close

తాజా వార్తలు

పావురం పొట్టలో బంగారం!

ఓ వేటగాడు ఒక రోజు అడవికి వెళ్లాడు. వలపన్ని ఓ పావురాన్ని పట్టుకున్నాడు. ఆ పావురం అతడితో ‘వేటగాడా! నన్ను చాలా కష్టపడి పట్టుకున్నావు. బాగానే ఉంది. కానీ నా లాంటి చిన్న పక్షిని తిన్నంత మాత్రాన నీ ఆకలి పూర్తిగా తీరుతుందా? నన్ను వదిలిపెట్టావంటే నీకు మూడు ఉపదేశాలు చేస్తాను. అవి నీకు జీవితమంతా ఉపయోగపడతాయి. సరేనా?’ అంది.
వేటగాడు కాసేపు ఆలోచించి పావురాన్ని వలలోంచి బయటకు తీశాడు. పావురం వేటగాడి చేతి మీద వాలింది.
‘ఇదిగో మొదటి ఉపదేశం చెబుతున్నా. ఎవరెంతగా చెప్పినా అసంభవమైన విషయాన్ని ఎప్పుడూ నమ్మకు’ అంది.
తర్వాత ఎగిరి కొమ్మ మీద వాలి ‘రెండో ఉపదేశం ఏంటంటే... జరిగిన నష్టాలకు, కష్టాలకు బాధపడొద్దు’ అంది.
ఆ తర్వాత అది ఇంకా పై కొమ్మ మీద వాలి ‘నా పొట్టలో పావుకిలో బంగారు ముద్ద ఉంది. అది నిన్ను పెద్ద ధనవంతుడిని చేసేది. దాన్ని నీ చేతులారా పోగొట్టుకున్నావు.’ అంటూ నవ్వింది.
ఇది వింటూనే వేటగాడు బావురుమంటూ ఏడ్చాడు. ‘అయ్యో! నేను ఎంత దురదృష్టవంతుడిని దొరికిన బంగారాన్ని వదులుకున్నానే. ఓ పావురమా! ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు?’ అంటూ వాపోయాడు.
పావురం నవ్వి ‘వేటగాడా! నా ఉపదేశాలను నువ్వు పాటించడం లేదు’ అంది.
వేటగాడు అర్థం కానట్టు చూశాడు.
పావురం ఇలా వివరించింది. ‘ఎవరెంత చెప్పినా అసంభవమైన విషయాన్ని నమ్మవద్దన్నాను, నష్టాలకు బాధపడొద్దన్నాను.. నువ్వు రెండూ చేశావు. నేనంతా కలిపి పావుకిలో ఉండను. నా పొట్టలో పావుకిలో బంగారం ముద్ద ఎలా ఉంటుంది? ఉపదేశాలు చెబుతాననేసరికి నన్ను వదిలేసి తర్వాత బాధపడుతున్నావు. జరిగిన దానికి ఎంత ఏడ్చి ఏం లాభం?’ అంది.
పావురం మాటలకు వేటగాడు కళ్లు తుడుచుకుని ‘సరేలే... మరి ఆ మూడో ఉపదేశం ఏమిటో చెప్పరాదూ?’ అన్నాడు.
‘నేను చెప్పిన రెండు ఉపదేశాలు నువ్వు ఏమాత్రం ఆచరించగలిగావు? అందుకే మూడోది చెప్పదలచుకోలేదు’ అంది పావురం.
‘ఇది అన్యాయం.  మంచిమాటలు చెప్పిన నువ్వే మన ఒప్పందాన్ని కాదనడం ఏమైనా బాగుందా?’ అన్నాడు వేటగాడు.
‘అందులోనే ఉంది మూడో ఉపదేశం. ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది.’ అంటూ పావురం తుర్రున ఎగిరిపోయింది.
అప్పటిగ్గానీ వేటగాడికి అర్థం కాలేదు. ‘పాటించని వాడికి ఎన్ని ఉపదేశాలు చేసినా ప్రయోజనం లేదు’ అనేదే పావురం చెప్పిన మూడో ఉపదేశమని!


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.