close

తాజా వార్తలు

ఆయన వల్లే సినిమాలపై ఇష్టం పెరిగింది  

‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది’
- ‘గబ్బర్‌సింగ్‌’ కోసం హరీష్‌ శంకర్‌ రాసిన డైలాగ్‌ ఇది.
నిజానికి ఈ డైలాగ్‌ తన కోసం తాను రాసుకుని, పవన్‌ చేత చెప్పించి ఉంటాడు. ఎందుకంటే.. ఆ తిక్క, లెక్క... అచ్చంగా హరీష్‌వే.
సినిమా అంటే పిచ్చి వ్యామోహం, వెర్రి ఆవేశం కావాల్సినంత ఉన్నాయి. అందుకే సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పండిత పుత్రుడిగా ఎదిగి - సినిమాలవైపు దూకాడు. ఎన్నో అనుమానాలు, అవమానాలు భరించాడు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నిలదొక్కుకోగలిగాడు. దానికి కారణం.. తనకున్న తిక్కే! ‘గబ్బర్‌సింగ్‌’తో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరీష్‌ ఇప్పుడు వరుణ్‌తేజ్‌ని ‘వాల్మీకి’గా మార్చాడు. ఈ సందర్భంగా ఆయన్ని ‘హాయ్‌’ పలకరిస్తే...

* తొలి చిత్రం ‘షాక్‌’ నుంచి ఇప్పటి వరకూ మీలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా వచ్చిన మార్పులు గమనించారా?
సినిమా సినిమాకీ నాలో మార్పు కనిపిస్తూనే ఉంటుంది. హిట్టవ్వనీ, ఫ్లాప్‌ అవ్వని ఆ సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుని ప్రయాణం చేయాల్సిందే. ‘మార్పు ఏజ్‌తో కాదు.. డామేజ్‌తో వస్తుంది’ అంటుంటారు. అది నిజమే. మనకు తగిలిన ఎదురుదెబ్బలతోనే జ్ఞానోదయాలు అవుతాయి. ‘షాక్‌’ వచ్చిన తర్వాతి ఈ పద్నాలుగు ఏళ్లలో ఓ మనిషి ఎన్ని రకాలుగా మారతాడో, మారాలో అన్ని రకాలుగానూ మారాను. ఇది వరకు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ ఉండేది కాదు. ఇప్పుడు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనిపిస్తోంది. ఇది వరకు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ, సినిమాలు తక్కువగా చూసేవాడ్ని. ఇప్పుడీ డిజిటల్‌ యుగంలో పుస్తకాలు చదవడం తగ్గిపోయింది. సినిమాలెక్కువయ్యాయి.

* పుస్తకాలకు దూరమైపోతున్నానేమో అనే బెంగ, బాధ కలగలేదా?
ఐదేళ్ల క్రితం అనిపించింది. ఆ తరవాతే మళ్లీ విస్తృతంగా చదవడం మొదలెట్టా. చదవడం సినిమా వాళ్లకు చాలా అవసరం. మాకే కాదు. ఏ రంగంలో వ్యక్తులకైనా పుస్తక పఠనం చాలా ఉపయోగపడుతుంది. యండమూరి వీరేంద్రనాథ్‌ నా అభిమాన రచయిత. ఈ మధ్య చాలా మంచి రచయితలు వచ్చి ఉండొచ్చు. యండమూరి స్థాయే వేరు.

* మరి మీకు ‘రాయాలి’ అని ఎప్పుడూ అనిపించలేదా?
‘ఆంధ్రభూమి’, ‘స్వాతి’ వార పత్రికలలో సింగిల్‌ పేజీ కథలు రాసేవాడ్ని. అలా నాటకరంగానికి దగ్గరయ్యా. చిన్న చిన్న స్కిట్లు, సంభాషణలు రాసేవాడ్ని. అప్పట్లో నటనపై మక్కువ ఉండేది. అప్పుడు నా వయసు అటూ ఇటూ కాకుండా ఉండేది. చిన్న పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. హీరో పాత్రలు వచ్చేవి కావు. దాంతో రచయితగా ఉండిపోయాను.

* నటనపై దృష్టి పెట్టకపోవడానికి కారణం ఏమిటి?
ఆ రోజుల్లో నటుడు కావడం చాలా ఖరీదైన వ్యవహారం. సరైన ఆహారం తీసుకోవాలి, ఫిట్‌నెస్‌ కాపాడుకోవాలి. మంచి మంచి దుస్తులు వేసుకోవాలి. స్టైలీష్‌గా కనిపించాలి.. ఇలా చాలా ఉండాలి కదా? మాదేమో మధ్యతరగతి కుటుంబం. నాన్న స్కూలు టీచరు. ఆర్థిక పరిస్థితి వల్ల అలాంటి ప్రయత్నాలు చేయలేదు. సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. నా జీవనోపాధి కోసం ట్యూషన్లు చెప్పి డబ్బులు సంపాదించేవాడ్ని. అందుకే రచయితగానో, సహాయ దర్శకుడిగానో ప్రయత్నించడం నయం అనిపించింది.

* పండిత పుత్రః... అంటూ మీ స్నేహితులు, చుట్టాలు ఏడిపించేవారా?
వాళ్లకు అంత అవకాశం ఇవ్వలేదు. నేను చాలా మంచి విద్యార్థిని. సాంస్కృతిక కార్యక్రమాల్లో మరింత ముందుండేవాడ్ని. కాకపోతే.. మా చుట్టాలు నన్ను దాదాపు వెలివేసినంత పని చేశారు. అంతటి సంప్రదాయ కుటుంబంలో పుట్టి సినిమా అంటూ వెర్రి వేషాలు వేసింది నేనే.

* ఘోస్ట్‌ రైటర్‌గా పనిచేశారు కదా? మీ ప్రతిభని వాడేసుకుంటున్నారు అన్న కోపం వాళ్లపై రాలేదా?
లేదండీ. ‘నేను రాసింది ఒకరికి నచ్చింది’ అనే సంతోషం ఉండేది. నాకు రావాల్సిన క్రెడిట్‌ ఇంకెవరో తీసుకెళ్లిపోతున్నారు అని ఎప్పుడూ అనుకునేవాడ్ని కాదు. నాకో ఏసీ రూమ్‌ ఇచ్చి, రోజుకు మూడు డీవీడీలు ఇచ్చి, సినిమాలు చూసుకో’ అని చెప్పి, భోజనం పెట్టి, డబ్బులు ఇచ్చి, మనల్ని పోషిస్తుంటారు నిర్మాతలు. నేను వచ్చింది ఇందుకేగా.. అనిపించి హాయిగా రాసుకునేవాడ్ని. తెరపై నా పేరు వేయలేదని ఎప్పుడూ ఫీల్‌ అవ్వలేదు. ఒకరిద్దరైతే బాగా వాడేసుకున్నారు. డబ్బులు కూడా ఇవ్వలేదు. అందులో ఒకాయన తరవాత బాగా చితికిపోయాడు. నేనే ఆయనకు ఓ సందర్భంలో ఆర్థిక సాయం చేసి ఆయనపై ప్రతీకారం తీర్చుకున్నాను.

నాన్న వల్లే సినిమాలపై ఇష్టం
నాకు సినిమాపై ఇష్టం పెరగడానికి కారణం మా నాన్నగారే. ఆయన సాహిత్యాభిమాని. అందునా సినిమా పాటలంటే పిచ్చి. ఘంటసాల, కిషోర్‌ కుమార్‌ పాటలు వింటుండేవారు. ఎన్టీఆర్‌ సినిమాల్ని బాగా చూసేవారు. ఆయన పాటల గురించి, సినిమాల గురించి నాతో చర్చిస్తుండేవారు. అలా ఆయన వల్ల కుట్టిన పురుగు ఓ రోజు అనకొండలా మారింది. బీహెచ్‌ఈఎల్‌కు మకాం మార్చినప్పుడు, అక్కడ నాటకాలపై ప్రేమ పెరగడం, అందులో ఉన్న కిక్‌ ఏమిటో అర్థం కావడం వల్ల నేను ఇటు వైపుగా వచ్చేశాను. తనవద్ద చదువుకున్న పిల్లలంతా మంచి ఉద్యోగాలతో సెటిల్‌ అవుతుంటే... నన్ను చూసి నాన్నగారు చాలా మధనపడేవారు. అలా ఆయనకు చాలా నిద్రలేని రాత్రుల్ని మిగిల్చా.
‘‘ఈ మధ్య నేను చూసిన సినిమాల్లో నన్ను బాగా కుదిపేసిన చిత్రం ‘మహానటి’. చూస్తూ చూస్తూ నాలుగుసార్లు ఏడ్చేశాను. అంతగా లీనమైపోయాను. మలయాళంలో ‘ప్రేమమ్‌’ బాగా నచ్చింది. ప్రతీ విభాగం అద్భుతంగా పనిచేసింది. ‘థింకింగ్‌ స్లో.. థింకింగ్‌ ఫాస్ట్‌’ అనే పుస్తకం ఈమధ్య బాగా స్ఫూర్తినిచ్చింది. యండమూరి ఓ మాట అంటారు. ‘నేను ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు రాస్తాను. వినాలనుకున్నప్పుడు చదువుతాను’ అని. ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు బాగా చదవండి. అదే ఏకైక మార్గం. యువ రచయితలకు నేనిచ్చే సలహా ఇదే’’
‘‘నాకు నిశ్శబ్దం అంటే భయం. నా చుట్టూ జనం ఉండాలి. ఒక్కడ్నే గదిలో కూర్చుని కథలు రాసుకోలేను. నన్ను అమీర్‌పేట్‌ సందుల్లో కూర్చోబెడితే, ఆ గోల మధ్య ఇంకాస్త షార్ప్‌ అవుతాను. అవసరం లేకపోయినా రైల్వేస్టేషన్‌కీ, ఎయిర్‌ పోర్టుకీ వెళ్లి కూర్చునేవాడ్ని. అక్కడ మనుషుల ముఖాలు, వాళ్ల హావభావాలూ.. చూస్తూ సమయం గడిపేసేవాడ్ని. లింగంపల్లి నుంచి దిల్‌సుఖ్‌నగర్‌ బస్సులో వెళ్తూ ప్రత్యేకంగా ఎవరెవరు కనిపిస్తారా? అని చూసేవాడ్ని. ఈ కసరత్తు నా ఆలోచనలకు ఇంధనంగా మారేది’’
‘‘చిన్నప్పుడు చాలా హైపర్‌గా ఉండేవాడ్ని. దానికి చాలా కారణాలున్నాయి. బీహెచ్‌ఈఎల్‌లో ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్న గ్యాంగ్‌ అంతా ఇంగ్లిష్‌ మీడియం పిల్లలే. తెలుగు విద్యార్థిని నేనొక్కడినే. వాళ్ల మధ్య ప్రత్యేకంగా కనిపించాలంటే ఏదో ఒకటి చేయాలి. అందుకే నేనెక్కడ ఉన్నా గోల గోల చేసేవాడ్ని. స్కూల్లో మాస్టారు ఏదైనా ప్రశ్న అడిగితే ‘నే చెబుతా సార్‌’ అంటూ చటుక్కున లేచేవాడ్ని. అందరి అటెన్షన్‌ను నాపైకి తీసుకు రావడానికి అదో ట్రిక్‌.’’

నువ్వెంత నీ అనుభవమెంత?

కథా చర్చలు జరుగుతున్నప్పుడు చాలా అవమానాలు ఎదురవుతుండేవి. ‘ఇది ఎలా కుదురుతుంది సార్‌’ అని లాజిక్‌గా అడిగితే, దానికి సమాధానం చెప్పకుండా ‘నువ్వెంత? నీ అనుభవం ఎంత’ అన్నట్టు మాట్లాడేవారు. వాళ్లు మాట్లాడే పద్ధతి దురుసుగా ఉన్నా, అది కరెక్టే అనిపిస్తుంటుంది. ‘గబ్బర్‌ సింగ్‌’లో కథానాయకుడి పేరు వెంకటరత్నం నాయుడు. ‘పసివాడు పవన్‌ కల్యాణ్‌ అయ్యాడు’ అని టైటిల్‌ కార్డ్‌ వేస్తే జనం చూశారు. అక్కడ ఇదెందుకు జరిగింది? ఎలా జరిగింది? అని లాజిక్కులు తీయలేదు.

‘దాగుడు మూతలు’ చేద్దామనుకున్నా

‘అల వైకుంఠపురము’ టీజర్‌లో అల్లు అర్జున్‌ చెప్పినట్టు ‘గ్యాప్‌ తీసుకోలేదు.. వచ్చింది’. నిజానికి డబ్బులు సంపాదించాలనో, ఆస్తులు కూడబెట్టాలనో సినిమాలు చేయదలచుకోలేదు. వచ్చిన పేరు కాపాడుకుంటూ మంచి సినిమాలు చేయాలన్న ప్రయత్నం నాది. అలాంటి కథ కోసం ఎదురుచూశాను. ‘డీజే’ తరవాత ‘దాగుడు మూతలు’ అనే  కథ చేద్దామనుకున్నాను. ఇద్దరు హీరోలతో చేయాల్సిన సినిమా అది. నాకు అనుకున్న తారాగణం దొరకలేదు. అనుకోకుండా ‘జిగడ్తాండ’ చూశాను. అది ఇప్పుడు ‘వాల్మీకి’గా మీ ముందుకు రాబోతోంది.

- మహమ్మద్‌ అన్వర్‌,  ఫొటో: జయకృష్ణ

Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.