close

తాజా వార్తలు

ప్రెసిడెంట్లే పెంచుకున్నారు!

 

చలికాలం స్వెటర్‌ వేసుకుని వెచ్చదనాన్ని ఆనందించేస్తాం... రగ్గులో చక్కగా నిద్రపోయి చలిపులి నుంచి తప్పించుకుంటాం... మనకు ఈ ఉన్ని వస్త్రాలన్నీ వచ్చేది గొర్రెల నుంచేనని తెలుసా? వాటి విశేషాలే ఇవి..!
ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ గొర్రెలున్నట్లు అంచనా. అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన జార్జ్‌ వాషింగ్టన్‌, థామస్‌ జఫర్‌సన్‌, జేమ్స్‌ మాడిసన్‌లూ గొర్రెల్ని పెంచినవారే. మాడిసన్‌ అయితే సొంత గొర్రె ఉన్నితో తయారు చేసిన కోటునే ధరించేవారు.

మేకల బంధువులే! 

* 15వేల ఏళ్ల క్రితమే మధ్య ఆసియా ప్రజలు వీటి పెంపకం మొదలుపెట్టారు. అందుకే వీటి పెంపకం అనేది ప్రాచీన పరిశ్రమగా ఉంది. 
* ఆసియా, ఐరోపాల నుంచే ఇవి ప్రపంచమంతటా వ్యాపించాయి. 
* ప్రపంచంలో వీటి జనాభా చైనాలో ఎక్కువ. తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, దక్షిణ అమెరికా దేశాలు వీటిని ఎక్కువగా పెంచుతున్నాయి. 
* ఇవి మేకలకు దగ్గరి బంధువులే.
* వీటిలో దాదాపుగా వెయ్యి వరకూ రకాలున్నాయి.
* ఇవి పది నుంచి పన్నెండేళ్లపాటు జీవిస్తాయి. 

చూపు చుట్టూరా!

* ఎప్పుడైనా గమనించారా? ఇవి మందలుగా నడుస్తున్నప్పుడు ఒకదాన్ని ఒకటి తగులుకుంటూ నడుస్తున్నట్టు అనిపిస్తాయి.అందుకు ఓ కారణముంది. ఇవి ఒకదానికి ఒకటి దగ్గరగా ఉండేందుకు ఇష్ట పడతాయి. అలా తగులుతూ ఉండడం వల్ల తక్కువ ప్రయత్నంతోనే ముందుకు నడిచేయొచ్చన్నది వీటి ఆలోచన. ఇంకా అన్నీ ఒకే చోట ఉంటే రాబోయే ప్రమాదాన్ని ఏ ఒక్కటి గుర్తించినా అంతా క్షేమంగా బయటపడొచ్చన్న ధీమా. 
* వీటికి వినికిడి శక్తి అద్భుతం. కంటి చూపు తక్కువ. తక్కువేగానీ 300డిగ్రీల కోణంలో దృష్టి ఉంటుంది. మెడ కొంచెమయినా పక్కకు తిప్పకుండా కాస్త వెనకాల వరకూ ఏం జరుగుతోందో పసిగట్టేయగలవు. అదే మనుషులకైతే 155 డిగ్రీల దృష్టి కోణమే ఉంటుంది. 
* గడ్డిలాంటివి మాత్రమే తినే శాకాహారులివి. వీటికి నాలుగు అంచెల జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇలా ఆకుల్ని అరిగించుకుని పోషకాలు గ్రహించుకోగల క్షీరదాల్ని రూమినెన్ట్స్‌ అంటారు.

ఉన్ని ఒక్కటే కాదు!

* ఉన్ని, మాంసం, చర్మం, పాల కోసం వీటిని పెంచుతారు. 
* మనిషి ఉన్నిని కత్తిరించి, పేని, ఊలు దారాలు తయారు చేయడం క్రీస్తు పూర్వం 3,500 సంవత్సరాల క్రితమే నేర్చుకున్నాడు. కిలో ఉన్నితో దాదాపుగా 15కిలోమీటర్ల పొడవైన ఊలు తయారవుతుంది. దీంతోనే స్వెటర్లు, రగ్గులు వస్తాయి. - గొర్రెల్లో చాలా రకాలుఉన్నాయనుకున్నాం కదా. వాటిలో కొన్ని ఎక్కువగా ఉన్నిని ఉత్పత్తి చేస్తాయి. ఒక్కోటీ ఏడాదికి మూడు నుంచి నాలుగు కేజీల ఉన్నినిచ్చేస్తాయి. 
* కొన్నింటిని మాత్రం మాంసం కోసమే పెంచుతారు. మన దేశంలో  ఉన్నిని ఉత్పత్తి చేసే రకాలు తక్కువ. మాంసం కోసం పెంచేవే ఎక్కువ.

బుల్‌ఫైట్‌కు సాటి! 

* పెద్ద గొర్రె జాతులు దాదాపుగా నాలుగు నుంచి ఐదు అడుగుల పొడవు, 150 నుంచి 180 కేజీల వరకూ బరువు ఉంటాయి. 
* మనం పెంచుకునేవే కాదు కొండకోనలో,్ల అడవుల్లో ఉండే రకాలూ బోలెడున్నాయి.
* మగవి వంపులు తిరిగిన కొమ్ములతో ఉంటాయి. బుల్‌ఫైట్‌లాగే ఇవీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసేసుకుంటాయి. ఒకటి ఓడిపోయానని ఒప్పుకొని అక్కడి నుంచి పారిపోయే వరకూ గంటలపాటు ఆ యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. బుల్‌ఫైట్‌లాగే ఈ గొర్రెపోతుల ఫైటూ కొన్ని దేశాల్లో ఫేమస్సు.
* పర్వతాల్లో నివసించే గొర్రెలు ఆ ఎత్తయిన కొండల్ని ఊరికే నడిచినంత తేలిగ్గా ఎక్కేస్తాయి. 
* ఇవి నిమిషానికి 16సార్లు ఊపిరి పీల్చుకుంటాయి. 
* మనకు నిమిషానికి 72సార్లు గుండె కొట్టుకుంటే వీటికి 75సార్లు కొట్టుకుంటుంది. 
* ఏడాదికి ఒకటి నుంచి రెండు సార్లు పిల్లల్ని కంటాయివి.
* చిన్న గొర్రె పిల్లను ఆంగ్లంలో ల్యాంబ్‌ అంటారు.
* ఐదు నెలలపాటు ఇవి పిల్లని కడుపులో పెట్టుకుని తర్వాత కంటాయి. పిల్ల స్వతంత్రంగా మారే వరకూ అన్నింటికీ తల్లి మీదే ఆధారపడుతుంది. అంతే.

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.