close

తాజా వార్తలు

చిరంజీవి ఇంటికెళ్లా.. లైఫ్‌లో మర్చిపోలేను!

‘సైరా’ సంగీత సారధితో ముచ్చట్లు

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘సైరా’తో తెలుగు వారికి తన బాణీలు వినిపించబోతున్నారు సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది. హిందీలో అనేక హిట్‌ సాంగ్స్‌ ఇచ్చిన ఆయనలో ఓ మంచి గాయకుడు, రచయిత కూడా ఉన్నారు. అమిత్‌ గీతాలంటే అభిమానులు చెవి కోసుకుంటారు. అందుకే జాతీయ పురస్కారంతోపాటు ఫిల్మ్‌ఫేర్‌, స్టార్‌ స్క్రీన్‌ తదితర అవార్డులు ఆయన్ను వరించాయి. అయితే ఈ సక్సెస్‌ ఆయనకు రాత్రికి రాత్రే రాలేదు. ఎన్నో ఏళ్లు శ్రమించి.. ఒక్కో మెట్టు ఎక్కారాయన. అక్టోబరు 2న ‘సైరా’ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న సందర్భంగా అమిత్‌ త్రివేది ముఖాముఖి మీ కోసం. 

* ‘సైరా’ లాంటి ప్రెస్టీజియస్‌ మూవీలో ఆఫర్‌ ఎలా వచ్చింది?
అమిత్‌: ఈ సినిమా గురించి చరణ్‌ టీమ్‌ నుంచి నాకు ఫోన్‌ వచ్చింది. ఈ సినిమా గురించి వివరించాక.. ఇది తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని తెలిసింది. సురేందర్‌ రెడ్డి కథను అందంగా నరేట్‌ చేశారు. నేను చిరంజీవికి పెద్ద అభిమానిని. ఈ ఆఫర్‌ నా వద్దకు రాగానే మనసులో రెండో ఆలోచన రాలేదు. వెంటనే ఓకే చెప్పేశా.

* అభిమాని అన్నారు.. అందుకే ‘సైరా’కు బాణీలు మంచి జోష్‌తో ఇచ్చారా?
అమిత్‌: ‘సైరా’లోని పాత్రల నుంచే నాకు జోష్‌ వచ్చింది. వాటిపై ఆధారపడే బాణీలు అందించా. చిరు పాత్ర చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సురేందర్‌ సినిమాలోని చాలా సంఘటనలు చెప్పారు. సినిమా టైటిల్‌ సాంగ్‌ మొత్తం కథను వర్ణిస్తుంది. నరేషన్‌ సమయంలో కథ నా మనసును తాకింది. దీంతో సహజంగానే నాకు ఆ ఫీలింగ్‌ (సీన్‌లోని భావోద్వేగాన్ని ఉద్దేశిస్తూ) వచ్చింది. యుద్ధం నేపథ్యంలో సాగే సినిమా కాబట్టి ఆ క్రోదం, ధీరత్వం, తెగింపు వినిపించాలి అనుకున్నా. అలానే బాణీలు సిద్ధం చేశా.
* ఓ సినిమాకు సంగీతం అందించాలంటే భాష రావాలి అంటుంటారు. మీకు ఎప్పుడైన భాష అడ్డంకి అనిపించిందా?
అమిత్‌:  అస్సలు లేదు..  నాకు తెలుగు అర్థం అవుతుంది.  అయినా సంగీతానికి భాషతో పనిలేదు. ఎమోషన్‌ను మ్యూజికల్‌గా చూపించగలిగితే సక్సెస్‌ అయినట్లే.

* సాహిత్య రచయితతో సంభాషణ ఎలా ఉంటుంది?
అమిత్‌: తెలుగు, హిందీ, మరాఠీ.. ఇలా భాష ఏదైనా సరే. దర్శకుడికి ఓ విజన్‌ ఉంటుంది. దాన్ని మనకు వివరిస్తారు. దాన్ని బట్టి నేను ట్యూన్‌ సిద్ధం చేసిరచయితకు వినిపిస్తా. అతడు మార్పులు చేర్పులు చెబుతాడు. దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత కలిసి ఎక్కువ సేపు సమయం గడుపుతుంటారు. మా ముగ్గురి మధ్య చర్చలు జరుగుతూనే ఉంటాయి.
* ఇప్పటివరకు ఈ జోనర్‌ సినిమాకు పనిచేయలేదు కదా..?
అమిత్‌: ఈ సినిమా కోసం నాలుగు పాటలు కంపోజ్‌ చేశాను. గతంలో ఈ జోనర్‌లో సినిమాకు నేను ఎప్పుడూ సంగీతం అందించలేదు. ఈ స్టైల్‌లో చేయడం నాకు కొత్త, నా కెరీర్‌లోనే తొలిసారి. ఈ సినిమా కోసం అనేక సవాళ్లు ఎదుర్కొన్నా. ఈ సినిమాకు సంగీతమందించడం రోజాపూలతో పరిచిన దారి కాదు. పర్‌ఫెక్ట్‌ సంగీతం అందించేందుకు చాలా రోజులు పట్టింది. ట్రైల్‌, ఎర్రర్‌, ట్రైల్‌ ఎర్రర్‌.. ఇలా అనేక స్టేజ్‌లు ఉంటాయి. కొన్ని సార్లు రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు.
* మెగాస్టార్‌తో పనిచేశారు. ఎలా ఫీలింగ్‌ గురించి చెప్పండి?
అమిత్‌: మెగాస్టార్‌ సినిమా కోసం పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత చిరు హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నేను చిన్నతనంలో చిరు సినిమాలు, పాటలు చూస్తూ పెరిగా. ఆయన డ్యాన్స్‌ చాలా బాగుంటుంది. అలాంటిది ఇప్పుడు ఆయన సినిమా కోసం పనిచేయడం అద్భుతం అనిపించింది. ఇది నా కెరీర్‌లోనే ఓ గొప్ప అనుభూతి. ఇలాంటి సినిమాకు పనిచేయడం ఓ డ్రీమ్‌లాంటిది. ఈ సినిమాతో దానిని సాధించా.

* సురేందర్‌ రెడ్డి గురించి చెప్పండి?
అమిత్‌: సురేందర్‌ చాలా క్లియర్‌గా ఉంటారు. ఆయను ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు. టీం నుంచి దాన్ని రప్పించాలని ప్రయత్నిస్తుంటారు. 
* ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి అన్నారు. మరి మీకు ఇష్టమైన పాట ఏది?
అమిత్‌: ఒక్కటి చెప్పడం చాలా కష్టం. ‘సైరా’ టైటిల్‌, లవ్‌ సాంగ్‌.. నాకు ఇష్టం. జాతర పాట కూడా చాలా బాగుంటుంది.
* మీకు జీవితాంతం గుర్తుండిపోయే సంఘటన ‘సైరా’ సమయంలో ఏదైనా జరిగిందా?
అమిత్‌: ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి క్షణం నాకు ఎంతో నచ్చింది. నేను చిరు సర్‌ను ఆయన ఇంట్లో కలిశా. ఆయన స్నాక్స్‌ పెట్టారు, చాలా రుచిగా ఉన్నాయి (నవ్వుతూ). ఆయన ఓ గొప్ప స్టార్‌.. కానీ నాతో ఎంతో స్నేహంగా ఉన్నారు. ఆ క్షణం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది నేను జీవితాంతం గుర్తుంచుకునే సినిమా.

ఇంటర్నెట్‌ డెస్క్‌

19 ఏళ్లకే..

ముంబయిలోని బాంద్రాలో అమిత్‌ జన్మించారు. చిన్నతనంలోనే ఆయనకు సంగీతంపై ఆసక్తి ఉండేది. క్లాసికల్‌ మ్యూజిక్‌ అంటే ఇష్టం పెరిగి.. దానివైపు అడుగులు వేశారు. 19 ఏళ్లకే సంగీతం కంపోజ్‌ చేయడం ఆరంభించారు. కాలేజీలో చదువుతున్నప్పుడు ‘ఓం’ అనే బ్యాండ్‌లో చేరారు. దాని ద్వారా స్థానికంగా జరిగే వేడుకలు, కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఓ సందర్భంలో టైమ్స్‌ మ్యూజిక్‌ వీరి బ్యాండ్‌ను గుర్తించి.. తమ ఆల్బమ్‌ క్రియేట్‌ చేసే ఆఫర్‌ ఇచ్చింది. ఆపై అమిత్‌ టీవీ షోలకు నేపథ్య సంగీతం అందించారు. మరాఠీ సినిమాల కోసం పనిచేశారు. ఎయిర్‌టెల్‌, మెక్‌ డొనాల్డ్స్‌ ప్రకటనలకు జింగిల్స్‌ కంపోజ్‌ చేశారు. ఓ రికార్డింగ్‌ స్టూడియో యజమాని అరవింద్‌ విశ్వకర్మ అమిత్‌ను సోనీ బీజీఎమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థకు పరిచయం చేశారు. దీంతో అమిత్‌ వివిధ ఆల్బమ్‌లకు సంగీతం అందించారు.

 

తొలి అవకాశం
ఆల్బమ్స్‌ చేస్తున్న క్రమంలో గాయకురాలు శిల్పా రావు అమిత్‌కు స్నేహితురాలు అయ్యారు. ఆమె ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు అమిత్‌ను పరిచయం చేశారు. అమిత్‌లో ప్రతిభ గుర్తించిన అనురాగ్‌ ‘దేవ్‌ డి’కు బాణీలు అందించే అవకాశం ఇచ్చారు. తొలి సినిమాతోనే అమిత్‌ అందరి ప్రశంసలు పొందారు. ఈ సినిమాకు గానూ అమిత్‌ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. అనురాగ్‌ ద్వారానే అమిత్‌కు రెండో ఆఫర్‌ లభించింది. అలా రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకుడిగా పరిచయమైన ‘ఆమీర్‌’కు (2008) బాణీలు అందించారు. తొలినాళ్లలోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో అమిత్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆపై ‘వేక్‌ అప్‌ సిడ్‌’, ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’, ‘బాంబే టాకీస్‌’, ‘క్వీన్’, ‘బాంబే వెల్వెట్‌’, ‘హైవే’, ‘ఉడ్తా పంజాబ్‌’, ‘డియర్‌ జిందగీ’, ‘స్వీక్రెట్‌ సూపర్‌స్టార్‌’, ‘ప్యాడ్‌మ్యాన్‌’, ‘కేదార్‌నాథ్‌’, ‘మిషన్‌ మంగళ్‌’ తదితర సినిమాలతో కెరీర్‌లో విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మరోపక్క ఆయన స్వరాలు అందించిన ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధం అవుతోంది. నాని, సుధీర్‌బాబు కథానాయకులుగా నటిస్తున్న ‘వి’ సినిమాకు కూడా అమిత్‌ పని చేస్తున్నారు.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.