close

తాజా వార్తలు

ఆయన స్థాయిని నేను ఎప్పటికీ తగ్గించను: చరణ్‌

‘సైరా’ వివాదంపై స్పందించిన స్టార్‌

డబ్బులుంటే సరిపోదు..

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌ రెడ్డి దర్శకుడు. ఇది చిరు డ్రీమ్‌ ప్రాజెక్టు కావడంతో ఆయన తనయుడు రామ్‌ చరణ్‌ నిర్మించారు. అక్టోబరు 2న సినిమా ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. బుధవారం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెర్రీ, సురేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

* ఇందులో రియల్‌ స్టోరీ ఎంత శాతం ఉంది? అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ సేతుపతిని మార్కెట్‌ కోసం తీసుకున్నారా?, కథలో భాగంగా తీసుకున్నారా?
సురేందర్: మాకు దొరికిన ఆధారాల ప్రకారం ఈ సినిమా తీశాం. కథలో అమితాబ్‌, సుదీప్‌, విజయ్‌ అవసరం ఉంది కాబట్టి.. వారిని తీసుకున్నాం.

* పరిశోధన ఎలా సాగింది?
సురేందర్: ఈ సినిమాకు ముందు నాకు నరసింహారెడ్డి గురించి తక్కువ తెలుసు. షూటింగ్‌కు ఆరు నెలల ముందు ఆయన గురించి తెలుసుకున్నా. స్నేహితుల సహాయంతో చాలా పరిశోధనలు చేశాం.

* చిరంజీవి లుక్‌పైన మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
చరణ్‌: ముందే చిరు పాత్ర, లుక్‌ ఎలా ఉండాలని డిజైన్‌ చేసుకున్నాం. దాన్ని ఆయన ఫాలో అయ్యారు. లక్కీగా అన్నీ బాగా కుదిరాయి.

* పవన్‌ వాయిస్‌ టీజర్‌కే పరిమితమా? సినిమాలో ఎక్కడైనా కనిపిస్తుందా?
చరణ్‌: సినిమాలో కూడా ఉంటుంది.

* సురేందర్‌పై నమ్మకం ఎలా కలిగింది?
చరణ్‌: ఆయన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు చేశారు. ‘ధృవ’తో ఆయన ఎలాంటి సినిమాలు తీయగలరో అర్థమైంది. అందుకే ఆయన తప్పా.. మరొకరు దీనికి న్యాయం చేస్తారని అప్పుడు నాకు అనిపించలేదు.

* ఈ ప్రాజెక్టు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్‌ అయ్యారు?
సురేందర్: నేను ఊహించలేదు. కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడానికి 15 రోజుల సమయం అడిగా. ఇంత బడ్జెట్‌ ఉన్న సినిమా, చిరుతో తీయగలనా? అనుకున్నా. ఆ సమయంలో నా ముందు కేవలం చిరు ఉన్నారు. ఆయన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నా. నా వెనుక చరణ్‌ ఉన్నాడు. ఈ ధైర్యంతో ముందడుగు వేశా.

* ‘సైరా’ను నిర్మించడానికి కారణం ఏంటి?
చరణ్‌: పదేళ్ల క్రితమే నాన్న ఓకే చేసిన సినిమా ఇది. అన్నీ సహకరించిన తర్వాత ఇలాంటి సినిమా తీయాలి అనుకున్నాం. దాన్ని ఇలా బయటికి తీసుకొచ్చాం. ఇది నాన్న కోరిక.

* ఇందులో రామ్‌ చరణ్‌లేని లోటు కనిపిస్తోంది?
చరణ్‌: ఏంటండి సురేందర్‌ గారు నాకు ఆ అవకాశం ఎందుకు ఇవ్వలేదండీ, నేను ఏం చేశానండీ (నవ్వుతూ).. (సురేందర్‌ మైక్‌ తీసుకుని.. ‘నిర్మాత అనేది పెద్ద రోల్‌. దాన్ని చూసుకుంటూ, నటించాలంటే కష్టం. అందుకే ఆయనకు పాత్ర ఇవ్వలేదు’ అన్నారు). చరణ్‌ అందుకుని.. జోక్‌గా అన్నాను. అక్టోబరు 2 ఎంత తొందరగా వస్తుందా? అని ఎదురుచూస్తున్నా. నాకు నిర్మించే అవకాశం దొరకడమే ఎక్కువ. నటనను పక్కనపెట్టండి.

* నిర్మాతగా సవాలు అనిపించిందా?
చరణ్‌: చాలా సవాలుగా అనిపించింది. ఓ సినిమా తెరపైకి రావాలంటే డబ్బులు, మంచి దర్శకుడు ఉంటే సరిపోదు. అందరూ అంకితభావంతో పనిచేయాలి. అలా పనిచేసిన సినిమా ఇది.

* బాధను కల్గించే క్లైమాక్స్‌ ఉన్న సినిమాలు నిరాశకు గురి చేస్తుంటాయి. ఇందులో కూడా అలానే ఉంది. మీలో ఆ భయం ఉందా?
సురేందర్: ఇది చరిత్ర. నరసింహారెడ్డి తన జీవితాన్ని త్యాగం చేసి.. ఓ యుద్ధాన్ని ప్రారంభించారు. అదే విక్టరీ.. ఈ చిత్రానికి అదే ప్లస్‌ పాయింట్‌.

* రికార్డుపరంగా ఎలాంటి వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు?
చరణ్‌: అవన్నీ లెక్కించి సినిమా తీయలేదు. మేం అనుకున్న కథ.. అనుకున్నట్లు తెరపై రావాలని ఖర్చు చేశాం.

* ‘సైరా’ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారని తెలిసింది. దానిపై ఏమంటారు?
చరణ్‌: ఆయన కుటుంబ సభ్యుల్ని నేను కూడా కలిశాను. ఓ వ్యక్తి జీవితం గురించి తీసుకున్నప్పుడు.. 100 ఏళ్ల తర్వాత అది చరిత్ర అవుతుంది. ఇదంతా మీకు తెలుసు. సుప్రీం కోర్టు ఎప్పుడో తీర్పు ఇచ్చింది. వందేళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర అవుతుంది. దాన్ని ఎటువంటి అభ్యంతరాలు లేకుండా, బాధ్యతాయుతంగా సినిమాగా తీయొచ్చని చెప్పింది. నరసింహారెడ్డిని ఓ కుటుంబానికి, ప్రాంతానికి పరిమితం చేయడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన దేశం కోసం పనిచేశారు. ఆయన స్థాయిని నేను ఎప్పటికీ తగ్గించను.

* ఎలాంటి రికార్డు ఊహిస్తున్నారు?
సురేందర్: ఓ సినిమా విజయం చూసి దీన్ని తీయలేదు. ‘మా డాడీకి పెద్ద గిఫ్ట్‌ ఇవ్వాలి. ఆయన 150 సినిమాలు చేశారు. అందులో నం.1 సినిమాగా ఇది ఉండాలి. ఆయన పేరు చరిత్రలో ఉండాలి’ అని చరణ్‌ నాతో అన్నారు. తన తండ్రికి బహుమతి ఇవ్వాలని ఈ సినిమాను ప్రారంభించాడు. ఆయన ఉద్దేశం గొప్పది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.