close

తాజా వార్తలు

ఆటుపోట్ల నయన్‌ జీవితం

ఆమె జీవితంలోని షాకింగ్‌ విషయాలు తెలుసా?

మూడు పదుల వయసులోనూ అందరూ మెచ్చిన తళుకు తార ఆమె. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం చేయడం ఆమె ప్రత్యేకత. అగ్ర కథానాయకులు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కేవలం కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇచ్చే బ్యూటీ. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి.. స్విమ్‌ సూట్‌లో అదరహో అనిపించుకోవడం ఆమెకే సాధ్యమైంది. తొలి నాళ్లలో ఈ భామ వివాదాల నడుమ చిక్కుకున్నారు. ప్రేమలో రెండుసార్లు విఫలమై మానసిక ఒత్తిడికి గురయ్యారు. దాన్నుంచి తేరుకుని వరుస చిత్రాలు, విజయాలతో దూసుకుపోతూ.. లేడీ సూపర్‌స్టార్‌గా మారారు. మనం కాదు.. సినిమా మాట్లాడాలంటూ ప్రమోషన్లకు కూడా దూరంగా ఉంటుంటారామె. ఆ నటి ఎవరో కాదు.. మన నయనతార. ఆమె చిరంజీవితో కలిసి నటించిన ‘సైరా’ సినిమా అక్టోబర్‌ 2న  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నయన్‌ జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాల్ని ఓ సారి చూద్దాం..

చార్టర్డ్‌ అకౌంటెంట్‌ కావాలని..

బెంగళూరులో జన్మించిన నయన్‌ విద్యాభ్యాసం దాదాపు ఉత్తర భారతదేశంలోనే జరిగింది. ఆమె తండ్రి ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పనిచేయడం వల్ల పలు పాఠశాలలు మారుతూ వచ్చారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేశారు. సినిమాల్లోకి రాకపోతే చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అవ్వాలనేది నయన్‌ కోరికట. 

ఆఫర్‌ వెతుక్కుని వచ్చింది

నయన్‌ ఓ పక్క చదువుతూనే మరోపక్క పార్ట్‌టైమ్‌ మోడల్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఆమెను మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ చూశారు. ‘మనస్సినక్కరే’ (2003) సినిమాలో కీలక పాత్ర చేయమని అడిగారు. సినిమాలంటే ఇష్టం లేని నయన్‌ తొలుత ఆయన ఆఫర్‌ను తిరస్కరించారు. ఆపై నచ్చజెప్పడంతో ఆలోచించి.. ఈ ఒక్క సినిమా చేస్తా అని షరతు పెట్టారు. జయరాంతో కలిసి ఆమె నటించిన తొలి సినిమా విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో వరుస ఆఫర్లు నయన్‌ వెంటపడ్డాయి. అలా కేవలం రెండేళ్లలో ఆమె ఎనిమిది సినిమాల్లో నటించారు.

వెంకీతో..

2005లో వచ్చిన ‘చంద్రముఖి’, ‘గజినీ’ సినిమాలు నయన్‌కు ఎంతో పేరు తీసుకువచ్చాయి. 2006లో ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. విక్టరీ వెంకటేష్‌ సరసన ‘లక్ష్మీ’ సినిమాలో సందడి చేశారు. ఆ తర్వాత ‘బాస్‌’, ‘యోగి’, ‘దుబాయ్‌ శ్రీను’, ‘తులసీ’ తదితర సినిమాల్లో నటించారు. కానీ ఈ సినిమాలు ఆమెకు ఓ హోదాను ఇవ్వలేపోయాయి.

దూకుడు..

2010లో నయన్‌ సినీ జీవితం మలుపు తిరిగింది. చక్కటి కథలతో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ‘అదుర్స్‌’, ‘సింహా’, ‘శ్రీరామ రాజ్యం’, ‘అనామిక’తోపాటు పలు తమిళ సినిమాలతో హిట్లు అందుకున్నారు. ‘శ్రీరామ రాజ్యం’ కోసం సీతగా మారి నంది అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు అనేక కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనూ నటించి లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. ప్రస్తుతం ‘సైరా’తోపాటు ఆమె చేతిలో ‘బిగిల్‌’, ‘దర్బార్‌’ సినిమాలు ఉన్నాయి. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటిస్తూ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా నిలిచారు.

సక్సెస్‌ వెనుక..

దాదాపు 16 ఏళ్లుగా హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. మీ సక్సెస్ రహస్యం ఏంటి? అని నయన్‌ను ప్రశ్నించగా.. ‘పెద్ద రహస్యం అంటూ ఏమీ లేదు. అదృష్టం కలిసి వచ్చింది అంతే. అసలు నాకన్నా అందగత్తెలు, బాగా నటించేవారు చాలా మందే ఉన్నారు. వారికిలేని అదృష్టం నాకు ఉంది అంతే. దీంతోపాటు కష్టపడి పనిచేయడం నాకు కలిసి వచ్చింది. అదృష్టం ఉంది కదా అని పనిచేయడం మానేస్తే సినిమాలు ఉండవు. కష్టపడితే ఫలితం దక్కుతుందని నమ్ముతా. అదే నా విజయ రహస్యం. టైమ్‌ బాగుంటే అంతా బాగుంటుంది. ప్రస్తుతం నా టైమ్‌ బాగుంది’ అన్నారామె.

తెలిసీ తెలియక..

‘మొదట్లో కొన్ని సినిమాలు మొహమాటానికి చేయవలసి వచ్చింది. కథ అంత బాగా లేదని అర్థమైనా కూడా చేశాను. అపజయాల్ని మూటకట్టుకున్నాను. ఇప్పుడు మాత్రం ఆ మొహమాటాలు పెట్టుకోదలచుకోలేదు.  కథ నచ్చితే పారితోషికం తక్కువ ఇచ్చినా ఒప్పుకుంటాను. కానీ నచ్చకపోతే ఎంత ఇచ్చినా తీసుకోను’ అని ఓ సందర్భంలో నయన్‌ చెప్పారు.

ఇష్టాయిష్టాలు..

నయన్‌కు ఉత్తర భారతదేశం వంటకాలంటే చాలా ఇష్టం. నల్ల రంగును అమితంగా ఇష్టపడుతారట. రజనీకాంత్‌, విజయ్‌ ఆమె అభిమాన నటులు. కాస్త ఖాళీ దొరికితే కెనడా వెళ్లి సేదతీరాలని అనుకుంటుంటారు. పుస్తకాలు చదువుతారు. సంగీత ప్రియురాలు. లాంగ్‌ డ్రైవ్‌ అన్నా ఇష్టమే.

షాక్‌ ఇచ్చారు

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నటనకు దూరం అవుతున్నానంటూ 2010లో నయన్ ప్రకటించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని ఓ గుడిలో మతమార్పిడి చేసుకుని హిందువుగా మారారు. ఆ తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొని.. తిరిగి నటిగా నిలదొక్కుకున్నారు.

ప్రేమలో విఫలం గురించి..

రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని నయన్‌ స్వయంగా చెప్పి మరోసారి షాక్‌ ఇచ్చారు. ‘నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్‌ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి మనిషిని చేశాయి. నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి’ అని నయన్‌ అన్నారు. కెరీర్‌ ఆరంభంలో నయన్‌ శింబును ప్రేమించినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయనతో విడిపోయారు. తర్వాత ప్రభుదేవాకు దగ్గరయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయనకూ దూరమయ్యారు.  గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేశ్‌తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం ఉంది. డిసెంబరులో వీరిద్దరి పెళ్లి కూడా జరగనున్నట్లు వదంతులు వచ్చాయి. అయితే దీనిపై నయన్‌ స్పందించలేదు.

ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.