
తాజా వార్తలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
బెంగళూరు: కన్నడ నాట మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్పకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తామంటూ ఇటీవల ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద దుమారం రేగడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇదే కోవలోకి ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్ కూడా చేరారు. అయితే, ఈయన కాస్త శ్రుతి మించి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రయాణికులను కలవరపెడుతున్న ట్రాఫిక్ జరిమానాల విషయంపై మాట్లాడుతూ రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయని వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ జరిమానాలు తగ్గించే విషయమై ఈయన స్పందిస్తూ ఈ మాటలన్నారు.
‘రాష్ట్రంలో ఏడాదికి పదివేలకు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు సరిగా లేకపోవడం వల్లే జరుగుతున్నాయని మీడియా చిత్రీకరిస్తోంది. కానీ, రోడ్లు సరిగా ఉంటేనే ప్రమాదాలు ఎక్కువగా జరుతున్నాయని నేను నమ్ముతున్నాను. ఎక్కువ శాతం ప్రమాదాలు హైవేల మీదనే జరుగుతున్నాయి. అలాగని నేను ఇంత ఎక్కువగా జరిమానాలు వేయడాన్ని సమర్ధించడం లేదు.కేబినెట్ సమావేశంలో వీటిని తగ్గించడంపై చర్చిస్తాం’అని అన్నారు. అయితే ఈయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష జేడీఎస్, కాంగ్రెస్ మండిపడ్డాయి. రోడ్లను బాగు చేయించడం కోసం తమ ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించిందని, భాజపా మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని చురకలంటించాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం స్పందించాలని డిమాండ్ చేశాయి.