close

తాజా వార్తలు

సంకేతాలు తెగిపోవడానికి ముందు ఏం జరిగింది..!

బెంగళూరు: ప్రయోగించిన నాటి నుంచి యావత్తు ప్రపంచం చంద్రయాన్‌-2ను ఆసక్తిగా చూస్తోంది. ఒక్కో దశ దాటుకుంటూ వ్యోమనౌక విజయవంతంగా ముందుకు దూసుకుపోతుంటే దేశ ప్రజలంతా మురిసిపోయారు. అన్ని దశలు అనుకున్నట్లుగానే సాగాయి. భూమి చుట్టూ ప్రదక్షిణలు ముగించుకొని జాబిల్లి కక్ష్యలోకి ఎంతో కచ్చితత్వంతో చేరింది. ప్రతి దశలో శాస్త్రవేత్తల కృషి, పరిశ్రమ ఫలించింది. అన్ని అనుకున్నట్లుగానే సాగి శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రునిపై కాలు మోపే దిశగా ల్యాండర్‌ విక్రమ్‌ విజయవంతంగా దూసుకెళ్లింది. ఎక్కడా ఏ లోపం లేకుండా ఇస్రో శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు పక్కాగా కుదిరాయి. ఇక కక్ష్య నుంచి ల్యాండర్‌ను నెమ్మదిగా జాబిల్లిపైకి దింపే ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియకు దాదాపు 15 నిమిషాలు పట్టే అవకాశం ఉందని.. ఈ క్షణాలు అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు ముందే ప్రకటించారు. అర్ధరాత్రి అయినా నిద్ర మాని ప్రజలు టీవీల ముందు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఒక్కో దశ పూర్తవుతున్న కొద్దీ ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇక ల్యాండింగ్‌కి కేవలం 2.1కి.మీ దూరంలో ఉండగా.. ఒక్కసారిగా శాస్త్రవేత్తల్లో నైరాశ్యం ఆవహించింది. అప్పటి వరకు టెలిమెట్రీ కేంద్రం నుంచి వస్తున్న ప్రకటనలు కాసేపు ఆగిపోయాయి. ల్యాండర్ దిశను చూపిస్తున్న తెరల్లో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. టీవీల ముందు కూర్చున్న వీక్షకులు, ఇస్రో టెలిమెట్రీ కేంద్రంలో కూర్చున్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అనేక మంది ప్రముఖులు, విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. వారి ఉత్కంఠకు తెరదించుతూ కొన్ని నిమిషాల అనంతరం ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ బాధాతప్త హృదయంతో ల్యాండర్ విక్రమ్‌ నుంచి సంబంధాలు తెగిపోయాయని ప్రకటించారు. అప్పటి వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలకు అసలు విషయం అర్థమయింది. అక్కడే ఉన్న ప్రధాని శాస్త్రవేత్తలకు అండగా ఉంటామని ప్రకటించి వారిలో స్థైర్యం నింపారు. వారు చేసిన ప్రయత్నం చాలా గొప్పదని.. నిరాశ చెందొద్దని స్ఫూర్తి నింపారు. దేశ ప్రజలంతా ఇస్రో చేసిన కృషిని కొనియాడారు. మేమంతా మీ వెంటే అంటూ సామాజిక మాధ్యమాల్లో నేతలు, ప్రజలు శాస్త్రవేత్తలకు అండగా నిలిచిన తీరు అభినందనీయం..

అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం..

జులై 22న శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-2 కొద్దిరోజుల పాటు భూ కక్ష్యలో పరిభ్రమించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. 

అనంతరం నెమ్మదిగా కక్ష్య తగ్గిస్తూ వ్యోమనౌకను జాబిల్లికి దిశగా సాగించారు. ఈనెల 2న ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్‌ విడిపోయింది. తర్వాత మూడు, నాలుగు తేదీల్లో రెండుసార్లు ల్యాండర్‌ కక్ష్యను తగ్గించి అంతిమ ఘట్టానికి చేరువ చేశారు. 

అన్నీ అనుకున్నట్లుగానే విజయవంతంగా సాగాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తుది దశ రానే వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 నుంచి 2.30 మధ్య ల్యాండ్‌ అయ్యే అవకాశం ఉందని ముందుగానే ప్రకటించడంతో ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు.

ఆ క్షణం రానే వచ్చింది. అర్ధరాత్రి దాటాక 1.38 గంటలకు ల్యాండర్‌ 30కి.మీ దూరంలో ఉందని.. 22 నిమిషాల్లో చంద్రునిపై  ల్యాండింగ్‌ కోసం ప్రయాణం ప్రారంభించనున్నామని ప్రకటించారు. అప్పటి నుంచి 19నిమిషాలు.. 15నిమిషాలు.. అలా కౌంట్‌ డౌన్ జరుగుతూ వచ్చింది. వీక్షకులలంతా ఎంతో ఉత్కంఠ భరితంగా వేచిచూస్తున్నారు.


 

ప్రధాని నరేంద్ర మోదీ ల్యాండింగ్‌ని స్వయంగా వీక్షించేందుకు మిషన్‌ ఆపరేషన్‌ కాంప్లెక్స్‌కు  చేరుకున్నారు. ఇస్రో ఛైర్మన్‌, కున్ని కృష్ణన్‌ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు కౌంట్‌డౌన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. 


-11 నిమిషాలు.... -5 నిమిషాలు...0 ఇలా కౌంట్‌డౌన్‌ పూర్తయి విక్రమ్‌ కక్ష్య నుంచి దిగుతూ జాబిల్లి వైపు 1630కి.మీ వేగంతో దూసుకెళ్లింది. 


కొన్ని క్షణాల అనంతరం ల్యాండర్‌లోని ఇంజిన్లను మండించి వేగాన్ని భారీగా తగ్గించారు. అలా క్రమంగా వేగాన్ని తగ్గిస్తూ వచ్చారు.


 

కీలక రఫ్‌ బ్రేకింగ్‌ ప్రక్రియ పూర్తయింది. 10 నిమిషాల తర్వాత ఫైన్‌ బ్రేకింగ్‌ ఫేస్‌ను ప్రారంభించారు. ప్రతి దశ పూర్తవుతున్న కొద్దీ శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.


• 2.1 కి.మీ వరకు సాధారణంగానే సమాచారం అందింది. కొన్ని క్షణాల్లో ల్యాండర్‌ నుంచి సంబంధాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 


అప్పటి వరకు సంతోషంగా ఉన్న శాస్త్రవేత్తల ముఖాల్లో ఒక్కసారిగా నైరాశ్యం ఆవహించింది. సంకేతాల కోసం కొద్దిసేపు వేచిచూశారు.


ఫలితం లేకపోవడంతో ఛైర్మన్‌ శివన్‌ కొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అసలు విషయాన్ని వివరించారు.  


అనంతరం ‘‘2.1కి.మీ వరకూ అంతా సజావుగానే సాగింది. ఆ తర్వాత ల్యాండర్‌ నుంచి భూకేంద్రానికి సంకేతాలు స్తంభించాయి. సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం’’ అని శివన్‌ బాధాతప్త హృదయంతో క్లుప్తంగా ఒక ప్రకటన చేశారు.


ఆ తర్వాత ప్రధాని మోదీ శాస్త్రవేత్తలను వెన్ను తట్టి ధైర్యం చెప్పారు. భవిష్యత్తులో ఇంకా గొప్ప విజయాలు సాధించగలరన్న నమ్మకం ఉందని వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం విక్రమ్‌ ల్యాండింగ్‌ను వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులతో ప్రధాని ముచ్చటించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.