close

తాజా వార్తలు

‘ప్రభుదేవా హీరోనా.. ఎవరు చూస్తారు’ అన్నారు!

25 వసంతాల ‘ప్రేమికుడు’

ఇంటర్నెట్‌డెస్క్‌: 1993లో ‘జెంటిల్‌మేన్‌’ విడుదలైంది. తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంది. శంకర్‌ టేకింగ్‌, అర్జున్‌ నటనను, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే, అందులోని ఓ పాట చిన్నా పెద్దా తేడా లేకుండా ఓ ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఆ పాటకు డ్యాన్స్‌ చేసిన వ్యక్తిని చూసి, అతని ఒంట్లో అసలు ఎముకలు ఉన్నాయా? అని ఆశ్చర్యపోయారు. అతనే ఆ తర్వాత ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా. అర్జున్‌తో తొలి చిత్రం హిట్‌ కొట్టిన శంకర్‌ రెండో చిత్రానికి అనూహ్యంగా ప్రభుదేవాను ఎంచుకున్నాడు. అదే ‘ప్రేమికుడు’. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘ప్రేమికుడు’ విడుదలై నేటికి(సెప్టెంబరు 17) 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

‘జెంటిల్‌మేన్‌’ విజయంతో..
శంకర్‌ మొదటి చిత్రం ‘జెంటిల్‌మేన్‌’ను కుంజుమన్‌ నిర్మించారు. చిత్ర పరిశ్రమలో ఆయన ఒక పద్ధతిని పాటిస్తారు. తనతో పనిచేసే వాళ్లు ఎవరైనా ఐదు చిత్రాలకు పనిచేయాలి. అలా ఒప్పందం చేసుకుంటారు. ‘జెంటిల్‌మేన్‌’ విజయంతో శంకర్‌కు దేవార్‌ ఆఫీస్‌తో పాటు, మారుతీ 800 బహుమతిగా ఇచ్చారు. ఆయన సహాయకులకు స్కూటర్లను, ఇతర  సాంకేతిక బృందానికి బంగారు నాణేలు ఇచ్చారు. మొదటి చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో తర్వాతి చిత్రం కోసం అందరూ కలిసి పనిచేయాలని అనుకున్నారు. 

అప్పుడే శంకర్‌ కుంజుమన్‌కు ఒక కథ చెప్పాడు. ‘మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడు ఏకంగా గవర్నర్‌ కుమార్తెను ప్రేమిస్తాడు’ ఇది శంకర్‌ చెప్పిన స్టోరీ లైన్‌. అందరూ బాగుందని అనుకున్నారు. కుంజుమన్‌ ఈసారి కూడా ఈ చిత్రాన్ని భారీగా తీయాలని భావించారు. మరోపక్క శంకర్‌ పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. 

జయలలిత అండతో..
ఈ సినిమా చేస్తున్న సమయంలో తమిళనాడు సీఎంగా జయలలిత ఉన్నారు. గవర్నర్‌గా చెన్నారెడ్డి పనిచేస్తున్నారు. ‘ప్రేమికుడు’లో హీరోయిన్‌ తండ్రి గవర్నర్‌. కుట్రలు కుతంత్రాలు చేస్తుంటాడు. ఈ కథ తెలిసి గవర్నర్‌ కార్యాలయం నుంచి నిర్మాత కుంజుమన్‌ బెదిరింపులు వచ్చాయి. ఆయా సన్నివేశాలను తీసేయమని హెచ్చరించారు. ఇదే విషయం కుంజుమన్‌ సీఎం జయలలితకు చెప్పడంతో.. ‘అలాంటి సన్నివేశాలు ఉంటే సెన్సార్‌ బోర్డు వాళ్లు కత్తెర వేస్తారు. భయపడాల్సిన పనిలేదు’ అని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత సినిమాను చూసిన ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 

హీరోగా ఎవరిని తీసుకోవాలి!
కథ సిద్ధమైంది. మరి ‘హీరోగా ఎవరిని తీసుకోవాలి’ అని చిత్ర బృందం ఆలోచనలో పడింది. కుంజుమన్‌ ఎవరైనా కొత్త వారిని తీసుకోవాలని చూస్తున్నారు. అప్పటికే ఆయన నిర్మించిన ‘వసంతకాల పార్వాయ్‌’లో ప్రభుదేవా డ్యాన్స్‌ చూశారు. ఆ తర్వాత ‘జెంటిల్‌మేన్‌’లో ‘చికుబుకు చికుబుకు రైలే’ పాటకు ఇరగదీశాడు. పైగా ఆయన తండ్రి సుందరం మాస్టర్‌తో కుంజుమన్‌కు మంచి పరిచయం కూడా ఉంది. దీంతో వెళ్లి ఆయనను కలిశారు కుంజుమన్‌. ‘మీ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా చేయాలని అనుకుంటున్నా’ అని చెప్పారు. ఆయన సరే అన్నారు. ఇదే విషయంలో దర్శకుడు శంకర్‌కు చెబితే, ఆయన అంతగా ఆసక్తి చూపలేదు.

అందుకు కారణం కూడా ఆయన చెప్పారు. ‘ప్రభుదేవా డ్యాన్స్‌ వేస్తే ఐదు నిమిషాలు చూస్తారు. ఆ తర్వాతా?. పైగా సన్నగా, పీలగా ఉన్నాడు. గుబురు గడ్డం. అలాంటి వ్యక్తిని హీరోగా ప్రేక్షకులు హర్షిస్తారా’ అని అనుమానం వ్యక్తం చేశాడు. ఇదే విషయం పంపిణీదారులను కూడా అడిగితే, వారు కూడా సరిగా జవాబు చెప్పలేదు. ‘రెండున్నర గంటల పాటు ప్రభుదేవాను ప్రేక్షకులు చూస్తారా?’ అని కొందరు అన్నారు. అయితే, ఆ తర్వాత ప్రభు పాత్రలో ప్రభుదేవా సరిపోతాడని శంకర్‌కు అనిపించింది. ‘అతను మంచి డ్యాన్సర్‌ అన్న విషయం తెలుసు. అతను చేసిన పలు పాటలను కూడా చూశాను. హావాభావాలు కూడా బాగుంటాయి’ అని కుంజుమన్‌కు శంకర్‌ చెప్పడంతో ఎట్టకేలకు ప్రభుదేవాను ఖరారు చేశారు. ‘డిస్ట్రిబ్యూటర్స్‌ అనుకున్నది తప్పు అని నిరూపించాలి’ అని శంకర్‌ అన్నారు. ఇక హీరోయిన్‌గా మొదట మాధురీ దీక్షిత్‌ను అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని చర్చల అనంతరం నగ్మాకు ఓటేశారు. 

వడివేలు అలా..
హీరో స్నేహితుడిగా గౌండమణిని తీసుకుందామని చిత్ర బృందం భావించింది. అంతకుముందు ఆయన నటించిన చిత్రాలు వరుసగా హిట్‌ కావడంతో పారితోషికం పెంచారు. దీంతో చిత్ర బృందం వడివేలును తీసుకుంది. అయితే, అప్పటికే వడివేలు నటించిన చిత్రాలు అంత పెద్దగా ఆడకపోవడంతో మరో తప్పు చేస్తున్నారని చిత్ర బృందాన్ని కొందరు హెచ్చరించారు. ‘అతనికి మరో అవకాశం ఇచ్చి చూద్దాం’ అని నిర్మాత అనడంతో వడివేలును తీసుకున్నారు. గవర్నర్‌ కాకర్ల సత్యనారాయణమూర్తి పాత్రకు గిరీష్‌ కర్నాడ్‌ను అడిగితే తొలుత ఆ పాత్ర చేసేందుకు ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత శంకర్‌, కుంజుమన్‌ ఆయనను ఒప్పించారు. 

మరోసారి రెహమాన్‌ మ్యాజిక్‌
‘జెంటిల్‌మేన్‌’ విజయంతో మరోసారి ఈ చిత్రానికి కూడా రెహమాన్‌ను తీసుకున్నారు. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. ‘ఊర్వశి.. ఊర్వశి..’, ‘ముక్కాల ముక్కాబులా’ పాటలు ఇప్పటికీ ఎంత ఫేమస్సోఅందరికీ తెలిసిందే. 

అసలే కొత్త హీరో. అందరికీ అనుమానం. సినిమా తీసుకుంటే ఏమవుతామోనని డిస్ట్రిబ్యూటర్స్‌కు భయం. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నారు శంకర్‌. అప్పుడు వచ్చిన ఆలోచన విజువల్‌ ఎఫెక్ట్స్‌. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని అనుకున్నారు. పాటల్లో వాటిని జోడిస్తే బాగుంటుందని భావించారు. అయితే, బడ్జెట్‌ పెరిగిపోతుంది.  అయితే కుంజుమన్‌ మాత్రం వెనకడుగు వేయలేదు. విదేశీ నిపుణులతో కూడా కొన్ని సీన్లు చేయించారు. ముఖ్యంగా సింగపూర్‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఇందుకు పనిచేశారు. ఇక ‘ఊర్వశి.. ఊర్వశి’ పాటలో కనిపించే అద్దాల బస్సును తోట తరణి డిజైన్‌ చేశారు. షూటింగ్‌ చేస్తుంటే బస్సును చేసేందుకు వందలమంది వచ్చారు. అయితే, ఆ తర్వాత అదే బస్సును రీడిజైన్‌ చేసి బ్లాస్టింగ్‌సమయంలో పేల్చేశారు.

సినిమా పూర్తయింది. 1994, సెప్టెంబరు 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. అంతా హిట్‌ టాక్‌. డబ్‌ చేసి హిందీలోనూ విడుదల చేశారు. శంకర్‌ టేకింగ్‌, ప్రభుదేవా నటన, డ్యాన్స్‌లు, నగ్మా అందాలు, పాటల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాను ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. నాలుగు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఉన్ని కృష్ణన్‌, ఉత్తమ ఎడిటింగ్‌ బి లెనిన్‌, వీటీ విజయన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ వెంకీ, ఏఎస్‌ లక్ష్మీనారాయణ, మూర్తిలకు ఆడియోగ్రఫీలో అవార్డులు దక్కాయి. 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.