close

తాజా వార్తలు

రివ్యూ: చిచ్చొరే

చిత్రం: చిచ్చొరే
తారాగణం: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధ కపూర్‌, వరుణ్‌ శర్మ, ప్రతీక్‌ బబ్బర్‌, తాహీర్‌ రాజ్‌ బాసిన్‌, నవీన్‌ పొలిశెట్టి, తుషార్‌ పాండే, సహస్ర శుక్ల తదితరులు
కథ: నితీశ్‌ తివారీ, పీయూష్‌ గుప్తా, నిఖిల్‌ మల్హోత్ర;
సంగీతం: ప్రీతమ్‌, సమీర్‌ ఉద్దిన్‌(నేపథ్యం)
ఎడిటింగ్‌: చారు శ్రీ రాయ్‌;
సినిమాటోగ్రఫీ: అమలెందు చౌదరి
నిర్మాణం: ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, నదియద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
దర్శకత్వం: నితీశ్‌ తివారీ
విడుదల తేదీ: 06-09-2019

ళాశాల నేపథ్యంలో వచ్చే సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. అందుకు ‘త్రీ ఇడియట్స్‌’.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సిరీస్‌ సినిమాలే నిదర్శనం. ఇప్పుడు ఆ పంథాలోనే మరో చిత్రం తెరకెక్కింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, శ్రద్ధ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చిచ్చొరే’. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ‘దంగల్‌’లాంటి హిట్‌ సినిమాను తెరకెక్కించిన నితీశ్ తివారీ దీనికి దర్శకత్వం వహించడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి సినిమా ఎలా ఉంది? ఆమిర్‌ఖాన్‌కులాగే సుశాంత్‌కు కూడా దర్శకుడు నితీశ్‌ తివారీ హిట్‌ ఇచ్చాడా? లేదా? అనేది తెలుసుకుందాం..

కథేంటంటే: అనిరుధ్‌(సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌), మాయ(శ్రద్ధ కపూర్‌) ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా.. కొన్నాళ్లకు విడిపోతారు. వారికి రాఘవ్‌ అనే ఓ టీనేజీ కుమారుడు ఉంటాడు. పేరొందిన ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు దక్కకపోవడంతో ఆత్మాహత్యాయత్నం చేస్తాడు. దీంతో తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుంటారు. ఈ విషయం తెలుసుకున్న అనిరుధ్‌, మాయ స్నేహితులు ఐదుగురు ఆస్పత్రికి వచ్చి రాఘవ్‌ను పరామర్శిస్తారు. అతడిలో ధైర్యం నింపడానికి వారంతా కళాశాలలో చదువుకున్న సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు, ఎదురైన అనుభవాలను రాఘవ్‌కు వివరిస్తారు. అదే ఈ సినిమా కథ..

ఎలా ఉందంటే: ఈ మధ్య కాలంలో విద్యార్థుల్లో చదువు ఒత్తిడి ఓ మానసిక వ్యాధిలా మారింది. పరీక్షలకు భయపడి... ఆశించిన ఫలితాలు రాలేదని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి అంశాన్నే ఎంచుకొని విద్యార్థి దశలో జయాపజయాలు సహజమేనని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు నితీశ్ తివారీ.  విద్యార్థి దశలో అందరికి ఎదురయ్యే సవాళ్లు, తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలను మరోసారి గుర్తు చేశాడు. కథ, కథనం చాలా నీట్‌గా ఉంటుంది. పాత్రల పరిచయాలు ఆకట్టుకుంటాయి. కథలో స్నేహితుల పరిచయాలు, సీనియర్స్‌ ర్యాగింగ్‌, క్యాంటీన్‌ రొమాన్స్‌ ఇలా అన్ని అంశాలను జోడించారు. అయితే ఇందులోని చాలా సన్నివేశాలు గతంలో చూసినవే కావడంతో తర్వాత వచ్చే సన్నివేశాలేంటో ప్రేక్షకుడికి ముందుగానే తెలిసిపోతాయి. ఫ్లాష్‌బ్యాక్‌ను.. వర్తమానాన్ని కలుపుతూ కథను నడిపించడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. పాత్రల మధ్య సంభాషణలు, హాస్య సన్నివేశాలు అలరిస్తాయి. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, వరుణ్‌ శర్మ, తాహీర్‌రాజ్‌ బాసిన్‌, నవీన్‌ పొలిశెట్టి, తుషార్‌ పాండే, సహస్ర శుక్ల వారికి ఇచ్చిన పాత్రల్లో సరిగ్గా సరిపోయారు. పాత్రలకు నూరు శాతం న్యాయం చేశారు. అయితే సుశాంత్‌ యువకుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. కానీ మధ్యవయస్కుడిగా అతడు మెప్పించలేకపోయాడు. ఆ గెటప్‌ సుశాంత్‌కు అంతగా నప్పలేదు. శ్రద్ధ కపూర్‌ పాత్రకు ప్రాధాన్యం లేదు. అయినా తెరపై ఆమె అందంగా, అమాయకంగా కనిపించి ఆకట్టుకుంది. తెలుగు నటుడు నవీన్‌ పొలిశెట్టి చక్కటి నటనతో మెప్పించాడు.

సాంకేతికంగా: సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అయితే ప్రధాన పాత్రలను మధ్య వయస్కులుగా చూపించే ప్రయత్నంలో మేకప్‌ ఎక్కువైందనిపిస్తుంది. మేకప్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సినిమాటోగ్రాఫర్‌ ఫ్లాష్‌బ్యాక్‌.. వర్తమానానికి మధ్య తేడా చూపిస్తూ చక్కటి పనితనం కనబర్చాడు. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు:
+ కథ, కథనం
+ తారల నటన
+ సంభాషణలు

బలహీనతలు:
- ఊహించగలిగే సన్నివేశాలు
- సంగీతం
- స్లో నరేషన్‌

చివరగా: ఈ ‘చిచ్చొరే’ యువతకు నచ్చుతుంది.
గమనిక:  ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.