close

తాజా వార్తలు

పూరీ హీరో.. ఎంట్రీ అదిరిపోవాల్సిందే!

వీడు చాలా పవర్‌ఫుల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: పూరీ జగన్నాథ్‌.. పవర్‌ఫుల్‌, మాస్‌ కథలకు మార్కుగా నిలిచిన దర్శకుడు. ఆయన సినిమాల శైలి కొత్తగా ఉంటుంది. ప్రత్యేకించి హీరో ఎంట్రీ ఆకట్టుకుంటుంది. పూరీ హీరోను తొలి సన్నివేశంలోనే పవర్‌ఫుల్‌గా చూపిస్తుంటారు. ఆయనలోని ఈ ప్రత్యేకతకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.‌ సినిమాకు కాస్త ఆలస్యంగా వెళ్లి హీరో ఎంట్రీ మిస్‌ అయితే ఫీల్‌ అయ్యే అభిమానులు ఎందరో. శనివారం పూరీ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తీసిన కొన్ని సినిమాల్లో హీరోల ఎంట్రీలు చూద్దాం.

* ‘బద్రి’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ ‘ఐయామ్‌ ఏన్‌ ఇండియన్‌’ అనే పాటతో ఎంట్రీ ఇస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పవర్‌స్టార్‌ అని రాసి ఉన్న స్టేజ్‌పై పాట పాడుతూ పవన్‌ ఎంట్రీ ఆకట్టుకుంటుంది.

* ‘ఇడియట్‌’ సినిమాలో ‘చంటిగాడు వచ్చాడు’ అనే డైలాగ్‌తో మాస్‌ మహారాజా రవితేజ ఎంటర్‌ అవుతారు. ఈ సినిమాకు ముందు ఆయన ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’ సినిమాతో విజయం అందుకున్నా.. మాస్‌ హీరోగా మద్ర పడింది మాత్రం ఈ సినిమాతోనే.

* ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’లో ‘నాకూ కొడుకున్నాడు తెలుసా.. చిన్నవాడు కాదు.. నీలాగా అడ్డగాడిదలా ఉంటాడు..’ అంటూ జయసుధ తన కుమారుడు రవితేజను పరిచయం చేస్తారు. ఈ స్టైల్‌లో హీరో ఎంట్రీ ఇవ్వడం ఓ కొత్త ప్రయోగం. అది ఇందులో సక్సెస్‌ అయ్యింది.

* ‘పోకిరి’లో మహేశ్‌బాబు ఎంట్రీ ఓ ప్రత్యేక ఆకర్షణ. ‘కొట్టేది మేము కాదు.. పండు.. రేపు పొద్దున ఇందిరానగర్‌లో పరిగెత్తించి, పరిగెత్తించి కొడతాడు’.. కట్‌ చేస్తే కూరగాయలు ఎగరటం, వాటి మధ్యలోంచి మహేశ్ మాస్‌ ఎంట్రీ. ‘షట్టర్‌ కొంచెం తెరిచిపెట్టుకోమ్మా.. పారిపోవడానికి ఉంటుంది’ అంటూ డైలాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన పండుగాడు రికార్డులు సృష్టించేశాడు.

* ‘దేశముదురు’.. అల్లు అర్జున్‌కు సూపర్‌ హిట్‌ ఇచ్చిన చిత్రం. ‘చేయి బిగుసుకుందన్నా, నరాలు తేలినాయ్‌ అన్నా.. ఆడి కళ్లల్లో కరెంట్‌ చూశానన్నా..’ అంటూ వేణుమాధవ్ డైలాగ్‌.. కట్‌ చేస్తే విలన్‌ను కొడుతూ బన్నీ పవర్‌ఫుల్‌ ఎంట్రీ‌. సిక్స్‌ప్యాక్‌ బాడీ స్టైలిష్‌ లుక్‌.. అప్పట్లో ఆయన యూత్‌కు ఐకాన్‌ అయ్యారు.

* ‘చిరుత’లో రామ్‌ చరణ్‌ కళ్లు.. నిజంగా చిరుత కళ్లా అన్నట్లు చూపించారు పూరీ. ‘అల్లుడూ.. జైలర్‌ ఓకే అన్నాడు.. కాకపోతే నువ్వెవడో తెలియకుండా మేనేజ్‌ చేయమన్నాడు. చీకటి పడేలోపు ఫస్ట్‌ షో పడిపోవాలి.. టాక్‌ అదిరిపోవాలి’ కట్‌ చేస్తే.. తోటి ఖైదీలతో ఫైట్‌.. చెర్రీ లుక్‌ రివీల్‌‌.

* ‘బుజ్జిగాడు’లో ప్రభాస్‌ ఎంట్రీ ఫైట్‌తోనే.. ఈ తొలి సీన్‌ హైలైట్‌గా నిలిచింది. ‘మామా ఇప్పుడు వీడితో పెట్టుకుంటే సినిమా ఫస్ట్‌ హాఫ్‌ అయిపోద్ది’.. ‘టైటిల్స్‌ కూడా పడనివ్వను. నేను ఒక్కసారి కొట్టినా.. వందసార్లు కొట్టిన సేమ్‌ ఫీల్‌’ అని రెచ్చిపోతారు ప్రభాస్‌.

* ‘బిజినెస్‌మేన్‌’.. ‘క్రైమ్‌ అనే ఆలోచన ఎవడి మైండ్‌లో మెదిలినా వాడ్ని షూట్‌ చేసి పడేస్తాను. అండర్‌ వరల్డ్‌ లో ఎవడు అడుగుపెట్టలేడు.. పెట్టనివ్వను’.. కట్‌ చేస్తే మహేశ్‌ ఎంట్రీ. ఇలా సాధారణమైన డైలాగ్, ఎంట్రీతో థియేటర్లో అరుపులు పుట్టించారు పూరీ. ఇందులోని ప్రతి డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

* ‘హార్ట్‌ఎటాక్’.. ‘కొట్టేసి వెళ్లిపోతారేంట్రా? ఐ వాంట్‌ మనీ.. ఏదైనా ఒంటరిగా వెళ్తుంటే ఆపి డబ్బులు లాక్కునే బ్యాచ్‌ దగ్గర డబ్బులు లాక్కోవడమ్‌ అనేది..’ ఇదే హీరో నితిన్‌ ఎంట్రీ. రొటీన్‌కు విభిన్నంగా ఉండే సీన్‌ ఇది.

* ‘టెంపర్‌’.. ‘వాడికి మొరాలిటీ ఉండకూడదు.. నీతి నిజాయితీ అంటే ఎంటో తెలియకూడదు. ఇంక ఒక్క మాటలో చెప్పాలి అంటే వాడు నాకన్నా వరస్ట్‌గా ఉండాలి.. ఒక్కడున్నాడయ్యా, వాడు హైదరాబాద్‌లో ఉన్నాడు.. మనందరం ఒకరకమైతే వాడు ఇంకోరకం’.. కట్‌ చేస్తే ఎన్టీఆర్‌.. పూరీ తన సినిమాల్లో హీరోల రూపురేఖలు మారుస్తుంటారు. ఇందులో ఎన్టీఆర్‌ ఫిట్‌గా కనిపించి.. మెప్పించారు.

* ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ని పూరీ చాలా మాస్‌గా చూపించారు. ఆయన మాస్‌ సినిమాలన్నీ కలిపితే వచ్చిన అవుట్‌పుట్‌ ఇది అనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో రామ్‌ పూల చొక్కాలు, తెలంగాణ యాసలో డైలాగ్‌లు.. మాస్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడిముంగట పొట్టెల్ని కట్టేసినట్టే.. మార్ ముంత చోడ్ చింత..’ అంటూ రామ్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి తగ్గట్టే ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. గత కొంత కాలంగా సరైన హిట్‌ కోసం ఎదురుచూస్తున్న పూరీ కెరీర్‌కు ఈ చిత్రం మరో హిట్‌గా నిలిచింది.

* ‘అర్జున్‌రెడ్డి’తో మాస్‌ అనిపించుకుని.. మళ్లీ ‘గీత గోవిందం’ కోసం క్లాస్‌గా మారారు యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్‌గా మారిన ఆయనకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. ఇప్పుడు విజయ్‌, పూరీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. దీంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ ప్రాజెక్టును ప్రకటించారు. పూరీ, ఛార్మి సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా వెల్లడించలేదు. మరి ఇందులో విజయ్‌ ఎంట్రీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.