారం రోజులు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో నాకు తరగతులు నిర్వహించే అవకాశం వచ్చింది. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు, తదితర అంశాల గురించి అక్కడి విద్యార్థులకు చెప్పా. మా ఉపాధ్యాయులందరికీ అక్కడి విధానాలపై అవగాహన కల్పించడమే కాదు... నేను తెలుసుకున్న విషయాలను ఆచరణలో పెట్టా...’ అని వివరిస్తుంది.
చదువు అర్థమయ్యేలా...
అమెరికా నుంచి వచ్చిన తరువాత వారి తరహాలో ఇక్కడి విద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంది. అంతటి సాంకేతికత ఇక్కడ అందుబాటులో ఉండదు గనుక తన ల్యాప్‌టాప్‌ను వినియోగించడం మొదలుపెట్టింది. ల్యాప్‌టాప్‌ ద్వారా చెప్పాల్సిన అంశాలను తెరపై చూపిస్తూ నేర్పించేది. ‘అక్కడి చిన్నారులకు బాల్యం నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి ఉంటుంది. ప్రతిస్కూల్లో ఓ గ్రంథాలయం తప్పనిసరి. ఇక్కడా ఆ మార్పులు తేవాలనుకున్నా. రెండువేల పుస్తకాలతో చిన్నపాటి లైబ్రరీని ప్రారంభించా. క్రమంగా పిల్లలందరినీ పుస్తకపఠనంవైపు మళ్లించా. వాళ్లకు ఆసక్తి పెరిగేలా... రకరకాల పుస్తకాలు అందుబాటులో ఉంచా... ’ అని చెప్పే ఆశారాణి... సబ్జెక్టు ఎలాంటిదైనా కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలంటుంది. భయం లేకుండా మాట్లాడితే ఏ భాషైనా సులువుగా నేర్చుకోవచ్చంటుంది.

ఉచిత శిక్షణ అందించేలా...
ఓ వైపు టీచరుగా పనిచేస్తూనే... ఇతర పిల్లలకు తనవంతుగా సాయం చేయాలనుకుంది ఆశారాణి. నేరెడ్‌మెట్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసి పదవీవిరమణ పొందిన పన్నాల లక్ష్మి నర్సింహారెడ్డితో కలిసి ఆయన పేరుతోనే ఓ ‘ఎడ్యుకేషన్‌ సొసైటీ’ ప్రారంభించింది. ఇందులో 18 మంది ఉపాధ్యాయులు సభ్యులుగా ఉన్నారు. నిరుపేద విద్యార్థులకు చదువుతోపాటు వృత్తివిద్యా కోర్సులను ఉచితంగా అందించడమే ఈ సంస్థ లక్ష్యం. ఆసక్తి, నేర్చుకోవాలనే పట్టుదల ఉన్న పిల్లలకు అన్నిరకాలుగా చేయూతనం దిస్తామని చెబుతుందామె. ఇప్పటివరకు దాదాపు వందమంది పిల్లలు దీని ద్వారా లబ్ధి పొందారని చెబుతుంది.
 పాఠ్యాంశాలు రాయడంలో...
మొదట్లో ఆంగ్లంపై అంతంతమాత్రమే అవగాహన ఉన్న ఆమె... క్రమంగా ఆ పాఠాలే రూపొందించే స్థాయికి చేరుకుంది. అయిదు, ఆరు, ఎనిమిదో తరగతికి చెందిన ఆంగ్లపాఠ్యపుస్తకాలను రూపొందించడంలో ఆశారాణి భాగస్వామ్యం ఉంది. 2006లో అయిదు, 2008లో ఆరు, 2012లో ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకాలను సిద్ధంచేసే 10 మంది బృందంలో ఆమెకీ అవకాశం వచ్చింది. కేవలం పిల్లలకే కాదు, ప్రభుత్వ టీచర్లకు బోధనావిధానాలపై ప్రత్యేక శిక్షణా తరగతులూ నిర్వహిస్తుంది. ఇవన్నీ కలిపే ఆమెకు ఈ ఏడాది జాతీయస్థాయి అవార్డును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 7న దిల్లీలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకోబోతోందామె.

- సీహెచ్‌. నర్సింహులు న్యూస్‌టుడే, పేట్‌ బషీరాబాద్‌

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.